TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
మోసకారి గంగన్న
గంగన్న చూసేందుకు పిల్లవాడిలాగా ఉంటాడు. తన రూపాన్ని ఆసరాగా చేసుకొని వాడు ఘరానా మోసాలు చేసేవాడు. ఒకసారి వాడి చూపు రామాపురం ప్రాంతంపై పడింది. పాడి పంటలతో, సౌభాగ్యంతో తులతూగే రామాపురంలో తనకు లభించనున్న డబ్బు వాడిని ఊరించింది.
రామాపురం వెళ్ళిన గంగన్న ఒక దుకాణం ముందు కదలకుండా కూర్చుని ఉండిపోయాడు. చాలా సేపు అక్కడే కూర్చున్న పిల్లవాడిని చూసి ఆ అంగడి ఆమె అడిగింది- "ఎవరు నువ్వు బాబూ, ఎక్కడినుండి వచ్చావు? నీ పేరేమిటి?" అని. ’మాది ఫలానా ఊరు. నా పేరు ’అప్పిచ్చినవాడు’ అన్నాడు గంగన్న. ’ఓహో అలాగా’ అని ఊరుకున్నది అంగడి ఆమె.
తరువాత కాసేపటికి ఆమెకు ఏదో పని గుర్తుకు వచ్చి " నేను ఇక్కడిదాకా పనిమీద వెళ్ళివస్తాను. నా దుకాణాన్ని కొంచెం గమనించుకుంటూ ఉండు’ అని చెప్పి వెళ్ళింది. గంగన్న కాసేపు అలాగే కూర్చొని, అటూ ఇటూ చూసి, అంగడిలోని డబ్బునంతా జేబులో వేసుకొని, తినుబండారాలు మూటగట్టుకొని లేచి ఉడాయించాడు. కొంతసేపటికి తిరిగివచ్చిన అంగడి ఆమె పరిస్థితిని చూసి లబోదిబోమంటూ గ్రామాధికారి దగ్గరకు పరుగెత్తింది.
"వాడు మా అంగడిలోని డబ్బు, సరుకు ఎత్తుకెళ్ళాడు మొర్రో" అని ఏడ్చింది. గ్రామాధికారి "ఎవరమ్మా ఎత్తుకెళ్ళింది?’ అని అడిగాడు. ’వాడే, "అప్పిచ్చినవాడు" ’ అంది అంగడి తల్లి. "అప్పిచ్చినవాడా? నువ్వు అప్పుచేసి తీర్చకపోతే వాడొచ్చి నీ డబ్బు, సామాను తీసుకెళ్ళాడు. దీనిలో నేను చేసేదేముంది?" అన్నాడు గ్రామాధికారి. "లేదు నాయనా, వాడు మాకు అప్పివ్వటమేంటి, వాడు ఎవరో నేను ఈరోజు వరకు చూడనేలేదు’ అని భోరుమన్నది అంగడి వనిత. "అప్పిచ్చినవాడు నీ సరుకు ఎత్తుకెళ్తే మేమేం చెయ్యాలి, పో ఫోమ్మా" అని ఆమెను పంపివేశాడు గ్రామాధికారి.
ఈలోగా గంగన్న ఆ డబ్బుతో ఒక గుర్రాన్ని కొన్నాడు. హుషారుగా గుర్రమెక్కి యువరాజులా స్వారీచేస్తూ ఇంకొకరిని మోసం చేయటం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. కొంచెం దూరంగా పెద్ద చెట్టు, చెట్టుకింద నీడ బాగా ఉన్న స్థలం కనిపించింది. అక్కడికెళ్ళి గుర్రాన్ని కట్టేసి, తను తెచ్చుకున్న తినుబండారాలు నెమరువేస్తూ కూర్చున్నాడు వాడు కులాసాగా.
ఆ చెట్టుకు కొంచెం దూరంలో చాకలివారు బట్టలు ఉతికి ఆరవేస్తున్నారు. వాళ్ళు చెట్టుక్రింద గుర్రం నిలిపిఉండటం చూసి దగ్గరకు వచ్చారు. ఇతన్ని చూసి పలకరించారు. ఆమాటా, ఈమాటా కలిపి ’నువ్వెవరు, నీ పేరేమిటి?’ అని అడిగారు. అప్పుడు గంగన్న "మాది ఫలానా ఊరు. నాపేరు సుడిగాలి" అన్నాడు. "ఓహోఁ అలానా" అన్న చాకలి వాళ్ళు గంగన్నగుర్రాన్ని మెచ్చుకుని, ఆ గుర్రం ధర ఎంతైందో అడిగారు. అలాంటి గుర్రాలు తమకు పనిలో గాడిదలకంటే ఎంతో ఉపకరిస్తాయని వాళ్ళకు అనిపించింది. "ఇదా, మీకింకా తెలీదా? ఇక్కడే పక్కనున్న గంగాపురంలో ఒక మహానుభావుడు అందరికీ గుర్రాలను పంచుతున్నాడు ఉచితంగా. మీరూ వెళ్ళండి. మీకూ ఇస్తాడు" అన్నాడు గంగన్న నమ్మబలుకుతూ. "బాబ్బాబు నీకు పుణ్యముంటుంది. మా బట్టలు కొంచెం చూస్తూండు, మేం వెంటనే వెళ్ళి, ఉన్నపళాన్న తిరిగి వస్తాం’ అని చాకలివాళ్ళు తమ బట్టలన్నీ గంగన్నకు అప్పగించి గంగాపురం పరుగెత్తారు.
వాళ్ళు అటు వెళ్ళగానే గంగన్న మంచి మంచి బట్టలు అన్నీ మూటగట్టుకొని గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. గంగాపురం వెళ్ళి మోసం జరిగిందని గ్రహించిన చాకలివాళ్ళు వెనక్కితిరిగివచ్చి లబోదిబోమని గ్రామాధికారి దగ్గరకు పరుగుపెట్టారు. "ఎవరెత్తుకెళ్ళారు?" అడిగాడు గ్రామాధికారి. "సుడిగాలి బాబూ" అని వాళ్ళు భోరుమన్నారు. ’సుడిగాలా?’ ఆశ్చర్యంగా అడిగాడు గ్రామాధికారి. ’అవును, సుడిగాలే’ అన్నారు వాళ్ళు. "సుడిగాలికి మీరు ఆరేసుకున్న బట్టలు ఎగిరిపోతే నన్నేం చేయమంటారురా? ఈరోజున అందరూ ఇలాంటి తిక్క జనాలే వస్తున్నట్లున్నారు నాదగ్గరికి. పోతారా లేదా?" అని వారిని గద్దించి పంపివేశాడు గ్రామాధికారి. చేసేదేమీ లేక వాళ్ళు బిక్క ముఖం వేసుకొని వెళ్ళిపోయారు. కానీ తెలివైన గ్రామాధికారి ఆలోచనలో పడ్డాడు. " ఈ రెండు సంఘటనలకూ సంబంధం లేదు గదా?" అని.
ఇక గంగన్న మగధీరునిలాగా గుర్రంమీద ఆ బట్టలమూటను పెట్టుకొని, కొత్తబట్టలు ధరించి, రాజ మార్తాండుని మాదిరి వీరపోజులో వెళ్తూ ఆనంద పరవశుడౌతున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ చీకటి పడే సమయానికి ఒక ఊరి చివర్న ఉన్న గుడిసెను చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి గుర్రం ఆపి గుడిసెలోకి తొంగిచూసి "ఎవరున్నారు, ఇంటిలో?" అని వాకబు చేశాడు. ఒక ఫూటకూళ్ల అవ్వ బయటికి వచ్చి "ఎవరునాయనా, నువ్వు? చూస్తూంటే మహరాజులా ఉన్నావే?" అన్నది. "ఆఁ.." అని చిరునవ్వు నవ్వాడు గంగన్న. లోపలికి వెళ్ళిన గంగన్నకు కళ్ళు చెదిరే ఆభరణాలు ధరించిన అవ్వమనమరాలు కనబడింది. ఎలాగైనా ఆమెను ఎత్తుకెళ్ళి ఆభరణాలన్నింటినీ దోచుకోవాలని గంగన్నకు ఉబలాటం మొదలైంది. పైకి అవ్వతో "నేను ఈ రాత్రికి ఇక్కడే ఆగచ్చా?" అని అడిగాడు. సరేనంది అవ్వ. "నీ పేరేమిటి నాయనా" అని అడుగుతూ. నాపేరు ’దాని మొగుడు’ అన్నాడు గంగన్న. "ఓహో, మనిషేకాడు, అతని పేరుకూడా గమ్మత్తే" అనుకుంది అవ్వ.
ఆ రాత్రికి ఆ గుడిసెలో పడుకొని, తెల్లవారు ఝామున గుట్టుచప్పుడు కాకుండా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయాడు గంగన్న. అవ్వ లేచి తన మనమరాలు, ’దాని మొగుడు’ ఇద్దరూ కనబడకపోవటంతో లబోదిబోమంటూ గ్రామాధికారి దగ్గరకు పరుగెత్తింది. "ఎవరెత్తుకెళ్ళారని" ప్రశ్నించిన గ్రామాధికారి ’దానిమొగుడు’ అన్న సమాధానం విని నివ్వెరపోయాడు. "ఏమిటి, దానిమొగుడా? పిల్లను దాని మొగుడుఎత్తుకెళ్తే నువ్వు ఫిర్యాదు చేసేందుకు వచ్చావా? ఫోమ్మా " అని తిడుతుండగానే ఆయనకు ఇది ఎవరో తెలివిగా చేస్తున్న మోసమని తెలియవచ్చింది.
ఈ మూడు మోసాలూ జరిగిన ప్రాంతాలను బట్టి, మోసగాడు గుర్రంమీద వెళ్తున్నాడన్న వాస్తవాన్ని బట్టి ఆయన లెక్కగట్టి, గంగన్న దొరికే ప్రదేశాన్ని నిశ్చయించి అక్కడి గ్రామసేవకులకు కబురు పంపాడు, ’ఏం చేయాలి’ అన్న సూచనలతో సహా.
అడవిలో ముసలమ్మ మనమరాల్ని వదిలించుకున్న గంగన్న గుర్రంపై ఇంకా ముందుకు పోతుండగా ఒక్కసారి గుర్రం ముందుకాళ్లపై లేచి నిలబడి సకిలించింది. కట్టె పట్టుకున్న వ్యక్తి ఒకడు గంగన్న తలపై బలంగా నాలుగు దెబ్బలు అంటుకున్నాడు. కళ్ళు బైర్లు గ్రమ్మిన స్థితిలో గంగన్న "ఎవరు నువ్వు? నన్నెందుకు కొడుతున్నావు?" అని అడిగాడు. "నేను సమాజాన్ని. నీ మోసాలకు గాను నిన్ను దండిస్తున్నాను" అన్నాడా వ్యక్తి, గ్రామాధికారి చెప్పమన్నట్లు. వింటూ స్పృహ తప్పిన గంగన్న "సమాజం నన్ను దండించాడు. నామోసాలకుగాను సమాజం నన్ను దండించాడు" అని గొణుగుతున్నాడు. గంగన్నను బంధించిన గ్రామసేవకుడు అతన్ని నేరుగా గ్రామాధికారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. గంగన్న తన మోసాల్ని అంగీకరించాడు. గ్రామాధికారి అతనిచే ఎవరి సామానులు వారికి ఇప్పించాడు. ’మోసాలు ఎక్కువకాలం సాగవు’ అని ఊళ్లోవాళ్లంతా చెప్పుకున్నారు.
Courtesy..
kottapalli.in