Facebook Twitter
అమ్మతనం

అమ్మతనం

 

 

“అబ్బా!”
తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్ స్టిచ్ కుడ్తున్న ప్రతిమ ఉలిక్కిపడింది.సూది ఎడమచేతి బొటనవేలులో కసుక్కున దిగి రక్తపుచుక్క తెల్లటి చీరపైకి ఎగజిమ్మింది. సూది గుచ్చుకున్న బాధకన్నా తెల్లటి చీరపై ఎర్రటి రక్తంమరక ప్రతిమ సహనాన్ని చంపేసింది.అర్ధగంటనుండీ గమనిస్తూనే ఉంది.ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నుకోవడం,రిమోట్ లాక్కోవడమో,దాచేయడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది.ఏదో సెలవులలో టి.వి.ని కాసేమయినా చూడనీ పాపం,ఎందుకు కట్టడి చెయ్యాలి అని ఊరికే వుంది కాని,ఆమె ఓర్పును పరీక్షిస్తున్నారు ఎనిమిదేండ్ల పెద్దకొడుకు సాత్విక్,ఆరేళ్ల చిన్నకొడుకు రుత్విక్.


‘చక్కగా అమ్మాయిలే నయం, ఇంతరొద ఉండకపోను,అయినా చిన్నాడెందుకు అబ్బా అని అరిచాడు? ’  
“మీరిద్దరు అన్నదమ్ములేనా,వాలిసుగ్రీవులా? ”అని అరచింది ప్రతిమ.
“వాలిసుగ్రీవులు అన్నదమ్ములే మమ్మీ! ”కిసుక్కుమంటూ పెద్దకొడుకు సాత్విక్ తాను నిద్రపోకముందు తండ్రి దగ్గరవిన్న పురాణాల సారాన్ని తల్లికి వివరించబోయాడు.


“రామలక్ష్మణులలాంటి అన్నదమ్ములా లేక వాలిసుగ్రీవులలా బద్ధవైరులా అని నా అర్థం.ఆ సంగతి వదిలేయ్,ఇంతకీ వాడినేం చేసావు అంతలా అరిచాడు! ” తీవ్ర స్వరంతో గద్దించి మరీ అడిగింది ప్రతిమ.
“నేనేం చేయలేదు”. రోషంగా తలెగరేసాడు సాత్విక్.
 

-2-


“అన్నీ అబద్ధాలే మమ్మీ ఇక్కడ చూడు చేతిమీద గోరుతో గిచ్చాడు. ” గాటుపడిన చేతిని చెయ్యిచాపి చూపించాడు రుత్విక్. 
“మరి నా చెయ్యి చూడు మమ్మీ ఎలా కొరికాడో!దద్దురు తేలిన చేతిని తల్లికన్నుల దగ్గరకు చాపి చూపించాడు రుత్విక్.పంటిగాట్లు కూడా లోతుగానే పడ్డట్లున్నాయి.రక్తం రాలేదుకాని గూడు కట్టినట్లయింది.
“ఏరా ఒకటివ్వాలా!ఐనా పెద్దవాడివి సర్దుకుపోలేవూ-రిమోట్ దగ్గర గిచ్చి కొరుక్కుంటారా కాట్లు పడేటట్లు! ఛీ..ఛీ మీతోవేగలేకపోతున్నాను” అంటూ టి.వి. ఆఫ్ చేసింది ప్రతిమ.


వేసవి సెలవులయినా,పండుగ సెలవైనా పిల్లలకు ఆటవిడుపే కాని పిల్లలతో వేగాలంటే ఒకింత కష్టమే1 ఇక వేసవి సెలవులు ఇచ్చారంటే పిల్లల అల్లరి భరించి మళ్లీ బడికి వెళ్లేదాకా  పిల్లలతో వేగాలంటే  ఇల్లాలికి ఓ తట్టెడు ఓర్పు,బుట్టెడు సహనం ఉండాల్సిందే!
“అమ్మా ఇప్పుడు చూడు వాడే కొడుతున్నాడు. ”సాత్విక్ మళ్లీ కేక పెట్టాడు. టి.వి. ఆపేసాక యుద్ధం మరింత సులువయింది.కొట్లాడుకోవద్దని, చక్కగా నెమ్మదిగా ఆడుకొమ్మని చెప్పిచెప్పి విసిగి పోతుంది ప్రతిమ.ఇంకా ఇలాగే ఎన్నాళ్లు వేగాలి? ఏం చేయాలి దేవుడా!అని ఆలోచించసాగింది ప్రతిమ....ఫ్లాష్! అవును ఆపని చెయ్యాలి.అప్పుడువీళ్లఅల్లరి వుండదు ఆగడము ఉండదు. తాత్కాలికంగా ఊరట చెంది ప్రతిమ నిట్టూర్చింది.


“ఏమంటున్నారు పుత్రద్వయం?ఎక్కడా సందడే లేదే! ”ఆఫీసునుండి వచ్చిన రఘు ,రోజూ పిల్లల గొంతులనుండి వెలువడే గలగలల ఆహ్వానం వినబడక ప్రతిమను ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. 

                         

 -3- 

 

డిజైన్ కుట్తున్న చీరను చిరాగ్గా ప్రక్కకు పడేసి “ఇద్దరికీ రెండు తగిలించాను.ఏడ్చి పడుకున్నారు. ” అంది ప్రతిమ.
“అయ్యో! ఎండకు తోడు డోలు కూడా వాయించావా మరి నిన్ను నువ్వు కొట్టుకున్నట్టు అలా వున్నావేం? ”నవ్వాడు రఘు 
“మీకు నవ్వులాటగానే వుంటుంది.నా అవస్థ మీకేంతెలుసు ? ”
“సెలవులుకదా!చిన్నపిల్లలకు తోచదు మరి. ”టై విప్పి టేబిల్ మీద పడేస్తూ బెడ్ రూమ్ లో నిద్రపోతున్న పిల్లలను ముద్దుపెట్టుకున్నాడు రఘు.


“మీకేం తీరికగా సాయంత్రానికి వస్తారు.సెలవులనేకాదు,బడి వున్న రోజులయితే మాత్రం ఏమి తక్కువ!బడికి పంపాలంటే యజ్ఞం,బడినుండి వచ్చాక చదువుల హోమం! అన్నీ భుజాన వేసుకుని మోసే భారంనాది. ” నిష్ఠూరమాడింది ప్రతిమ.
“సరిసరి దండకమేనా ,కాఫీలాంటిదేమైనా వుందా? ”భార్య మాటలకు అడ్డుకట్ట వేసాడు రఘు.
వేడికక్కుతున్న కాఫీకన్నా మరింత మండిపడుతున్నట్టుంది ప్రతిమ.భార్య అందించిన కాఫీ త్రాగుతూ, 
 “కూల్ డౌన్ ప్రతిమా,ఏమిటి ఈ వేళ వర్క్ లోడ్ పెరిగిందా?పైగా ఎంబ్రాయిడరీ ఎక్స్ ట్రా వర్క్ పెట్టుకున్నావు” సానుభూతిగా అన్నాడు రఘు.


“ఆ...... నా మానసికానందానికి చేసే పని మాత్రం మీకు ఎక్స్ ట్రాగా కనబడుతుంది.మీ పిల్లల అల్లరి మాత్రం ముచ్చటగా ఉంటుంది.అసలు ఎగ్జామ్స్ రాయించేసరికి దేవుడు కనబడ్డాడు.ఇక ఈ సెలవులలో నాకు పిచ్చెక్కేటట్లుంది. ”అంది ప్రతిమ విసుగ్గా.
     

 -4-


“ఏం చేయమంటావ్ మళ్లీ పాత పాట మొదలెట్తున్నావ్ ”అన్నాడు విసురుగా.
ఆ విసురును కాఫీ కప్పు పెట్తున్న వైనంలో చూపాడు రఘు.
“నాది పాటలాగే వుంటుంది మీకు.నా పాట్లు మాత్రం అర్థం చేసుకోలేరు.నేను మాత్రం తల్లినికానా? పిల్లలను క్రమశిక్షణలో పెంచాలనుకోవడం తప్పా?ఈ సంవత్సరం నామాట వినండి.ఆ తరువాత చూడండి మన పిల్లలలో మార్పు.! ” అంటూ తన మనస్సులో కోరికను బయటపెట్టింది.భర్త అంగీకారం కోసం ఆశ,అర్థింపు కలగలిపి కోరుతోంది ప్రతిమ.
“అబ్బ నీ ఫ్రెండ్ వార్డెన్ అయితే అయింది కానీ నీకు మాత్రం భలే ఉబలాటంగా ఉంది నీ కొడుకులను హాస్టల్ లో చేర్పించాలని” నిష్ఠూరంగా అన్నాడు రఘు.


“ఈ ఒక్కసారికి నా మాట వినండి. నా ఫ్రెండ్ వార్డెనే కాదు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా! చాలా స్ట్రిక్ట్ మనిషి.డిసిప్లిన్ కు పెట్టింది పేరు.ఏమంటారు? ”ఆసక్తిగా భర్త వంక చూసింది ప్రతిమ.


రఘు ఆలోచనలో పడ్డాడు. ‘కనీసం రోజుకొక్కసారైనా హాస్టలు ప్రసక్తి రాకుండా గడవడం లేదు.ప్రతిమ తనను జీడిపాకంలా పట్టుకుంది.పిల్లల అల్లరి శృతి మించుతోందని తల్లిదండ్రులకు దూరంగా ఉంటేనే క్రమశిక్షణతో పెరుగుతారని నొక్కి మరీ చెప్పే ప్రతిమ భావాన్ని తాను మార్చగలనా! ’ అనుకున్న రఘు,సరే చూద్దాం పిల్లలు మారఢం ఎలా వున్నా ప్రతిమ మారుతుంది,విసుగు,చిరాకు తగ్గుతుంది అనుకుని ప్రతిమను కావాలసిన ఏర్పాట్లు చేసుకోమన్నాడు. ఎట్టకేలకు భర్త ఒప్పుకున్నందుకు ప్రతిమ చాలా సంతోషపడింది.పిల్లలు హాస్టల్లో స్వతంత్రంగా అన్నీ చేసుకోవడం నేర్చుకుంటారని,బుద్ధిగా హోం వర్క్ చేసుకుంటారని,క్రమశిక్షణ నేర్పే స్నేహితురాలు వార్డెన్ గా వుండటం తన అదృష్టం అని ,ఆమెదగ్గర పిల్లల అల్లరి 

 

-5-


తగ్గిపోయి,బాగుపడి వృద్ధిలోకి వస్తారని తలపోస్తూ పిల్లల ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకోసాగింది. పిల్లల అల్లరి,ప్రతిమ అరుపులు చర్వితచర్వణంగా సెలవులు గడిచిపోయి స్కూళ్లు తెరిచే టైమయింది.హాస్టలుకువెళ్లాలి అని తల్లి బట్టలు సర్దుతుంటే  పిల్లలు కూడా సంబరంగా సహాయం చేయసాగారు.బట్టలన్నీ సర్దుకుని బ్రష్, పేస్టు, దువ్వెన,సబ్బులు వంటి వస్తువులు ఎవరివి వారు చక్కగా సర్దుకుంటూ ఎవరి వస్తువులు వారికి సమానంగా దొరకుతుంటే సాత్విక్,రుత్విక్ అమితానందపడిపోతున్నారు.పైగా కారులో ప్రయాణం.కొత్త ఊరికెళ్తున్న సంబరం.పిల్లలు కేరింతలు కొడ్తుంటే ప్రతిమకూ సంతోషంగానే వుంది కొద్దిగా బాధనిపించినా  పిల్లల బాగు కోసమే కదా తను వాళ్లను దూరంగా వుంచాలనుకుంటుంది అని మనసుకు సర్ది చెప్పుకుంది.పిల్లల అల్లరి సహజగుణం కదా అన్న అంతరాత్మ ప్రశ్నకు ఉలిక్కిపడి సర్దుకుంది ప్రతిమ.


పిల్లలకోసం చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు కొని తెచ్చాడు రఘు.ఇద్దరికీ సమానంగా ఇచ్చాడు.రోజూ ఆఫీసునుండి ఇంటికొచ్చేసరికి పిల్లలగొంతులు ఇంట్లో ఇక వినబడవు అని తలచుకుంటేనే రఘుకి ఎంతో బాధగా ఉంది. రుత్విక్,సాత్విక్ మాత్రం రెట్టించిన ఆనందంతో బిస్కెట్లు, చాక్లెట్లు పెట్టెల్లో దాచేసుకున్నారు. ఇవన్నీ దొరుకుతాయని అమ్మ చెప్పినందుకే వాళ్లు హాస్టలుకు వెళ్తామని సిద్ధమయ్యారు. ప్రయాణంలో పాటలు,రైమ్స్ ఒకటేమిటి తల్లి దగ్గర అప్పజెప్పిన పద్యాలు, పాఠాలతో సహా వల్లెవేసి వినిపించేస్తున్నారు.కొత్తబాటలో మరిన్ని  కొత్త పాటలు నేర్చుకుంటారని  

 

 -6-


ప్రతిమ కలలు కనసాగింది.రఘు మాత్రం పిల్లల ఎడబాటును మౌనంగా దిగమ్రింగుతున్నాడు. పగలంతా ప్రయాణం చేసినట్లే వుంది.ప్రతిమ ముందే ఫోనుచేసినా పెద్దగా వివరాలమీ చెప్పలేదు.భర్తతో,పిల్లలతో వస్తున్నానని ఫ్రెండ్ తో చెప్పింది. “చాలా రోజులకు కనబడ్డావు ప్రతిమా!అయినా మీవారిని,పిల్లలను చూడ్డం  దే ఫస్ట్ టైం. ”ప్రతిమను,రఘును సాదరంగా ఆహ్వానించి ముద్దులు మూటగడ్తున్నట్లున్న రుత్విక్,సాత్విక్ ల బుగ్గలు పుణికి ముద్దెట్టుకుంది ప్రతిమ నేస్తం వెరసి వార్డెన్ ఇందుమతి.
“నువ్వలా ముద్దుచెయ్యకు,ఆ తరువాత నీకే కష్టం” ప్రతిమ హెచ్చరించింది.


“అదేమిటి! ” అని ఇందుమతి అర్థంకానట్టు చూసింది.
“నన్ను కాదు అటు చూడు”
ప్రతిమ చూడమన్న వైపు చూసిన ఇందుమతికి రఘు వెంట బరువైన సూట్ కేసులు రెండు మోసుకొస్తున్న వాచ్ మెన్ కనిపించాడు.రఘు తనచేతిలోని బ్రీఫ్ కేస్ ప్రతిమకందించాడు. బ్రీఫ్ కేస్ తెరచి పిల్లల ప్రోగ్రెస్ కార్డులు,ఫోటోలు చూపించింది ప్రతిమ.
“ఏమిటి ప్లాన్ మీదున్నావ్” అనుమానంగా అడిగింది ఇందుమతి.
“ఇక నీదే భారం వీళ్ల అల్లరిని నేను కంట్రోలు చేయలేకపోతున్నాను. వీళ్లకు క్రమశిక్షణ నేర్పి ఒక దారికి తెచ్చే మార్గం నీవే చూపాలి ”ప్రతిమ వేడుకోలుగా అంది.
“అంటే హాస్టల్లో పెట్టేస్తున్నావా” అని ఇందుమతి ఆశ్చర్యంగా అడిగింది.
“నీ గురించి అంతా విన్నాను ఇందూ!పైగా కొందరు పేరెంట్స్ మాఊరి వాళ్లు కూడా చెప్పారులే నువ్వు పిల్లలను చాలా స్ట్రిక్ట్ గా కంట్రోలు చేస్తూ అల్లరి చెయ్యనియ్యవని,ఏ 
     

  -7-


వేళకు చేసే పని ఆ వేళకు మాత్రమే చేయిస్తావని పిల్లలంతా రీడ్ వైల్ యు రీడ్ అన్నట్లు నీ గొంతు వింటేనే పుస్తకాలకు జిగురులా అతుక్కుపోతారని ..... ”నవ్వుతూ చెప్తోంది ప్రతిమ.
“ఆ..ఆ...ఇక ఆపు తల్లీ నన్నో వార్డెన్ లా చెప్పావా లేక విలన్ గా చెప్పావా నీ పిల్లలకి” అంటూ ఇందుమతి ప్రతిమ నవ్వుతో శృతి కలిపింది.


రఘు స్నేహితురాండ్రనిద్దరినీ గమనిస్తున్నాడు. ‘పాపం పిల్లలు రేపటినుండి తమకు దూరంగా,ఏం చేద్దాం?ప్రతిమకు బి.పి పెరిగిపోతోంది.ఇక ఇలా రాజీ పడక తప్పలేదు.మనసులో దిగులుగా అనిపించింది.ఆఫీసునుండి ఇంటికి రాగానే కనిపించే పిల్లల అమాయక వదనాలిక కరువే’ అనుకుని నిట్టూర్చాడు.


తమ కాలేజీ కబుర్లు,తాముండిన హాస్టలు కబుర్లతో కాలాన్నిఐస్ క్రీంలా కరిగించేస్తున్నారు.రఘు పేపరు అడ్డం పెట్టుకుని ఒకటి అరా మాటలలో మాత్రం రెస్పాస్స్ ఇస్తున్నాడు. పిల్లలిద్దరూ తల్లి చెప్పినట్లు అల్లరి చెయ్యకుండా బుద్ధిగా కూర్చున్నారు. కూర్చుని కూర్చుని నిద్రలోకి జారిపోతున్నారు.


“మీవారు పిల్లలు అలసిపోయినట్లున్నారు.నేను భోజనాల సంగతి చూస్తాను. ఇక ఈ రాత్రికి రిలాక్స్ అవండి.మీకు గెస్ట్ రూం సిద్ధంగా వుంది.బైదిబై అప్లికేషను ఫారాలు రేప్పొద్దుటే ఇస్తాను.పూర్తిచేసి ఇద్దురుగాని. ”అని కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది ఇందుమతి. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది, “మీ వారు, పిల్లలు” అనుమానిస్తూనే అడిగింది ప్రతిమ. “వాళ్లా !వదిలేసా.....అదే ఈ పూటకు వదిలేసా.మా ఆడబిడ్డ ఇంట్లో బర్త్ డే పార్టీకి వెళ్లారు.నువ్వు వినిపించుకోలేదేమో,మీ పిల్లలతో అన్నాగా !కాస్త ముందొచ్చి వుంటే 
     

 -8-


మీరు పార్టీకివెళ్లి వుండేవారని.వచ్చేస్తార్లే మీరు భోంచేసి రిలాక్స్ అవ్వండి. ”అంటూ డైనింగ్ ఏర్పాట్లకై లేచింది ఇందుమతి. కొత్తవాతావరణం,అసలే ప్రిన్స్ పాల్,పైగా వార్డెన్! సాత్విక్,రుత్విక్ క్యాబేజి కూర ఇష్టంలేకపోయినా వద్దనలేదు.మారాము చెయ్యలేదు. భోజనాలయ్యాయి. ఇందుమతి ఏవో ఫైళ్లు చూసుకుంటోంది .గుడ్ నైట్ చెప్పి వచ్చి పడుకుంది ప్రతిమ.పిల్లలప్పుడే నిద్రలోకిజారుకున్నారు.రఘు నిద్ర నటిస్తున్నాడని తెలుసు. ‘తప్పదు పిల్లలకోసం తనలోని అమ్మ మనసు చంపుకోక తప్పదు. ’ పిల్లలకు బెడ్ షీట్ కప్పింది,తమ వెంట తెచ్చుకున్న జెట్ మ్యాట్ ప్లగ్ లోపెట్టి ఆన్ చేసింది.పిల్లలు రేపటినుండి అన్నీ స్వంతంగా చేసుకుంటారు. రఘు నిద్రలోకి చేరుకున్నట్లు సన్నని గురకే చెప్తోంది.భర్త ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుందేమోనని అనుకున్నప్రతిమ హమ్మయ్య అని నిట్టూర్చి నిద్రలోకి జారిపోయింది.


తెల్లారినట్లుంది.గోలగోలగా ఏడుపులు వినిపిస్తున్నాయి. ఉలిక్కిపడి లేచింది ప్రతిమ.గోడకున్న గడియారం ఎనిమిది గంటలు సూచిస్తోంది. ‘అయ్యో ఇంతగా  నిద్రపొయ్యానా! ’ఇటు తిరిగి చూసింది. పిల్లలింకా మంచి నిద్రలో వున్నారు. ‘ఇదేమిటి ఇలా అయ్యింది? క్రమశిక్షణ ఈ రోజే మొదలవు తుందనుకుంటే తనే  ఆలస్యంగా లేచిందే అనుకుంటూ మెల్లగా లేచివెళ్లి హాల్లోకి తొంగి చూచింది. ఇందుమతి టి,విలో న్యూస్ చూస్తున్నట్లుంది. రఘు ఎప్పటిలానే  పేపరు తిరగేస్తున్నాడు.ఇక పిల్లలు,వార్డెన్ ఇందుమతి పిల్లలు! అల్లరి, ఏడుపు దట్టించి మరీ ఆడుకున్నట్లుంది. హాలంతా రంగు రంగుల కాగితాలు,బెలూన్లు, పిల్లలు ఆడించినట్లు ఆడుతున్నాయి.ఒకరు ఊదిన బెలూన్లు మరొకరు పుల్లతో పొడిచి ఫట్ 
 

 -9-


మనిపిస్తున్నారు.రంగుకాగితాల కంటించిన జిగురు నేలను కూడా ఒలికి హాలంతా అశుభ్రంగా తయారయ్యింది. ఇందుమతివేపు చూసింది ప్రతిమ.క్రాఫ్ట్ క్లాసులో వున్నట్లుగా ఫీలవుతున్నట్లుంది.టి.వి చూస్తూనే పిల్లల అల్లరిని తనే సంభ్రమంగా చూస్తోంది.చిరునవ్వుతో వాళ్ల అల్లరిని ప్రోత్సహిస్తున్నట్లే వుంది.వార్డెన్ లో వున్న నిజమైన అమ్మను చూస్తోంది ప్రతిమ.పిల్లల అల్లరిని మనఃపూర్తిగా భరిస్తోంది. టి.వి ఆఫ్ చేసి ఇటు తిరిగిన ఇందుమతి,ప్రతిమను చూసి నవ్వింది.


“లేచావా రాత్రడిగావే ఇదిగో వీళ్లే నా సుపుత్రులు. ”రఘు ప్రక్కనే కూర్చుని వున్న ఇందుమతి భర్త “మా సుపుత్రులు” అని సవరించాడు. అందరు నవ్వుకున్నారు. “ప్రతిమా నేనోగంటలో స్కూలుకు బయలుదేరుతాను.అడ్మిషన్లు చూసుకోవాలి కదా.టీపాయ్ మీద అప్లికేషను ఫారాలు పెట్టాను.ఫిలప్ చేసి స్కూలుకు రండి.వెయిట్ చేస్తుంటాను” అంది ఇందుమతి. ఇందుమతి మాటలను వినిపించుకోనట్లే వుంది ప్రతిమ.ఏదో మార్పు కనబడుతోంది ప్రతిమలో. ఇల్లెగిరిపోయేలా అరుస్తున్న ఇందుమతి పిల్లలవంకే రెప్పవాల్చకుండా చూస్తోంది. ‘తన ఇంటికి ఏమాత్రం భిన్నంగా లేని సన్నివేశం.!ఇంకాస్త అధ్వాన్నంగానే ఉన్నట్లుంది.కొత్తవాళ్లున్నారని కూడాలేదు.తనపిల్లలే నయం. ఎవరింటికెళ్లినా ఎవరైనా వచ్చినా అల్లరి మానేసి బుద్ధిగా ఉంటారు. ’ గదిలోకి వెళ్లి పిల్లలవైపు ప్రేమగా చూసింది.వంగి ఇద్దరి నుదుటి మీద క్రాఫు సవరించి ముద్దులు పెట్టుకుంది. ‘ప్రయాణం సంబరంలో తనవెంటబడి వచ్చారే గాని వీళ్లు తనని వదలి ఉండగలరా?అసలు తనుండగలదా? ’ప్రతిమ ఆలోచనలో పడింది. 


        -10-


“కిటికీ ఊచలకంటుకు పోయి ఆ ఆలోచనలేమిటి ప్రతిమా,నువ్వేం వర్రీ కాకు,నాకప్పచెప్పావుగా ,ఇంతకీ మీ ప్రోగ్రాం ఏమిటి? ”ప్రతిమ భుజంపై చెయ్యివేసి ఆప్యాయంగా అడిగింది ఇందుమతి.
“మరోగంటలో బయలుదేరుతాం ఇందుమతీ” అని నిశ్చయంగా అంది ప్రతిమ.
“అదేమిటి పిల్లలకు యూనిఫాం,పుస్తకాలు కొనవా? నీవు దగ్గరుండి కొంటే బెటర్ కదా!” ఇందుమతి సలహా ఇచ్చింది.
“లేదులే ఇందుమతీ !ఇప్పుడు మేము తయారుగా రాలేదులే” అంది ప్రతిమ.
రఘుకేం అర్థం కావడంలేదు.పదివేలు తెచ్చిచ్చాడు.ప్రతిమ మరిలా చెప్తోందేమిటి?
ఏదో మాటలాడబోయిన రఘును కళ్లతోనే వారించింది ప్రతిమ.
కాఫీ, టిఫన్లు పూర్తయాయి. సాత్విక్, రుత్విక్ లేవగానే గబగబా తయారయిపోయారు.ఇందుమతి పిలల్లు రంగుకాగితాలకై కొట్టుకుంటుంటే తమ అల్లరి గురించి మరచిపోయి చూస్తుండిపోయారు  సాత్విక్, రుత్విక్.


కిటికీ ఊచలనుండి తోటలోకి చూస్తోంది ప్రతిమ. సీతాకోక చిలుకలు పువ్వులను పలకరిస్తూ హయిగా విహరిస్తున్నాయి.ప్రతిమ మనసు తేలికై విహంగమైంది. ‘నిద్రపోతున్న పిల్లలను వదలి వెళ్లాలనుకున్న తన కఠిన నిర్ణయాన్ని మనసు వేలెత్తి ప్రశ్నిస్తోంది.కళ్లు తుడుచుకుంది ప్రతిమ.’తన బ్రీఫ్ కేసుతోపాటు పిల్లల సూట్ కేసులను కూడా కారులో తిరిగి పెట్టేస్తుంటే ప్రతిమలో మూసపోసిన అమ్మతనాన్ని కడు వేడుకగా తిలకిస్తున్నాడు రఘు. 

 

రచన: సి. ఉమాదేవి