Facebook Twitter
కుమ్మర్రాజు కథ

కుమ్మర్రాజు కథ

 

అమలాపురం అనే ఊరిలో ఏడుగురు అన్నదమ్ముళ్లు ఉండేవాళ్లు. వాళ్లలో చివరి వాడు కుమ్మర్రాజు. అతను పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయారు. కుమ్మర్రాజంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. కానీ మొదటి వదిన ప్రేమతో, అభిమానంగా పెంచబట్టి వాడు బ్రతికాడు. కేవలం బ్రతకటమే కాదు; పెద్దయ్యేసరికి, కనీ వినీ ఎరగనంత బలమూ, చాలా మంచితనమూ కలిగాయి కుమ్మర్రాజుకు.

అలా ఉండగా, ఒక సారి ఉగాది పండగ వచ్చింది. ఈసారి ఉగాదికి వారం ఉన్నదనంగా ఆరుగురు అన్నలూ కుమ్మర్రాజుని పిలిచి, "ఒరేయ్, తమ్ముడూ! ఈసారి ఉగాదికి ఏడు కుండలు కాల్చరా, అవి గట్టిగా, భద్రంగా ఉండేట్లు కాల్చు!" అన్నారు. సరేనని, కుమ్మర్రాజు ఆ రోజున 10 బండ్ల బంకమట్టిని ఒక్కడే భుజానికి ఎత్తుకొని, కుండల్ని కాల్చేందుకు రెండు తాటిచెట్లని- ఆ చంకన ఒకటి, ఈ చంకన ఒకటి- పెట్టుకొని, నడిచి వస్తుంటే ఊరంతా అబ్బురంగా చూసింది. అయినా అతనిని ఏ ఒక్కరూ పలకరించలేదు! అలా అతను ఏడు కుండల్ని కాల్చి, మొదటి వదినకిచ్చి, "నీకు కావలసినది నువ్వు తీసుకొని, ఒకటి నాకు ఉంచు; మిగిలిన వాటిని అయిదుగురు వదినలకూ ఇవ్వు" అని చెప్పి, స్నానానికి బయల్దేరాడు.

అతను వచ్చేలోగా ఆరవ వదిన తనవంతు కుండని తీసుకొని పోతూ ఉంటే, ఆమె చేయిజారి, కుండకాస్తా ఎత్తునుండి క్రిందికి పడిపోయింది. అయినా అది పగిలిపోలేదు! ఇనుములాగా శబ్దం చేసి, దొర్లుకుంటూ పోయింది! దాంతో ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది- అంతేకాక కుమర్రాజు మీద విపరీతమైన ద్వేషం కలిగింది. "వీడు ఇంత మంచి కుండలు చేస్తే, ఇక మన కుండలను ఎవరు కొంటారు? వీడిని ఎలాగైనా చంపేయాలి" అనుకున్నది ఆమె. వెంటనే తన మనసులోని మాటను తన పెద్ద అక్కతో- అంటే కుమ్మర్రాజు మొదటి వదినతో- చెప్పేసింది కూడాను.

తర్వాత కొంతసేపటికి కుమ్మర్రాజు వచ్చాడు. పెద్ద వదిన అతనికి అన్నం పెడుతూ, ఆపుకోలేక కంట తడి పెట్టింది. "ఎందుకు వదినా ఏడుస్తున్నావు?" అని కుమ్మర్రాజు అడిగితే, ఆమె జరిగిన విషయం చెప్పి చాలా బాధ పడ్డది. అప్పుడు కుమ్మర్రాజు "నువ్వు ఏడవద్దు వదినా!నాకు నా బట్టలు మూటకట్టి ఇవ్వు నేను ఎక్కడికైనా వెళ్ళి బ్రతుక్కుంటాను" అని, మూట చేతబట్టుకొని బయలుదేరాడు.

 

అలా కుమ్మర్రాజు వెళ్తూ ఉండగా ఆశ్చర్యకరమైన దృశ్యం ఒకటి అతని కంట పడింది. సీతయ్య అనే రైతు ఒకడు ఎద్దులకు ఎండ తగలకుండా తన వీపు మీద ఒక పెద్ద జివ్విమానుని కట్టుకొని పొలం దున్నుతున్నాడు! కుమ్మర్రాజు రైతు దగ్గరికి వెళ్ళి, "అన్నా, నువ్వెంత మొనగాడివన్నా! ఎద్దులకు ఎండ తగలకుండా జివ్విమానుని వీపుకు కట్టుకొని దున్నుతున్నావు!" అన్నాడు మెచ్చుకోలుగా.

అప్పుడు సీతయ్య "నేనేం మొనగాడినయ్యా! పది బండ్ల బంకమట్టిని భుజాన పెట్టుకొని,రెండు తాటిచెట్లను ఆ సంకన ఒకటి,ఈ సంకన ఒకటి పెట్టుకొని వచ్చినవాడు మొనగాడు" అన్నాడు. అప్పుడు కుమ్మర్రాజు "ఆ పని చేసింది నేనే!" అని చెప్పగానే, సీతయ్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరై, కుమ్మర్రాజును ఎంతో గౌరవించి, "ఎక్కడికన్నా, ఇప్పుడు బయల్దేరావు?" అని అడిగాడు. "నేను ప్రపంచాన్ని చూసేందుకు వెళుతున్నాను"అన్నాడు కుమ్మర్రాజు. "నేను కూడా వస్తానన్నా, నీతోపాటూ!" అని సీతయ్యకూడా కొమ్మర్రాజుతోపాటు బయలుదేరాడు.

