Facebook Twitter
ఉపాయం

ఉపాయం

 

 

ఒక ఊరిలో కుమార్ అనే పిల్లవాడు ఉండేవాడు. కుమార్ ఆరవ తరగతి చదువుతున్నాడు- అతను ఒక మోస్తరు విద్యార్థి. శ్రమ పడితే చదువు బానే వస్తుంది; కానీ అట్లా శ్రమపడటం అంటే అతనికి ఏమంత ఇష్టం ఉండేది కాదు. "ప్రొద్దున్నే లేచి చదువుకోరా, చదువు బాగా వంటపడుతుంది' అని వాళ్ల నాన్న ఎంత చెప్పినా కుమార్ వినేవాడు కాదు. అసలు సంగతేంటంటే వాడికి నిద్రపోవటం చాలా ఇష్టం. రాత్రి త్వరగా పడుకునేవాడు; అయినా ఉదయం ఆలస్యంగానే నిద్ర లేచేవాడు. సమయం దగ్గర పడగానే గబగబా లేచి, త్వరత్వరగా తయారయ్యి, బడికి పరుగు తీసేవాడు.

అట్లా చాలా సార్లు జరిగాక, ఒక రోజున వాళ్ల నాన్నగారు ఆలోచించారు- "వీడు ప్రొద్దున్నే త్వరగా లేవాలంటే ఏమి చేయాలి?" అని. ఆయనకో అద్భుతమైన ఉపాయం తట్టింది. ఆయన వెంటనే పట్టణానికి వెళ్లి, ఒక కెమెరా కొనుక్కొచ్చారు. దాన్ని కుమార్‌కి ఇచ్చి "ఒరేయ్ కుమార్! చలికాలం వస్తున్నది కదా, మన ఊరి నుండి లెక్కలేనన్ని పక్షులు కొల్లేరుకు వలస వెళ్తున్నాయట. వాటిలో కొన్ని అరుదైన పక్షులు కూడా ఉంటాయి. అట్లాంటి అరుదైన పక్షుల ఫొటోలకోసం దినపత్రికల వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలిసింది.

 

మనం ఫొటో తీసిన పిట్ట రకాన్ని బట్టి వాళ్ళు వెయ్యి రూపాయల వరకూ ఇవ్వవచ్చు. అంతే కాక ప్రశంసా పత్రం, ఆ ఫోటోలు తీసిన వ్యక్తి గురించి దిన పత్రికలో ఓ చిన్న సమాచారం కూడా వేస్తారట. అయితే పక్షులన్నీ కనబడేది తెల్లవారు జాముననే కదా, అందుకని మనం రేపు ఉదయాన్నే 5:30కి లేచి మేడ మీద కూర్చొని ఆ పక్షుల ఫోటోలు తీద్దాం" అని చెప్పారు. దినపత్రికలలో తన గురించి వేయటం, నగదు-ప్రశంసా పత్రం- ఇట్లాంటి మాటలు వినగానే కుమార్‌కు ఆశ పుట్టింది. మరుసటి రోజునుండి ఉదయం 5:30 కల్లా నిద్రలేచి, మేడపైకి వెళ్లి, పక్షుల కోసం ఎదురు చూడసాగాడు. అక్కడ వాడికి రకరకాల పక్షులు కనిపించేవి. చిలకలు, పిచ్చుకలు, కొంగలు- ఒక్కోసారి ఏవో వింత పిట్టలు కూడాను. అయితే వాడు ఫొటో తీద్దామనుకునేసరికి అవి ఎగిరిపోయేవి.

అంతలోనే వాడికి సలీం అలీ రాసిన పక్షుల పుస్తకం ఒకటి బహుమతిగా ఇచ్చాడు వాళ్ల నాన్న . "దీన్ని చూస్తే పక్షుల్ని గుర్తు పట్టటం సులభం" అని. బయట పక్షుల్ని చూడటం, తర్వాత వాటి గురించి పుస్తకంలో చదవటం- అప్పుడప్పుడూ వాటిని ఫొటోలు తీయటం, తనూ సలీ అలీ అయిపోయినట్లు కలలు కనటం- ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. చూస్తూ చూస్తూండగానే చలికాలం వచ్చేసింది. ఇప్పుడింక పక్షులు ఏమన్ని కానరాలేదు. "ఇంక వలస పక్షుల కోసం చూడనక్కర్లేదు- సమయం వృథా" అనుకున్నాడు కుమార్.

ఉదయాన్నే లేవకుండా మళ్లీ తనపాత పద్ధతిలోకి మారిపోవాలనుకున్నాడు. కానీ ఎందుకనో, అది ఇక వీలు కాలేదు! ఉదయాన్నే లేవడం అలవాటు అయిపో-యినట్లుంది- ప్రతిరోజూ అయిదున్నరకు మెలకువ వచ్చేసేది! మెల్లగా వాడు ప్రొద్దున్నే చదువుకోవటం మొదలెట్టాడు. విషయాలు కూడా వాడికిప్పుడు ఇంతకు ముందుకంటే బాగా అర్థమౌతున్నాయి! తన పథకం ఫలించినందుకు కుమార్ వాళ్ల నాన్న ఎంతో సంతోషించాడు.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో