TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తెలివైన కుందేలు
అనగనగా ఒక అడవిలో కొన్ని తేనెటీగలు, ఒక ఎలుగుబంటి, కుందేలు, ఏనుగు ఉండేవి. తేనెటీగలు పోగుచేసిన తేనెను ఎలుగుబంటి తాగేస్తుండేది. తేనెటీగలు, పాపం, తమ తేనె మొత్తాన్ని ఎలుగు బంటి తాగేస్తోందని బాధ పడుతుండేవి. ఎలాగయినా సరే, ఎలుగు బంటి బారినుండి తప్పించుకునేందుకు ఉపాయం వెతుకేవి. అప్పుడు వాటికి తమ మిత్రుడు కుందేలు గుర్తుకు వచ్చింది. కుందేలుకు తెలివి ఎక్కువ కదా, అందుకని అవి అన్నీ కలసి కుందేలును ఉపాయం అడిగాయి. తమకు సాయం చేస్తే కావలసినంత తేనెను ఇస్తామని మాట ఇచ్చాయి.
కుందేలు బాగా ఆలోచించి, తేనెటీగలకు "మీరు తేనె తుట్టెను సింహం గుహ వెనక దాచి పెట్టమ"ని సలహా ఇచ్చింది. ఎలుగుబంటి ఎంత వెతికినా తేనెతుట్టె దానికి కనిపించలేదు. అలా తేనెటీగలకు ఎలుగుబంటి బెడద తప్పింది. అయితే అవి తాము కుందేలుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఒక రోజు కుందేలు ఇంటికి బంధువులు వచ్చారు. వారికి తీయని తేనె రుచి చూపాలనుకుంది కుందేలు. అది తేనెటీగల దగ్గరకి వెళ్ళి ఇచ్చిన మాటప్రకారం కొంత తేనె ఇవ్వమని అడిగింది. ’నీలాంటి వారికోసం ఇవ్వడానికేనా మేము తేనెను పెట్టుకున్నది?’ అన్నాయి తేనెటీగలు.
కోపంకొద్దీ కుందేలు ఎలుగుబంటికి తేనెతుట్టె ఎక్కడ ఉన్నదీ చెప్పేసింది. మళ్లీ ఎలుగుబంటి తేనెను తాగేయడం మొదలు పెట్టింది. తేనెటీగలకు బాధలు మొదటికొచ్చాయి. మళ్ళీ వాటికి కుందేలు సహాయం అడగక తప్పలేదు. అవి కుందేలు దగ్గరకు వచ్చి తమను క్షమించమని వేడుకున్నాయి. కుందేలు వాటిని క్షమించి ఇంకొక ఉపాయం చెప్పింది.
పథకం ప్రకారం తేనెటీగలు ఒక తారు డ్రమ్మును తీసుకొని సింహం గుహలో పెట్టాయి. కుందేలు ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి "ఎలుగుబంటి మామా! తేనెటీగలు ఒక డ్రమ్మునిండా తేనెను చేసి గుహలో దాచి పెట్టాయి, మనం ఈ రోజు రాత్రి చీకటి పడిన తరువాత వెళ్లి దాన్నంతా తాగేద్దాం" అని చెప్పింది. అయితే ఎలుగు బంటి కుందేలుకంటే ముందు తానే వెళ్ళి తేనెను తాగెయ్యాలనుకుంది. చీకటి పడుతుండగానే ఒంటరిగా గుహ దగ్గరకు వెళ్లింది. చీకట్లో డ్రమ్ములోపల ఏముందో సరిగా కనబడలేదు. తారును చూచి నిజంగానే తేనె అనుకున్నది. దాన్ని అందుకునే ప్రయత్నంలో డ్రమ్ములోకి దూరి, తారు కారణంగా అందులోనే ఇరుక్కు పోయింది.
హాహా కారాలు చేస్తున్న ఎలుగుబంటిని తేనెటీగలు, కుందేలు వచ్చి చూశాయి. తప్పును తెలుసుకున్న ఎలుగుబంటి తనను కాపాడమని మొరపెట్టుకున్నది. అప్పుడవి తమ మిత్రుడైన ఏనుగు సహాయంతో ఎలుగుబంటిని డ్రమ్మునుండి బయటికి తీసి శుభ్రం చేశాయి. అందరూ మిత్రులైనారు. తాము ప్రత్యేకంగా చేసిన తేనెతో తేనెటీగలు అందరికీ విందు చేశాయి.