Facebook Twitter
ఎవరు గొప్ప

ఎవరు గొప్ప

 

అనగా అనగా ఒక ఊళ్ళో ఐదుగురు మాంత్రికులు ఉండేవాళ్ళు. ఒక రోజున ఆ ఐదుగురు మాంత్రికులూ వేరే ఊరికి బయలు దేరారు. అట్లా పోతూ ఉంటే, వేగంగా పారే నది ఒకటి అడ్డు వచ్చింది వాళ్ళకు. నదికి వరద వచ్చి ఉన్నది. ఎటు చూసినా అలవికానన్ని నీళ్ళు! దాటేదెలాగ? 

 

వాళ్ళలో ఒకడు అన్నాడు: "చూడండి, మనందరం మామూలు మనుషులం కాదు. టక్కుటమార విద్యలు నేర్చిన మహా మాంత్రికులం. కనుక మనందరం ఇప్పుడొక పోటీ పెట్టుకుందాం. ఎవరైతే మంచిగా, తెలివితో ఈ నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకుంటారో, మనందరిలోకీ‌ వాళ్ళే గొప్ప మాంత్రికులు!" అని. అందరూ సరేనన్నారు.

 

మొదట ఒకడు నదిని మొత్తాన్నీ ఒక సీసాలో బంధించేసాడు. ఇసకలో నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ తర్వాత సీసా మూత తీసి, నదిని వదిలేశాడు. రెండవ వాడు నవ్వాడు. తన చెప్పుల్ని తీసి ముందు పెట్టుకున్నాడు. ఏవేవో మంత్రాలు చదివాడు. తర్వాత ఆ చెప్పులు వేసుకొని,నీళ్ళమీదనుండి మామూలుగా నడుచు-కుంటూ పోయాడు!

 

మూడవవాడు తన తుండుగుడ్డనొకదాన్ని తీసి ముందు పెట్టుకున్నాడు. ఏవో మంత్రాలు చదివాక, దాన్ని నడుముకు కట్టుకున్నాడు. ఆ వెంటనే గాలిలోకి లేచి, అలవోకగా నదిని దాటేసాడు! నాలుగో వాడు ఊపిరిని బాగా పీల్చి నది మీదికి ఊదాడు. నది అంతా గింగిరాలు తిరిగి, మొత్తంగా ఆవిరైపోయింది! ఒకసారి వాడు దాటాక, ఆవిరైన నీళ్లన్నీ తిరిగివచ్చి నదిలో పడ్డాయి.

 

ఐదో వాడు మంత్రాలు చదివేటప్పటికి నదికి అవతల అడవిలో ఉన్న చెట్లు ఒక వంద, అక్కడికి వచ్చి చేరుకున్నాయి. ఆ చెట్లతో వంతెన కట్టి, కులాసాగా నడచుకొంటూ నదిని దాటాడు అతను! బేతాళం ఇంతవరకూ చెప్పి, "ఇప్పుడు చెప్పు విక్రం, వీళ్ళలో ఏవరుగొప్ప? ఎందుకు?" అని అడిగింది.

 

విక్రం కొంచెం ఆలోచించి, "బాగున్నది బేతాళం. వీళ్లు ఐదుగురూ మంత్రగాళ్ళే. సాధారణ మానవులకు అతీతమైన శక్తులు వీళ్ళకు ఉన్నై. వీళ్ళు నదిని సీసాలో బంధించగలరు; నీళ్ళమీద నడవగలరు. గాలిలో ఎగరగలరు; నదిని మొత్తంగా ఆవిరి చేయగలరు! ఐతే ఈ నాలుగు శక్తులూ కేవలం ఆయా మంత్రగాళ్ళకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప, ఇతరులెవ్వరికీ వాటి ఫలాలను ఆస్వాదించే అవకాశం లేదు. 

 

ఐతే ఐదోవాడు ఉపయోగించిన వంతెన శక్తి వీటికి భిన్నమైనది. వంద చెట్లను పోగొడితే పోగొట్టింది గాని, తర్వాత పది కాలాలపాటు జనాలు ఉపయోగించుకునేందుకు తగిన వంతెననైతే ఇచ్చింది అది! అందుకని, సందేహంలేదు- వీళ్ళలో ఐదోవాడే గొప్పవాడు!" అన్నాడు.

 

విక్రం మౌనం భంగం అవ్వటంతోటే బేతాళం అతని చేతుల్లోంచి తప్పించుకొని మళ్ళీ చెట్టెక్కి కూర్చున్నది!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో