TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నాగసముద్రానికి తూర్పున ఉన్న అడవిలో పింకీ, టింకీ, చంకీ అని మూడు కుందేళ్లు ఉన్నాయి. అవి మూడూ మంచి స్నేహితులు. ఓసారి ఆ మూడూ రామయ్య అనే రైతు తోటలో క్యారట్లు తింటూ ఉన్నాయి.
సరిగ్గా ఆ సమయానికే రామయ్య, అతని చిన్ననాటి స్నేహితుడు సోమనాథ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ అటుగా వచ్చారు. "ప్రక్క ఊరిలో జాతర జరుగుతుందట, వెళ్దాం సోమనాథ్" అంటున్నాడు రామయ్య. ఆ సంగతి విన్నది టింకీ.
వెంటనే పరిగెత్తుకొని వచ్చి పింకీకి, చంకీకి ఆ సంగతి చెప్పింది. "మనం కూడా వెళ్దామా?" అంది. 'సరే' అని ముగ్గురూ జాతరకు బయలుదేరారు.
దారిలో ఈత కాయలు, నేరేడు పండ్లు కడుపునిండా తిన్నారు ముగ్గురూ.
చివరకు జాతరకు చేరుకున్నారు. దేవుడిని దర్శించుకున్నారు. గుడి ప్రక్కనే ఐస్‌క్రీం బండి ఉంది. ముగ్గురికీ నోరు ఊరింది. వెంటనే అక్కడికి వెళ్లి తలా ఒక ఐస్‌క్రీం తీసుకున్నారు. అప్పుడు గుర్తొచ్చింది- వాళ్ల దగ్గర డబ్బు లేదు!
పింకీ, చంకీ ఐస్‌క్రీములు చేత బట్టుకొని అక్కడే నిలబడ్డాయి. "ఇంటికెళ్లి డబ్బులు తీసుకురా, టింకీ! గబుక్కున వచ్చేయి!" అని టింకీని ఇంటికి పంపించాయి. 'సరే' అని బయల్దేరింది టింకీ.
అయితే వెంటనే దానికో అనుమానం వచ్చింది- "నేను వచ్చే లోపల వాళ్లు నా ఐస్‌క్రీం కూడా తినేస్తే ఎలాగ?" అని. అందుకని అది ఇంటికి పోకుండా ప్రక్కనే ఉన్న ఓ చెట్టు చాటున దాక్కొని, పింకీ-చంకీల చేతుల కేసే చూడటం మొదలు పెట్టింది.
అరగంట దాటింది.. ఇంకా రాలేదు టింకీ. ఆలోగా ఐస్‌క్రీం మొత్తం కరిగిపోయి కారటం మొదలెట్టింది. "అయ్యో ఐస్‌క్రీం మొత్తం కారిపోతోందే" అని ఏడుపు మొహంతో దాన్ని నాకెయ్యబోయారు పింకీ-చంకీలు.
"ఏయ్! నాకు తెలుసు, మీరు మోసం చేసి, నా ఐస్‌క్రీం కూడా తినేస్తారని! అందుకనే, నేనసలు ఇంటికి వెళ్ళనే లేదు- ఇక్కడే, ఆ చెట్టు చాటున దాక్కొని చూస్తున్నాను!" అని ఇకిలించింది టింకీ, వాళ్ళ ముందుకు దూకి. మిత్రులిద్దరికీ పిచ్చి కోపం వచ్చింది.
"మమ్మల్ని క్షమించన్నా. ఇది ఇంత తెలివి తక్కువ దద్దమ్మ అనుకోలేదు- మేమిద్దరం వెంటనే ఇంటికెళ్ళి, పది నిముషాల్లో నీ డబ్బులు నీకు తెచ్చిస్తాం" అన్నాయవి ఐస్‌క్రీం బండి అతనితో.
బండి అతను నవ్వి "ఈ టింకీ ఒట్టి దద్దమ్మే కాదు. దీనికి నమ్మకం అంటే ఏంటో కూడా తెలీదు. ముందు దీనికి స్నేహంగా ఉండటం నేర్పండి. నాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదులే" అని బండిని నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు.
Courtesy..
kottapalli.in