TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అక్కా చెల్లెళ్ళు
అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి పెళ్లి అయింది; ఇద్దరు కూతుర్లు కూడా పుట్టారు; కానీ కొన్ని సంవత్సరాల తరువాత రాణీగారు చనిపోయారు. అప్పటినుండీ ఇద్దరు పిల్లల బాధ్యతా రాజుగారి మీదే పడింది. పిల్లలిద్దరూ చాలా మంచివాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్లకి అమ్మ లేదు కదా, అందుకని వాళ్ళకు పనుల్లో సాయం చేయటం కోసం మంగళ అనే ఆమెను తెచ్చి పెట్టారు రాజుగారు. మంగళ కూడా వాళ్ళతోబాటే ఉండేది, వాళ్ల ఇంట్లోనే. అయితే కొన్ని రోజులు అయ్యాక ఆమె కాస్తా రాజుగారి మీద మనసు పడ్డది. ఎలాగైనా రాజుగారిని పెళ్లి చేసుకొని, ఈ ఇద్దరు పిల్లల్ని ఇంటి నుండి వెళ్లగొట్టాలని కంకణం కట్టుకున్నది.
ఒకరోజున పిల్లలు ఇద్దరూ పొయ్యి మీద అన్నం పెట్టి, బయటకు వెళ్లి ఆడుకొంటున్నారు. మంగళ వచ్చి "నాకు బట్టలు తోమడానికి బొగ్గులు కావాలి- కొన్ని బొగ్గులు తెచ్చిపెట్టండి" అని అడిగింది. "సరేలే ఎందుకో అడుగుతోంది" అని పిల్లలు బొగ్గులు ఏరుకొచ్చి ఇచ్చారు. మంగళ ఆ బొగ్గుల్ని చాటలో ఎత్తుకెళ్ళి నేరుగా అన్నంలో వేసేసి, ఏమీ తెలియని నంగనాచిలా వెళ్లిపోయింది. ఆరోజున రాజు వచ్చి భోజనానికి కూర్చుంటే, పిల్లలు బొగ్గులు వేసిన అన్నం వడ్డింఛారు. "ఏమిటమ్మా ఇవి?" అడిగాడు రాజుగారు."ఏమో నాన్నా! మాకు తెలీదు" అన్నారు పిల్లలు.
రాజుగారికి చాలా కోపం వచ్చింది. "మంగళను పిలవండి" అని అరిచాడు. మంగళ వచ్చింది. ఇదేంటి, అన్నంలోకి బొగ్గులు వేస్తారా, ఎవరైనా?" అరిచాడు రాజుగారు. "నాకేం తెలుసు? మీ పిల్లల్నే అడగండి. నేను ఒద్దంటున్నా వాళ్ళే, బొగ్గులు ఎత్తెత్తి వేశారు అన్నంలో. కావాలంటే వాళ్ళ చేతులు, గోళ్ళు చూడండి. నల్లగా ఉండకపోతే అప్పుడు అడగండి నన్ను" అన్నది మంగళ గట్టిగా. రాజుగారు చూస్తే పిల్లలిద్దరి గోళ్ళూ నల్లగా ఉన్నాయి. "మాకేం తెలీదు- మంగళ బొగ్గులు తెమ్మంటే తెచ్చాం, అంతే" అన్నారు పిల్లలు. కానీ రాజుగారు నమ్మలేదు.
"పనిచేసి ఆకలితో ఇంటికొస్తే ఇట్లా చేస్తారా? ముందసలు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీ ముఖం నాకు చూపించకండి" అని పిల్లలిద్దర్నీ గట్టిగా తిట్టారు. అన్నం కంచం ముందునుండి గబగబా లేచి వెళ్ళిపోయారు. పిల్లలిద్దరూ ఏడుస్తూ గదిలో కూర్చుంటే మంగళ వచ్చి- "విన్నారుగా, మీ నాన్న చెప్పినా మీకు సిగ్గులేదా? పోండి. మీ ముఖం అసలు మాకు చూపించనే చూపించవద్దండి" అని ఇంట్లోంచి గెంటేసింది. పిల్లలు ఏడ్చుకుంటూ అడవిలో పడి పోతూ ఉంటే తోక రాక్షసుడు ఒకడు ఎదురయ్యాడు. "ఎందుకు, ఏడుస్తు-న్నారు?" అని అడిగి, సంగతంతా తెలుసుకున్నాడు.
అసలు సంగతేంటంటే వాడికి పిల్లలిద్దరినీ చూసేసరికి నోరు ఊరింది. "నా వెంట రండి. ఇక్కడ ఊరవతలే నాకో భవంతి కూడా ఉంది. అందులో సలిపిండి (చలిమిడి) చేసుకునే సామానూ చాలా ఉంది" అని వాడు వాళ్ళిద్దరినీ భవంతిలోకి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక, వాళ్ళిద్దరినీ లోపలే పెట్టేసి, బయటినుండి తాళాలు వేసుకొని వెళ్ళిపోయాడు! వాడి అసలు ఉద్దేశం పిల్లలకు తెలీదు కద- అందుకని కొంచెం సేపు అక్కడే ఆడుకుంటూ కూర్చున్నారు. తర్వాత వాళ్లకు ఆకలైంది. వెతికి చూస్తే భవంతిలో సలిపిండి చేసుకునే సామాను అసలు ఒక్కటీ లేదు. అన్నీ ఏవేవో ఎండబెట్టిన జంతువుల మాంసాలూ, సారాయిలూ ఉన్నాయి గదుల నిండా!
దాంతో పిల్లలిద్దరికీ అర్థం అయ్యింది- 'వీడు ఎవరో మంచివాడు కాదు' అని, వాడు వచ్చేసరికి జాగ్రత్తగా ఒక మూలన నక్కి కూర్చున్నారు. ఆరోజు రాత్రి రాక్షసుడు వచ్చీ రాగానే "ఎక్కడున్నారు పిల్లలు?!" అని చూసి, "నిద్రపోతున్నారులే" అని అన్నంతినేసి వెళ్ళి పడుకున్నాడు. అప్పుడు అక్క-చెల్లి ఇద్దరూ మెల్లగా లేచి వెళ్ళి, ఆ రాక్షసుడి తోకకు పరుపులు, దుప్పట్లూ అన్నీ చుట్టి కట్టేసి, నూనె పోసి అగ్గి ముట్టించి, ఆ గదిలోంచి గబగబా బయటికి పరుగెత్తి గొళ్ళెం వేసేసారు.
రాక్షసుడు లేచి చూసుకునేసరికి వాడి పరుపు, తోక అన్నీ అంటుకొని ఉన్నాయి! దాంతో వాడు గట్టిగా అరుస్తూ పారిపోదామని చూశాడు. కానీ బయటినుండి గొళ్ళెం వేసి ఉంది కదా, ఏమీ చేయలేక చివరికి వాడు కాస్తా మాడి మసైపోయాడు. తెల్లవారాక అక్క-చెల్లి ఇద్దరే ధైర్యంగా పోయి వాడిని లాక్కెళ్ళి భవంతిలోనే బూంచి పెట్టారు. ఇంక ఆ రోజునుండీ వాళ్ళిద్దరే ఆ భవంతిలో ఉంటూ, అక్కడి తోటలో కొంచెం కూరగాయలు, ఆకుకూరలు, రాగులు అన్నీ పండించుకొని తింటూ హాయిగా ఉన్నారు.
అక్కడ రాక్షసుడి దగ్గర, ముందుగానే చాలా ఆవులు గేదెలు ఉండినై; ఇప్పుడు అక్క-చెల్లెళ్లకు అవి బాగా దగ్గరైనాయి. చెల్లెలేమో రోజూ ఆవుల్ని గేదెల్ని మేపేందుకు వెళ్లేది. అక్క ఇంట్లో పని చూసుకునేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇంక అక్కడ, వాళ్ల రాజ్యంలో, రాజుగారు ప్రొద్దునే లేచి 'పిల్లోల్లు ఏరి?' అని చూస్తే ఎక్కడా లేనే లేరు!
"వీళ్ళెక్కడికి పోయారు?" అని మంగళనడిగితే "నాకేం తెలీదు" అన్నది. రాజుగారు పిల్లలిద్దరికోసం రాజ్యమంతా వెతికించాడు గానీ, ఎవ్వరికీ వీళ్ళున్న భవంతి కనబడనే లేదు. దాంతో రాజుగారు చాలా బాధపడ్డాడు. "బాధపడకు, నీకేమీ పర్వాలేదు" అని చెప్పి, మంగళ మెల్లగా రాజును మంచి చేసుకున్నది. కొంతకాలానికి రాజుకు కూడా మంగళ మీద ప్రేమ కలిగింది. "ఈమె చాలా మంచిదిలాగున్నది. ఇంక ఈమెని పెళ్ళి చేసుకుంటాను" అనుకున్నాడు రాజుగారు. పిల్లలిద్దరూ రోజూ హాయిగా పనులన్నీ చేసుకొని, బాగా వండుకొని తింటున్నారు కదా, ఇద్దరూ బాగా పెద్దయినారు; యుక్తవయసు వచ్చింది. ఇద్దరూ దేముడికి రోజూ మొక్కుకుంటున్నారు.
అక్కడ రాజు మంగళను పెళ్ళి చేసుకోవాలని అనుకోగానే, ఇక్కడ దేముడు అతని కళ్ళు తెరిపించాలనుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి ప్రక్క ఊరి రాజకుమారుడు అటుగా వెళుతున్నాడు. అతనికి ఈ భవనం కనిపించింది; బాగా దాహంకూడా వేసింది. "ఇక్కడ ఎవరో ఉంటారు. నాకు నీళ్ళు దొరుకుతాయి" అని అతను ఇంటి తలుపు తట్టాడు. ఆ సమయానికి చెల్లె అక్కడ లేదు. అక్క ఒక్కతే ఉండింది. రాజకుమారుడు ఆమెని చూసి "మాది ప్రక్క ఊరే! దారిలో పోతాఉంటే దాహం అయ్యింది. నీళ్ళు ఇవ్వు" అని అడిగాడు.
అక్క నీళ్ళు తెచ్చి ఇచ్చింది. "నువ్వెవరు, ఇక్కడెందుకు ఉన్నావు ఒంటరిగా?" అని అడిగాడు రాజకుమారుడు. ఆమెను చూడగానే రాజ కుమారుడికి ఆమెను పెళ్ళి చేసుకోవాలని అనిపించింది. "నేను ఒంటరిగా ఉండను. ఇక్కడ మా చెల్లి కూడా ఉంటుంది. మేం ఇద్దరమూ ఇట్లా పలానా రాజుగారి పిల్లలం.." అని వాళ్ల కథంతా చెప్పింది అక్క.
"సరే అయితే, మరి నన్ను పెళ్ళి చేసుకుంటావా, నాతో మా దేశానికి రావచ్చు?!" అన్నాడు రాజకుమారుడు.
"మా చెల్లెని కూడా తీసుకెళ్దాం" అన్నది అక్క. అయితే వాళ్ళు మూడు రోజులు ఎదురు చూసినా, చెల్లి మటుకు ఇంటికి రానే లేదు! రాజకుమారుడేమో "మనం వెళ్దాం- మీ చెల్లె కోసం మళ్ళీ రావచ్చులే" అని బలవంత పెడుతూనే ఉన్నాడు. చివరికి అక్క "సరే" అని అతనితోబాటు బయలుదేరింది. అయితే తను బయలుదేరే రోజున చాలా పూలు కోసుకొచ్చి, తను వెళ్ళే దారిలో అంతా ఆ పూలరేకులు చల్లుకుంటూ పోయింది- 'చెల్లెలు వచ్చి చూసుకుంటుంది కదా' అని.
చెల్లెలు ఆవుల్ని, ఎనుగొడ్లను వెంటబెట్టుకొని మరుసటి రోజే ఇంటికి వచ్చింది. 'అక్క లేదే' అనుకున్నది. కొంచెం సేపు వెతికాక, పూల దారిని కనుక్కున్నది- ఆ దారివెంట నడవటం మొదలు పెట్టింది. అయితే కొంత దూరం పోయాక, పూలబాట ఆగిపోయింది! పూల రెక్కలన్నీ గాలికి చెల్లా చెదరైపోయి ఉన్నాయి! చెల్లెలు ఏదో ఒక దారిని పట్టుకొని పోయింది. పోగా పోగా చివరికి వాళ్ల నాన్న రాజ్యమే ఎదురైంది!
ఆ సరికే రాజుగారు మంగళను పెళ్ళి చేసుకోబోతున్నాడు. రాజ్యంలో ఎవ్వరికీ మంగళ అంటే ఇష్టం లేకుండింది. ఇప్పుడు చెల్లెల్ని చూడగానే ప్రజలంతా "ఈమే మా యువరాణి" అని ఆమెను ఊరేగింపుగా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆమెను చూడగానే కళ్ల నీళ్ళు పెట్టుకున్నాడు రాజుగారు. "అక్కేది? మీరు నన్ను వదిలి ఎందుకు వెళ్ళారు అసలు?" అని అడిగాడు. వాళ్ల మాటల్లో మంగళ మోసం కాస్తా బయట పడ్డది. రాజుగారు మంగళను దేశంలోంచి బహిష్కరించారు.
"పద, పద అక్కను పిల్చుకొద్దాం" అంటుండగానే, అక్క- ఆమెను పెళ్ళి చేసుకున్న యువరాజు అక్కడికి వచ్చారు. అప్పటి నుండి అందరూ కలిసి సంతోషంగా జీవించారు!
కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో