Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 26వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 26వ భాగం

మాధవుడు రాకుమారునికి కొద్దిగా వెనుకగా తన అశ్వాన్ని నడిపిస్తున్నాడు. సమరానికి సంసిద్ధమయ్యాక, వారం రోజులాగి వెళ్దామన్నాడు మాధవుడు. ఆ లోగా వైద్యులని పిలిపించి, దెబ్బలు తగిలిన, భటులకి, అశ్వాలకి, గజాలకీ వైద్యం చేయించాడు. బలమైన ఆహారం ఇప్పించాడు. రోజూ అభ్యాసాలు చేయించాడు.

  అనుకూలమైన అటవీ ప్రాంతం లభ్యమయింది అదృష్టవశాత్తూ..

  ఆ ప్రాంతం.. రెడ్డి, రాయల రాజ్యాల మధ్యలో.. అనామకంగా ఉంది. జన సంచారం కూడా ఎక్కువగా లేదు.

  శన్యూషమందు వినాయకుడిని, జగన్నాధుడినీ అర్చించి బయలు దేరారు..  ఈసారి ఇంకా చిన్న గుంపులుగా..

  అయినా.. విజయోత్సవాలలో మునిగి పోయిన కాంచీపురం రాజు, తిరిగి గజపతులు దండయాత్రకి వస్తారని ఊపించలేదు. ప్రమత్తంగా ఉన్నాడు.

  చారులు కూడా, పురుషోత్తముడు వెనుతిరిగి వెళ్లపోయాడని చెప్పారు.

  వరదయ్య మంత్రి మరల స్వయంవరం ఏర్పాట్లలో నిమగ్న మయ్యాడు. రాజులందరికీ వర్తమానాలు పంపించుట, రాబోయే వరులకి వసతి ఏర్పాట్లు.. ఎక్కడా ఏ లోటూ రాకూడదు కదా!

  రాకుమారుని ముందుగా కొద్ది మంది భటులు, వెనుక గజాలు, అశ్వ దళం సాగుతోంది. కాంచీపురం రాజ్య సరిహద్దుల్లోకి వచ్చాక కనిపించిందొక గొల్ల వనిత.

  అప్పటికి వేగం తగ్గించి జాగ్రత్తగా అటూ ఇటూ పరికిస్తూ వెళ్తున్నారు.. శతృరాజ్యం కదా..

  కనిపించడమే కాదు.. చేతులూపి ఆగమని సైగ చేసింది.

  ఆశ్చర్యంగా చూస్తూ ఆగాడు మాధవుడు. పురుషోత్తముడు కూడా.. అవాంఛనీయమైనదేదైనా అనిపిస్తే, గుర్రాలు దౌడు తీయడానికి వీలుగా కళ్లెం పట్ఠుకునే ఉన్నారు.

  “స్వామీ! నా పేరు మాణమ్మ. పాలు పెరుగు అమ్ముకుని జీవిస్తుంటాను. మూడు నాలుగు ఘడియల క్రితం ఇద్దరు రౌతులు ఇటుగా.. కాంచీపురం వైపు వెళ్లారు. వారి వెనుక పెద్ద సైన్యం ఉంది. మీరు రాకుమారుడు పురుషోత్తమ దేవులే కదా?”

  ఉలిక్కి పడ్డారు మాధవ, పురుషోత్తములు. శతృరాజుకు తాము వస్తున్నట్లు ముందుగానే తెలిసి పోయిందా?

  ఆందోళనగా అటూ ఇటూ చూశారు.. ఒర లోనుంచి కత్తి తియ్యబోయారు.

  “కత్తులు తియ్యకండి బాబూ! ఇక్కడ మీ శతృవులెవరూ లేరు. ఆ రౌతులు.. తమ పేర్లు బలభద్రుడు, జగన్నాధుడు అని చెప్పారు. పూరీ పట్టణంలో ఉంటారుట. అదెక్కడో పాలమ్ముకునే నాకెలా తెలుస్తుంది? దాహంగా ఉందని మజ్జిగ తాగారు. ఒకరు తెల్లగా, ఒకరు నీలంగా ఉన్నారు. తెల్ల గుర్రం మీద ఒకరు, నల్ల గుర్రం మీద ఒకరు వచ్చారు.” మాణమ్మ ఆగింది ఆయాసంతో. కత్తులు చూసి భయపడి పోయింది.

