TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తెలుగువన్-అక్షరయాన్ సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కథల పోటీలో తృతీయ బహుమతి రూ. 1,116 పొందిన కథ
"సుగుణా ఏం ఆలోచించావ్?"
"కాస్త టైమ్ కావాలి ధీరజ్."
"సరే ... నువ్వు చైత్ర పుట్టిన రోజు నాటికి నీ ఒపీనియన్ చెప్పు .... నేను చాలా ఏర్పాట్లు చేసుకోవాలి ... సరిగ్గా పదిరోజులు టైమ్ ఉంది.. ఆలోచించు... అది నీకు, నాకు కూడా మంచిది... మనం చైత్రని అపురూపం గా చూసుకోవలసిన అవసరం ఉంది... దానికోసం, మనకోసం కూడా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. అంతేకాదు నేను ఒక భాద్యత గల పౌరుడిని కూడా. నీకు నా గురుంచి తెలుసుగా... నీకు సామాజిక భాద్యత కూడా ఎక్కువే అని.. అది నచ్చే నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావ్ కదా.. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది.. కాస్తా మనస్సు పెట్టి ఆలోచించు."
"అలాగే ధీరజ్" అంది ముభావంగా సుగుణ.
"హాపీ బర్త్ డే చైత్రా"
"థాంక్యూ అమ్మా"
"పుట్టిన రోజు శుభాకా౦క్షలు తల్లీ.. ఇక లే.. స్నానం చెయ్యాలి , కొత్తబట్టలు వేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, అక్కడ నుంచి మీ స్కూల్ కి వెళ్ళాలి. అక్కడ మీ నేస్తాలుంటారు, అందరికీ స్వీట్స్ ఇవ్వాలి. సాయంత్రం పార్టీకి మీ నేస్తాలను పిలవాలి. మా నేస్తాలని కూడా. అయ్యబాబోయ్ చాలా పనులున్నాయ్. నువ్వు తొందరగా లే తల్లీ" అంటూ మురెపంగా నుదుటి మీద ఒక ముద్దు ఇచ్చి మంచం దిగాడు ధీరజ్.
"నాన్నా నీ నేస్తాలు ని కూడా పిలుస్తావా!"
"యెస్"
"అదేంటి ఎప్పుడూ పిలవవు కదా.. ఈ సారి ఎందుకు?" అని అడిగింది అయిదో క్లాస్ చదువుతున్న చైత్ర.
"నా నేస్తాలే కాదు, అమ్మ నేస్తాలు కూడా."
"అదే ఎందుకు అంటున్నా"
"ఈ మహారాణి పుట్టిన తరువాత మమ్మల్ని మర్చిపోయావ్ నువ్వు అని, మా స్నేహితులు, అమ్మ స్నేహితులు కూడా అడుగుతున్నారు...అందుకే పిలుస్తున్నా."
"ఓ అదా సంగతి.. అయినా నాకు ఈ పుట్టిన రోజు నచ్చలేదు నాన్నా."
"ఏం ఎందుకని?"
"నానమ్మ లేదుగా.. ఉంటే ఎంచక్కా... ఈ పాటికి నేను నానమ్మ గుడికి వెళ్ళి వచ్చేసేవాళ్లం."
"అవును కదా.. ఏం చేస్తాం.. దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది నానమ్మ."
"అయితే నేను ఒక్కసారి దేవుడి దగ్గరకి వెళ్ళి నానమ్మని చూసి రానా! నానమ్మ కాళ్ళకి దండం పెట్టి చాక్లెట్ నోట్లో పెట్టి వచ్చేస్తా." అన్నది చైత్ర.
"నోర్మూసుకో ....మొదల పెట్టింది నానమ్మ పురాణం ... ఇక మంచం మీద నుంచి లేవండి... పుట్టిన రోజు పూట అపశకునం మాటలు మీరు." అని కోపంగా అంది సుగుణ.
"అబ్బా ఎందుకు సుగుణ అంత కోపం .. ఏదో చిన్నపిల్ల." అని వెనకేసుకొచ్చాడు ధీరజ్.
"ఏంటి చిన్నపిల్ల... మీరు, మీ మాటలు." అని కసిరింది సుగుణ.
