Facebook Twitter
ఒక వెంగళప్ప కథ

ఒక వెంగళప్ప కథ

 

ఒక రోజున వెంగళప్ప వాళ్ల నాన్నతో కలిసి అంగడికి వెళ్లాడు. నాన్న బఠానీలు కొని పెట్టాడు. దుకాణాదారు బఠానీలు తూశాక, వెంగళప్ప తన దోసిలిని ముందుకు చాపాడు. దుకాణదారు కొంచెం తటపటాయిస్తుంటే వెంగళప్ప "ఇయ్యన్నా!"అన్నాడు. దుకాణదారు వాటిని తక్కెడలోంచి నేరుగా వెంగళప్ప చేతుల్లో‌ పోశాడు.

వాటిని అట్లాగే తినేందుకు ప్రయత్నించాడు వెంగళప్ప. వాడి నోటిని చేరేలోగా బఠానీలు సగానికి సగం కింద పడిపోయాయి. అది చూసి వాళ్ల నాన్న "ఒరే, నాన్నా! ఎవరన్నా ఏమన్నా ఇస్తే అలా చేతిలో పట్టుకోగూడదురా, జేబులో వేసుకోవాలి. అప్పుడు కదా, అవి భద్రంగా ఉండేది?! కొంచెం ఆలోచించాలి నాయనా" అని చెప్పాడు ముద్దుగా. ఆ రోజునే వాళ్ల అమ్మ పూరీలు చేయాలనుకున్నది. చూడగా ఇంట్లో నూనె లేదు. ఆవిడ కొడుకును పిలిచి "ఒరేయ్! పోయి శెట్టిని అడిగి కొంచెం నూనె పోయించుకొని రా,పో!" అని గిన్నె ఇచ్చింది. వెంగళప్ప ఉత్సాహంగా పరుగుత్తుకుంటూ పోయి అంగడిలో నూనె పోయించుకున్నాడు.

వెనక్కి తిరిగి వస్తూంటే వాడికి అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది- "ఎవరన్నా ఏదైనా ఇస్తే జేబులో వేసుకోవాలి, అప్పుడు కదా, అవి భద్రంగా ఉండేది?" అని వెంటనే గిన్నెలోని నూనెనంతా జేబులో పోసుకున్నాడు. నూనె అంతా కారిపోయింది. ఇంటికి వెళ్ళాక వాళ్లమ్మ నెత్తీ నోరూ బాదుకున్నది- "పూరీలకు నూనె లేకపోగా, వాడి చొక్కాకున్న జిడ్డు వదిలించేందుకు కిలో డిటర్జెంటు పొడి అవసరమౌతుందే" అని. ఒకసారి వాళ్ళ ఊళ్ళోకి బాతులు అమ్మే ఆయన వచ్చాడు. మాంసం తినేవాళ్లంతా ఆరోజున పోయి తమకు కావలసినన్ని బాతులు తెచ్చుకుంటున్నారు. "మనకి ఒక బాతును తీసుకురా పో" అని పంపింది వెంగళప్ప వాళ్లమ్మ.

వెంగళప్ప వెళ్ళి ఒక బాతును కొనుక్కున్నాడు. దుకాణదారు దాన్ని వీడి చేతికి ఇవ్వగానే అది రెక్కలు టపటపా కొట్టుకున్నది. వీడు బెదిరిపోయి దాన్ని వదిలేశాడు. బాతు ఒక్క ఎగురు ఎగిరి, అదృష్టం కొద్దీ దుకాణం లోపలికే పోయింది. దుకాణదారు దాన్ని మళ్ళీ పట్టుకొని తెచ్చి ఇస్తూ "ఒరే! ఇంతమాత్రం తెలీదురా?! పక్షుల్ని పట్టుకునేది ఎట్లాగ? మెడ దగ్గర పట్టుకుంటే అవి కిక్కురుమనకుండా ఉంటాయి- ఇలాగ మెడ పట్టుకో" అని బాతును వెంగళప్ప చేతికి అందించాడు. ఆ రోజు సాయంత్రం వాళ్ల నాన్న ఇంటికి వచ్చి "ఒరే! సుబ్బారావు మామయ్యగారింట్లో కోళ్ళు ఎక్కువై పోయి, మరీ‌ అల్లరి చేస్తున్నాయట. 

మనం పెంచుకునేందుకు ఒక రెండు కోళ్ళు ఇస్తానన్నాడు. వెళ్ళి పట్టుకురా, పో" అని పంపాడు వెంగళప్పను. వెంగళప్ప రెండు కోళ్ళను దొరకపుచ్చుకొని, వాటి మెడలు పట్టుకొని ఎత్తుకొచ్చాడు. ఇంటికొచ్చేసరికి అవి కాస్తా చచ్చిపోయి ఉన్నాయి! "వాళ్ళింట్లో‌ ఇవి బానే ఉన్నాయి నాన్నా!" అన్నాడు వెంగళప్ప బాధపడిపోతూ. "అవునురా, మెడ పిసికితే కోళ్ళు ఎలా బ్రతుకుతాయి, కాళ్ళు కట్టేసి తల క్రిందులుగా పట్టుకొని తేవాలిగాని?!" అన్నాడు నాన్న, మరింత విచారంగా. వెంగళప్ప తల తిరిగింది ఈసారి. "అబ్బ!ఈ ప్రపంచాన్నంతా అంతా బలే తిక్కగా చేశాడు దేవుడు. దీన్ని అర్థం చేసుకునేది ఎలాగో, ఏమిటో" అనుకున్నాడు కలవరపడుతూ.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో