TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
బాల కార్మికులు
14సం|| లోపు వయసు గల పిల్లల్ని కొన్ని అంతర్జాతీయ చట్టాలు ’బాలలు’ అని గుర్తిస్తాయి. అయితే కొన్నిచట్టాల ప్రకారం మన దేశంలో 18సం ||కు తక్కువ వయసుగలవారంతా కూడా బాలలే. పేదరికం పెరగడం కారణంగా భారతదేశంలో చాలామంది పిల్లలు చదువులు మాని, కఠినమైన పనులు చేస్తూ బాలకార్మికులు అవుతున్నారు. ’వీరంతా బాలకార్మికులుగా ఎందుకు మారుతున్నారు’ అన్నది మనం అందరం ఆలోచించవలసిన విషయం.
ఎక్కువగా పల్లెలో ఉన్న పిల్లలే బాలకార్మికులుగా మారుతుంటారు-ఎందుకంటే వారికి తినడానికి తిండి లేక. వాళ్ళ పెద్దవాళ్ళు తమ పిల్లలను చదివించే స్తోమతు లేక, పట్టణాలలో స్వీట్ షాపుల్లోను, బీడీ అంగళ్లలోను, ఆడపిల్లల్నైతే ఇళ్లలో పని మనిషులుగాను పెట్టి, వారు తెచ్చిన డబ్బుల్ని కూడా తీసుకుని వాడుకుంటారు. కాని ఆ పిల్లలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిద్రలేకుండా గొడ్డుచాకిరి చేస్తారు .
రాజకీయ నాయకులు, పెద్ద మనుషులు ఉపన్యాసాలిస్తారు-’బాలకార్మికుల వ్యవస్థను రద్దుచేస్తాము; వారికి కావలసిన సదుపాయాలు కల్పిస్తాము’ అని. కానీ ఒక్కరు కూడా వాటిని అమలు చేయరు.
భారతదేశంలో ఏ ఇతర దేశాలలో లేనంతగా బాలకార్మికులున్నారు.బాలకార్మికులు లేకుండా ఉండడానికి ప్రభుత్వం మొదట జనాభాని నియంత్రణ చేయాలి. అంతే కాకుండా గ్రామాలలోని పిల్లలకు చదువులు చెప్పడం వంటి కార్యకలాపాలు చేపట్టాలి. బారతదేశంలో మొత్తం 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలకు పోకుండా వ్యవసాయరంగంలోను, కర్మాగారాలలోను పని చేస్తున్నారు . అలా ఉన్న పిల్లలను చూసి ప్రభుత్వం వారికి కావల్సిన సదుపాయాలు చేస్తే మంచిది.
బాలలను అలా కర్మాగారాలలో పని మనుషులుగా పెట్టుకున్నవారికి తాఖీదులిచ్చి, వారిని వెంటనే పాఠశాలకు పంపటం మొదలుపెట్టాలని చెప్పాలి. అలా చేయని వారిని ప్రభుత్వం జైల్లో వేసేటట్లు చేస్తే తప్ప మన భారత దేశం ఈ బాలకార్మిక సమస్య నుండి విముక్తి పొందదు.
బాల కార్మికులకు కొన్ని ఆశలు, ఆశయాలు, కష్టాలు ఉంటాయి.మనం వాటిని గుర్తించి, వారికి చదువు చెప్పడం వలన చాలా లాభం కలుగుతుంది. బాల కార్మికులను చిన్న చూపు చూస్తే వారు ఎదగరు, అలాగే వుంటారు. అంతే కాకుండా మిగిలిన పిల్లలు కూడా వారిలా తయారవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వారిని చిన్నచూపు చూడటం మాని, వారికి సరైన అవకాశాలు కల్పించి, వారు కూడా జనజీవనంలో కలిసిపోయేందుకు అవకాశాలు కల్పించాలి.
Courtesy..
kottapalli.in