"అంతరార్థం అర్థమైందిలే సఖీ.. మరి నా ఏర్పాట్లు నేను చేసుకోవచ్చా... నువ్వు సిగ్నల్ ఇచ్చినట్టేనా" అన్నాడు ధీరజ్ ఓరకంట సుగుణని చూస్తూ.
"ఏది చేసినా మన చైత్ర గురుంచే కదా... ఉన్న ఒక్క గా నొక్క బిడ్డ ఆనందగా, సంతోషంగా ఉండాలి .. నాకెలాంటి ఇబ్బంది లేదు.. కాని మనతో కలుస్తుందో, లేదో. చిన్న బెంగ ఉంది." అంది సుగుణ.
"నీ మనసు నాకు తెలుసు. అది నాకు వదిలేయ్, నేను చూసుకుంటా కదా, ఐ లైక్ ఇట్ డియర్" అంటూ బుగ్గ గిల్లి.. "హమ్మయ్య, ఇప్పుడు నాకు కాస్త ప్రశాంతం గా ఉంది." అంటూ స్నానానికి బయల్దేరాడు ధీరజ్. 'సుగుణ తొందరగానే ఒప్పుకుంది.. అల్లరి చేస్తుందేమో అనుకున్నా.. నాట్ బేడ్..' అనుకుంటూ బాత్ రూంలో కమోడ్ మూత వేసి దాని మీద కూర్చొని ఒక్కసారి గతంలోకి తొంగి చూశాడు ధీరజ్
లాస్ట్ ఇయర్ చైత్ర పుట్టినరోజు కి రెండు రోజుల ముందు....
"ఒరే ధీరు, మన వంశంలో ఆడపిల్ల అనగానే వడ్ల గింజ వేసి చంపేస్తుంటారుట. అందుకే ఎక్కువ మగ సంతానమే. అబ్బాయి కావాలంటే మా దగ్గరకి రండి.. అని మీముత్తాతలు సవాలు విసిరేవారట.. ఆ దేవుడికి కోపం వచ్చినట్టుంది, మా ముందర తరంలో గాని, మాతరంలో గాని ఆడపిల్లలే లేకపోయే. ఇకపోతే మా తాత కూడా మూర్ఖుడే.. నేను కడుపులోనుంచి బయటకు రాగానే ఆడపిల్ల అని చెప్పగానే, వడ్ల గింజ వేసేశారట.. కానీ మా అమ్మమ్మ సాయంతో, మా అమ్మ దయవల్ల అలా వడ్ల గింజకి కూడా చావకుండా బతికి బట్ట కట్టాను నేను. కానీ ఆడపిల్ల అనగానే ఎందుకో అసలు మనిషిలాగానే చూడరు ఎందుకో ? .. నాకు చాలా సార్లు చనిపోవాలని కూడా అనిపించేది. కానీ మా అమ్మ ఉంది చూసావు ... తను మాత్రం నన్ను చూసి మురిసిపోయేది. నువ్వు చచ్చిపోతే ఎలా రాముడూ..! నువ్వు బతికితే, ఒక తరం బతికినట్టే అనేది. ఆడపిల్ల ఇంటికి ఎంత అందమో, ఏమీ ఆశించకుండా ఈ ఆడపిల్ల.. ప్రేమని , అనురాగాన్ని పంచి, పెళ్లి అనే అపురూపమైన బంధాన్ని కలిపి ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తుంది. ఇది తెలుసుకోవడానికి మీ మగాళ్ల జీవితాలు సరిపోవురా.. ఒక ఆడపిల్ల ఆడపిల్లయి ఒక వంశాన్ని వృద్ది చేస్తుంది, ఈ ఆడపిల్లని అపురూపంగా మహారాణిలా పెంచాలిరా.. అమ్మ నాన్న దగ్గర మాత్రమే ఆ మహారాణి మురిపాలు, ముద్దులు. మెట్టినింట అన్నీ భాద్యతలు, బరువులే... అయినా, ఆనందంగా భరించే శక్తి ఆడపిల్లకి మాత్రమే సొంతం.. భర్త కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి, ప్రేమించే గుణం ఒక్క ఆడపిల్లకి మాత్రమే చేతనవుతుంది తెలుసా.. ఒరే ధీరు.. ఈ మహారాణిని అపురూపంగా చూసుకోరా.. నీ దగ్గరున్నంత వరకు గుండెల్లో పెట్టుకుని చూసుకో.. పాపాయి చేసే ప్రతి అల్లరి నీకు ఏదో ఒకటి నేర్పించి తీరుతుంది. నీకున్నంతలో ఏ లోటు లేకుండా చూసుకో ధీరు.. ఒకవేళ ఏ లోటున్నా భర్తీ చేసెయ్యరా సాధ్యమైతే.. భవిష్యత్తు అందంగా ఆలోచించి తీర్చిదిద్దరా.. నీకు అమ్మవుతుంది, తోడవుతుంది.. నీకు హద్దులు లేని ప్రేమని కురిపిస్తుంది... ప్రతి ఒక్కడికి ఒక కూతురుండి తీరాలిరా.. అప్పుడు మాత్రమే ఒక అమ్మ విలువ తెలుస్తుంది." అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
మరో రెండు రోజుల తరువాత...
