TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 12వ భాగం
సీ. రాజనగ నెవరదీ జగమున జన
సామాన్యమందరి సాధకముల
చూచి కాచెడి వాడు, చోరుల దండించ
యప్రమత్తుడై నుండి యరయు వాడు
తగురీతి రాజ్యమున్ ధరలదుపుంబెట్టి
సుఖజీవనమునంత చొనుపు వాడు
వెవసాయమునకునూ బేహారమునకునూ
సమ ప్రధానత్వ మొసగెడి వాడు.
ఆ.వె. ప్రజను కన్న తండ్రి వలె చూచుగ నతడు
కష్ట సుఖములందు కమ్ము కొనగ
యట్టి రాజెపుడును యక్షయముగ నిల
మనగలడుగ నెంతొ మహిమ తోను.
రాకుమారుడు పురుషోత్తమదేవుని రాక చూసి గురుకులంలోనే కాదు పల్లె పల్లంతా సంతోషం వెల్లి విరిసింది.
పురుషోత్తమదేవుని వెనుక బళ్లల్లో, నిండుగా ఏనుగులకి ఆహారం.. పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు, ఆకులూ.. చాలా బళ్లున్నాయి. పాతిక పైగా. ప్రతీ బండిలోనూ ఇద్దరిద్దరు యువకులు.. బండి తోలే వాళ్లు కాకుండా.
రాకుమారుడు వచ్చి, గుర్రం దిగి ఆచార్యులవారికి వందనం చేశాడు.
“ఏమిది రాకుమారా?”
“ఏనుగులన్నిటినీ కోటకి తరలిద్దాము ఆచార్యా! తండ్రిగారు గజబలం పెంపొదించే ఆలోచనలో ఉన్నారు. సరైన శిక్షణ నిస్తే మన గజబలానికి ఎదురే ఉండదు. కోట వెనుక ఏనుగుల నిమిత్తం పెద్ద వనం కూడా పెంచాము.. ఇంకా ఆ వన వైశాల్యము పెంచుతున్నాము. కరవుతో అడవిలో ఆహారం లేనే లేదు కదా!” పురుషోత్తముడు వినయంగా అన్నాడు.
“మీ వంశానికి గజపతులనే పేరు సార్ధక నామధేయం అవగలదు నాయనా! మహరాజుగారి ఆలోచన దివ్యంగా ఉండి అటు పశువులకీ, ఇటు రాజ్యానికీ.. ఇరు పక్కలా.. ఉభయతారకం.” ఆచార్యులు ఆశీర్వదించారు, నమస్కరిస్తున్న రాకుమారుడిని.
“మాధవా! ప్రారంభిద్దామా?” పురుషోత్తముడు పిలిచాడు, కొద్ది దూరంలో నిలుచుని వీక్షిస్తున్న మాధవుడిని. అతడి నైపుణ్యం మీద అంతులేని నమ్మకం రాకుమారునికి.
“ముందుగా కొంత ఆహారం.. ఒక బండి మీదున్నది.. పల్లెవైపు వస్తున్న మంద ముందు వేస్తే ఏనుగులు ఆగిపోతాయి. ఆ బళ్ల మీదున్న వారు మావటీ వారనుకుంటాను.. ఆహారం తింటున్నపుడు ఏనుగులని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంటే.. మనం ప్రణాలిక రచిద్దాము.” మాధవుడు జవాబిస్తూనే, రాకుమారుని వద్దకు వచ్చాడు.
పురుషోత్తముడు మావటి వారికి సైగ చేశాడు.
……………….
అడవి లోనికి వెళ్లే దారిలో చితుకులనీ, ఎండు కట్టెలనీ పేర్చారు. అదే విధంగా.. కోట వైపుకి ఉన్న దారిలో తప్ప మిగిలిన రెండు దిక్కులా చేశారు. కోటకి వెళ్లే దారిలో ఆకుపచ్చని ఆకులతో ఉన్న కొమ్మలు పేర్చారు. ఏనుగుల గుంపు నడుస్తుంటే.. ఆ కొమ్మలని బళ్లతో లాగే ఏర్పాటు చేశారు.
మొత్తం అనుకున్న విధంగా తయారయే సరికి అపరాహ్ణం దాటింది.
ఆ సమయంలో మావటివారు ఏనుగులని మచ్చిక చేసుకో గలిగారు.
మాధవుడు అన్ని పనులనూ పర్యవేక్షించి, ఏనుగుల వద్దకు వెళ్లి.. నాయకునిలా ముందు ఆజమాయిషీ చేస్తున్న గజరాజు వద్దకు వెళ్లాడు.
తమ కోసం ఆహారం సమకూర్చాడనో ఏమో.. ఆ ఏనుగు అభివాదం చేస్తున్నట్లు తొండం ఎత్తింది.
మాధవుని కంట నీరు తిరిగింది. ఎన్ని రోజులుగా ఆహారం లేకుండా ఉన్నాయో! తప్పని సరైతే కానీ జనావాసాలకి రావు.
ఏదో.. చెప్పాలని ఉంది ఆ గజానికి..
మాధవుని తొండంతో ఎత్తి తన మీదికి ఎక్కించుకుంది ఆ గజరాజు. ఒక మావటి వానిని కూడా ఎక్కించుకుని ఏనుగు ఎక్కడికి తీసుకు వెళ్తుందో గమనిస్తున్నాడు మాధవుడు.
పల్లెకి అడవికీ మద్యనున్న ఒక పుంతలోకి దారి తీసింది. కొద్ది దూరం వెళ్లగానే కనిపించింది.. పొదల మధ్య. పడుకున్న నల్లని కొండలాగుంది..
దూరం నుండే ఆ ఆకారాన్ని పోల్చుకున్నారు.
సైనికుడు కత్తి విసిరిన గజం.
తమ నేస్తం అలా పడుందని ఏనుగులన్నీ ఒక దగ్గర చేరి నట్లున్నాయి.
ఏనుగు మరణించి ఉండదు. మరణిస్తే ఇంకా విజృంభించేవి. ఎప్పడో పల్లె మొత్తం నాశనమయ్యేది.
చాలా పెద్ద ఏనుగు.. బాధతో తల వాల్చేసి ఉంది.
నెమ్మదిగా అక్కడికి నడిచింది, మాధవుడెక్కిన గజం.
ఆ ఏనుగు వద్దకు వెళ్లి నేలమీదికి కూర్చుని, తొండాన్ని మాధవునికి ఆనించింది,
ముందుగా మాధవుడు, తరువాత మావటీడు దిగారు.
గాయపడిన గజం.
సైనికుని చురకత్తి ఒక కాలిలో లోతుగా దిగింది. ఆ కత్తి ఇంకా అక్కడే ఉంది.. స్తంభంలా ఉన్న కాలి పైభాగంలో.. తొడ వద్ద. కాలంతా రక్తం గడ్డకట్టి ఉంది.
ముందు గాయాన్ని కడగాలి.. ఏనుగు చేత నీరు తాగించాలి. శరీరంలో ద్రవాలు లేక నిస్త్రాణ అయిపోయింది. అటూ ఇటూ చూశారిద్దరూ.. రక్షణ బృందం.
జంతువులకున్న గ్రహింపు శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు.
వారిని తీసుకొచ్చిన ఏనుగు తొండంతో ఇద్దరినీ తడిమింది. వంగి ఉన్న కాలి మీద ఎక్కి మాధవుడు పైకి లంఘించాడు. త్వరత్వరగా నడుస్తూ గురువుగారు, రాకుమారుడు ఉన్న స్థలానికి తీసుకెళ్లింది.
వెంటనే జరగ వలసిన ఏర్పాట్లు జరిగి పోయాయి.
కుండలలో నీళ్లు, అవసరమైన ఔషధాలు, లేపనాలు, పల్చని వస్త్రములు తీసుకుని, ఒక బండి తరలింది. మాధవ, మావటీలు తమని తీసుకు వచ్చిన ఏనుగు మీద కూర్చుని దారి చూపుతూ ముందుగా వెళ్లారు.
రక్త సిక్తమై ఉన్న కాలంతా కడిగి, జాగ్రత్తగా కత్తిని బైటికి లాగి, గట్టిగా మెత్తని వస్త్రాన్ని కాలి చుట్టూ కట్టారు.. రక్త స్రావం అరికట్టడానికి.
మావటి, వీలు చూసుకుని, తల పక్క కూర్చుని ఏనుగు నోరు తెరచి, నీళ్లు పోశాడు గొంతులో.. కుండలతో. కాస్త త్రాణ రాగానే కళ్లు తెరిచి తల అటూ ఇటూ తిప్పిందా గజం. వెంటనే.. ఆహారం తినిపిస్తూ, ఔషధాలు కూడా పోశారు గొంతులో.
కాలికున్న బట్ట విప్పి, అవసరమైన లేపనాలు పూశారు.
ఈ వైద్యం జరుగుతున్నంత సేపూ అక్కడే కూర్చుని చూస్తోంది మాధవుని తీసుకు వచ్చిన ఏనుగు. వైద్యం తీసుకుంటున్న గజం కూడా కిమ్మనలేదు.
కొంచెం తల ఎత్తి, కూర్చోగానే.. బాగా ఆకులున్న కొమ్మలు దగ్గరగా పెట్టారు. నెమ్మదిగా నములుతూ తల అటూ ఇటూ తిప్ప సాగింది గజం.
అందరూ సంతోషంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.
సంధ్యా సమయానికే దెబ్బతిన్న గజరాజు లేచి నిలబడ్డాడు.
నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్లారు మిగిలిన పరివారం వద్దకి. ఆ గజాన్ని చూడగానే అన్ని ఏనుగులూ తొండాలూ, తలలూ ఊపుకుంటూ వచ్చేశాయి తమ నేస్తం దగ్గరగా!
కొన్ని తొండాలు ఊపుకుంటూ, కొన్ని తలలూపుతూ.. గున్నలు తల్లుల కింద నిలబడి తొండాలతో సవరదీస్తూ.. సన్నగా ఘీంకరిస్తూ చుట్టూ చేరాయి.
వాటి ఆనందం చూసి తీర వలసిందే.
చుట్టూ ఉన్న జనుల మీద కోపం పోయింది.
మాధవుడు, మావటీడు తమ వాహన గజం మీది నుంచి కిందికి దిగగానే.. వారి వద్దకు రావడానికి ప్రయత్నించాయి. ఇద్దరూ ఏనుగుల వద్ద మెలగడం అనుభవంఉన్నవారే..
అన్నిటినీ స్వయంగా.. తడుముతూ, పలుకరిస్తూ ఓదార్చారు.
ఆ ఓదార్పు ప్రక్రియ చూసిన వారు జంతువుల కృతజ్ఞతా భావాలను చూసి కదలి పోయారు.
ఆ.వె. తమకు హాని కలుగ దాడిచేయను వచ్చు
ప్రేమ చూప గాను పేర్మి యొసగు
మాట రాదు గాని మౌన భాషణ సేయు
వారి చేష్టలన్ని బాగు బాగు.
మూగజీవులే కాని భావ ప్రకటనలో సిద్ధహస్తులే.
గురువుగారు పురుషోత్తమదేవుని చూసి చిరునవ్వు నవ్వారు.
“ఈ రోజు ఇంక కదలలేము రాకుమారా! రేపు ప్రభాత సమయంలో బయలు దేరుదాము.” మాధవుని సలహాకి తల పంకించాడు రాకుమారుడు.
“మన నేస్తాలని కూడా విశ్రాంతి తీసుకోమందాము. పాపం.. అవి కూడా గత రెండు దినముల నుండీ బాగా అలిసి పోయాయి. ఇప్పుడు సంధి కుదిరింది కనుక నిశ్చింతగా ఉంటాయి. మన మాట వింటాయనే ఆశిస్తున్నాను.”
“అవును మాధవా! కడుపు నిండుగా ఆహారం కూడా దొరికింది. ఇంక కావలసినదేముంది? అటు చూడు మిత్రమా?” పురుషోత్తముడు చూపిన వైపు చూసి చిరునవ్వు నవ్వాడు మాధవుడు.
అన్ని ఏనుగులూ తలొక చెట్టు కిందా, స్థిర పడిపోయాయి. గున్నలు తల్లుల పక్కగా తలలు పక్కకి తిప్పి రాస్తూ ఉన్నాయి. ఒక అలౌకిక స్థితిలోకి చేరుకున్నాయి ప్రశాంతంగా.
పురుషోత్తమదేవుడు సంతృప్తిగా తల పంకించి, గురుకులం వైపుకి దారి తీశాడు.
పల్లె వాసులంతా తమ పల్లెకేసి తిరిగారు.
“ఒక్క క్షణం ఆగండి..” వెను తిరిగిన రాకుమారుడు పిలిచాడు.
పల్లె పెద్ద దగ్గరగా వచ్చాడు. కోటలో ఉండే రాకుమారుడు.. తమ వద్దకు వచ్చి.. తమని పిలిచి మాటలాడడమా! పల్లె వాసులకి నోట మాట రాలేదు.
“మీ పంట నష్టం గురించి తండ్రిగారికి విన్నవించాను. మిమ్మల్ని తప్పక ఆదుకుంటారు. బెంగ పడకండి.”
వంగి వంగి దణ్ణాలు పెట్టుకుంటూ వెళ్లి పోయారు అందరూ.
మావటీలకీ, బళ్లు తోలే వారికీ.. వచ్చి వారందరీకీ ఆహారం తయారు చేశారు.శిష్యులు గురు పత్ని పర్యవేక్షణలో.
రాకుమారు ఒక బండిలో ఆహార పదార్ధాలు తీసుకుని వచ్చాడు. శిష్యులు తమ గృహాల నుంచి తెచ్చివి కూడా ఉంటాయెలాగూ. గురుకులంలోనే కూరగాయలు పండిస్తారు.
కడుపు నిండుగా భోజనాలు చేసి ఒళ్లు తెలియకుండా నిద్ర పోయారందరూ.
………………
కం. ప్రేమను మించిన భావము
ప్రేమ వలెను నూరడింప వేరేముందీ
ప్రేమయె కద నిలనంతయు
ప్రేమ మయము చేయ వచ్చె పెన్నిధి వలెనే.
మరునాడు లేవగానే అందరినీ అలరించిందొక సుందర దృశ్యం.
ఏనుగుల మంద.. అక్కడున్న చెరువులో జలకాలాడుతోంది. గురుకులంలో మాధవుడు, రాకుమారుడు చూపిన ప్రేమతో వాటికి అంతులేని విశ్వాస మొచ్చింది, అక్కడి వారి మీద.
మాధవుని చూడగానే తొండాల నెత్తి, ఘీంకరిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి.
కాలకృత్యాలు తీర్చుకోవడానికీ, స్నాన మాచరించి, అర్ఘ్యం విడవడానికీ కొలనుకి వెళ్తే.. అతని మీద తొండాలతో నీళ్లు కుమ్మరించి అభిషేకం చేశాయి.
చూస్తున్న వారి కన్నులు ఆశ్చర్యంతో విప్పారాయి.
సదానందాచార్యులవారు ప్రసన్న వదనంతో వీక్షించారు.
వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది.
పరివారం అంతా లేచి, త్వరిత గతిన తయారయి కోటకి పయనమయ్యారు.
మొదటగా అనుకున్నట్లు మూడు పక్కలా మంటపెట్టడం, కోట దారంతా కొమ్మలు లాగడం వంటి ప్రణాలిక అవసరం లేక పోయింది.
మాధవుడు, మావటి తమకు మచ్చికైన గజం మీద కూర్చుని త్రోవ చూపుతుండగా.. ఏనుగులన్నీ బారాబతి కోటకి పయనం సాగించాయి. ప్రయాణం ఆరంభం అవగానే మరి మూడు మందలు వచ్చి చేరాయి. బళ్ల మీదున్న ఆహారం వాటికి తినిపించి, వారంతా కూడా పాలు, పళ్లు ఫలహారం చేసి బయలు దేరారు.
అనూహ్యంగా నూరు ఏనుగులు.. అంతకన్నా సైన్యానికి బలం ఏముంటుంది?
కపిలేంద్ర దేవుని రాజ్య విస్తరణకి తిరుగు లేని విధంగా గజబలం సేకరణ అయింది దైవికంగా.
……………..
......మంథా భానుమతి