Facebook Twitter
అజ్ఞాత కులశీలశ్య….” 11వ భాగం

అజ్ఞాత కులశీలశ్య….” 11వ భాగం

మాధవుడు రయమున కళ్యాణిని కళ్లెంతో వేగిర పరుస్తూ వెళ్లే సరికే పరిస్థితి భీభత్సంగా ఉంది.

  గౌతమికి కాస్త సుస్తీ చేస్తే గురువుగారి అనుమతితో నాలుగు రోజులు సెలవు తీసుకున్నాడు. ఇంకా ఒక రోజు గడువుంది.

  గురుకులం ఒక పల్లెనానుకుని ఉంది.

  పల్లెవాసులంతా భీతావహులై అటూ ఇటూ పరుగెడుతున్నారు.

  ఏనుగులు పంట పొలాలన్నింటినీ నాశనం చేశాయి. పెద్దా చిన్నా కలిపి పదిహేను ఏనుగులుంటాయి. గున్న ఏనుగులు కూడా చిన్న తొండాలని ఊపుకుంటూ చేలలో మొక్కలని భక్షిస్తున్నాయి.

  మాధవునికి చూడగానే అర్ధమైపోయింది. చాలా పెద్ద సమస్యే..

  మాధవుడు ఇట్టువంటి విపత్తుని ఇదివరకు చూశాడు. వంగ దేశంలో అడవులెక్కువే.. ఏనుగులూ, పులులూ కూడా ఎక్కువే. ఒక సారి ఇటువంటి పరిస్థితే పులులతో వచ్చింది అక్కడ.

  వెంటనే తమ కోటలోని సైనికులు వెళ్లి పులులని తరిమేశారు. ఒక పులి, నలుగురు మనుషులు చనిపోతే కానీ అదుపు లోకి రాలేదు పరిస్థితి. అప్పుడు అక్కడి రాకుమారుడితో వెళ్లి దూరం నుంచే చూశాడు.

  మాధవునికి గజం మీదికి ఎక్కడం వాటిని మచ్చిక చెయ్యడం కూడా వచ్చును. ఒక రకంగా పసి వయసులోనే అన్నీ నేర్పిస్తారు వంగదేశపు కోటలలో రాకుమారులకి. నిరంతరం అప్రమత్తులై ఉండాలిసిందే. ఏ క్షణం ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.

  అది మనుషులవచ్చు, జంతువులవచ్చు. అందుకే పసి తనం నుండే మాధవునికి చాలా అనుభవాలు కలిగాయి.

  “మనవాళ్లేమైనా చేశారా ఏనుగులని?”

  తల వంచుకున్నాడు సహ విద్యార్ధి.

  “ఏమయింది?”

  “మొన్న ఒక మదపుటేనుగు వచ్చి పొలాలన్నీ నాశనం చేస్తే చుర కత్తి పట్టుకుని ఒక సైనికుడు..”

  మాధవుని హృదయం ఒక క్షణం లయ తప్పింది.

  “ఏనుగు మరణించిందా?”

  “తెలియదు. బాగా రక్త స్రావం అవుతుంటే అడవిలోకి పారిపోయింది, కుంటుకుంటూ.”

  “ఇక్కెడెక్కడా గాయపడిన ఏనుగు కనిపించడం లేదు. మరణించే ఉంటుంది. అందుకే మొత్తం మందంతా వచ్చింది. ఊరుకున్నామంటే మిగిలిన మందలని కూడా పిలుస్తాయి.”

  “ఇప్పుడేం చెయ్యాలి మాధవా?” వణికి పోతూ అడిగాడు మిత్రుడు.

  “ఏనుగులు ఏమీ ఎరగనట్లుంటాయి కానీ, గ్రహణ శక్తి ఎక్కువే. అసలు అడవి లోనుంచి జనావాసంలోకి ఎందుకు వచ్చిందో ఆ మదపుటేనుగు?”

  “ఈ సంవత్సరం కరవు వచ్చింది కదా.. అడవిలో వృక్షాలన్నీ ఎండిపోయుంటాయి. ఆహారం దొరక్క వచ్చుంటుంది.”

  ఆలోచనగా తలూపాడు మాధవుడు.. నిదానంగా పచ్చని పొలాల్లోని, తోటల్లోని చెట్ల ఆకుల్ని భక్షిస్తున్న ఏనుగులని చూస్తూ.

  అప్పుడే గురువుగారు మిగిలిన శిష్యులని తీసుకుని వచ్చారు, చింతా క్రాంతులై.

  “మాధవా! ఎందుకో.. నీకు ఈ పరిస్థితిని తప్పించగల నేర్పుందని అనిపిస్తోంది. ఇప్పటికే నలుగురి ప్రాణాలు హరించుకు పోయాయి. గజాలన్నీ మహోగ్రంగా ఉన్నాయి. ఏం చెయ్యాలో అర్ధం అవడం లేదు.. ఈ పరిసరాలని విడిచి పెట్టి పోవడం తప్ప.” గద్గద స్వరంతో అన్నారు.

  “ఆ మదపుటేనుగుని గాయపరచకుండా ఉండాలిసింది. ఇప్పుడు ఆ జంతువులన్నీ అభద్రతా భావంతో రెచ్చిపోతున్నాయి.” మాధవుడు కొద్ది దూరంలో కనిపిస్తున్న మందని చూస్తూ అన్నాడు.

  నిజమే..

  ఒక సైనికుడు అటుపక్కకి నాలుగడుగులు వేశాడో లేదో.. భయంకరంగా ఘీంకరిస్తున్నాయి.

  మందకి ముందుగా ఒక ఆడ ఏనుగు అందరినీ పర్యవేక్షిస్తోంది. కొన్ని గున్నలని తొండంతో సవరిస్తూ.

  ఆ ఏనుగుని కనుక స్వాధీన పరచుకుంటే..

  “అది చాలా ప్రమాదం మాధవా!” మాధవుని మనసు గ్రహించిన గురువుగారు వారించారు.

 

        

 

  నిజమే.. ఏనుగులు ఒకదానికొకటి రక్షగా నిలిచినట్లు ఉన్నాయి.

  “నీకేం ఫరవాలేదు. మేమున్నాము..” అన్నట్లుగా తుండములతో సవర దీసుకుంటున్నాయి.

  తమ వారంటే.. తమ జాతంటే ఎంత ప్రేమ?

  ఆ ప్రేమే.. సమస్త విశ్వాన్నీ ఇంకా కాపాడుతోంది. చూస్తున్న వారి మనసులు ఆర్ద్ర మయ్యాయి. ఒక్క క్షణం అవి చేసిన విధ్వంసాన్ని మరచేట్లు చేశాయి.

  

ఉ.   పేర్మిని విశ్వ రక్షణము పెంపున నెప్పుడు సేయనుండగా

      కూర్మిని సంతసంబు నను కోరి సమస్త ప్రపంచ మందునా

      ధార్మిని జంతుజాలముల తార్క్ష్యము లన్నిటి నందు కూడనూ

      వార్మణి వోలెనే కనగ బాగుగ విశ్వము ప్రేమ మంతయున్.

 

   (వార్మణి= కౌస్తుభము)

  

  ఒక కాకికి ఏమైనా ఐతే కాకులన్నీ వాలిపోయి నానా గోలా చేస్తాయి.

  మానవులే చాలా నేర్చుకోవాలేమో అనుకున్నాడు మాధవుడు.

  “అవును మాధవా! సకల విశ్వమునూ లయ తప్పకుండా నడిపించేది ఆ ప్రేమ తత్వమే. ఆ అనుబంధమే లేక పోతే.. ఎవరికి వారనుకుని బ్రతుకుతుంటే నిస్సారమే. ఇపుడీ సమస్య తీరే విధం కనిపించడం లేదు.” విచారంగా అన్నారు గురువుగారు.

  అంతలో పల్లెవాసులు పరుగు పరుగున వచ్చారు.

  “స్వామీ! మీరే కాపాడాలి మమ్మల్ని. వేరే దిక్కు లేదు.” కాళ్ల మీద పడిపోయాడు పల్లె పెద్ద.

  అదృష్టమే.. ఇంకా పల్లె లోని ఇళ్ల మీద పడలేదు. ముందుగా కడుపు నింపు కోవాలనుకున్నాయేమో!

  ఒక విధంగా జాలి వేసింది మాధవునికి. అడవిలో ఆహారం లేక జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయి జీవాలు. వర్షాధారమైన వనాలు కరవు వస్తే ఎండి పోతాయి.

  “లేవండి.. ఏదో ఉపాయం ఆలోచిద్దాము. ప్రస్తుతానికి ఇళ్ల మీదికి రావు లెండి. జంతువుల జోలికి మాత్రం వెళ్లకండి.”

                                       ……………….

  “గురువుగారూ! ఏనుగుల మందని అడవిలోకి పంపించ వచ్చును, కానీ.. అక్కడ ఆహారం లేక పోతే మళ్లీ వచ్చేస్తాయి. మహారాజుగారు ఏదైనా ఏర్పాటు చేస్తే కానీ సమస్య పోదు.” మాధవుడు అంటుండగానే పురుషోత్తమ దేవుడు వచ్చాడు.

  “రాకుమారా! చూస్తున్నావు కదా.. ఏమిటి కర్తవ్యం?” గురువుగారు అడిగారు.

  పురుషోత్తమ దేవుడు చాలా చురుకైనవాడు. తండ్రి వద్ద చాలా చనువు కూడా ఉన్నవాడు. కపిలేంద్రదేవుని ప్రియ భార్య కొడుకు.

  “ఏదో ఒకటి తప్పకుండా చేద్దాం ఆచార్యా! నేను వెంటనే కోటకి వెళ్లి తండ్రిగారికి వివరించి వస్తాను. రేపు ఆపరాహ్ణానికి ఒక ప్రణాలిక రచిద్దాము. అంతవరకూ మాధవుని సహాయం తీసుకోండి. అతడికి అడవి జంతువులతో మెలగుట, వాటిని అదుపులోనికి తెచ్చుట కరతలామలకము.” వెనువెంటనే పురుషోత్తముడు వెడలిపోయాడు.

  ఏనుగుల మంద తినడం కొంత తగ్గినట్లుంది. ఒక దాన్నొకటి రాసుకుంటూ, తొండాలతో పలుకరించుకుంటూ తిరుగుతున్నాయి నెమ్మదిగా. అన్నీ ఒక చెట్టుకిందికి వెళ్తున్నాయి.

  మాధవుడు పెద్ద పెద్ద డప్పులు తెప్పించి చెవులు హోరెత్తేటట్లుగా, కర్రలతో వాయించమన్నాడు కొందరిని.

  కొందరిని పొడవైన కాగడాలు తీసుకురమ్మని, నూనెలో ముంచి వెలిగించి, అర్ధ చంద్రాకారంగా, అడవి దిక్కుకి వ్యతిరేకంగా, మందవైపుకి అతి నెమ్మదిగా కదలమన్నాడు.

  ఏనుగులన్నీ ఒక్క సారిగా కదిలి అడవిలోకి పయనమయ్యాయి.

  ఘీంకారాల్లేకుండా, నెమ్మదిగా.. ఒక ఊరేగింపులాగ.

  నాశనమయిన పంటలని చూస్తూ, రోదిస్తూ, పల్లె జనం తమతమ ఇళ్లకు బయల్దేరారు. గురువుగారు, శిష్యులు కూడా గురుకులంలోకి పయనమయి, పాఠ్యాంశాల మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించారు.

  బాలురందరూ, గట్టిగా ఆదిశంకరులవారి సౌందర్యలహరి శ్లోకాలని వల్లిస్తూ సాగుతున్నారు.

  “ఇంక రావేమో కదా మాధవా గజాలు.. అడవిలోకి వెళ్లి పోయాయి కదా?” ఒక సహాధ్యాయి అడిగాడు. గురువుగారు మాత్రం తల అడ్డంగా తిప్పుతూ సాలోచనగా చూశారు.

  ”అవును ఆచార్యా! మీ ఊహ నిజమే. తిరిగి రావడానికే అవకాశాలు ఎక్కువ. రాకుమారులు ఏ వార్త తీసుకుని వస్తారో వేచి చూద్దాము.” మాధవుడు కళ్యాణి వద్దకు వెళ్లాడు, దాణా పెట్టడానికి.