 

దారిలో ఇంకొక వింతమనిషి కనబడ్డాడు వాళ్లకు- నీళ్లల్లో ఉన్న చేపల్ని పట్టుకునేందుకు బాణాలు వేస్తున్నాడతను. సీతయ్య,కుమ్మర్రాజు ఇద్దరూ అక్కడ నిలబడి చూశారు. అతను నిజంగానే చేపల్ని బాణాలతో కొడుతున్నాడు! అప్పుడు కుమ్మర్రాజు అతని దగ్గరకు వెళ్ళి "నువ్వెంత మొనగాడివన్నా! నీళ్లల్లో ఉండే చేపను బాణంతో కొట్టేశావు!" అని మెచ్చుకున్నాడు.

అప్పుడు ఆ రామయ్య "పోవయ్యా, పో! నేనెక్కడి మొనగాడిని?! పది బండ్ల బంకమట్టిని భుజాన పెట్టుకొని, రెండు తాటిచెట్లను ఆ చంకన ఒకటి, ఈ చంకన ఒకటి పెట్టుకొని వచ్చినవాడు కదా, మొనగాడు!" అన్నాడు. అప్పుడు సీతయ్య ముందుకొచ్చి, రామయ్యతో "ఇదిగో! ఇక్కడ కనిపిస్తున్నాడే, ఇతనే, ఆ మొనగాడు! మేము ప్రపంచాన్ని చూసి రావడానికి వెళ్తున్నాం" అని చెప్పగానే రామయ్య సిగ్గుపడి, "అన్నా! నేనూ వస్తా, మీతోపాటూ" అని వాళ్లకి తోడుగా ఇతనూ బయలుదేరాడు.

అలా వాళ్లు ముగ్గురూ నడిచి నడిచి 'అలంపురం' రాజ్యం చేరుకున్నారు. అక్కడి యువరాణి అందాల భరిణ. "వీపు మీద జివ్విమానుని కట్టుకొని, ఎద్దులకు ఎండ తగలకుండా దున్నిన వాడికే తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తాను" అని ఏనాడో దండోరా వేయించి ఉన్నారు రాజుగారు. కానీ రాజ్యంలో ఎవ్వరూ ఆ పని చేయలేకపోయారు! రాకుమారికి ఇంకా తగిన వరుడే దొరకలేదు! అప్పుడు కుమ్మర్రాజు సీతయ్యను ఒప్పించి, ఆ పోటీకి పంపించాడు. సీతయ్య నెగ్గకుండా ఎలా ఉంటాడు? అతనికి రాజు కూతురిని ఇచ్చి ఘనంగా పెళ్ళి జరిపించాడు. కొన్నాళ్ళకు కుమ్మర్రాజు వెళ్తానన్నాడు. "మీకేమయినా అయితే మాకెలా తెలిసేది?" అని సీతయ్య అడిగితే అతను ఒక మల్లెచెట్టు నాటి "ఇది వాడిపోయి ఏ పక్కకు వంగితే ఆ వైపున నాకు ప్రమాదం ఉన్నదని గుర్తించు"అని చెప్తాడు.

ఇక రామయ్య, కుమ్మర్రాజు బయల్దేరి పోతూ పోతూ 'భీమాపురం' రాజ్యాన్ని చేరుకున్నారు. అక్కడి రాకుమారి కృష్ణచేణికి స్వయంవరం ఏర్పాటు చేశారు. "నీళ్లలోని చేపల్ని బాణాలు వేసి పట్టగలవాళ్ళనే ఆమె పెళ్ళి చేసుకుంటుంది". ఇది విని, కుమ్మర్రాజు రామయ్యను ఒప్పించి స్వయంవరానికి తీసుకెళ్ళాడు. నెగ్గిన రామయ్య, కృష్ణవేణిని పెళ్ళి చేసుకున్నాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత కుమ్మర్రాజు వెళ్లివస్తానని బయల్దేరాడు. "మీకేమయినా ప్రమాదం జరగవచ్చు, నేనూ వస్తాను" అన్నాడు రామయ్య. "వద్దు. నేను ఓ మల్లె మొక్కను నాటి వెళ్తాను, అది వాడిపోయి ఏ దిశకు వంగితే అటువైపున 'నేను ప్రమాదంలో ఇరుక్కున్నాను' అని అర్థం చేసుకోండి" అని బయల్దేరాడు కుమ్మర్రాజు.