  మాధవ, పురుషోత్తములు మొహాలు చూసుకున్నారు.

  బలభద్ర, జగన్నాధులా?

 

  “భయంలేదవ్వా! నిన్నేం చెయ్యము.” మాధవుడు గుర్రం దిగి, అవ్వని ఓదార్చాడు.

  “వారిద్దరూ అన్నదమ్ముల్లా ఉన్నారయ్యా! రంగులు వేరుకానీ రూపులొక్కలాగే ఉన్నాయి. మజ్జిగ తాగి, ధనం లేదన్నారు. చేతికున్న ఉంగరం తీసిచ్చారు. కాసేపట్లో మీరొస్తారనీ, ఈ ఉంగరం మీకిచ్చి, రూకలు తీసుకొమ్మనీ చెప్పారు.” కొంగుకి కట్టిన ఉంగరం తీసిచ్చింది మాణమ్మ.

  ఆ ఉంగరం చూడగానే మాధవుని కన్నులు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో.

  అది, గజపతుల కోశాగారంలోని ఉంగరం. వారి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఉంగరం రాకుమారునికిచ్చాడు మాధవుడు.

  అటూ ఇటూ తిప్పి చూశాడు పురుషోత్తముడు. తమ ఆస్థానంలోదే..

  కానీ దేవదేవుడే స్వయంగా.. నమ్మ శక్యంగా లేదు.

  “నిజమే నయ్యా! నా ధనం నాకిస్తే వెళ్లి పోతాను.” గొల్ల వనిత తొందర చేసింది.

  ధనం ఇచ్చి ముందుకు కదిలారు రాకుమారుడూ, పరివారం.

  పురుషోత్తమ దేవునికి ఒడలు పులకరించగా ఆశువుగా కవిత్వం వచ్చేసింది.

 

      ఆ.వె.   “నమ్మ శక్య మేన నామీన కరుణను

                  చూప గాను వచ్చె చొక్క గాను

                  అన్న తోడు కొనియు నార్తినే బాపగా

                  ఆదిదేవుడతడె నాదరమున.”

 

     మాధవుడు దీటుగా జవాబిచ్చాడు..  

 

   ఆ.వె.     “తనదు భక్తులకును తానెపుడును రక్ష

                 యొసగు చుండు నతడు యొద్దికగను

                 మనసునంత నిలిపి మాధవు కొలిచిన

                 మరి కలద యపజయమన్న పదము?”

                 

  అనుకోకుండా అనేశాడు కానీ అంతలోనే బెదురుతూ చూశాడు. దేవదేవునికి అనంత నామములుండగా మాధవుడనే పేరే రావాలా? రాకుమారులేమనుకున్నారో?

  పురుషోత్తమ దేవుడు ఫకాలున నవ్వాడు.. దైవబలం ఉందనిన ధీమా అతనికి ఉల్లాసాన్నిచ్చింది.

  “నిక్కముగా నుడివావు మాధవా! అటు ఆ స్వామి, ఇటు ఈ మిత్రుడు కాచుకొను చుండగా.. ఇంక నాకు ఓటమి ఎక్కడిది?”

  ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకు సాగారు.. సైనికులకు ప్రోత్సాహము అందిస్తూ!

                                         ……………….

 

  కాంచీ పుర సరిహద్దుల్లోనే ఎదురయింది పురుషోత్తమ దేవునికి సంభ్రమాశ్చర్యములు కలిగించే దృశ్యము.

  గజదళం ముందుకు సాగుతుండగా, అశ్వముల మీది సైనికులు, పదాతి దళం.. కలిసి కాంచీ పురాన్ని ముట్టడిస్తున్నారు.

  గజాల మీద కళింగ రాజ్య పతాకములు ఎగురు తున్నాయి.

  కంచి సైన్యాలు వారి ధాటికి తట్టుకోలేక వెనుతిరుగు తున్నాయి.                    

                              

                          

 

                      సీ.    గజములన్నియును ఘీంకారముం జేయగా

                                       భీతిల్లి నరిసేన వెను తిరిగెగ

                             అశ్వదళములన్ని యబ్బురముగ కదం

                                        తొక్కుతూ కడిమిని దూసు కెళ్లె

                             కరవాలముల నన్ని కసమస తిప్పుతూ

                                        యోధులందరు కూడి హోరు చేయ

                             ఓఢ్ర సైనికులంత యుగ్రమూర్తులయిరి

                                        కంచి శూరుల యొక్క గర్వ మడచ

 

                 ఆ.వె.   సైన్యమే మెలపుతొ చాకచక్యమునను

                            క్రమమున నడవగను గాఢముగను

                            సాధనముగ నెంతొ సమరమే సలుపగా

                            రాకుమారు నివ్వెఱ పడి నిలిచె.

 

  గొల్ల వనిత చెప్పిన అన్నదమ్ములు ఎక్కడున్నారా అని వెతికాడు మాధవుడు.

శతృసైన్యంలోకి చొచ్చుకుని పోయి వీర విహారం చేస్తూ కనిపించారు ఇద్దరూ.

  తమ సైనికాధికారులకి కూడా ఆనతిచ్చి, తమ గజాలని ముందుకురికించారు పురుషోత్తమ దేవ, మాధవులు.

  సైన్యం రెట్టింపవడంతో.. మహోత్సాహంతో ముందుకురికింది గజపతుల సైన్యం.

సాధ్యమయినంత వరకూ జంతునష్టం, జన నష్టం అవకుండా చూడమని ఆదేశాలిచ్చారు బలభద్ర, జగన్నాధులు.

  శతృ సైన్యాన్ని బెదరగొట్టి, వెను తిరిగేట్లు చెయ్యడమే తమ ముఖ్యోద్దేశ మని గట్టిగా చెప్పారు.

  అదే విధంగా.. సైనికులు అలసిపోయే విధంగా ముప్పు తిప్పలు పెడుతున్నారు, రణరంగంలో ఆరి తేరిన కళింగ సైనికులు.

  చివరికి.. స్వయంగా కాంచీపుర పాలకుడు యుద్ధ రంగానికి రాక తప్పలేదు.

  రాజు ఏనుగు పై రాగానే మహోగ్ర రూపం దాల్చి పురుషోత్తమ దేవుడు తన గజాన్ని ఎదురుగా నడిపించాడు. గజపతుల గజం కదా.. అందులో, పురుషోత్తమ మాధవులు ప్రాణాలు కాపాడిన గజం.. రణరంగంలో ఏ విధంగా చెలరేగి పోవాలో బాగా నేర్చిన గజం.. తన యజమాని మనో భావాలను బాగా ఆకళింపు చేసుకున్నది..

 

                           

 

  ఒక్క సారిగా.. దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకారం చేసింది. కంచి రాజుకి ఏనుగు సవారీ అంతగా అనుభవం లేదు..

  ఆ అరుపుకే హడలి పోయాడు.. ఐనా, సహజంగా వీరుడు కనుక, శత విధాల పోరాడాడు.

  కాంచీ పుర సైనికులు అంతకు ముందు జరిగిన రణంలో అలసి పోయి ఉన్నారు.. గెలిచిన ఆనందంలో సంబరాలు చేసుకుంటుంటే యుద్ధానికి సన్నిద్ధమవాలన్నారు. గజపతుల సైన్యం సగం పైగా కొత్తగా వచ్చింది. పైగా వారి రోషం, ధ్యేయం ముందర ఎంతటి యోధులైనా బలహీన పడక తప్పటం లేదు.

  మొదటి రోజు ముగిసిన యుద్ధంలో కంచి సైన్యానికి బాగా నష్టం వచ్చింది.

  రెండవ రోజున దిగజారిన ఉత్సాహంతో వచ్చారు యుద్ధానికి.

  గజపతుల సైన్యం మరీ రెచ్చిపోయింది.

  చివరికి, పురుషోత్తముని పక్కనే ఉండి కాచుకుంటున్న మాధవుడు, కంచి రాజుని బంధించి తీసుకొచ్చాడు.

  “ఆ వరదయ్యని కూడా బంధించండి.” పురుషోత్తముడు హుంకరించాడు.

  సైనికులు వెళ్లి, తన గృహములో బిక్కుబిక్కు మంటూ కూర్చున్న వరదయ్యను తెచ్చి అప్పగించారు.

  “అంతే కాదు.. పద్మావతిని కూడా బంధించి తీసుకు రండి.” ఆవేశం తగ్గని పురుషోత్తముడు ఆనతిచ్చాడు.

  కంచి రాజు తల దించుకుని నిలుచున్నాడు.

  “ప్రభూ! రాకుమారిని బంధించా?” మాధవుడు ఆశ్చర్యంగా అడిగాడు.

  “ఇప్పుడామె రాకుమారి కాదు. ఒక సేవకుని కూతురు. ఆమెని, చీపురుతో మలినాలని శుభ్ర పరచే సేవకుని కిచ్చి వివాహం చేస్తాను. చెప్పిన పని చెయ్యి మాధవా!” ఆగ్రహంతో ఆదేశ మిచ్చాడు కాబోయే చక్రవర్తి.

  మనసు చివుక్కు మన్నా, మొహంలో చూపించకుండా అక్కడి నుంచి కదిలాడు మాధవుడు.

  యుద్ధం ముగిసింది.

 “ప్రభూ! వారిరువురూ వెళ్లి పోతున్నారు.” చూపించాడు మాధవుడు.

  అప్పటి వరకూ రణరంగంలో స్వైర విహారం చేసిన యువకులు.. బలభద్ర, జగన్నాధులు శరవేగంతో దూసుకెళ్తున్నారు.

  “అరే! మాకు మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్లి పోతున్నారే..” సంభ్రమంగా అన్నాడు పురుషోత్తముడు.

  “మనకి చెప్పి రాలేదు కదా! వారు అనుకున్న కార్యం చేసి మరలి పోతున్నారు.” మాధవుడు భక్తిగా వారికి నమస్కరించాడు.

  “ఎవరు వారు?” కాంచీపుర రాజు అడిగాడు, కళ్లు వెడల్పు చేసి. తన ఓటమికి వారే కారణము.. అనుకోని విధంగా, ప్రమత్తులై ఉన్న తన సైనికుల మీద దాడి చేశారు.. అదీ.. హఠాత్తుగా.

  “మాక్కూడా తెలియదు. దైవ భక్తుని దూషించిన వారిని శిక్షించడానికి స్వయంగా వచ్చిన ఆ దైవ స్వరూపులని అనుకుంటున్నాం. మా మహారాజుగారు, కటకం నుండి పంపిన సైన్యానికి, ప్రధాన సైన్యాధికారుల వలే ప్రత్యక్షమయి, పని అవగానే వెడలి పోతున్నారు.

                                               

    

 

  దైవ భక్తుని హీన పర్చడం, దైవాన్ని దూషించిన కంటే పాపం.. అదే భాగవతం మనకు నేర్పిన పాఠం. అందుకే పాప ఫలం అనుభవించక తప్పదు. కన్య నివ్వమని.. వివాహం చేసుకుని ముత్యాల పల్లకిలో తీసుకుని వెళ్తామని కోరితే ఆనందంగా ఇవ్వ వలసింది. కానీ.. తాము, దుష్ట శక్తుల ప్రభావంతో జగన్నాధుని భక్తుని దూషించారు. అనుభవించక తప్పదు.” మాధవుడు వివరించాడు.

  కంచిరాజు, తన పక్కనే బంధింపబడి యున్న వరదయ్యని చూశాడు. ఇతని వల్లనే కదా.. ఇంత నాశనం అయింది.

  ప్రతీ యుద్ధానికీ ఇటువంటివారు ఒకరు ఉంటూనే ఉంటారు. తన వివేకం ఏమయింది?

                                        …………………….

......మంథా భానుమతి