Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 25వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 25వ భాగం

కపిలేంద్ర వర్మ కటకం వచ్చి నాలుగు రోజులయింది. ఈశాన్య సరిహద్దులో కలకలం సృష్టిస్తున్న జానుపూర్ సుల్తాను, మహమద్ షాని వెళ్లగొట్టడమే కాక, అతని రాజ్యం లోని కొన్నిపట్టణాలను ఆక్రమించుకుని విజయోత్సాహలతో వచ్చిన రాజు, తన రాజ్యం లోని పరిస్థితులనవగాహన చేసుకుంటున్నాడు.
   పురుషోత్తమ దేవుని పరిపాలనతో సంతుష్టుడయ్యాడు. మాధవుడతడికి చేదోడు వాదోడుగా ఉండటం మరింత తృప్తినిచ్చింది.
   గత మూడు రోజుల నుంచీ అశ్వ, గజ దళాల అభ్యాసాల గురించి కూడా వింటున్నాడు. రాకుమారుడు, సైనికులనందరినీ కత్తి యుద్దంలోనూ, విలు విద్యలోనూ అభ్యాసం చేయిస్తున్న విన్యాసాలని కూడా విన్నాడు.
   కటకం పట్టణ రక్షణకై ఉంచిన సైన్యాన్ని కూడా అప్రమత్తంగా ఉంచుతున్నందుకు పురుషోత్తమ రాకుమారుడిని మనసులో మెచ్చుకున్నాడు.
   కంచి విశేషాలు తెలుసు కోవడానికి ఆరోజు కుదిరింది కపిలేంద్రవర్మకి.
   కుమారుడుని, మాధవుడిని తన మందిరానికి పిలిపించాడు.
   “కుమారా! కాంచీపుర విశేషాలేమి? వరదరాజ స్వామిని అర్చించి వచ్చారా? శివ కేశవులకు భేదము లేదు. ఏకాంబరేశ్వరునికి అభిషేకము చేసి వచ్చితిరి గాదా! జగములనేలు అమ్మ కామాక్షదేవిని కళింగదేశమును చల్లగా కాచుకొమ్మని వేడినారు కదా! మార్గ మధ్యమున నే అవరోధములనూ ఎదుర్కొన లేదుగా?”
   “మార్గాయాసము ఏమీ లేకుండా చల్లగా వెళ్లి వచ్చాము ప్రభూ. మధ్య మజిలీలు కూడా ఆహ్లాదంగా గడిచాయి. కంచిలో అన్ని ఆలయాలలోనూ అర్చిత సేవలు చేసుకున్నాము.” మాధవుడు వివరించాడు.
   “కుమారుని మోమెందుకో ఉదాసీనంగా ఉంది మరి. కారణమేమి?”   పురుషోత్తమదేవుడు మాట్లాడకుండా ప్రక్కకి చూశాడు.
   మాధవుడు మౌనంగా ఉండిపోయాడు.
   “కుమారుని వరించెనని చారులు చెప్పిన యతివ యనుకూలమనపించలేదా? వ్యాకులతకు కారణం ఏమి? కాంచీపుర రాజుని కలవలేదా? వివరం తెలియజెయ్యి మాధవా!” మహరాజు ఆజ్ఞాపించాడు.
   మాధవుడు తాము కంచి వెళ్లినప్పటి నుండి జరిగిన సంగతులన్నీ వివరించాడు.
   “అక్కడ కొలువులో ఉన్న వరదయ్య మంత్రి మన మీద కక్ష కట్టినట్లు అనిపించింది ప్రభూ! అతడే.. నేను అడిగినప్పుడు సంతోషంగా ఒప్పుగుని సరే అన బోయిన కంచి రాజుకి అడ్డు కట్ట వేశాడు. ఆ తరువాత జగన్నాధుని రథయాత్రకి విచ్చేశాడు.”
   కపిలేంద్రుడు తల పంకించాడు.
   “ఐతే.. ఆ వరదయ్య తిరిగి వెళ్లి ఆ రాజుకు ఏం చెప్పాడో..” మాధవుని మాట పూర్తి చెయ్యలేదు..
   “రాయబారిగా వచ్చినవాడు అపభ్రంశంగా వదరుతే సరిదిద్ద వలసిన ధర్మము రాజు దేకదా! అంతటి అవమానకరమైన లేఖ రాస్తాడా? ఇది మన పరువుకీ, మన శక్తికీ సంబంధించిన విషయం తండ్రీ!

                     కం.     పరమాత్ము సేవ నగడుగ
                              పరిహాసము సల్పు వారు పాతకులె కదా
                              హరికి విరోధులగుదురుగ
                              మరి యరి భంజనము సేయ పరగెద తండ్రీ!”

   పురుషోత్తమ దేవుడు ముక్కు పుటాలదురు తుండగా, ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకొనుటకు ప్రయత్నించాడు.
   “అటులనే చేద్దాం కుమారా! మరికొంత శిక్షణ ఇవ్వాలి సైనికులకూ, అశ్వ గజములకూ కూడా. మన సైన్యాధ్యక్షునికి చెప్తాను. యుద్ధానికి సన్నిద్ధం కమ్మని. కానీ.. ఉత్తర దండయాత్ర నుంచి వచ్చి నాలుగు దినములు కూడానూ అవలేదు. సైనికులంతా అలసి సొలసి ఉంటారు. కొన్ని రోజులు వారి వారి కుటుంబాలతో గడవనిద్దాం. పిదప.. సడి చెయ్యకుండా బయలుదేరి ఆకస్మాత్తుగా మీద పడాలి. అదే మన వ్యూహం.” మహారాజు అనుభవంతో చెప్తున్న మాటలు..
   అక్కడ విజయనగరం దేవరాయలి అండ ఉంది. నెమ్మదిగా.. తెలియకుండా కొద్ది కొద్దిగా సైన్యాన్ని సరిహద్దులకి చేరుస్తుండాలి. మధ్యలో రెడ్డిరాజుల పాలన.. ఎంత అసమర్ధులైనా.. ఇంకా వారి రాజ్యం స్వాధీనమవలేదు.. కపిలేంద్ర వర్మ ఆలోచిస్తున్నాడు.
   పురుషోత్తముడిని త్వరపడద్దని బాగా హెచ్చరించాలి.
   “దగ్గరగా రా కుమారా! పరిష్వంగ సుఖం మా కందించు.” తండ్రి మాటను మన్నించి పురుషోత్తమ దేవుడు, అతడి కౌగిలిలో ఒదిగాడు.
   కానీ.. ఇంకనూ ముఖమంతా కందగడ్డలా ఎర్రగానే ఉంది, భావోద్వేగాలతో.
   “ఒక్క రెండు నెలలు కుమారా.. యుద్ధానుభవాలింకనూ మెదలుతూ ఉంటాయి సైనికులకి. అవి కాస్త మరపుకి రానివ్వాలి. ఈ లోగా మీరు మీ అభ్యాసాలు, శిక్షణలూ బాగుగా చేస్తూ ఉండండి. మీ కోరిక తప్పక తీర్చగలను. ఇదే నా వాగ్దానము. ఇంక మీమీ పనుల మీద నిమగ్నమవ్వండి.” చేతిలో చెయ్యేసి, భుజం మీద నొక్కి వదిలాడు మహారాజు.
                                         …………………
   పురుషోత్తమ దేవునికి ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు. ఇంకా రెండు మాసములా! ఆ లోగా కంచి రాజు స్వయంవరం చాటింపు వేశాడని చారులు చెప్పారు.
   తను సైన్యాన్ని సమాయత్తం చేశాడు కదా.. ఎందుకు ఆగాలి అన్ని రోజులు?
   కంచి రాజు వద్ద సైన్యం అంత యెక్కువ ఉన్నట్లు లేదు.
   రేపే తండ్రికి చెప్పి సమరానికి తరలి వెళ్లాలి..
   ఒక నిర్ణయానికి వచ్చి నిదుర కొరిగాడు.
   కపిలేంద్ర వర్మ.. చెట్టంత ఎదిగిన కొడుకుని ఏమనలేక పోయాడు.
   “సరే.. మీకంత తొందరగా ఉంటే.. తప్పదనుకుంటే, మీరు తయారు చేసుకున్న సైన్యంతో వెళ్లండి” అన్యమనస్కంగానే అనుమతి ఇచ్చాడు.
   కానీ.. మనసులోనే ఏదో ప్రణాలిక వేసుకుంటున్నాడు. పైగా..చెప్తే వినేట్లు లేడని.. స్వయంగా అనుభవంతో నేర్చుకుంటాడని అనుమతిచ్చినట్లున్నాడు. తండ్రి ప్రేమ అంటే అంతే మరి..
                          కొడుకుల మాటల కాదన
                          కడిమిని చూపగ నరగొనుగ జనకులు యిలన్
                          బడిమిని సేయుట నైనను
                          తడబడకను చేసెదరుగ తప్పుల నెన్నో.
 
   కానీ.. కపిలేంద్ర దేవుడు అంత తెలివి తక్కువగా తప్పులు చేయు వాడు కాదు. ఎంతటి మేధ లేక పోతే.. రాజ్యంలోపలి, వెలుపలి శత్రువులను మెలకువతో నియంత్రించ గలుగుతున్నాడు?

   పురుషోత్తముడు మరునాటి నుంచే సైన్యాన్ని సమాయుత్తం చేయుట ఆరంభించాడు.  
మంచి ముహుర్తం చూసుకుని నూటపది ఏనుగులతో, రెండువందల అశ్వాలతో బయలుదేరాడు.. ఆరు విడతలుగా.
   మరీ ఎక్కువమంది ఒకేసారి కదుల్తే చారులు వార్తని చేరేస్తారు. మధ్యలో రెడ్డి, విజయనగర రాజ్యాల మీదుగా వెళ్లాలి. ఏనుగులకి అడవుల్లో వెళ్లడం తెలుసు కనుక అటవీ మార్గంలో పయనం సాగించారు. ఎదురవుతున్న ఆటంకాలని తొలగిస్తూ, సాగుతున్నారు.
   రాత్రి సమయాలలో తమ శిబిరాల వద్ద, నెగడులు, మంటలు పెట్టుకుని జంతువుల నుండి రక్షించుకుంటున్నారు.
   కాంచీపురం సరిహద్దుల వద్ద, అడవి మధ్యకు చేరి, శిబిరాలను నిర్మించుకుని రణానికి సన్నిద్ధులయ్యేసరికి పక్షం రోజులు పట్టింది.
   పద్మావతీ దేవి స్వయంవర సన్నాహాలలో ఉన్న కంచిరాజుకి వార్త చేరనే చేరంది. వేగులు అప్రమత్తులై అన్ని ప్రాంతాలలోనూ తిరుగుతూనే ఉంటారు.
   స్వయంవరం నిలిపి వేసి, తానుకూడా యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాడు.
   నాలుగు రోజుల సమరం తరువాత, పురుషోత్తముని సైనికులను, వెళ్లగొట్టి విజయ భేరి మోగించాడు కంచి రాజు.
   ఏనుగులకి గాయాలు మాత్రమే అయ్యాయి కానీ.. అశ్వాలు ఇరవై, సైనికులు పదిమంది మరణించారు. తాను చేపట్టిన తొలి యుద్ధంలో ఓడిపోయి వెనుతిరిగాడు పురుషోత్తమ దేవుడు.
   అప్పుడు అర్ధ మయింది.. అనుభవజ్ఞుడైన తండ్రి చెప్పిన మాటలలోని సత్యం. తొందరపాటుతనం ఎంత చేటో కూడా తెలియవచ్చింది.
   అవమాన భారంతో.. నెమ్మదిగా వెనుతిరిగి వెళ్తున్న పురుషోత్తముడ్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు మాధవుడు. ఆశాభంగం ఎంతటి పని నైనా చేయిస్తుంది. రాకుమారుడు ధ్యాన యోగాదులతో కొంత తేరుకుంటున్నాడు. దారిలో రంగనాధ స్వామి ఆలయ దాపుల్లో విడిది చేశారు సైనిక బృందం.
                
   సంధ్యావందనాది కార్యక్రమాలయ్యాక, పురుషోత్తమ దేవుడు వంటరిగా ఆలయంలో గడుపుతానని చెప్పాడు. స్వామి దర్శనం, పూజ అయిన పిదప చీకట్లు ఆవరించుకోవడంతో గర్భగుడి తలుపులు మూసి వెళ్లిపోయాడు అర్చక స్వామి.
                                

  “స్వామీ మేమీ రాత్రికి ఇచ్చట విశ్రమించ వచ్చా?” మాధవుడు అడిగాడు.
   “కొద్దిమంది ఫరవాలేదు సామీ.. కానీ.. జాగ్రత. దోపిడీ దొంగలుంటారు. బాట సారులని దోచుకుంటారు.” హెచ్చరించి వెళ్లిపోయాడు అర్చకుడు.
   రాకుమారునికి, తనకీ ఆహారం అక్కడికే తెప్పించి, ఇద్దరు సైనికులని మాత్రం ఉండమని అందరినీ తమ సత్రాలకి వెళ్లమని చెప్పాడు. ఏనుగులూ, అశ్వాలూ వాటి వాటి శాలల్లో సేద తీరుతున్నాయి.
   గర్భగుడిలో వెలుగుతున్న దీప కాంతులు తప్ప ఏ వెలుతురూ లేదు.
   సైనికులిద్దరినీ వంతుల వారీగా ప్రధాన ద్వారం వద్ద కాపలా కాయుమని, తను మండపం అరుగు మీద, రాకుమారు దృష్టికి ఆనేట్లుగా కూర్చున్నాడు.
   ఏ క్షణమైనా, కత్తి ఒరలోనుండి లాగడానికి సిద్ధంగా..
   ఒక ఝాము గడిచింది.
   పురుషోత్తముడు కన్నులు మూసుకుని ప్రార్ధిస్తున్నాడు.
 

            ఉ.  “చేసిన నేరమేమి యది? చీకిలితో నొక తీరుగా నదే
                  వాసిగ తేరునూడిచితి భక్తిన, రాజను దృష్టి చూపకే
                  చేసితి నేనహర్నిశము సేవను శ్రద్ధగ నీదయం గొనన్,
                  భాసమునే కటాక్షమును బాసిల రావదె నన్ను బ్రోవగా.”

   కన్నుల వెంట నీరు కారి పోతోంది ధారగా.
   “జగన్నాధా! దీన బాంధవా.. బుద్ధి తెలిసిన నాటి నుంచీ నీ సేవ చేసుకుంటున్నాను. ఆసేవనే పరిహసిస్తుంటే సహించలేక సమరానికి సంసిద్ధమై వెడలితిని. చెడు మాటలన్నవారిని శిక్షింపక యుండుట న్యాయమా? నా పక్షమున నిలచి చేదోడుగా ఉండి గెలిపించక పోతివా పరంధామా!”
   మనసంతా జగన్నాధుని మీద ఉంచి ప్రార్ధిస్తున్నాడు రాకుమారుడు.
   ఆదిదేవుని రూపు తప్ప మరి ఏదీ కాన రావట్లేదు.
   ఆ విధంగా రెండు ఘడియలు కూర్చుని ఉంటాడు.. స్పష్టంగా, గంభీమైన కంఠస్వరం విన వచ్చింది..
   “రాకుమారా విచారము మాని వెనుకకు మరలు. కాంచీపుర రాజుతో మరల యుద్ధం చెయ్యి. ఈ మారు తప్పక గెలుస్తావు. నా ఆభయం, సహకారం ఉంటుంది. నీ సైనికులకు కూడా తగిన శక్తి లభ్యమవుతుంది.”
   “నిజంగానా! ఆ పరాత్పరుడు నాకు సందేశ మిచ్చాడా?” నమ్మలేని పురుషోత్తమదేవుడు కన్నులు తెరిచాడు.
   రెండు ఘడియలనుకున్నాడు కానీ.. తెల్లవార వచ్చింది. అయినా అలసటనేది లేదు. రాత్రంతా విశ్రమించినట్లే అనిపించింది.
   రాకుమారుడు కన్నులు తెరవగానే, మాధవుడు వచ్చేశాడు.
   “ప్రభూ! కుశలమేనా?” ఆందోళనగా అడిగాడు. రాత్రంతా మెలకువతో ఉన్నా, కించిత్తుకూడా సోలిపోకుండా కళకళ్లాడుతూ కనిపించాడు మాధవుడు.
   “కుశలమే మాధవా! నాకు జగన్నాధుడు ఆదేశమిచ్చాడు.. వెనుకకు మరలి సమరం సాగించమని. తాను సహకారం అందిస్తానన్నాడు. మన సైనికాధికారులకు విషయం తెలియ పరచండి.”
   “అట్లే చేద్దాం దేవా! అధికారులతో మాట్లాడుతాను.”
   మాధవుడు, పురుషోత్తముడు, పినాకినీ నదికి వెళ్లి స్నాన పానాదులనంతరం సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలి వచ్చారు.
   వారు తిరిగి వచ్చేసరికి, సైనికులు కాలకృత్యాలు తీర్తుకుని, ఫలహారాలు చేసేసి తయారుగా ఉన్నారు. ఆహార పదార్ధాలు, వంటవారు కూడా వారి వెంట ఉంటారు. అనువైన చోటు చూసుకుంటే రెండు ఘడియల్లో భోజనం తయారై పోతుంది.
   సైన్యాధికారులు తయారుగా ఉన్నారు.
   రాకుమారుని, మాధవుని చూడగానే దగ్గరగా వచ్చారు.
   “ప్రభూ! మన సైనికులు కూడా ఓడిపోయి వెనుకకు మరలడాన్ని చిన్నతనంగా భావిస్తున్నారు. మరల యుద్ధం చెయ్యడానికే ఆటంకమూ లేదు. మనం ఇప్పుడే.. తక్షణమే మరలచ్చు.” ముఖ్య సైనికాధికారి వచ్చి సెలవిచ్చాడు.
   మాధవుడు పురుషోత్తముడిని ఉత్సాహ పరచి, ఫలహార శిబిరానికి తీసుకెళ్లాడు.
   “మాధవా! నేను చేస్తున్నది మంచి పనేనంటావా? అలసి సొలసిన సైనికులను, అశ్వాలనూ మరల యుద్ధం చెయ్యమనడం అమానుషం అవుతుందా? మనం మరింత నష్ట పోతామా?”
   మాధవుడు చిరునవ్వు నవ్వాడు.
   భృకుటి ముడిచి వింతగా చూశాడు పురుషోత్తముడు. తనెంతో వేదనలో ఉంటే నవ్వడం.. అదేమి పద్ధతి..
   “అపార్ధం చేసుకోకు మిత్రమా! కురుక్షేత్ర సంగ్రామం ముందు అర్జునుడి మాటల్లాగ అనిపించి నవ్వొచ్చింది. ఆరంభంలో నిర్వేదం ఆ మహానుభావునికే తప్పలేదు మనమెంత? కృష్ణ పరమాత్మ చెప్పింది మననం చేసుకోవడమే మనం చెయ్యవలసింది.
    
      * ఆ.వె      చేయదగినదియును, చేయరాదనెడిది
                     నీదు కరమునందు నేది లేదు
                     పాత కర్మ కెపుడు పాశ బద్ధుడ నీవు
                     కనుక కదలవయ్య కదనమునకు.
ఇంకా..
       * ఆ.వె.  పురుష శ్రేష్ఠ! నీకు పూర్తి గోప్యమునైన
                   జ్ఞానమిచ్చినాను జ్ఞాని కమ్ము
                   బుద్ధిమంతుడ వీవు పూర్తిగా యోచించి
                   సబబు నైనదొకటె సాగనిమ్ము.
                           
                      
(*ప్రముఖ పాత్రికేయులు శ్రీ గోపీనాథ్ పిన్నలిగారు అందరికీ అర్ధమయే రీతిగా భగవద్గీత    అధ్యాయలను తెనిగించారు. వారి సౌజన్యంతో.. అందులోని పద్యాలు.. రచయిత్రి.)

   పై విధంగా చెప్పి భగవానుడు అర్జనుడి నిర్ణయానికే వదిలేశాడు. కానీ.. ధర్మమునకు కట్టుబడిన అర్జనుడు కదనానికి కదిలాడు.. పరమాత్మ బోధించినట్లుగా.
   అదే విధముగా, పరాత్పరుని సేవలో లీనమయిన భక్తులను అవమానించడం, భగవంతుని దూషించడం కన్నా ఘోరమైన నేరం. ఆ నేరాన్ని కంచి రాజు చేశాడు. అందుకు శిక్ష పడాలిసిందే. భగవానుడి ఆనతి కూడా అయిన పిదప ఆలోచించ వలసిన పని లేదు. అయిననూ.. మరొకమారు యోచించి..” మాధవుని మాట మధ్యలో ఆపేసి ఫక్కున నవ్వాడు పురుషోత్తముడు.
   “నిర్ణయం తీసుకోవాలి. అంతేగా! ఆ శ్రీకృష్ణులవారి లౌక్యము కన్ననూ మిక్కుటముగా మించిపోయావయ్యా మాధవా! అదే పేరు కదా మరీ.. రణ భేరి మోగిద్దాం.. పద.”
                                     …………………

......మంథా భానుమతి