అలా బయల్దేరిన కుమ్మర్రాజు చివరికి 'నిమ్మాపురం' రాజ్యం చేరుకున్నాడు. నిమ్మాపురంలో ఎవరింట్లో చూసినా ఉప్పునీళ్లే ఉన్నాయి! కుమ్మర్రాజు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి పోయి "ఎందుకవ్వా, నీళ్ళు ఇంత ఉప్పగా ఉన్నాయి? ఈ ఊళ్ళో మంచినీళ్ళు లేవా?"అని అడిగాడు. అప్పుడా అవ్వ "లేకేం నాయనా, ఉండేందుకు ఒక మంచినీళ్ళ బావి ఉంది. కానీ అక్కడ ఒక పెద్దపులి ఉంది. అక్కడికి వెళ్ళిన వాళ్లందరినీ అది తినేస్తోంది. ఆ పులిని చంపినవాళ్ళను రాకుమారి నిర్మల పెళ్లాడుతుంది. కానీ ఇంత వరకూ అక్కడికి పోయి తిరిగి వచ్చిన వాళ్లు లేరు" అని చెప్పింది, బాధ పడుతూ. వెంటనే కుమ్మర్రాజు "అవ్వా నాకు ఒక బిందె ఇవ్వు, నేను వెళ్తాను పులి దగ్గరికి" అన్నాడు. "వద్దు బాబూ, ఏ తల్లి కన్నబిడ్డవో! నీ నిర్ణయం మార్చుకో" అని వారించింది అవ్వ. అయినా తగ్గని కుమ్మర్రాజు బిందె చేతబట్టుకొని మంచినీళ్ళ బావికి చేరుకున్నాడు.

ఇంతలో ఆ పులి "నరవాసన!నరవాసన!"అంటూ పరిగెత్తుకొచ్చి, "నేను నిన్ను తినేస్తా! నాకు చాలా ఆకలిగా ఉంది" అని గర్జించింది. అప్పుడు కుమ్మర్రాజు ధైర్యంగా- "చంపే ముందు ఒక పోటీ పెట్టుకుందాం, అందులో ఓడితే నన్ను తినేసేయచ్చు. ముందుగా మనం ఒకరినొకరం మూడు గుద్దులు గుద్దాలి" అన్నాడు. అందుకు ఒప్పుకున్న పులి ముందుగా కుమ్మర్రాజుని మూడుసార్లు గుద్దింది. అయినా కుమ్మర్రాజుకి ఏమీ కాలేదు. ఆ తరువాత కుమ్మర్రాజు పులిని గుద్దాడు. అతని మొదటి గుద్దుకే పులి ప్రాణం సగం పోయింది. ఇక రెండవ గుద్దుకు అది చచ్చేపోయింది! పులి కొనగోర్లు, కొనతోక, కొననాలుక కోసుకొని, బిందెనిండా నీళ్లు నింపుకొని తిరిగివచ్చాడు కుమ్మర్రాజు. అతన్ని ప్రాణాలతో చూసిన పూటకూళ్ల అవ్వ చాలా సంతోషపడ్డది. తాను పులిని చంపిన విషయం ఆమెకు చెప్పనేలేదు కుమ్మర్రాజు. అయినా ఆ సంగతి ఊరంతా తెలిసిపోయింది. ఒక్కరొక్కరే వచ్చి 'పులిని చంపిన యోధుడ్ని' చూసిపోవటం మొదలు పెట్టారు. సంగతి తెలిసిన రాకుమారి నిర్మల కుమ్మర్రాజును వరించింది.

అలా రాజైన కుమ్మర్రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ పరిపాలించాడు. కొన్నాళ్లకు అతనికి తన అన్నలు వదినలు గుర్తుకు వచ్చారు. నిర్మలనుకూడా వెంటబెట్టుకొని, సామాన్యుడిలాగా కాలినడకన బయలుదేరాడతను. తోడుగా ఆ రాజ్యపు సేనాపతి వస్తానన్నాడు. కానీ మోసగాడైన ఆ సేనాపతి, వీలు చూసుకొని కుమ్మర్రాజుని లోతైన ఒక బావిలో పడేసి, నిర్మలను ఎత్తుకెళ్లిపోయి, వాళ్ల రాజ్యాన్ని తనే కైవశం చేసుకున్నాడు.

అయితే అదే సమయానికి సీతయ్య,రామయ్యల దగ్గరున్న మల్లె చెట్లు వాడబట్టాయి. వెంటనే వాళ్ళిద్దరూ సైన్యాలను వెంటబెట్టుకొని నిమ్మాపురం చేరుకున్నారు. అంతపెద్ద సైన్యాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక సేనాపతి పలాయనం చిత్తగించాడు. రామయ్య సీతయ్యలు రాజ్యం అంతా గాలించి, బావిలో పడ్డ కుమ్మర్రాజును వెలికి తీశారు. వాళ్ళే కుమ్మర్రాజు అన్నల్నీ, వదినల్నీ నిమ్మాపురం పిలిపించారు కూడానూ. ఆ విధంగా మిత్రులిద్దరి సహాయం వల్ల తేరుకున్న కుమ్మర్రాజు మళ్ళీ రాజై, అనేక సంవత్సరాలు చక్కగా రాజ్యాన్ని పాలించాడు.

Courtesy..
kottapalli.in