ఆ రోజు సాయంత్రం చైత్రని.. స్కిన్ ఎలర్జీ వచ్చిందని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లింది అమ్మ... తిరిగి వస్తున్న ఆటోని ఒక లారీ బలంగా గుద్దెయటంతో అమ్మ అక్కడికక్కడే చనిపోయింది.. చైత్ర చిన్న చిన్న దెబ్బలతో బతికింది.. ఆ రోజు తన జీవితంలో మర్చిపోలేని రోజు.. ఏక్సిడెంట్ లో అమ్మ పోయింది.. కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టైంది. చైత్ర అంటే అమ్మకి చాల ఇష్టం. చైత్ర పుట్టిన తరువాతే అమ్మ తమ వూరు నుంచి వచ్చి తన దగ్గరకి వచ్చి ఉంది. అమ్మ ప్రపంచమే చైత్ర అయిపోయింది. చైత్రని విడిచి ఒక్క క్షణం ఉండదు. దాని పుట్టిన రోజు ప్రతిసంవత్సరం పండగలా చెయ్యాలి. లేకపోతే అసలు ఒప్పుకునేది కాదు.
ఒక్కోసారి సుగుణ ఉడుక్కునేది... 'అత్తయ్యను చూడండి నా కూతుర్ని తన వశం చేసేసుకుంది' అని.. కానీ 'అది తప్పు... నా కూతురే అమ్మని వశం చేసుకుంది' అనేవాడు. ఇలా, సుగుణ ఆరోపణ చేసిన ప్రతీసారి, 'అమ్మ ఉండబట్టే టెన్షన్ లేకుండా ఉద్యోగం చేసుకుంటున్నావ్ .. లేకపోతే చిన్నపిల్లని .. ఆడపిల్లని చూసుకోవాలంటే ఎంత కష్టమో నీకు తెలీదు' అనేవాడు తను.
అందులో కూడా నిజం ఉండడంతో.. సుగుణ కిమ్మనేది కాదు.. నాన్న తన చిన్నప్పుడు పోవడంతో అమ్మ... తనను అల్లారుముద్దుగా పెంచింది... ఒక బ్యాంక్ ఉద్యోగిని చేసింది.. తన ఇష్టప్రకారమే ఒక పేదింటి పిల్లని.. బ్యాంక్ ఉద్యోగిని తను ఇష్టపడ్డానని పెళ్లి చేసింది. సుగుణని కూడా ఊరు వెళ్లినప్పుడు అమ్మ కూతురులాగానే చూసుకుంటుంది అని సుగుణ చాలా సార్లు తనకు చెప్పింది.
నానమ్మ మీద బెంగతో చైత్ర ఇంకా తేరుకోలేదు.. చాలా రోజులు తమతో మాట్లాడేది కాదు. నానమ్మ కావాలని అల్లరి చేసేది. అమ్మ ఉన్నప్పుడున్న కలివిడితనం మళ్ళీ చూస్తానో లేదో చైత్రలో అని తనకు బెంగగా ఉండేది ....
"చైత్ర మనతో బాగా ఉండటం లేదు ధీరు.. మామూలు మనిషి ఎప్పుడవుతుందో.." అని సుగుణ కూడా బాద పడేది. చైత్రని ఎలా చూసుకోవాలో అని.. అమ్మ చెప్పిన మాటలు తన చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి.. చైత్రని చూసినప్పుడల్లా అమ్మ తన కళ్ళముందున్నట్టే అనిపిస్తుంది ... అమ్మ చెప్పింది నిజం. ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి, ఆడపిల్లలో అమ్మ కనపడుతుంది" అని ఒకసారి మనసులో అమ్మని తలచుకున్నాడు ధీరజ్. ఇంతలో, "ఏంటండీ.. .బాత్రూమ్ లో ఉండిపోయారు.." అంటూ సుగుణ పిలిచిన పిలుపుకి స్నానం పూర్తి చేసి బయటకు వచ్చాడు.
వస్తూనే... "సుగుణ కాటరింగ్‌కు ఆర్డర్ ఇచ్చేశాను. ఇల్లు అలంకరించడానికి వస్తున్నాడు... కాస్త దగ్గర ఉండి చూసుకో.. మా ఆఫీసు నుంచి వచ్చిన వారికి బహుమతులు ఆ రూంలో ఉన్నాయి.. ఆ ... చైత్రని రెడీ చేసేస్తే గుడికి వెళ్ళి .. స్కూల్ లో పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చి, మరో సారి చైత్ర స్కూల్ టీచర్స్ ని ఆహ్వానించి వచ్చేస్తా.. అన్నట్టు మీ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పావా లేదా... చూడు చూడు ఎవర్ని మరచిపోయినా ... దండయాత్రకు వచ్చేస్తారు నీ హితులు." అని ఆట పట్టించాడు ధీరజ్ . "అన్నట్టు పంతులుగారిని సాయంత్రం నాలుగయ్యేసరికి ఉండమని ఫోన్ చెయ్." ... అంటూ రెడీగా ఉన్న కూతుర్ని వెంట బెట్టుకుని గుడికి బయలుదేరాడు ధీరజ్.
**
సాయంత్రం నాలుగు గంటల సమయం ....
ధీరజ్ ఇంట్లో సందడి. ఇంటి గుమ్మాలకి పూలతో, మావిడి తోరణాలతో అందమైన అలంకరణ, బంధువులు, స్నేహితుల పలకరింపులు, ఇరుగు పొరుగు అమ్మలక్కల మూతివిరుపులు, పవిత్ర మైన వేదమంత్రాల ఉచ్ఛారణ మద్య “రావోయి అతిధి” కార్యక్రమం సందడి సందడి గా మొదలైంది ....
చిత్రం కదా అని విచిత్రంగా చూస్తూ .....సమాధానం ఎవరు ఏ విధంగా చెబుతారో అని ఒకరి ముఖాలలో ఒకరు ప్రశ్నలు – సమాధానాలు వెతుక్కుంటున్నారు అతిథులు..
వీటిని భంగపరుస్తూ ధీరజ్ స్నేహితుడు కిరీటి అక్కడకి వచ్చాడు .. "నోరెళ్ళ బెట్టుకుని చూస్తున్నారేంటి ఆసీనులవ్వండి." అంటూ అందర్నీ ఉద్దేశించి చెప్పడంతో అక్కడ జరిగిన తంతు కళ్లార్పకుండా కూర్చొని చూస్తున్నారు. ఇంతలో ఒకామె .. వయస్సు సుమారు యాభై -అరవై మధ్యలో .. లేత ఆకుపచ్చ చీరతో కాస్త పొట్టిగా తెల్లగా కాస్త బక్కగా ఉన్న ఆమెని చైత్ర తీసుకుని వచ్చి ధీరజ్, సుగుణ పక్కనే కూర్చోబెట్టింది.. ఆమె మెడ చుట్టూ చేతులు వేసి "నానమ్మా" అంటూ చైత్ర గారాలు పోతోంది.
"ఆమెని.. సుగుణ ధీరజ్ లు దత్తత తీసుకుంటున్నారట" అన్నారు ఎవరో మెల్లిగా.....
"ద....త్త......త...... అదేంటి పిల్లలని దత్తత తీసుకున్న పెద్దవాళ్లని చూశాం గాని, పెద్దలని దత్తత తీసుకున్న పిల్లలని ఎక్కడా చూడాలేదమ్మా విడ్డూరం కాకపోతే.." అన్నారెవరో. "ఆవిడని ఓల్డేజ్ హోమ్ లో నుంచి తెచ్చి మరీ దత్తత తీసుకుంటున్నారు, దానికేమో “రావోయి అతిధి” అని క్యాప్షన్ ఒకటి, చోద్యంగా లేదు! అదే కదా....అంటున్నా.." అంది ఒకామె. "ఈ రోజుల్లో అమ్మానాన్నలే బరువైపోతున్నారు... ఉన్నవాళ్ళు ఎప్పుడు చనిపోతారా అని ఎదురుచూస్తున్నారు. అయినా సుగుణకి బుద్ది లేదు గాని మొన్నీ మద్య అత్తగారు ఏక్సిడెంట్ లో చనిపోయింది .... హాయిగా ఉండక ఇదేం పని.. మళ్ళీ ఒక ముసలిదాన్ని తెచ్చుకుంటోంది బుర్ర లేకుండా. పుట్టినవాళ్ళు, చావకుండా ఉంటారా ఏమి, మొన్న ఆమె, ఈ రోజు ఇంకొకరు ...పుట్టడం, చావడం కామన్ కదా" అంది ఒకామె. "ఆ.. ఏముంది.. బిల్డప్... కూతుర్ని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి కదా.. ఇద్దరూ ఉద్యోగులాయె... ఒక మనిషి ఉంటే ఎంత ఖర్చు ఈ రోజుల్లో"... అని రకరకాలుగా అనుకుంటున్నారు అక్కడున్నవాళ్ళు. అన్నిటికి తెర దించుతూ.. "అమ్మ దత్తత స్వీకారానికి.. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు"... అంటూ... "ఈమె పేరు సత్యవతి కానీ అతికొద్దికాలంలోనే నా కూతురు చైత్ర రాముడమ్మగా మార్చేసింది.... ఈమె భగవంతుడు నాకిచ్చిన మరో అమ్మ, మా అమ్మ, నా భార్యకి అత్తగారు, నా ముద్దుల కూతురికి నానమ్మ.." అని పరిచయం చేశాడు ధీరజ్. ఆమె హుందాగా తలవంచి అందరికీ నమస్కారం చేసింది. ఆమె కళ్ళల్లో ఉన్న కన్నీటి పొర లీలగా ఆనందాన్నివ్యక్తపరిచింది. వచ్చిన ఆహుతులందరిలో ఎన్నో ప్రశ్నలున్నాయి.. "ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో కాస్తా వివరిస్తావా?" అన్నాడు స్నేహితుడు కిరీటి.
"ఎస్... చెబుతా.. సరిగ్గా అమ్మ చనిపోయి ఎనిమిదినెలలయింది. నా కూతురు ఇంతవరకు మాతో మాట్లాడి౦దే లేదు. ఒక పదిహేను రోజుల నుంచి మునుపటి చైత్ర లా మాట్లాడుతోంది.. ఆ చిన్నారికి నానమ్మ పోయిన తరువాత తేరుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది అన్నమాట అనుకున్నాం.. ఈ మద్య ఒక సంఘటన కూడా జరిగింది. నా కూతురు స్కూల్ కి రాలేదని టీచర్ నుంచి ఫోన్ వచ్చింది. వాకబు చేస్తే నా కూతురు స్కూలుకి దగ్గరలో ఉన్న ఒక ఓల్డేజ్ హోమ్ లో దిగినట్టు రిక్షా వాడు చెప్పాడు. అక్కడకి ఎందుకు వెళ్లి౦దో అర్థం కాలేదు. మరుసటి రోజు కూడా అదే జరిగింది. అదెలా చూసిందో తెలీదు. ఎవరనుకుందో తెలీదు. అక్కడ ఒకామెతో పరిచయం. పిల్లలు ఎక్కువగా పెద్ద వాళ్ళతో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మా అమ్మతో చైత్ర బాగా కనెక్ట్ అయింది. బహుశా అలా కనెక్ట్ అయి ఉంటుంది. మా అమ్మ చనిపోవడం చాలా పెద్ద లోటు చైత్రకి. బహుశా ఆమెలో నానమ్మని చూసి ఉంటుంది చైత్ర.
