Facebook Twitter
గాలి పటం (సంక్రాంతి స్పెషల్)

 

గాలి పటం

 

సంక్రాంతి సెలవులు కదా అని హైదరాబాదులో మా చెల్లెలింటికి వెళ్లా. పదేళ్ల అభి నన్ను చూడగానే అడిగాడు.
"మామయ్యా! నీకు గాలిపటం ట్చేయటం వచ్చట కదా, అమ్మ చెప్పింది?" అని.
"చిన్నప్పుడు న్యూస్ పేపర్లతో చేసి ఎగరేసే వాళ్లంరా, ఇప్పుడు మర్చిపోయినట్లున్నాను" అన్నా.
"ఏం కాదులే, ఒకసారి నేర్చుకొని చేసేస్తే, అవి ఇక మన బ్రెయిన్‌లోంచి పోవట-మా టీచర్ చెప్పింది. అయినా ట్రై చెయ్యి, ఎట్లా వచ్చినా నేనున్నా కద, ఎగరేసేందుకు?!" అన్నాడు అభి.

"సరేలేరా! ఓ పెద్ద న్యూస్ పేపరు తీసుకురా, ఓ పేజీ చింపు జాగ్రత్తగా!" అన్నా.
వాడు తెచ్చాడు.
నాలుగంచులూ సమానంగా ఉండేట్లు చింపు, ఓ చతురస్రం చెయ్యి అన్నా.
చక్కగా చేశాడు.
ఇప్పుడు మంచి కొబ్బరి చీపురు పుల్లలు రెండు పట్టుకురా అన్నా.
తెచ్చాడు.
మిగిలిన న్యూస్ పేపరులోంచి ఒక అంగుళంన్నర-రెండంగుళాలు వెడల్పుండే ముక్కలు చేసిపట్టుకో, అలాగే మంచి బంక తీసుకురా అన్నా.

పాపం శ్రద్ధగా చెప్పినట్లు చేశాడు.
"ఇప్పుడి ఒక పుల్లని ఆ చతురస్రానికి అడ్డంగా పెట్టు- రెండు చివర్లలోనూ బంకరాసిన కాయితం ముక్కలు అంటించెయ్, పుల్లకదలకుండా-"
అంటించాడు.

"సరే, ఇప్పుడు రెండో పుల్లని ధనస్సులాగా వంచు. బొమ్మలో చూపించినట్లు బంకరాసిన కాయితాలతో మూడు నాలుగు చోట్ల అంటించెయ్, కదలకుండా-"
కొంచెంకష్టపడ్డాడు గానీ బాగానే చేశాడు.
"ఇప్పుడు గాలి పటానికి తోక పెట్టు. అంగుళం వెడల్పుతో తోక ఓ రెండు అడుగులుండాలి" అంటించాడు.
"ఇప్పుడు ఓ కష్టం పని ఉందిరా, సూత్రం కట్టాలి. దారం తీస్కురా, గట్టి నూలు దారం కావాలి అన్నాను. మంచి దారం ఉండ తెచ్చాడు వాడు.
గాలి పటాన్ని వెనక్కి తిప్పి, పుల్లతో సరైన చోట్ల నాలుగు చిల్లులు చేసి, వాటి గుండా పోయేట్లు దారం కట్టా, లెక్కగా పైన ముడి వేశా. "సూత్రం కట్టటం అందరికీ బాగా రాదు. సూత్రం బాగా కడితే గాలిపటం తోక లేకుండా కూడా ఎగురుతుంది" చెప్పా.
"మరిప్పుడు "మాంజా" తేనా?" అడిగాడు అభి.
'మాంజా' అంటే?" అడిగా.
"మంచి దారంలే; అదివ్వనా?" అని పోయి పెద్ద కండెడు దారం తెచ్చాడు వాడు. రకరకాల లావుల్లో, రకరకాల గట్టి దనాలతో, మెత్తగా-గరకుగా రకరకాలుగా‌ఉన్నదది!
"ఓరి! ఇంత దారం ఉందే, నీ దగ్గర!" ఆశ్చర్యపోయా.
"మరేమనుకున్నావు, గాలిపటాలు ఎగరెయ్యాలంటే 'మాంజా' కావాలిగా మరి! రా, ఇప్పుడు మనం మేడమీదెక్కి ఎగరేద్దాం" అన్నాడు వాడు, గొప్ప నిపుణతతో గాలిపటానికి దారం కడుతూ.

నిజానికి వాడికి నాకంటే బాగా వచ్చు- గాలిపటం ఎగరెయ్యటం.
చాలా చక్కగా ఎగరేశాడు. చూస్తూ చూస్తూండగానే గాలిపటం ఆకాశంలోకి ఎత్తుగా ఎగిరింది.
"దారాన్ని నా చేతికి ఇయ్యిరా కొంచెం" అన్నాను .
చేతికి ఇచ్చినట్లే ఇచ్చి "ఖీంచ్ ఖీంచ్" అరిచాడు వాడు-
బిత్తరపోయి చూశా.
వాడు నా చేతిలోంచి గబుక్కున దారాన్ని తన చేతిలోకి తీసుకొని లాగుతూ, "గాలిపటం పడిపోతున్నా, గుండ్రగా తిరుగుతున్నా దారాన్ని లాగాలి" అన్నాడు.
"ఓహో, 'ఖీంచ్' అంటే అర్థం అదా?" నవ్వాను.
"ఢీల్ ఢీల్" అంటే దారం వదలాలి. అప్పుడు గాలిపటం ఇంకా దూరం పోతుంది" చెప్పాడు. "ఖీంచ్ ఖీంచ్...ఢీల్...ఢీల్...ఢీల్.." వాడిసూచనల ప్రకారం పట్టుకొని లాగుతూ వదుల్తూ పోతే, గాలిపటం బలే ఎగిరింది!
తర్వాత నా దగ్గరినుండి దారం తీసుకొని తనే గాలిపటం ఎగరేస్తూ కూడా "ఖీంచ్ ఖీంచ్..ఢీల్ ఢీల్" అని అరుస్తూనే ఉన్నాడు వాడు.
వాడి సంతోషపు కేకలు వింటూంటే ఓ క్షణాన అనిపించింది-"మన జీవితం నిజంగానే, ఒక గాలిపటం లాంటిది. ఒక్కోసారి దాని మీద పట్టు బిగించి, లాగి- దాని దిశనూ, వేగాన్నీ నియంత్రించాలి. ఒక్కోసారి దాన్ని వదలాలి, ప్రవహించనివ్వాలి, దానితో బాటూ మనమూ ప్రవహించాలి. మన చదువుల్లోనూ, పరీక్షల్లోనూ- అన్నింటా ఈ సంగతి గుర్తుంచుకోవాలి- ఎప్పుడూ బిగపట్టుకోనూ కూడదు, అట్లా అని ఎప్పుడూ బలాదూరుగా ఉండనూ కూడదు. ఎప్పుడు ఏది అవసరమో గుర్తించుకుంటూ అప్పుడు ఆ పని చేయాలి" అని.  మీరేమంటారు?

........ kottapalli.in

సౌజన్యంతో