TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తులసి
రంగన్నది పేద కుటుంబం. వాళ్ళ నాన్న చెడు అలవాట్లకు బానిసై, ఇల్లంతా గుల్ల చేసి, చివరికి చనిపోయాడు. అమ్మ ఒక్కతే పిల్లల్ని నలుగురినీ పెంచలేక తంటాలు పడసాగింది. ఇంట్లో రంగన్నే పెద్ద పిల్లవాడు. దాంతో వాడే ఇంటి బాధ్యతంతా నెత్తిన వేసుకున్నాడు. కూలికి పోయాడు; చదువుకు స్వస్తి చెప్పాడు. చెల్లెలినీ, తమ్ముళ్ళిద్దర్నీ చదివించాడు. ఆలోగా వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది.
తమ్ముళ్లిద్దరూ అన్న చదివించిన చదువు సహాయంతో మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. రంగన్నే ఇద్దరు తమ్ముళ్ళకూ పెళ్ళి చేశాడు. పెళ్ళి అవ్వగానే వాళ్ళిద్దరూ వేరుపడ్డారు. ఎవరికి వాళ్ళు సుఖంగా బ్రతకటం మొదలు పెట్టారు. చెల్లెలి చదువు పూర్తయిందిగానీ, ఆ సరికి ఇక రంగన్న దగ్గర ఏమీ లేకుండా అయ్యింది. రంగన్నే ఆ పిల్లకు ఏదో ఉద్యోగం తెప్పించి, తగిన కుర్రాడిని చూసి పెళ్ళి చేసాడు.
తర్వాత రంగన్నను ఇంక ఎవరూ పట్టించుకోలేదు. రంగన్న కూలి పని ఆపి, గుజిరి వ్యాపారం (పాత సామాన్లు అమ్మే వ్యాపారం) లోకి దిగాడు. పనిలో పరిచయమైన సరోజను పెళ్ళి చేసుకున్నాడు. సరోజకూ వేరే ఎవ్వరూ లేరు. భార్యాభర్తలిద్దరూ కలిసి వ్యాపారాన్ని నడిపిస్తూ వచ్చారు. కొద్ది రోజులకు వాళ్ళకో కూతురు పుట్టింది, అమ్మాయికి తులసి అని పేరు పెట్టారు.
ఊహ తెలిసిన నాటినుండి తులసి తల్లి దండ్రులకు సహాయంగా ఉండేది. బడి ముగిసిన తరువాత ఆ పాప కూడా గుజిరి అంగడి దగ్గరే గడిపేది. అక్కడంతా కూర్చొని పాత పుస్తకాలు, పేపర్లు చదువుతూ వచ్చింది. గుజరీ దుకాణం ద్వారానే ఆ పాపకు విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు అనేకం పరిచయమైనాయి. గొప్ప గొప్ప వాళ్ల జీవిత చరిత్రలు దొరికాయి; రకరకాల కథలు, నవలలు, సాంఘిక శాస్త్ర గ్రంధాలు అందాయి.
అలా ఆ పాపకు చక్కని సామాజిక దృష్టి ఒకటి ఏర్పడింది.
గుజరీ దుకాణం పుణ్యాన తులసి రకరకాల విషయాలు తెలుసుకొన్నది; ఉద్యమాలలో పాలు పంచుకున్నది; పోటీ పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది; మంచి ఉద్యోగం కూడా తెచ్చుకున్నది. రంగన్న శ్రమ జీవన సౌందర్యాన్ని, తులసి తెలివితేటలను, పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. శ్రమించేందుకు భయపడని రంగన్న, సమస్యలను జ్ఞాన సముపార్జనకు సాధనాలుగా మార్చుకున్న తులసి అనేకమందికి స్ఫూర్తి నిచ్చారు.
అటు తర్వాత రంగన్న తమ్ముళ్ళు, చెల్లెలు అందరూ మళ్ళీ కలిసారు. రంగన్న వాళ్లను, వాళ్ళ పిల్లల్ని ఎప్పటి మాదిరే ఆదరించాడు.
కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో