Facebook Twitter
చలి చొక్కా ( కథ)

 

చలి చొక్కా ( కథ)

 

 

ఓసారి ఏమైందంటే, గంగరాజుకి బాగా చలి పుట్టింది. చలికాలం కదా, అందుకని. అయితే వాడి దగ్గర చలిచొక్కా లేదు. పాపం వాళ్ళమ్మ ఒక్కత్తే ఎంతకని కష్టపడుతుంది? అందుకని వాడు తన చలి గురించి ఆమెకి చెప్పనేలేదు- అట్లానే ఓర్చుకున్నాడు.

అయితే ఆరోజు బడికి రత్నాలవారి అబ్బాయి భూపతి గొప్ప చలిచొక్కా ఒకటి వేసుకొని వచ్చాడు.లావుగా, మెత్తగా, చక్కగా మెరిసిపోతూ- భలే ఉందది. దాన్ని చూసినవాళ్లందరికీ ఎండపొద్దునకూడా చలి పుట్టింది, ఆరోజున.

"ఒరే, ఒక్కసారి వేసుకోనియ్యిరా!" అని వాడిని అడుక్కున్నారు అందరూ. "మా అమ్మ ఎవ్వరినీ వేసుకోనివ్వద్దందిరా" అని పోజు కొట్టాడు వాడు. అమ్మ మాటని ఏనాడూ కాదనని కొడుకు మాదిరి మొకం కూడా పెట్టాడు.

ఆ రోజంతా గంగరాజు భూపతి తోకల్లే తిరిగాడు. అయితే ఎంత రాసుకొని పూసుకొని తిరిగినా భూపతి మాత్రం‌ ఒక్కసారంటే ఒక్కసారన్నా చలిచొక్కా ఇవ్వలేదు. సాయంత్రం బడిగంట అవ్వగానే గంగరాజు భూపతి వెంట పోయాడు: "ఇంటికెళ్ళినాక చలిచొక్కా విప్పుతాడు కదా, అప్పుడైనా వేసుకోనిస్తాడేమో" అని.

ఉహుఁ..లాభం లేదు. చొక్కా మార్చుకునేందుకు లోపలికి వెళ్ళిన భూపతి ఇంక బయటికి రానే లేదు. గంగరాజుకి చాలా బాధైంది. నిజంగానే తనకూ ఓ చలిచొక్కా కొనిపెట్టమని అడిగెయ్యాలనుకున్నాడు అమ్మని. గబ గబా ఇంటికి పరుగు పెట్టాడు.

అయితే వాడు వెళ్ళేసరికి అమ్మ ఇంటి బయట పాత్రలు తోముతోంది- "ఒరేఁ గంగీ! ఓ సారి పొయ్యికి కట్టెలు ఎగెయ్యిరా! అట్లానే కూర కలబెట్టు, గంటెతో" అని అరిచింది, బయటినుండే.

గంగిరాజు పుస్తకాల సంచీని ఇంట్లో మూలకి విసిరేసి, పొయ్యి దగ్గరికి వెళ్ళాడు-

ఆశ్చర్యం! పొయ్యి దగ్గరంతా ఎంత వెచ్చగా ఉందో! భలే ఉంది. పొయ్యిలోకి కట్టెలు ఎగేస్తూంటే చేతులంతా హాయిమన్నాయి. కూర కలబెడుతూ గంటె పట్టుకుంటే- ఇంక అక్కడినుండి లేవబుద్ధి కాలేదు.

"రేయ్! లెగు. పొయ్యి దగ్గర కూచొని ఏం చేస్తా ఉండావు?" అంటూ‌ లోపలికి వచ్చిన అమ్మ, చలి కాగుతున్న కొడుకుని సూటిగా చూసి "పొయ్యి దగ్గర కూకొని చలి కాగుతుండావా, సాయంకాలం పూటనే?! రేప్పొద్దున్న సంతలో ఓ చలిచొక్కా కొనుక్కొస్తాలే, నీకంత చలైతే!" అంది.

"ఏం వొద్దులే, అమ్మా!‌ మాపటేలా, పొద్దున్నా మంట వేసుకుంటే ఎంత చలైనా పారిపోతుందిలే. ఇంక చలిచొక్కా దేనికి, ఊరికెనే?!" అన్నాడు గంగిరాజు, పొయ్యికి మరింత దగ్గరగా జరుగుతూ.

 

 

........ kottapalli.in

సౌజన్యంతో