నేను అప్పటినుంచి కాస్తా దగ్గరగా ఆబ్జెర్వ్ చేసి చూసా.. వారం రోజుల తరువాత మా అమ్మ చీరలన్నీ ఒక సంచిలో పెట్టి తీసుకుని వెళ్ళి ఆమె కిచ్చింది.. మెల్లి మెల్లిగా చైత్రలో మార్పు వస్తోంది.. ఆమె కూడా చైత్ర కాస్త లేట్ అయితే చాలు వాచ్ మెన్ బుర్ర తినేస్తుంది.. ఆమెకి లంచ్ లో పెట్టిన గుత్తి వంకాయ కూర ఓ రోజు దాచి ఉంచి చైత్రకి తినిపించింది.. ఆమెని "నానమ్మ" అని పిలవటం నా చెవులతో నేను విన్నా... 'ఇక్కడెందుకు ఉండిపోయావ్... నాన్న దగ్గరికి వచ్చేస్తే బాగుంటుంది' అని అడిగింది. దానికి సమాధానంగా ఆమె ఏడ్చింది. 'నాకు ఎవరూ లేరు తల్లీ.. నా కోసం రోజు వస్తావా' అని అడిగింది ఆమె. 'ఓ ఎందుకు రాను.. రోజు నేను వస్తా'.. అని ముద్దుగా తల మీద చెయ్యి వేసి చెబుతున్న చైత్రని ముద్దులతో ముంచెత్తింది ఆమె.
ఆ రోజునుంచి నా కూతురిలో పాత చైత్రని చూసా.. మా అమ్మ చనిపోయిన తరువాత చైత్రలో ఇదివరకటి ఉత్తేజం లేక చురుకుగా ఉండేది కాదు.. ఈవిడని కలిసిన తరువాత మునుపటి చైత్రలా మారిపోయింది. హుషారుగా మారిపోయింది. అప్పుడు మా అమ్మ చెప్పిన మాట నాకు గుర్తుకు వచ్చింది. చైత్ర జీవితంలో “ఏదైనా లోటు ఉంటే భర్తీ చేసెయ్యరా......సాద్యమైతే” అనేది మా అమ్మ. పిల్లలు పుట్టకపోయినా, పుట్టిన వాళ్ళు చనిపోయినా దత్తత తీసుకుంటాం.. మరి పెద్దవాళ్లను కోల్పోయాక వాళ్ళని ఎందుకు దత్తత తీసుకొని పెంచుకోకూడదు అన్న ఆలోచన వచ్చింది.. సుగుణతో చర్చించా.. 'పెద్దవాళ్ళ చాదస్తం భరించటం కాస్త కష్టమైన పనే.. కానీ మన అల్లరిని వాళ్ళు భరించినప్పుడు వాళ్ళ చాదస్తాన్ని మనం కూడా భరించాలి. వచ్చినావిడ మనతో సర్దుకుపోతుందో లేదో' అన్న అనుమానం వ్యక్తం చేసింది సుగుణ.. 'మనం ప్రేమిస్తే ఆమె కూడా మనల్ని ప్రేమిస్తుంది. ప్రేమ ఉంటే సర్దుకోవటం పెద్ద కష్టం కాదు' అనుకున్నాం. వెంటనే ఓల్డేజ్ హోమ్ వాళ్ళతో మాట్లాడాం.. వాళ్ళ అంగీకారం, ఆమె అంగీకారం తీసుకున్నాకే ఈ దత్తత కార్యక్రమం ఏర్పాటుకి శ్రీకారం చుట్టా.
ఆమె కళ్ల నిండా కన్నీళ్లు ఆనంద భాష్పాలై చెక్కిళ్లపై జాలువారుతున్నాయి. మనసు ఆనంద డోలికలలో తేలియాడుతోంది. నాకూ ఒక కుటుంబం ఉందని తెగ సంబరపడింది సత్యవతి . 'వెళ్ళు వెళ్ళు అదృష్టవంతురాలివి.. భగవంతుడు నీకు ఒక మనవరాలిని, కొడుకుని, కోడలిని ఇచ్చాడు. నువ్విప్పుడు మాలా అనాథవు కాదు' అని తోటి ముసలివాళ్లు అంటుంటే తెగ సంతోషపడింది.. అంతేకాదు, అలా ఎవరైనా వచ్చి మమ్మల్ని తనవాళ్లలా చూసుకునే వాళ్ళు దొరికితే ