Facebook Twitter
మనది కానిది మనకెందుకు?

మనది కానిది మనకెందుకు?

 

ఒక ఊరిలో రాజయ్య అని ఒక కట్టెలు కొట్టేవాడు వుండేటోడు. వాడు రోజూ అడవికి పోయి ఆ రోజుకు సరిపడా కట్టెలు కొట్టుకోని అమ్మేవాడు. ఎక్కువగా ఆశ పడేవాడు గాదు. ఉన్న దానిలో తిని, హాయిగా కాలం గడిపేవాడు. ఒక రోజు వాడు అడవిలో పోతావుంటే, దారిలో ఒక చోట ఒక బంగారు వరహా కనబడింది. దానిని తీసుకొని చుట్టూ చూసినాడు.. ఎవరూ కనబళ్ళేదు. కొంచెం దూరం పోయేసరికి మరో వరహా కనబడింది వాడికి! ఇంకొంచెం దూరం పోయేసరికి ఇంకో వరహా! అలా ఒకదాని తరువాత ఇంకొకటి!! కాసేపటికి వాడి చేతులు రెండూ వరహాలతో నిండిపోయినాయి. కానీ వరహాలు మటుకు ఇంకా కనబడతానే ఉన్నాయి. "పాపం! ఎవరో పారేసుకున్నట్టున్నారు. వీటిని తీసుకు పోయి రాజభటులకు చూపిద్దాం. వాళ్ళొచ్చి, మిగతావి కూడా వెతికి పట్టుకొని, సొంతదారులు ఎవరో కనుక్కొని అప్పజెబుతారు" అనుకుంటా తిరిగి వెనక్కు బైలుదేరినాడు రాజయ్య.


రాజయ్య ఇంటి పక్కనే ధనయ్య అని ఒకడు వున్నాడు. ఊరిలో వానంత ధనవంతుడు ఎవడూ వుండడు. వాడు పెద్ద ఆశపోతు. ఎంత సంపాదించినా "ఇంకా కావాల,ఇంకా" అని అల్లాడి పోతా వుంటాడు. ఆరోజున వాడు ఇంటి బైట కూచోని, ఎప్పుడూ గాడిద మీద కట్టెలు వేసుకోని వచ్చే రాజయ్య వుత్త చేతులు వూపుకుంటా రావడం చూసినాడు. "పాపం.. ఈ రోజు కట్టెలు దొరకలేదేమో" అనుకున్నాడు- గాని రాజయ్య మొగం ఏదో గాబరాగా వుంది. అది చూసి, 'ఏదో జరిగింది' అనుకోని, దగ్గరికి పోయి "ఏం రాజయ్యా, కట్టెలు దొరకలేదా, ఎందుకలా కంగారు పడతా వున్నావు?" అన్నాడు. రాజయ్య వానికి జరిగిందంతా చెప్పినాడు. "నిజమా... ఇంకా వరహాలు వున్నాయా, అక్కడ?" అన్నాడు ధనయ్య అశగా. 'వున్నాయం'టూ తలూపినాడు రాజయ్య. "సరే ఒక పని చెయ్యి. మన పల్లెలో రాజభటులు ఎక్కడ వుంటారు?! నేనే సొయంగా అవన్నీ ఏరుకోని పోయి, మన నగరాన్ని పాలించే రాజుకు అప్పజెబుతాలే. నువ్వు హాయిగా నీపని చూసుకో!"అని నమ్మకంగా చెప్పేసినాడు ధనయ్య.

 

రాజయ్య చానా అమాయకుడు. ఎవురిని పడితే వాళ్లని నమ్ముతాడంతే. అందుకని ఆ ధనయ్య మాటలు నమ్మేసి, తన చేతిలోని వరహాలు గూడా వానికే ఇచ్చి, "ఇవి గూడా తీసుకోని పోయి రాజుకు అప్పజెప్పు ధనయ్యా, ఒకని సొమ్ము మనకెందుకు?!" అనేసినాడు. ధనయ్య లోపల్లోపల సంబరంగా నవ్వుకుంటా అవి తీసుకున్నాడు. వెంటనే బిరబిరా ఇంటిలోనికి పోయి, రెండు గోనె సంచులు గాడిదమీద వేసుకోని, రాజయ్య చెప్పిన వైపు వురుకులు పరుగులు మీద పోయినాడు. రాజయ్య చెప్పిన చోటుకి చేరుకునే సరికి బంగారు వరహాలు కనబన్నాయి. సంబరంతో ఎగిరి గంతులు వేసినాడు. గాడిదను వేగంగా తోలుకుంటా పోతా ఒక్కొక్క వరహా ఏరుకో సాగినాడు. నెమ్మదిగా ఒక గోనెసంచీ నిండిపోయింది. వరహాలు చానా బరువు వుంటాయి గదా, దాంతో గాడిద మోయలేకపోతోంది. ఐనా ధనయ్య ఆశ అగడం లేదు. ఇంకా దారి వెంబడి వరహాలు కనబతానే వున్నాయి. సాయంకాలానికి రెండు సంచులూ నిండిపోయినాయి.


ఇంక చీకటి పడతా వుంది. ఆ అడవిలో దొంగలు చానా ఎక్కువ. వాళ్ల చేతికి చిక్కితే కష్టమే. అందుకని ధనయ్య మెల్లగా వెనక్కి తిరిగి ఇంటికి బైలుదేరినాడు. గాడిద ఆ బరువును మోయలేక, అడుగు తీసి అడుగు వేయసాగింది. ఇలాగే నత్తలాగా నెమ్మదిగా పోయారంటే చీకటి పడి, దొంగలకు దొరికిపోవడం ఖాయం! దాంతో ఎదారిపడిన ధనయ్య ఒక మూటని తనే ఎత్తుకుని పోదామని చూసినాడు. కానీ పని చేయక చానా రోజులైంది కదా, అందుకని నాలుగు అడుగులు వేసేసరికే చుక్కలు కనబన్నాయి. దాంతో తిరిగి మూటలు రెండూ గాడిద వీపుమీదే వేసినాడు. "ఏం చేద్దామా?" అని ఆలోచించ సాగినాడు. ఊరికి తొందరగా చేరుకొనేకి ఒక అడ్డదారి వుంది. ఆ దారిన పోతే సగం దూరం తగ్గుతుంది. కానీ ఆ తోవలో చిన్న వాగు ఒకటి అడ్డం వుంది. వాగులో ఎక్కడ ఏ గుంత వుంటాదో, ఎక్కడ ఏ పెద్ద రాయి తగులుతాదో ఎవరికీ తెలీదు. అందుకే ఎవరూ అటువైపు రారు. కానీ ఆశపోతు ధనయ్య ఆ వాగువైపే బైలు దేరినాడు. కాసేపటికి అక్కడికి చేరుకోని నెమ్మదిగా గాడిదతో సహా వాగులోకి దిగినాడు. నీళ్ళు వేగంగా పారతా వున్నాయి. గాడిద అప్పటికే బాగా అలసి పోయివుంది. దానికి చేతగావడం లేదు. అడుగులు తడబడతా వున్నాయి. అంతలో దాని కాలు చిన్న గోతిలో పడింది. అంతే! దభీమని కింద పడిపోయింది. దాని వీపు మీదున్న రెండు మూటలూ జారి పోయినాయి. వాటిలోని నాణాలన్నీ నీళ్ళలో పడి చెల్లాచెదురై పోయినాయి. ధనయ్య అదిరిపన్నాడు. నీళ్ళల్లో కిందా మీదా పడతా వెదకసాగినాడు.

 

కొట్టుకు పోయినవి కొట్టుకు పోగా అక్కడొకటి ఇక్కడొకటి దొరకసాగినాయి వరహాలు. వాటిని ఏరుకుంటా వుండగానే వెనుక చప్పుడయింది. తిరిగి చూసినాడు: పెద్ద దొంగలగుంపు- చేతుల్లో కత్తులతో. అదిరిపన్నాడు. "దొరికితే ఇంగేమన్నా వుందా, అంతే సంగతులు!" అనుకొని, ఆ నీళ్ళల్లోనే వేగంగా ముందుకు వురకసాగినాడు. అలా వురుకుతా వుంటే నడుమ ఒక పెద్ద గొయ్యి అడ్డం వచ్చింది. చూసుకోక అందులో కాలు పెట్టినాడు. అంతే కాలు కలుక్కుమనింది. దభీమని పడిపోయినాడు. "అబ్బా!" అంటూ ముక్కుతా మూలుగుతా పైకి లేచినాడు. అంతలో దొంగలు వచ్చి వాన్ని చుట్టుకున్నారు. "ఏరా మానుంచే తప్పించుకోని పారిపోదామని అనుకుంటున్నావా" అంటా తలా నాలుగు పీకినారు. చేతిలోని బంగారు వరహాలన్నీ గుంజుకున్నారు. వాటితో పాటు ధనయ్య మెడలో గొలుసు, వేళ్ళ వుంగరాలు, చేతి కంకణం, బంగారు మొలతాడు- అన్నీ ఒలుచుకోని పోయినారు. "అయ్యో! చేతికి చిక్కిన వరహాలూ పాయ, ఒంటిమీదున్న బంగారమూ పాయ!" అని బాధతో లబోదిబోమన్నాడు ధనయ్య. అయినా వానికి ఆశ చావలా. బుధ్దిరాలా. వుత్త చేతులతో ఇంటికి పోవాలనిపించలా. అక్కడే ఒక చెట్టుచాటున పడుకోని నిదురపోయినాడు.


తరువాతి రోజు పొద్దున్నే- ఇంకా తెలవారక ముందే లేచి, కుంటుకుంటా కుంటుకుంటా మళ్ళీ వరహాలు దొరికిన చోటికి పోయినాడు. ఇంకా అక్కడ దారంతా వరహాలు పడున్నాయి. "హమ్మయ్య! ఆ పాతవన్నీ పోతే పోయినాయిలే. ఇక్కడ ఇంకా చాలా వున్నాయి. ఈసారి తొందరగా ఏరుకోని పోతాను. చీకటి పడేలోగా ఇంటికి చేరుకుంటాను" అనుకుంటా బిరబిరా ఏరుకోసాగినాడు. నిజానికి ఆ వరహాలన్నీ ఆ వూరి రాజుగారివే. ఆ ముందురోజు వరకూ చుట్టు పక్కల దేశాలనుంచి, సామంతుల నుంచి వసూలు చేసుకున్న కప్పమంతా ఒక పెద్ద గుర్రంబండిలో వేసుకోని రాజుగారి ఖజానాకు తీసుకోని పోతా ఉండినారు సైనికులు . అయితే ఆ బండికింద చిన్న బొక్క పడింది. దారి వెంబడంతా ఒక్కొక్కటే వరహా జారి పడిపోయింది. సైనికులు దాన్ని గమనించుకోలేదు. తీరా పోయినాక తెరిచి చూస్తే ఇంకేముంది?! లోపల సగానికి సగం ఖాళీ అయిపోయింది. దాంతో సైనికులు అదిరిపడి వెదుకుతా పోతే, దారి వెంబడి మొత్తం బంగారు వరహాలు కనబన్నాయి. దాంతో వాళ్ళు అటు వైపు నుంచి ఒక్కొక్కటి ఏరుకుంటా రాసాగినారు. ధనయ్యకు ఇది తెలీదు గదా, అందుకని వీడు ఇటువైపు నుంచి ఒక్కొక్కటి ఏరుకుంటా పోసాగినాడు. కొంతసేపు అయ్యేసరికి వాళ్ళు, వీడు ఒకరికొకరు ఎదురు పడినారు! సైనికులు అదిరిపడి "ఏరా, దొంగ వెధవా! రాజుగారి వరహలే కాజేసి పోదామని అనుకుంటా వున్నావా?" అంటూ వాన్ని పట్టేసుకున్నారు.

 

వాడు నాకేమీ తెలీదంటూ లబోదిబోమని మొత్తుకోసాగినాడు. "మిగిలిన వరహాలు ఎక్కడున్నాయో చెప్పు!" అంటూ వాళ్ళు వాన్ని నున్నగా, తన్నిన చోట తన్నకుండా తన్నినారు. దాంతో వాడు వాళ్లకు జరిగిందంతా చెప్పేసినాడు. సైనికులు కోపంగా "పోగొట్టుకుని పోయింది ఏదైనా దొరికితే దాన్ని రాజుకి అప్పజెప్పాల గానీ, ఇలా మట్టసంగా మూడో కంటికి తెలీకుండా నున్నగా నొక్కేయడమేనా. ఇంక నీకూ, ఆ దొంగలకూ తేడా ఏముంది? నీవల్ల రాజు సంపద అంతా దొంగల పాలు అయింది. మరియాదగా తిరిగి ఆ రెండు మూటల బంగారు ఖజానాకు కడతావా, లేక జీవితాంతం కారాగారంలో వేసి బంధించమంటావా?!" అన్నారు. ఆ మాటలకు వాడు అదిరిపన్నాడు. కాళ్ళా వేళ్ళా పన్నాడు. అయినా వాళ్ళు వాన్ని వదలలేదు. దాంతో ఇంటికొచ్చి, ఎప్పుటినుంచో తినీ-తినక దాచి పెట్టుకున్న సొమ్మంతా తీసి వాళ్ళ చేతిలో పెట్టినాడు ధనయ్య. దాంతో ఆ సైనికులు అవన్నీ తీసుకోని వాన్ని వదిలేసినారు. "ఆశకు పోతే ఆఖరికి వున్నవి గూడా పోయినాయే!" అని ధనయ్య లబలబలాన్నాడు. 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో