Facebook Twitter
“అజ్ఞాత కులశీలస్య..” 41వ భాగం

“అజ్ఞాత కులశీలస్య..” 41వ భాగం

   పాలకులు ఎవరైనా సుంకాలు మాత్రం క్రమం తప్పకుండా వసూలు చెయ్యడంలో నిష్ణాతులయ్యారు.
   అది, కృష్ణా తీర ప్రాంతాలలోని బొడ్డుపల్లి గ్రామం.
   మాధవుడు కొద్దిపాటి సైన్యంతో దక్షిణ దిశగా వెళ్తున్నాడు, సైన్యాన్ని వృద్ధి చెయ్యడానికి. నల్లమల అడవుల్లో గజాలు సమృద్ధిగా ఉన్న వార్త తెలిసింది. ఆ ఏనుగులని మచ్చిక చేసుకుని, గజ బలగం పెంపొందించటం కూడా అతని ముఖ్యోద్దేశం..
   ఇంక హంవీరునితో సమరానికి సర్వ సన్నద్ధమయినట్లే. కపిలేంద్ర దేవుడు స్వర్గానికేగి నాలుగు సంవత్సరాలు దాటింది.
   గ్రామంలోని ప్రధాన రహదారిలో కనిపించిందా దృశ్యం.
   ఒక వృద్ధుని కాళ్లకీ, చేతులకీ సంకెళ్లు వేశారు. భుజాల మీద ఊరి వాకిట్లో వేళాడవలసిన నల్ల ఇనుపగుండు ఎక్కించారు. చేతిలో వెదురు కర్ర. మెడలో పల్లేరు పూల దండ వేళాడుతోంది.
   ఎండ మండిపోతోంది. వృద్ధుని వెనుక నున్న సైనికులిరువురు, కర్కశంగా అదిలిస్తున్నారు.
   కాళ్లకున్న సంకెళ్లు నడకని నిరోధిస్తుంటే, మెళ్లోని బొగడదండ గుచ్చుకుంటుంటే, భుజాల మీద బరువుతో నడుం వంగిపోయి, మండుటెండలో చెమటలు కక్కుతూ ఆ వృద్ధుడు నడుస్తున్నాడు.
   నోటినున్న పళ్లు ఊడినా, స్పష్టత చెడని పలుకులతో, కంచుకంఠంతో పద్యం రాగయుక్తంగా చదువుతున్నాడు.


            *సీ.    “కవిరాజు కంఠంబు కౌగిలించెను కదా
                            పురవీధి నెదురెండ బొగడ దండ
                    ఆంధ్ర నైషధ కర్త యంఘ్రియుగ్మంబున
                            దగిలి యుండెను కదా నిగళయుగము
                    వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత
                             వియ్యమొందెను కదా వెదురుగొడియ
                    సార్వభౌముని భుజస్కంధ మెక్కెను గదా
                             నగరి వాకిటనుండు నల్లగుండు
                        
            తే.గీ.   కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
                       బిలబిలాక్షలు దినిపోయె దిలలు పెసలు
                       బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
                       నెట్లు చెల్లింతుడంకంబు లేడు నూర్లు?”  
     
        (* శ్రీనాధ మహాకవి విరచితము..)


   హృదయం కదిలించేలాఉందా పద్యం. తన నిస్సహాయ స్థితిని చెప్తూనే, తనెవరో, తన గొప్పదనమేంటో తెలియజేస్తోంది.
   మాధవుడు అశ్వం దిగి, పరుగున వృద్ధుని ముందుకు వెళ్లాడు. తను భయపడినట్లే అయింది.
   అతడు కవి సార్వభౌముడు శ్రీనాధుడే.
   
          సీ.       పండువెన్నెల లోన మెండైన భామినీ
                         నాట్యాల కనిన శ్రీ నాధు డతడె
                     మండుటెండ నిలిచి మలమల మాడుతూ
                         చెమటను కన్నీట చేర్చి నిలిచె
                     పటిక బెల్లము వంటి  పలుకుల నొసగిన
                         కవిసార్వ భౌముని కంఠ మదియె
                     బొగడ పూదండయే బిగిసి పట్టుకొనగ
                         కంబుక మదియేను కంది పోయె


        ఆ.వె.       నల్ల గుండు బరువు నడుమును వంచగా
                      చరణములు తడబడె సంకెల పడి
                      తెనుఁగు సాహిత్యమును తేరుపై నెక్కించి
                      వెలిగి నతడె నొరిగె వెతను నేడు.


   అయ్యయ్యో.. ఎం కష్ట మొచ్చింది?
   మాధవుడు మారు ఆలోచించలేదు. సైనికులకు సైగ చేసి నల్లగుండు దింపి, బొగడ దండని తెంపి వేశాడు. కాళ్లకున్న సంకెలలను తెంచి వేశాడు.
   శ్రీనాధులవారు వణికి పోతున్నారు. తొంభై సంవత్సరాల వృద్ధుడనైనా కనికరం లేక ఇంతటి దారుణ మైన శిక్ష వేయడానికి ఏం చేశారు? ఏం జరిగింది?
   ఆ శిక్షను అమలు జరుపుతున్న వారు పరుగున వచ్చారు.
   “సామీ! మీరిలా చేస్తే మాకు పడతాయి శిచ్చలు. మేం రాజాజ్ఞ పాటిస్తన్నాం.”
   “ఎందుకింత కఠినంగా చేస్తున్నారు?” తన దగ్గరున్న రాజముద్రికని చూపిస్తూ ఆడిగాడు.
   “ప్రభూ! సామి వారు ఏడునూర్ల టంకాలు సుంకం చెల్లించాలి. వారి దగ్గర రొక్కం లేదు. ఏ శిచ్చయినా ఏసుకోండన్నారు. అందుకని సైన్యాధికారి ఈ శిక్ష ఏశారు. ఇప్పుడు మీరు ఇడిపించి తీసికెల్తే మమ్మల్ని కొరతేస్తారు.”
   “సరే! నేను చెల్లిస్తాలే సుంకం. జమ చేసుకోండి.”


   “గురువుగారూ! ఏమిటీ ఘోరం? తమరు ఈ స్థితిలో.. సాక్షాత్ సరస్వతీ స్వరూపులే..”
   శ్రీనాధుడు చూసిన చూపుకి మాధవుని గుండె కదిలి బైటికి వచ్చినంత పనయింది. మాధవుడు తన ఇంటికి తీసుకుని వెళ్లాడు మహాకవిని.
   “ఎవరు నాయనా నువ్వు?”
   మాధవుడు తానెవరో.. ఇది వరకు తాము కలిసిన వైనం చెప్పుకొచ్చాడు.
   “జ్ఞాపకం రావట్లేదు నాయనా! నేల తల్లిని నమ్ముకుంటే నాలుగు వేళ్లూ నోట్లో కెళ్తాయని, భూమి కౌలుకు తీసుకుని, వ్యవసాయం మొదలు పెట్టాను.. అవపాన దశలో. సాహిత్యాన్ని, కవిత్వాన్నీ ఆదరించే వారే కరవైపోయారు. నన్నాదరించిన వీరారెడ్డి, మైలార ప్రభువు, రాయలు, విస్సన్న మంత్రి.. అందరూ స్వర్గస్థులయ్యారు.


                       * సీ.    కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి
                                     రత్నాంబరంబు లే రాయడిచ్చు?
                               కైలాసగిరి బండె మైలారువిభుడేగె
                                    దినవెచ్చ మేరాజు దీర్పగలడు?
                               రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు
                                    కస్తూరి కేరాజు ప్రస్తుతింతు,
                               స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ
                                     పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు?


             తే.గీ.          భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె
                               కలియుగంబున నిక నుండ కష్టమనుచు
                               దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
                               నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.
                          
         (* శ్రీనాధ మహాకవి విరచితము.)


   అంతే నాయనా! ఎన్ని భోగములనుభవించాను. చివరికి ఈ స్థితిలో.. ఎక్కడో, ఎవరి వద్దో.. ఈ విధంగా” శ్రీనాధుడు రొప్పుతూ ఆపేశాడు.
   “గురువుగారూ! నావంటి అభిమానులింకా ఉన్నారు. మిమ్మల్ని కళ్లలో పెట్టి చూసుకుంటాను. నా వద్దనే ఉండండి. మీకు ఏలోటు రానియ్యను. మీరు పరమ శివుని భక్తులు. మీకు నేను చెప్పగల వాడను కాను. అంతా ఆ చిదానంద స్వరూపమే కదా! ఆదిశంకరులు తమ నిర్వాణషట్కంలో సెలవిచ్చినదదే కదా!


   న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ
   అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శ్శివోహం శివోహం


  సీ.    పుణ్యమనేది నెపుడు నాకు లేదుగ
                 పాపమనేది నా వద్ద లేదు
          సుఖ దుఃఖములనేను చొరగొననెపుడును
                 మంత్ర తీర్ధము లను మాట లేదు
          వేదము యనగనే పేర్మియు కనరాదు
                 యజ్ఞ యాగములును యవియు లేవు
          అనుభవమ్మన నాకు అసలు తెలియదుగ
                అనుభవించే వాడ నైన కాదు


  తే.గీ.   నే చిదానంద రూపుడ నే శివోహ
            మంటు మనన సేయవలెను మనసు దీర
            నిత్యము నిరతము నెపుడు సత్యముగనె
            సాధన శివోహమనెపుడు స్మరణ సేయి!


   ఆ పరమాత్ముని ధ్యానంలో సమయం గడపండి. మిమ్మల్ని సేవించుకునే భాగ్యం కలిగినందుకు నేను ధన్యుడను.”
   ఎన్నెన్నో భోగాలననుభవించి నింగినేలు దివాకరుని ప్రకాశముతో జీవితం గడిపిన కవిసార్వభౌముడు, చివరి రోజులలో పడరాని కష్టాలు పడి, పరమశివుని ధ్యానంలో తనువు విడిచాడు.
   శ్రీనాధులవారిని మరల కలుసుకోవాలని ఎంతగానో ఆశపడ్డ మాధవునికి చివరి చూపు దక్కింది.
   ఒకరకంగా మాధవుని ఆశ నెరవేరింది.
   శ్రీనాధ మహాకవి కూడా మండుటెండలో రహదారి నడుమ, దిక్కులేని వాని వలె, కాకుండా, నీడ పట్టున పరమేశ్వరుని ధ్యానిస్తూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచారు.
   తెలుగు సాహిత్యాకాశం లోని ఒక ధృవతార, నింగికెగసింది నిశ్సబ్దంగా.


   పురుషోత్తమ దేవుడు ఎట్టకేలకు, హంవీరుని జయించి, కళింగ సింహాసనాన్ని ఆక్రమించాడు. కటకం కోటలో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి.


         
                             


   మాధవుడు మంత్రిగా, ఆంత రంగికునిగా మహరాజు వెనువెంట ఉండి పరిపాలన ప్రజారంజకంగా ఉండేటట్లు తన వంతు సహకారాన్ని అందించారు.
   హంవీరుడు, కుమారునితో కలిసి కిమిడి సంస్థానాన్ని పాలిస్తూ ఉండిపోయాడు.
   పురుషోత్తమదేవుని పరిపాలనలో, సాహిత్యం, సంగీతం అభివృద్ధి చెందాయి బాగా.  
   గజపతుల యుగంలో పురుషోత్తమదేవుడు ఏలిన కాలం అత్యున్నతమైనది అని చెప్పవచ్చు.
   మాధవుడు తానెవరో ఎవరికీ తెలియకుండా, అజ్ఞాత కులశీలుని లాగానే, నంద పుత్రుని వలే, మహారాజుకి ఆప్త మిత్రుని వలే ఉండిపోయాడు.


                                 *---------------------------*

                                           సమాప్తం.

                                         “నవల వెనుక కథ”


   “అజ్ఞాత కులశీలస్య..” నవల సమాప్త మయింది. ఆదరించిన పాఠకులకి వందనములు.
   ప్రోత్సాహమిచ్చి, ప్రచురించిన తెలుగువన్.కామ్ సంపాదకులకు ధన్యవాదములు.
   చారిత్రిక నవలలు వ్రాయడం కొంచెం కత్తి మీద సాము అయినా, ఆ నాటి స్థితి గతులు శోధన చేస్తుంటే ఆసక్తి, సంభ్రమము కలుగుతూ ఉత్సాహంతో ముందుకు సాగుతాము. కల్పనలుంటాయి, కానీ సంఘటనలను మార్చకుండా జాగ్రత్త తీసుకోవాలి.
   సాధ్యమయినంత వరకూ ఆవిధంగానే ఈ రచన కొన సాగించాను.
   ఆరుద్రగారి “సమగ్రాంధ్ర సాహిత్యం” లో “గజపతుల యుగం” అని ప్రత్యేకంగా ఒక విభాగం కేటాయించారు. చదువుతుంటే ఆసక్తికరమైన విషయాలెన్నో తెలిశాయి. అక్కడి నించి ప్రారంభించి శోధన సాగిస్తుంటే.. వారు చేసిన సాహిత్యసేవ, కట్టించిన, పునరుద్ధరించిన ఆలయాలు.. ప్రజల కందించిన మంచి పరిపాలన గురించి తెలిసింది. మంచిపనులన్నీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగిన యుద్దాలలో మరుగై పోయాయి.
   ముఖ్యంగా, గజపతుల కాలంలో.. కవి సార్వభౌముడు, మహాకవి శ్రీనాధుని గురిచేసిన ఇబ్బందులు, శిక్షల గురించి బాగా ప్రాచుర్యం చెంది, చరిత్ర లో వారి మీద చెడు అభిప్రాయం కలిగింది.
   ఆరుద్ర గారు శ్రీనాధుని గురించి రాసిన వివరాలలో, గజపతుల సేన లోనే ఎవరో ఒక మంచివాడు ఆ మహాకవి శృంఖలాలు ఛేదించి మండుటెండ లోనించి తప్పించి కాపాడి తీసుకెళ్లి ఆశ్రయమిచ్చి ఉంటారని చెప్పారు.
   ఆ విషయం చదువుతుంటేనే ఆ ‘మంచివాని’ పాత్ర సృష్టించి, ఆ పాత్ర ద్వారా, గజపతుల పాలన, వారి మంచి పనులు, చరిత్ర గురించి ఏదైనా వ్రాయాలనే సంకల్పం కలిగింది. వారి గురించి వివరంగా నవల రూపంలో వచ్చినట్లు ఎక్కడా నా పరిశోధనలో కనిపించలేదు.
   శ్రీనాధుని పుట్టుక, మరణ సమయం గురించి కూడా పలు అభిప్రాయాలు వెలిబుచ్చారు చరిత్ర కారులు. ఆ వివరాలలో, నా నవలకి అనుకూలమైన కాలాలు తీసుకొనడం జరిగింది.
   ఆ విధంగా మాధవుని పాత్ర సృష్టించి, గణేశుల, గాంగేయుల కాలం నుంచీ గజపతుల పరిపాలన ఉన్నత దశ చేరుకునే వరకూ నా శక్తి కొలదీ వివరించడానికి ప్రయత్నించాను.
   ఎక్కడయినా సందిగ్ధంగా ఉన్న విషయాలని తప్పించి, తేలికగా చెప్పడానికి ప్రయత్నించాను.
   ఈ నవలలో, ఛందో బద్ధమైన పద్యాలతో కొంత కథని నడిపించాను. అచ్చంగా తెలుగు బృందంలో చేరాక, శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారి ప్రోత్సాహంతో ఛందస్సు మీద అభిరుచి కలిగి ఆవిధంగా సాహసించాను. కొన్ని పద్యాలు అరుదుగా కనిపించే ఛందస్సులో కూడా వ్రాసి, వారి చేత సరి అనిపించుకుని నవలలో ఇమిడ్చాను.  కట్టుపల్లి వారికి కృతజ్ఞతలు.
   అందరికీ కృతజ్ఞతాభివందనలు.
మంథా భానుమతి.

 

  ......మంథాభానుమతి