TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పండిత రమాబాయి సరస్వతి
"ఆడవారు ఉన్నత కులస్తులైనా, నిమ్న కులస్తులైనా, ఆడవారెపుడూ పాపాత్ములూ, హీనులూ, అపవిత్రులూ, అసత్యం లాంటి వాళ్ళూనూ, అందువల్ల వీళ్ళకి మోక్షం లభించదు మగవాళ్ళలాగా. అయితే మోక్షం పొందటానికి వీరికి ఒకే వొక్క మార్గం ఉంది, అదేంటంటే, ప్రత్యక్ష దైవాలైన పతి దేవుళ్ళని కొలవటం. ఇదొక్కటే వారిని అసంఖ్యాకమైన జన్మలెత్తి, చెప్పలేని దుఖాన్ని అనుభవించాల్సిన ఖర్మ నుంచి తప్పించేది. ఆడవాళ్ళు వేదాలనూ వేదాంతాన్నీ చదవటానికి అర్హులు కారు. కానీ బ్రహ్మజ్ఞానం లేకుండా మోక్షం ఎవరూ పొందలేరు కదా. నా కళ్ళు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా తెరుచుకుంటున్నాయి. ఆడదానిగా నా హీన స్తితికి నేను మెల్లిగా చేరుకుంటున్నాను. భక్తి ద్వారా ఆధ్యాత్మిక ఓదార్పు పొందడం నాకు సాధ్యం కాదని అసలు ఆడదానిగా నాకు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో స్థానం లేదని, శాస్త్రాలు నాకు ఇవ్వగలిగేదాంతో నాకు తృప్తి లేదని నాకర్ధమవుతోంది."
ఈ మాటలు అన్నది ఎవరో మమూలు స్త్రీ కాదు, పన్నెండేళ్ళ వయసుకే 18 వేల శ్లోకాలు అనర్గళంగా వాటి తాత్పర్యంతోపాటు, అది కూడా శుద్ధ సంస్కృతంలో చెప్పగలిగిన రమా బాయి. ఈమె ఆ వయసులో మరాఠీ, కన్నడ, హిందుస్తానీ, బంగాలీ, సంస్కృత భాషల్లో దిట్ట. ఇంత పాడిత్యం ఉన్న ఈమెకు ఇంత విరక్తి కూడా ఎందుకు కలిగిందో తెలుసుకుందాం. ఆమె జీవితం ఒక కధలా కాక ఒక గాధలా రెండు విభిన్న కాలాల్లో జరిగినట్టుగా ఉంటుంది. పెళ్ళివరకూ ఒక కాలంలో, ఆతరవాత కొంచం మనకు దగ్గర కాలంలో లాగా.
మైసూరు సంస్థానంలో పండితుడైన అనంతుడనే ఈమె తండ్రి మహా పండితుడూ, పురాణాలను, వేదాలను ఔపోసన పట్టిన వాడు. అయితే ఈయనకిఒక విచిత్రమైన కోరిక పుట్టింది (నా దృష్టిలో అది విచిత్రమే ఆయన ఉన్న కాలంలో) తన పాండిత్యాన్నంతా తన భార్యకూ, తల్లికీ కూడా నేర్పించాలని. మొదట ఆ ఇద్దరూ కూడా ఇది తగని పనని చెప్ప చూస్తారు, కానీ అనంతుడు వినడు. కానీ ఆయన తన పట్టుదల సాధించే లోపే ఇద్దరూ చనిపోతారు. తన పాండిత్యాన్ని ఇంకా మెరుగు పెట్టడం కోసం నేపాల్ వెళ్ళినప్పుడు, ఇతని పాండిత్యానికి మెచ్చి నేపాల్ రాజు ఇతనికి ఇతర కానుకలతో పాటు రెండు ఏనుగులను కూడా బహూకరించాడట. ఈయన తిరిగి తన 44వ ఏట 9 ఏళ్ళ పిల్లను రెండవ వివాహం చేసుకుంటాడు. ఆ పిల్లతో తన పంతం సాధించుకునే ప్రయత్నం చేసినప్పుడు, చిన్న పిల్ల కదా పైగా ఈయన చాలా పెద్దవాడు (తండ్రి వయసు) ఎదురు చెప్పక నేర్చుకుంటుంది, సంస్కృతమే కాకుండా ఇతర భాషలూ నేర్చుకుంటుంది. సగం మంది చనిపోగా మిగిలిన ఒక అబ్బాయికీ, అమ్మాయిలిద్దరికీ కూడా నేర్పిస్తుంది.
అయితే ఈ క్రమంలో సమాజం నుంచి వెలి ఎలాగూ తప్పక, తానే దగ్గర్లోని అడవుల్లో, ఒక పుణ్య క్షేత్రం సమీపంలో అనంతుడు ఇల్లు కట్టు కుని ఉంటాడు, మైసూరు లోని సర్వ భోగాలూ వదిలిపెట్టి కేవలం ఆడపిల్లలకి విద్య నేర్పే కార్యానికి అంతరాయాలు లేకుండా ఉండటం కోసం. బాల్య వివాహమే చేస్కున్నా ఈయన ఆశయం హర్షించదగినది. అందులోను రమా బాయి అద్భుత ప్రతిభ కనపరుస్తుంది. స్వతహాగా దాన కర్ణుడైన అనంతుడు ఉన్నదే కాకుండా తను పురాణ పఠనం చేసి సంపాదించేదంతా కూడా దాన ధర్మాలతో ఖర్చు చేస్తాడు. ఆ తరవాత చేసేది లేక తను కూడా కుటుంబంతో సహా పుణ్య క్షేత్రాల దర్శనార్ధం యాత్రికుడై యాచిస్తూ దేశమంతా తిరుగుతుంటాడు. ఈ క్రమంలోనే చెన్నై పరిసరాల్లో ఒక గుడి దగ్గర ఒక సంవత్సం పాటు ఉంటారు. రమాబాయికి పదహారేళ్ళ వయసులో, అప్పుడొచ్చిన భయంకరమైన కరువు వల్ల, తిండి లేక రోగాల బారిన పడి, తండ్రి, తరవాత తల్లి, ఆ తరవాత ఇంకొక అక్కా కూడా చనిపోతారు. రమా బాయి ఆమె అన్న శ్రీనివాసు ఇద్దరే మిగులుతారు. భుక్తి గడవటానికి దారి లేక చిన్నప్పట్నుండి తెలిసిన ఒకే ఒక యాత్రిక జీవనం వల్ల, మళ్ళా ఇద్దరూ యాత్రలు చేస్తూ కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వేల మైళ్ళు తిరుగుతూ కలకత్తాకు వస్తారు. వారి భోజనం సాధారణంగా ఉప్పు వేసిన గంజి నీళ్ళే.
అయితే కలకత్తాలో ఈమె ప్రతిభ గమనించిన పండితులు కొందరు ఈమెకు పండిత అనే బిరుదు ఇస్తారు. ఈమె ప్రతిభ అప్పటి పండిత పురుషులకేమాత్రం తీసిపోదని గుర్తించి ఆమెను అపర సరస్వతి అని కీర్తించి సరస్వతి అనే బిరుదు కూడా ఇస్తారు. ఈ సరస్వతి అనే బిరుదు యూనివర్సిటి ఆఫ్ కలకత్తా ఆమె పాండిత్యాన్ని పరీక్షించి ఇచ్చినది. ఆ తరవాత ఆమె పేరు దేశమంతా మారు మ్రోగుతుంది. కానీ వీరిద్దరికీ అనేక పుణ్య క్షేత్రాల్లో జరిగే మోసాలను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో హిందుత్వం మీదా, హిందూ దేవుళ్ళ మీదా నమ్మకం సన్నగిల్లుతూ ఉంటుంది.
ఈ సమయంలో వేదాలు చదివినప్పుడు ఆమెకు, ఆమె తండ్రికి ఉన్న అపారమైన నమ్మకం (మనసా వాచా కర్మణా దేవుడిని నమ్మి పురణాల్లో, శాస్త్రాల్లో చెప్పినట్టు నిష్టగా బ్రతికినా ఎటువంటి కష్టాలు పడ్డారో అనుభవమయ్యాకా) నిజం కాదనీ, పండితులు చెప్పే ఎటువంటి అద్భుతాలూ జరగవని, మోక్ష ప్రాప్తికి ముఖ్యంగా స్త్రీలకు హిందూ మతంలో అవకాశం, లేదనిపిస్తుంది. వేదాలను, ఉపనిషత్తులనూ కూలంకషంగా చదివాకా వాటిల్లో స్త్రీల ఆనాటి స్తితిగతులకి ఎటువంటి సమాధానాలు ఆమెకు లభించవు. పైగా స్త్రీ పురుషుడి జీవితానికి, పురోగతికి ఒక ప్రతిబంధకం, ఆటంకంగా చిత్రించడమే ఆమెకి కనిపిస్తుంది. ఆమె తలంపే ఒక పాపం. పురుషుడి మోక్ష ప్రాప్తికి ఆమె సాంగత్యమొక అవరోధం. తండ్రి భక్తిలో నమ్మకం సన్నగిల్లినా, స్త్రీ విద్య కోసం తాపత్రయపడ్డ ఆయన ఆశయ సాధనకే తమ జీవితమంతా శ్రమించాలని అన్నా చెల్లెళ్ళిద్దరూ నిశ్చయించుకుంటారు. కానీ ఆమెకి 22 ఏళ్ళ వయసులో ఆమె అన్నగారు కూడా విషజ్వరంతో చనిపోతాడు. ఒంటరిగా ప్రపంచంలో బ్రతకటం కష్టమని, వివాహం చేసుకోమని కోరతాడు. తరవాత ఆమె అన్న స్నేహితుడూ, న్యాయవాది అయిన ఒక నిమ్న కులస్తుడిని కోర్ట్ మేరేజ్ చేసుకుంటుంది. ఈమె బ్రాహ్మిన్ కాబట్టి మళ్ళీ సమాజ వ్యతిరేకత తప్పించుకోవటానికి అస్సాంలో స్థిరపడతారు.
కానీ దురదృష్ట వశాత్తూ ఒక కూతురు పుట్టిన కొన్ని నెలలకే, భర్త చనిపోతాడు. ఏడు సంవత్సరాల్లో అయిదుగురు కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న ఆమె, మళ్ళీ విధవరాలు, అందునా కులాంతర వివాహం చేసుకున్న విధవ, ఉన్న చోట బ్రతకటం దుర్లభం కాబట్టి మద్రాసు, అక్కడ్నించి పూనా వస్తుంది. భర్త పోయిన సంవత్సరం లోపే రమా బాయి ఆర్య మహిలా సమాజ్ స్థాపిస్తుంది అగ్రకుల విధవ మహిళల కోసం, స్త్రీ విద్య కోసం, ఇంకా బాల్య వివాహాలకి వ్యతిరేకంగా పనిచెయ్యటం కోసం. స్త్రీ ధర్మ నీతి (Morals for Women) అనే పుస్తకం రాస్తుంది. బ్రిటిష్ గవర్నమెంట్ స్త్రీ విద్య గురించి పంపిన హంటర్ కమిషన్ కి తిరుగులేని తన వాదాన్ని వినిపిస్తుంది. తరవాత అచ్చయిన ఆమె వాదన బ్రిటిష్ క్వీన్ విక్టోరియాను ఎంతగానో ప్రభావితం చేస్తుంది.
1874 లో ఆమె భారత దేశంలో lady teachers, స్త్రీలకి వైద్యులు స్త్రీలే ఉండాలన్న ఆకాంక్షతో ఇంగ్లాండ్లో వైద్య వృత్తి చదవడానికి వెళ్తుంది. కానీ అక్కడ కూడా వైద్యం చదవడానికి వచ్చిన కొద్దిమంది స్త్రీల మీద రాళ్ళేసిన ఘనులే బ్రిటిష్ మగవాళ్ళు. పైగా ఈమె ఇండియను. అందువల్ల వైద్యం నేర్చుకోవడానికి సాధ్య పడదు. అస్సాం లో ఉన్నపుడు పడిన బీజం, క్రిష్టియానిటీ పట్ల ఆకర్షణ ఆమెను అటువైపుకి లాగుతుంది. క్రీస్తు ప్రవచించిన సర్వ మానవ ప్రేమ, ఆడవారినీ అందులోనూ దిగజారిన అంటే పడుపువృత్తి లోని స్త్రీలనూ క్షమించి ప్రేమించి ఆదరించడం, హిందు మతంలోలా వెలివేయటం, శిక్షించడం కాకుండా, ఆమెకు నచ్చుతుంది. భారత దేశంలో స్త్రీలు పడే కష్టాలకి సమాధానం, ఓదార్పూ ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఉందని ఆమె విశ్వసిస్తుంది. మతం మారనని అంతకు ముందు ప్రకటించినప్పటికీ, దీనికి తన దేశంలో చాలానే వ్యతిరేకత ఉంటుందని, తను చేయదల్చుకున్న పనికి ఇది అడ్డంకి కాగలదని తెలిసినా ఆమె తన కూతురితో సహా క్రిస్టియన్ మతం పుచ్చుకుంటుంది.
అయితె కొన్ని కొన్ని విషయాల్లో ఆమె క్రిష్టీనిటీ వల్ల కూడా పూర్తి సంతృప్తి చెందలేదు. అది వేరే విషయం అనుకోండి. అక్కడనుంచి ఆమె అమెరికా వెళ్తుంది. అక్కడ కిండర్గార్టెన్ టీచర్ ట్రైనింగ్ అవుతుంది. అనేక చోట్లకి వెళ్ళి లెక్చర్స్ ఇచ్చి డబ్బు కూడబెడ్తుంది. The High Caste Hindu Woman అని ఒక పుస్తకం రాసి, దాని అమ్మకాల్తో కొంత డబ్బు సంపాదిస్తుంది. అమెరికా నుంచి కొన్ని విరాళాలు అంతా కలిపి 30,000 దాలర్లు ప్రోగు చేస్తుంది ఇండియా లో తను చెయ్య బోయే కార్యక్రమాల కోసం. తను సంస్కృతం నేర్పిస్తూ, గ్రీక్ ఇంక హిబ్రూ భాషలు నేర్చుకుంటుంది. 1888 లో ఇండియా తిరిగి వచ్చి, శారదా సదన్ అనే సంస్థని సర్వ మత సామరస్యంతో పని చేసే ప్రాతిపదిక మీద, అనాధ విధవలకి, బాలికలకి విద్యనందించటం కోసం స్థాపిస్తుంది. ఇక్కడికి ఉన్నత కులాలకి చెందిన విధవ స్త్రీలని ఆకర్షించటం కోసం వారి ఆచారాలకీ, నమ్మకాలికీ ఎటువంటి అవరోధాలు ఆంక్షలు లేకుండా ఉండేట్టు చూసుకుంటుంది. మెల్లి మెల్లిగా ఇక్కడికి అన్ని వయసుల్లో ఉన్న బాలికలు, స్త్రీలు చదువుకోవటానికి వచ్చి ఉంటారు.
కానీ తను పాటించే క్రిస్టియన్ ధర్మాల పట్ల కొందరు ఆకర్షితులవడం వల్ల, హిందూ సమాజంలోని వాళ్ళకు నచ్చక కొందరిని వెనక్కి తీస్కెళ్ళిపోవడం జరుగుతుంది. హిందువులని క్రిస్టియన్లుగా మారుస్తోందని పత్రికలు ఆమెను దుమ్మెత్తి పోస్తాయి. ఈమె స్థాపించిన సూత్రాల మీద పని చెయ్యటంలేదని ఆమెకు విరాళాలు రావటం కూడా ఆగిపోతుంది. ఆమె ఈ కారణంగా, శారదా సదన్ని పూనా కి మారుస్తుంది. మెల్లిగా అక్కడ తలదాచుకునే ఆడవాళ్ళ సంఖ్య మళ్ళి పెరుగుతూ పోతుంది. ఈమె కృషిని ప్రత్యక్షంగా పరీక్షించిన అమెరికన్ సంస్థలు ఆమెకు బేషరతుగా విరాళాలు ఇవ్వడానికి సిద్ధపడతాయి. ఆమె కృపా సదన్ అనే ఇంకొక సంస్థని సమాజంలో వెలి వేయ బడ్డ వేశ్యలకీ వారి పిల్లల కోసం ప్రారంభిస్తుంది. ఈ రెండు సంస్థల్లో ఆమె వాళ్ళకు రక రకాల వృత్తుల్లో శిక్షణ ఇప్పిస్తుంది. వారిలో చాలా మందిని తన దగ్గరే పనికి పెట్టుకుంటుంది. కూతురు మనోరమా బాయి పేరిట కూడా బాలికలకు పాఠశాల స్థాపిస్తుంది. ముక్తి సదన్ అనే సంస్థని స్థాపించి అందులో అనాధ స్త్రీలకీ, పిల్లలకీ, వికలాంగులకీ ఆశ్రయం కల్పిస్తుంది. 1900 మొదటి కాలంలో గుజరాత్లో వచ్చిన కరువు కాలంలో ఆమె తన దగ్గర రెండు వేల మందికి ఆశ్రయం ఇచ్చి తిండి బట్ట సమకూరుస్తుంది. పైగా దీనికోసం ఆమె ఊళ్ళు తిరిగి దిక్కు లేని వారందరిని తన హోంలోకి తీస్కొస్తుంది. అందరికీ వారు చేయ దగ్గ పనులూ వృత్తుల్లో శిక్షణ ఇప్పిస్తుంది. శిక్షణ పొందిన వారిని తన దగ్గరే శిక్షకులుగా ఉంచుకుని వేతనాలిస్తుంది. పేద పిల్లల్ని తన బడికి రప్పించటం కోసం రోజుకి అణా పైసలు ఇచ్చేదట. ఆమె శారదా సదన్ని స్థాపించాకా మొట్ట మొదటిగా ఆమె ఆదుకున్న ఆమ్మాయి ఒక పన్నెండేళ్ళ విధవ, అత్తవారింట్లోంచి గెంటివేయబడి, పుట్టింటి వారు తిరిగి ఆదరించకపోతే రోడ్డునపడి అడుక్కుతింటూ బతుకుతూన్న పసి పాప. ఆలోచిస్తుంటే ఎంత దయలేని సమాజమా ఆనాటిది అని అనిపించక మానదు. తరవాతి సంవత్సరాల్లో ఆ అమ్మాయే ఆమె ముఖ్య సహాయకురాలిగా పని చేస్తుంది. రుక్మాబాయి అనే ఒక బాల్య వివాహిత తన భర్తతో కాపరం చెయ్యడానికి నిరాకరిస్తుంది. అది కోర్ట్ దాకా వెళ్ళి, కోర్ట్ విచారించి ఆమెకు శిక్ష వేస్తుంది. (అమలు అవ్వదు) ఈ విషయంలో స్పందిస్తూ రమాబాయి ఇలా అంటుంది.
'' ఒక నిస్సహాయ వివాహిత తన గొంతు విప్పితే, ఆమెను అణిచివేయడానికి హిందూ చట్టం ఇంకా బ్రిటిష్ కోర్ట్ లూ, మూడు కోట్ల పురుషులూ ఇంకా ముప్పై మూడు కోట్ల దేవుళ్ళూ ఏకమై పొయ్యారు. . ఇంగ్లీష్ గవర్నమెంట్ ని అనడానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మగవాళ్ళ ఆకాంక్షలకి, ఉద్దేశ్యాలకి కట్టుబడి ఉంటామని ఒప్పుకున్నవాళ్ళే.” ఆడవారి సమస్యలూ, బాధలూ ఎప్పుడూ మారలేదు పురాణకాలం నుంచి ఇప్పటిదాకా. కానీ వారి సమస్యలకి స్పందించాల్సిన న్యాయ వ్యవస్థ ఎంత మెల్లిగా స్పందిస్తూ మారుతూ వస్తోందో చూడండి. ఇప్పటికీ మనకి కొత్త చట్టాలు రావాల్సిన అవసరం కనపడుతూనే ఉంటుంది. పండిత రమాబాయి ముక్తి మిషన్ పూనా లో ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది. వేలాది అనాధల తోడుగా, నీడగా నిలబడుతోంది.
ఈ సంస్థ 100 ఏళ్ళు కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం స్టాంప్ విడుదల చేసింది. ఆమెను ఒక Australian పత్రిక ప్రపంచంలోని 20 మంది మానవతావాదుల్లో ఒకరిగా గుర్తించి సత్కరించింది. Indian Secular Society అనే సంస్థ నడిపే, The Secularistఅనే పత్రిక ఎడిటర్ A.B.Shah ఆమెను ఆమె చనిపోయిన 50 ఏళ్ళ తరవాత '' The greatest woman produced by the modern India” అని వర్ణించారు. ఆమె చివరి రచన బైబిల్ ను ఒరిజినల్ హిబ్రూ భాషనుంచి మరాఠీలోకి అనువదించడం.
అంతకు ముందు అనువాదం లేదని కాదు, ఉంది, కాని అది హిందు పండితుల సాయంతోనే జరగడంవల్ల చాలా పదాలు క్రిస్టియానిటీని దాని అసలు అర్ధంలో ప్రజలకందించలేదని ఆమె అభిప్రాయం. ఇంత పెద్ద రచన ఆమె కొద్ది నెలల్లోనే ముగించిందట. ఇది అచ్చయినది కూడా ఆమె శిక్షణ ఇచ్చిన పనివారితోనే ఆమె సదన్ లోని ప్రెస్ లోనే. ఇందరి జీవితాల్లో వెలుగులు నింపిన రమాబాయి జీవితమంతా విషాదమే. పాతికేళ్ళ వయసులోపే భర్తను పోగొట్టుకుని వొంటరిదైన ఆమె చివరికి తన కూతురి చావును కూడా చూసిన రెండేళ్ళ లోపు మరణించింది. నిజానికి ఒక రచయిత్రిగా కన్నా, ఒక మానవతావాదిగా, స్త్రీల విద్యకూ, బాల్య వివాహాలు నిరోధించటం కోసం ఆమె చేసిన కృషికి ఆమెకు గుర్తింపు ఎక్కువ. ఆమె భాషా పాండిత్యం అమోఘం, అనితర సాధ్యం. ఈరోజున ఆడవారికి ఈమాత్రం స్వేఛ్చ ఉందంటే, Male Chauvinists ని ఎదిరిస్తూ రాయగల్గుతున్నారంటే అది రమాబాయి, తారాబాయి షిండే ఇంకా ఇలాంటి ఎందరో Feminist మహిళామణుల వల్లే కదా. According to Annie Zaide, writer, we all got to be feminists if we are going to be a decent society. అందువల్ల ఈనాటి ఆడవారు వీరికి ఎంతయినా ౠణపడి ఉన్నారు. నాకు చాలా సంతోషం కలిగించిన పరిచయాల్లో ఇది ఒకటి. మీక్కూడా నచ్చుతుందని ఆశిస్తూ.
.... Sharada Sivapurapu