Facebook Twitter
ఒంటికాలి కాకి

 
                                                               ఒంటికాలి కాకి

                        

అప్పుడే క్లాస్ అయిపోయి బయటికొస్తున్నాను.
దూరంగా ఇద్దరు పిల్లలు నా వైపుకు పరిగెత్తుకు వస్తున్నారు.
'సార్... సార్.. కుంటి కాకి అక్కడుంది. రండి చూపిస్తాం ' అని గస పెడుతూ చెప్తున్నారు.
'అవునా...' అని దీర్ఘం తీస్తూ ఊ కొడుతూనే
'కుంటి కాకి అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి.' అని చిరాకుపడ్డాను.
' అదే.. అదే.. ఒంటికాలి కాకి ... సార్!' అంటూ తడబడుతూ బదులిచ్చారు పిల్లలు.

మొన్న కూడా కొంత మంది పిల్లలు ఇట్లాగే వచ్చి చెప్పారు.
ఆ కాకిని చూడ్డానికి ఆసక్తిగా పరుగుపరుగున వెళ్లాను. కానీ అదక్కడ లేదు. ఇప్పుడే అటువైపుకి ఎగిరిపోయిందని చెప్పారు అక్కడున్న పిల్లలు.
' అయ్యో ' అనుకుంటూ వెనక్కి వచ్చేశాను.

ఈ మధ్య బడి ఆవరణలో 'ఒంటికాలితో తిరుగుతున్న కాకి ' బాగా కనిపిస్తోందని బడి పిల్లలు తరచూ చెప్తున్నారు . నాకెప్పుడూ అది తారసపడలేదు. దాన్ని చూడాలని నాక్కూడా అనిపిస్తోంది. కానీ ఆ కాకి కనిపించడం లేదు. బడి గోడకు చివర ఉన్న కానుగ చెట్టు వద్ద దాన్ని చూశామని పిల్లలు ఎప్పుడూ చెప్తుంటారు.

మధ్యాహ్నం పిల్లలందరూ భోజనం చేశాక, ప్లేట్లు కడుక్కునే చోట అన్నం మెతుకులు తినడం కోసం కూడా వస్తుందని ఇంకొందరు చెప్పారు. నేనెప్పుడూ దాన్ని చూడలేదు.

ఒక కాలుతో ఆ కాకి ఎట్లా జీవనం సాగిస్తోందో నా ఊహకు కూడా తట్టేది కాదు . దానికి ఒక కాలు ఎట్లా పోయి ఉంటుందో అనే ఆలోచన కంటే ఒక కాలు తోనే అది బతుకుతున్న తీరు పైనే మొదట్నుంచీ నా దృష్టి . దీంతో ఆ కాకిని చూడాలనే ఉబలాటంతో ఉన్నాను. ఇదిగో ఇప్పుడిట్లా పిల్లలొచ్చి కాకి విషయం చెప్పడం తో వారితో పాటూ ముందుకు కదిలాను.

దూరంగా వేపచెట్టు కొమ్మలు గాలికి ఊగుతున్నాయి.
పైన ఎండ కు కింద విస్తరించిన కొమ్మల నీడలు. అడుగులు ముందుకు పడుతున్నాయి.
అవును ... చెట్టుకింద నీడలో కాకి కనిపిస్తోంది. అటూ ఇటూ తిరుగుతోంది.ముక్కుతో ఏదో పొడుచుకొని తింటోంది.

ఇంకొంచెం దగ్గరికి వెళ్తే ఎగిరి పోతుందేమో. తెలియదు. కానీ దాన్ని దగ్గర్నుంచి చూడాలనే కోరిక. ఆలోచిస్తూనే చిన్నగా ముందుకు నడుస్తున్నాను.

ఎండ మండిపోతోంది. వేడిగాలి. వేప చెట్టు పూత వాసన .
మెల్లగా చెట్టు దగ్గరికి చేరుకున్నాను. అవును... దానికి ఒక కాలే ఉంది. తన దేహ బరువునంతా ఆ ఒక్క కాలు పైనే మోస్తోంది. ఏ గింజలనో తినడానికి వంగి నప్పుడల్లా తన దేహం అంతా భూమిని తాకుతోంది. అట్లా ఒంగితే గాని అది ఆ గింజల్ని తన ముక్కుతో అందుకో లేకపోతుంది. ఇలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు. అది తన జీవిత కాలమంతా బతకాలి. అనుకుంటేనే గుండె బరువెక్కుతోంది. దాన్నిఅట్లాగే కాసేపు చూస్తుండిపోయాను. దాని కళ్ళల్లో ఎక్కడ తనకు ఒక కాలే ఉందన్న భావన లేదు. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా తన జీవితానికి జీవాన్ని నింపి జీవిస్తోంది. రెక్కల్ని రెపరెపలాడిస్తూ తన ఆహారాన్ని తానే సంపాదించుకుంటోంది. రివ్వున కొమ్మల పైకి ఎగురుతోంది. మళ్లీ కిందకి దిగుతోంది.

నేలపైన ఒక కాలితో ఒక చోటి నుంచి మరో చోటికి
అది ఎగురుతున్నప్పుడు చూడముచ్చటగా ఉంది.
వళ్ళంతా నల్ల రంగు తో మధ్య మధ్య లో ' కావ్... కావ్ ..'అని అంటుంటే ' ఏవీ శాశ్వతం కాదని. ఈ జీవితాన్ని ఇట్లా గడపడమే పరమార్థమని' హెచ్చరిస్తున్నట్లు గానే ఉంది. అలాగే దాన్ని చూస్తుండిపోవాలనిపిస్తోంది.

బలంగా గాలి వీచింది.
చెట్టు పై నుంచి ఒక ఎండిన కొమ్మ రాలి పడింది. కింద పడగానే ముక్కలు ముక్కలయింది. చీమల పుట్ట దగ్గర ఆహార అన్వేషణలో ఉన్న ఒంటికాలి కాకి తన రెక్కల్ని విప్పార్చింది.
ఎగురుతూ ఎగురుతూ రాలిపడిన ఎండిన పుల్లల వద్దకు చేరుతుంది. ఒక మంచి పుల్లను ఎంపిక చేసుకొని నోటికి కరచుకుని పైకి ఎగిరింది.
ఒక కొమ్మ ను చేరుకుంది. ఆ కొమ్మ పై నుంచి మరో కొమ్మకు . పైనున్న చిటారు కొమ్మకు చేరుకుంది.
పచ్చటి ఆకులు నీడలు పడుతున్న చోట తన గూడును కట్టుకుంటోంది.
అది నిర్మిస్తున్న 'పెద్ద గూడు' ను నేనట్లా చూస్తూనే ఉండిపోయాను.

                                                                                           - డాక్టర్ వేంపల్లి గంగాధర్