Facebook Twitter
“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” 13 వ భాగం

                       
“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” 13 వ భాగం
  

 

 

సరిగ్గా పది సంవత్సరాల క్రితం..
దేవల్ దేవి, గుజరాత్ రాజు కరణ్ కుమార్తె.                     
             
   అల్లారు ముద్దుగా అపురూపంగా పెరుగుతున్న రాకుమారి జీవితం, ముష్కురుల దండయాత్రతో అస్తవ్యస్తం అయిపోయింది. అల్లావుద్దీన్ రాజ్య కాంక్షకి బలైపోయింది.
   ఢిల్లీ సుల్తాన్ జలాల్ ఖాన్ ఖిల్జీ అల్లుడు, మేనల్లుడు అల్లావుద్దీన్. సుల్తాన్ ఆజ్ఞ పై అతడు, దక్షిణ దేశ దిగ్విజయ యాత్ర గుజరాత్‍తో ప్రారంభించాడు.
   అక్కడి రాజులు అడవుల పాలయ్యారు. దేవాలయాలు నాశనమయ్యాయి. విగ్రహాలు ముక్కలయ్యాయి.
   రాజా కరణ్, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని, ముక్కుపచ్చలారని పదేళ్ల దేవల్ దేవిని తీసుకుని దేవగిరి పారిపోయాడు. తన రాణి కమల్ దేవిని మాత్రం రక్షించుకోలేక పోయాడు.
   కమల్ దేవి అల్లావుద్దీన్ సేనలకు పట్టుబడింది. అల్లావుద్దీన్ ఆమెని వివాహమాడి, తన రాణీవాసంలో చేర్చుకున్నాడు. కమల్ దేవి మతం మార్చుకోవలసి వచ్చింది. అల్లవుద్దీన్ సుల్తానా అయింది.
   రాజా కరణ్ దేవగిరి చేరాక దేవల్ దేవిని, దేవగిరి రాజు రామ్‍దేవ్ రావ్ కుమారుడు శంకర్‍దేవ్ రావునకిచ్చి, పసి వయసులోనే పెండ్లి చేశాడు. తనని సుల్తాన్ వదలడని గ్రహించి. ఎవరో ఒకరి రక్షణలో ఉండాలి కదా రాకుమారి!
   గుజరాత్ దండయాత్ర, స్వాధీనం తరువాత దేవగిరి మీద పడ్డాడు అల్లావుద్దీన్. యువరాజు శంకర్‍దేవ్ సగం సేనని తీసుకుని గుజరాత్‍కి వెళ్ళాడు.. అతను వచ్చే లోగానే ఎనిమిది వేలమంది బలగంతో, దారిలో అన్నీ సర్వనాశనం చేస్తూ దేవగిరికి వచ్చేశాడు అల్లావుద్దీన్..
   రామ్ దేవ్ తన వద్దనున్న నాలుగువేల బలంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు.. కానీ ఖిల్జీ పశుబలం ముందు వెనుకకు మళ్ళక తప్పలేదు.
   సుల్తాన్ సేనలు దేవగిరి చేరగానే పట్టణంలోని అమాయక ప్రజల మీద పడి వారిని చిత్రహింసల పాల్జేశారు. ముష్కురులు ఆక్రందనలు చేస్తున్న స్త్రీలని, ఆడపిల్లలని అమానుషంగా మానభంగాలు చేశారు.
   రామ్‍దేవ్ అల్లావుద్దీన్‍తో సంధి చేసుకున్నాడు.
   కోటకి తిరిగి వస్తున్న శంకర్‍దేవ్ తన సైనిక బలంతో అల్లావుద్దీన్‍ను ఎదుర్కున్నాడు.. సంధి అయిందని కబురు చేసిన తండ్రి మాటను పెడ చెవిని బెట్టి.
   ఉన్న సైనిక బలం కన్నా చాలా ఎక్కువగా ఉన్నట్లు భ్రమ కల్పించి శంకర్ దేవ్‍ను ఓడించి, అత్యధిక ధనరాశులను ఢిల్లీకి తరలించి, కప్పం కట్టడానికి ఒప్పుకున్న యాదవ రాజును వదిలి ఢిల్లీ చేరాడు అల్లావుద్దీన్.
   ఆ యుద్ధంలోనే దేవల్ దేవిని పట్టుకుని పోయి, పెద్దకొడుకు ఖిజర్ ఖాన్‍ కిచ్చి పెళ్ళి చేశాడు.
   తల్లి తన రాణి, కూతురు తన కొడుకు రాణి..
   మృగాలకి వావి వరుసలు నీతి నియమాలు ఉంటాయనుకోవడం భ్రమ. వానికి ఉండేవి రెండే రెండు.
   ఆకలి, కామం..
   మృగాల్లాంటి మనుషులకి అవి కూడా సరిపోవు. ఆలోచనా శక్తి ఉంది కనుక వారికి ఇంకా ఉంటాయి.
   అదనంగా రాజ్యకాంక్ష.. అధికారం, క్రోధం, పగ.
   ఎక్కడైనా ఊడిగం చేసుకునైనా క్షేమంగా ఉంటుందనుకున్న గారాలకూతురు.. పాలబుగ్గలమీద కన్నీటి చారలతో, అంతఃపురమనే తన బందిఖానాలోకే చేరితే ఆ తల్లి గుండె పగిలి ముక్కలవదా!
   అదే జరిగింది కమల్ దేవికి. ఆత్మాభిమానం కల ఆ తల్లి, కూతురుని ఏ వరుసతో పిలవాలో తెలియక, ఆమె కంటికి మళ్ళీ కనిపించలేదు.
   అతి చిన్న వయసులో అన్నన్ని దారుణాలు చూసిన దేవల్ దేవి, తనకు జరిగిన అన్యాయాన్ని, సుల్తానా అయిన తల్లి వారించలేకపోయిందని గుండె పగిలేలా ఏడిచింది. ఆ తల్లి నిస్సహాయత చిన్నారి దేవల్‍కి తెలియదు.
   ఆ లేతమొగ్గని ఖిజర్ ఖాన్ నలిపి నుగ్గు చేశాడు.
   పశు వాంఛకి వయసుతో పనేముంది?
   లేత మాంసం మరింత రుచిగా ఉంటుందట..
   ఖుశ్రోఖాన్ సహాయంతో సింహాసనమెక్కిన ముబారక్ షా.. అందాల రాణి దేవల్ దేవిని వదలగలడా! అన్నగారి భార్యని రాణీని చేసుకుని తన అంతఃపురంలోనికి తరలించాడు. దేవల్ దేవి, ఖిల్జీ సామ్రాజ్యానికి రాణీ అయింది.. మరొక ఖిల్జీ మృగానికి బలైపోయింది.
   సుల్తాన్ కామ వికారాలు, మనశ్శరీరాలని బండ రాళ్ళని చేసుకుని భరించింది దేవల్ దేవి.
   ఒక్కొక్కసారి సుల్తాన్‍కి విచిత్రమైన కోరికలు కలుగుతాయి.
   తనని.. నాట్యకత్తెలా తయారు చేసి, తనతో నాట్యం చెయ్యమంటే.. మనసులో ద్వేషం రగులుతున్నా, అసహ్యం వేసినా, సుల్తాన్‍కి అలంకారాలు చేసి, మొహంలో ఆనందాన్ని చూపించింది.
   నిస్సారంగా గడిచిపోతున్న దేవల్ దేవి జీవితంలోనికి ఖుశ్రో ఖాన్ ప్రవేశించాడు.
   ఖిల్జీ వంశ చరిత్ర మారబోతోంది.

                    
                               ..................
                                     10
    రాజ్య కాంక్షలకి, యుద్ధాలకి, పశువాంఛలకి.. ధనాగారాలకి, దూషణ భూషణాదులకీ దూరంగా..
    ప్రశాంతమైన వాతావరణం.
    ఇంటి వెనుక తోటలో..  తాము ఎప్పుడూ కూర్చునే చెట్టుక్రింద కూర్చున్నాడు ఎర్రన. ఎదురుగా తాతగారు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
   ఎర్రపోతన మనుమనికి మహాభారత రచన మీద అవగాహన, ఆలోచన.. పూర్తి చేయాలన్న ఆశయం కలిగించి, ఆ నృసింహుని సన్నిధికి చేరుకున్నాడు. ఆ వెనుకనే పేరమాంబ కూడా పతిని అనుసరించింది.
   అంతకు మును ముందే ఎర్రనని ఒక ఇంటివాడిని చేశారు సూరన దంపతులు. తమ కంటి వెలుగు కళ్యాణాన్ని కన్నులారా గాంచి కన్నుమూశారు ఎర్రపోతన దంపతులు.
   ఎర్రన ముందు ఎన్నో ప్రణాలికలు..
   మొదటగా తాతగారికి వాగ్దానం చేసిన మహాభారత పర్వాన్ని పూరించాలి.
   తన స్వంత ఆశయం.. రామాయణం వ్రాయాలి.
   కన్నులు మూస్తే కంటి ముందు ప్రత్యక్షమయి నృసింహ పురాణం వ్రాయమంటున్నారు తాతగారు. కలలో కోరిననూ.. కోరికే కదా!
   అదే విధంగా హరివంశము.
   అసలు ఏ కావ్యం వ్రాయడానికైననూ ఉభయ భాషా పాండిత్యము, ఛందో వ్యాకరణములలో పట్టు ఉండి తీరాలి.
   ఎర్రాప్రగడకి జన్మతః వచ్చిన జ్ఞాపక శక్తి అనన్యం. విద్య నేర్వుటకు సూరనార్యుని శుశ్రూష ఉండనే ఉంది. అన్నింటిలోనూ నిష్ణాతుడైన ఎర్రనని.. తాతగారి దిశా నిర్దేశం ముందుకు నడిచేలాగు చేసింది. నిశ్చయాన్ని అదేశించింది
   భారతాన్ని ఎన్ని మారులు చదివాడో లెక్కే లేదు.
    నన్నయగారి భారతం మూడు వంతులు పైగా కంఠస్థం..
   తిక్కనగారి భారతంలో ఏ పత్రంలో ఏ విషయం ఉందో గ్రహించ గలిగిన శక్తి అపారం.
   చిన్నతనంలోనే క్లిష్ట సమాసాలతో పద్యాలు చెప్పగలిగిన ఎర్రాప్రగడకి కావ్య రచన సమస్యే కాదు.
   మరి..
   నును సిగ్గుతో దరి చేరింది ధర్మపత్ని..
   "స్వామీ! క్షీర పానం మరచారు." రాగి పాత్రలో పాలు తీసుకొని వచ్చింది.
   అదీ అసలు సమస్య..
   అనగా..  ధర్మపత్ని  సమక్షమా? కానే కాదు.
   సమస్యల్లా రాగి పాత్ర..
   రజత పాత్రలో క్షీర పానం చేసి, సువర్ణ పుష్పం చెక్కిన రజత పళ్ళెంలో భోజనం చేసేటి సూరనార్యుని కుటుంబీకులు రాగి పాత్రలు వాడే స్థితికి వచ్చారు.
   మృణ్మయ పాత్రలకి చేరక ముందే ఏమయినా చేయాలి.
   ఏదయిననూ జరగాలి..
   ప్రతాప రుద్రుడు, సేనానుల మాట కాదని చేసిన అనాలోచిత చర్య వలన రెట్టింపు కప్పం కట్టవలసి వచ్చింది. ఆ ప్రభావం మూలమూలల నున్న గ్రామాలకు కూడా వ్యాపించింది. నిత్యావసర వస్తువుల మీద సుంకం అధికం చేయక తప్పలేదు నాయంకరులకి.
   నగలు నాణ్యాలు సేకరించుట అట్టే పోయె.. ఉన్నవి కూడానూ అమ్ముకుని భుక్తి కొనసాగించ వలసి వస్తోంది.
   సూరనార్యునికి శిష్యులు తగ్గిపోయారు. బ్రాహ్మణ యువకులను కూడా రాజ ప్రాసాదములోనికి ప్రతి దినమూ పిలుస్తున్నారు.
   అద్దంకి ప్రభువు ఏ సహాయమూ చేసే స్థితిలో లేరు. వారు మరల.. భీకర సమరమునకు బలాలను సమకూర్చుకుంటున్నారు. ఈ మారు బలవంతం లేదు.. ఏ ప్రణాలికలు చెవిని వేశారో కానీ, ప్రతీ ఇల్లాలూ ఇష్టపూర్వకంగా తమ బంగారు కొండలను సైన్యం లోనికి పంపుతోంది. మౌలిక మార్పునకు దక్షిణా పథమంతా రహస్య ప్రయత్నాలు చేస్తోంది.
   ఎర్రనకి వయో పరిమితి ఆడ్డం వచ్చింది, అద్దంకి సైన్యంలో చేరుటకు. ఊరిని కాపాడవలసిన కొద్దిమందిలో చేరారు సూరన, ఎర్రన. మంచీ చెడూ చూసే ఆచార్యుల పర్యవేక్షణలో పసివారు, వృద్ధులు, స్త్రీలు క్షేమంగా ఉంటారు.
   విజయమో. వీర స్వర్గమో.. ప్రతీ వారి నినాదం అదే.
   తెగింపు విపరీతమైన ధైర్యాన్నిస్తుంది.
   సూరనార్యుడు పురాణ కాలక్షేపం చేసి, మంగళ హారతి పళ్ళెంలో వచ్చిన అల్ప నాణెములతోనే ఇంటిలోని నలుగురూ నాలుక తడుపుకుని మన గలుగుతున్నారు.
   నన్నయ భట్టారకునికి, తిక్కన సోమయాజికి రాజ ప్రాపకం ఉంది. ఆదరించి సకల సౌకర్యాలు కలుగ జేసిన ప్రభువుల అండా దండా ఉన్నాయి.
   ఎర్రన కొద్ది రోజులలో అభిమానము వదలి, పంట పొలాలలో హాలికుడై పనులకు వెళ్ళవలసిన పరిస్థితి..
   ఏది ఏమైనా మహారాజ ప్రోత్సాహం, పోషణ లేనిదే కావ్యరచన చేయుట సంభవం కాదనే నిశ్చయానికి వచ్చేశాడు ఎర్రాప్రగడ.
   ఏమవునో.. ఆంధ్ర మహాభారతం సంపూర్ణ స్థితిలో లభ్యమవునో లేదో! ఆంధ్రుల అదృష్ట మెటులున్నదో!
   వేచి చూడ వలసినదే.
                               …………….
    "విధి", ఖుశ్రోఖాన్, దేవల దేవిలను ఒక్క దగ్గరికి కాలక్షేపాని కోసం చేర్చలేదు..
   హిందూదేశ చరిత్రలో అనూహ్యమైన మార్పులు రావాలి.. తాత్కాలికంగా నైనా సరే!

            
   హిందూ మహా సముద్రంలో చుక్కాని లేని నావను నడిపినంత సాహసమే..
   నివురు గప్పిన నిప్పుల్లాగ నిశ్చలంగా ఉండి, సుల్తాన్ మదిర మత్తులో వళ్ళెరుగక పడి ఉన్నప్పుడు..
   గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న భావాల్ని పంచుకున్నారా ’విధి’ వంచితులు.
   ఇరువురికీ అవధులు లేని అధికారం చేజిక్కింది.
   ఖుశ్రోఖాన్ దేవగిరి దండయాత్రలో జరిపిన హింసతో సుల్తాన్ నమ్మకాన్ని సంపూర్ణంగా గెలుచుకున్నాడు. రోజుకు నాలుగు సార్లు నమాజ్‍తో మతం మీది తన భక్తిని చాటుకుంటున్నాడు.
   సుల్తాన్ పాలనాధికారాన్ని పూర్తిగా ఖుశ్రో చేతుల్లో పెట్టేసి, నిశ్చింతగా ఉన్నాడు.
   దేవలదేవికి సుల్తాన్ మీది ప్రేమ రోజు రోజుకూ ఎక్కువవుతోంది. మత్తులో లేని కొద్ది సేపూ, అతగాడి విచిత్ర వికృత కోరికల్ని తీరుస్తోంది.
   చల్లగా.. చాపకింది నీరులా తాము అనుకున్నది చేస్తున్నారిరువురూ.. ఆ ఫాలాక్షుడికి కూడా అనుమానం రాకుండా.
   గుజరాత్‍లో ప్రతినిధిగా ఉన్న సుల్తాన్ మామగారు మరణించగానే, మహమ్మదీయుడిగా మతం మార్చుకున్న ఖుశ్రో అన్న రాజ ప్రతినిధి అయ్యాడు.
   గుజరాత్‍లో శిక్షణ పొందిన ముప్పది వేలమంది సైనికులూ.. అందరూ హిందువులే.. ఖుశ్రో కనుసన్నల్లో ఉండి, నిప్పుల్లోనైనా, నడి సంద్రంలో నైనా దూకడానికి సిద్ధంగా ఉన్నారు.
   ముసల్మాన్ సర్దార్లకి, వజీర్ ఖుశ్రో కదలికలు అనుమానాస్పదంగా అనిపిస్తున్నాయి. అయిననూ ఏమీ చెయ్యలేని పరిస్థితి. దేవగిరి ఊచకోతలతో సుల్తాన్ ఎవరేం చెప్పినా నమ్మడు.
   ఆ విషయం నిర్ధారణగా తెలిసిపోయింది.
   సాహసించి ఒకసారి ఒక ముదుసలి మంత్రి.. జలాలుద్దీన్ కాలం నుండీ విశ్వాసపాత్రంగా ఉన్నవాడు.. తన అనుమానాలు చెప్పబోయాడు.
   అతను చెప్పినది అంతా విని, ఖుశ్రో అని పేరు రాగానే ముందు వెనుకలాలోచించకుండా నూరు కొరడా దెబ్బలు శిక్ష వేశాడా ఉన్మాది సుల్తాన్. ఇరవై దెబ్బలకే ఆ అభాగ్యుడు ఆఖరి ఊపిరి పీల్చాడు.
   మంత్రి మండలి అంతా ఆవేశంతో ఊగి పోయారు.
   ఇనుప కవచంలా ఖుశ్రో కమ్మి ఉంటే సుల్తాన్‍ను ఏం చెయ్యగలరు ఎవరైనా!
   వారి సంశయం తీర్చడానికే అన్నట్లు మరల దక్కను దండయాత్ర చేశాడు ఖుశ్రో.
   ఈ దండ యాత్రతో హిందువులలో మరింత ఉక్రోషము ప్రబలింది. హిందువులలో ఢిల్లీ సుల్తాన్ పట్ల అవిశ్వాసము, అవిధేయత పెరగడానికే ఖుశ్రో దక్కన్ వెళ్ళాడని ముసల్మాన్ నాయకుల నమ్మకం. ముస్లిములను నాశనం చేసి, హిందూ రాజ్యం స్థాపించడమే ఖుశ్రో ధ్యేయం అని వారి ఉద్దేశ్యం.
  అదే నిజం కూడా!
                                  …………..
   హిందువుల ఉక్రోషాక్రోశాగ్ని జ్వాలలకి ఆజ్యం పోస్తున్న వాడు మేవార్ రాజు రాణా హమీర్.
   హిందూ రాజుల సైన్య సమీకరణలనూ, రాజపుట్‍ల రహస్య మంతనాలనూ ఖుశ్రో చూసీ చూడకుండా వదిలేస్తున్నాడని ఢిల్లీ హిందువులు, ఉత్తరదేశ హిందువులు నమ్ముతున్నారు. ఖుశ్రోఖాన్, దేవల్ దేవి కలిసి ఏదో విప్లవానికి ప్రణాలిక వేస్తున్నాడని అనుమాన పడుతున్నారు.
   దక్షిణ దేశ నిర్దాక్షిణ్య దండ యాత్ర తరువాత ఎవరూ ఖుశ్రోని వేలెత్తి చూపలేరు. ముసల్మాన్ వేష ధారణ, నమాజ్.. తల మీది తప్పనిసరి శిరస్త్రాణం, నిండుగా పెరిగిన గడ్డం, విశ్వాసంతో కూడిన చూపులూ.. నర మానవుడెవడూ ఈ వజీర్ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించడమే కాకుండా, ముసల్మాన్ రాజ్యాన్ని హిందు సామ్రాజ్యం క్రింద మార్చగలడని అనుకోడు.
   ఖుశ్రోఖాన్, దేవలదేవిల ధ్యేయం అదే.
   అదే పదకొండేళ్ళ ఖుశ్రోకి గుజరాత్ రాజు చనిపోయే ముందు చెప్పింది.
   అదే మాలిక్ కాఫర్ ఆశయం కూడా.. నెరవేర్చడంలో తన ప్రాణాలు త్యాగం చెయ్యడానికి కూడా వెరవలేదతను. హిమాలయాల చిల్లులోంచి వచ్చి, హిందువుల ఆలయాలను కొల్లగొట్టి, చిద్రం చేసి.. బలవంతంగా  మత మార్పిడా..
   అంతకు అంతా తీర్చుకోవాలిసిందే!
   సుల్తాన్, ఖుశ్రోని అధికార పాలకుని చేసి తాను రాజ్యభోగాలు అనుభవించడం మొదలు పెట్టాక రాజ్యంలో అనేక మార్పులు సంభవించాయి.
   హిందువుల మీద అత్యాచారాలు, దుర్మార్గాలు తగ్గిపోయాయి.
   స్వేఛ్ఛగా తమ తీర్థయాత్రలు చేసుకోవచ్చు. భక్తిని ప్రకటించుకోవచ్చు.
   అల్లావుద్దీన్ కాలంనుంచీ హిందూ రైతుల మీద ఉన్న సుంకాలని తగ్గించాడు.
   నెమ్మదిగా, స్థిరంగా హిందువుల పాలిటి దైవంగా అవతరించాడు ఖుశ్రో. సామాన్య ప్రజకి ఆరాధ్య దైవం అయ్యాడు.
   సమయం కోసం వేచి చూస్తున్నాడు.
   సమయం ఆసన్నమయింది.
   ఖుశ్రో, దేవలదేవిలు తమ ప్రణాలికను అమలుపరచడానికి నిశ్చయించుకున్నారు.
   పది పన్నెండేళ్ళ కల ఫలించబోతోంది. మొత్తం మారిపోతుంది.. మార్పు మార్పు..  ఇంకా మారాలి.
   మార్పు జరిగింది.
   అత్యంత నాటకీయంగా, అనూహ్యంగా.. కోటలోని వారికి ఏం జరుగుతోందో అర్ధమవుటకు కొంత సమయం పట్టింది. ఆలోగా జరగవలసింది జరిగిపోయింది.
   "ప్రభూ! గుజరాత్ నుండి ముప్పదివేలమంది హిందువులను పట్టి బంధించాను. వారు మతం మార్చుకోవడానికి సంసిద్ధులు. ఢిల్లీ తీసుకొని వచ్చుటకు అనుమతినివ్వండి."
   సగం మత్తులో ఉన్న సుల్తాన్ అనుమతినివ్వడమే కాదు.. వారిని కోటలోకి తీసుకొచ్చి తన ఎదుటే మార్పిడి జరగాలని ఆదేశించాడు.
   మార్పిడి జరిగింది..
   కానీ సుల్తాన్ జీవితంలో.
   ముప్ఫైవేల మంది ఖుశ్రో సైనికులూ కోటలోకి ప్రవేశించారు. రాత్రికి రాత్రి సుల్తాన్‍ను హత్య చేశారు.
   ఖుశ్రోఖాన్ తాను సుల్తాన్‍గా, దేవల దేవిని వివాహం చేసుకుని రాణీగా ప్రకటన చేశాడు.
                                  ---------------

 

 

 

 

 

......మంథా భానుమతి