                                           ……………

 

       నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః

       నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ము తతేనమః

  గురువుగారు, నమకం అభ్యాసం చేయిస్తున్నారు శిష్యుల చేత.

  పరమశివుడు మేరు పర్వతాన్నిబంగరు ధనుస్సుగా చేసుకుని, తూణీరాలను ఇరు ప్రక్కలా పట్టుకుని పాపం చేసిన వారిని దండించడానికి సిద్ధంగా ఉన్నాడు.. రౌద్ర రూపంలో. అతడు తూణీరాలను వదుల్తే జగమంతా అశ్రుధారలే.

  అందువలననే ఆ రుద్ర మూర్తిని శాంతింప జేయాలి, స్తుతించి. యజుర్వేదంలోని ఆ స్తోత్రములే నమకంగా ప్రసిద్దమయినవి.

 

 “ నా మీద కోపగించకు. నేను పాపాలే చేసి యుండవచ్చు. నన్ను వ్యాకుల పరిస్తే  తట్టుకోలేను. నాకు దుఃఖం వస్తే నిన్ను తలవలేను. నా యీ జీవితంలో నీ పాదాలకు దూరమై పోతాను. నీ పాదాలను తలచలేని, ఆరాధించలేని పరిస్థితి వస్తుంది. అది నేను భరించలేను. ఈశ్వరా నీ రౌద్రానికొక నమస్కారం. నీ ధనుస్సునకో నమస్కారం. నీ తూణీరాలకూ ఒక నమస్కారం.”

 

  గురువుగారు ప్రధమ శ్లోకాన్ని వివరించాక మరింత భక్తితో స్తుతిస్తున్నారు శిష్యులు.

  మాధవుడు వల్లిస్తున్నాడు కానీ కొంత దృష్టి అడవికేసి సారించాడు. ఏక సంథగ్రాహి అవడంతో శ్లోకం కంఠస్తా వచ్చేసింది. యాంత్రికంగా పెదవులు కదుపుతున్నాడు.

  మనసంతా నిండిన ఆందోళన ఏకాగ్రతని అసాధ్యం చేస్తోంది.

  అనుకున్నంతా అయింది. ముందు సవ్వడి వినిపించింది. ఆ తరువాత పైకిలేపుతూ, పక్కలకి ఆడిస్తున్న తొండాలు కనిపించాయి.

  ఆ పిదప  ఒక దాని వెనుక ఒకటి.. తల్లి పక్కగా ఆనుకుని నడుస్తూ గున్నలు, చివరిగా మగ ఏనుగులు.. వస్తూనే ఉన్నాయి.

  ఒక క్రమశిక్షణతో.. ఊరేగింపు వస్తోంది.

  “ఆచార్యా!” మాధవుడు సన్నగా పిలిచాడు. అది పిలుపు కాదు.. ఆక్రోశం.

  వేదఘోష ఆగింది.

  అందరూ ఒకేసారి లేచి నిలుచున్నారు.

  “నిన్నటికంటే మూడు రెట్లున్నాయి ఏనుగులు. ఏం విధ్వంసం జరగబోతోందో.. ఇంకా మందల్ని కలుపుకుని వస్తున్నాయి” మాధవుని మాటలకు ఆందోళనగా తలూపారు గురువుగారు.

  “కిం కర్తవ్యం?”

  “గురువుగారూ! రాకుమారుడు..” శిష్యులు అరిచారు.

  తలవెనుకకు తిప్పారు ఆచార్యులు, మాధవుడు. ఇద్దరి మోములూ వికసించాయి..

పురుషోత్తమ దేవుని అశ్వం కాన వచ్చింది.

  వెనుకగా ఎడ్ల బళ్లు..

  “బళ్ల నిండుగా.. ఏమది మాధవా? రాజుగారు ఏం చెయ్యబోతున్నారు?”

  మాధవుడు నమ్మలేనట్లు చూశాడు బళ్లని, బళ్ల లోనివారిని, అందున్నవాటిని!

                                    …………………..

......మంథా భానుమతి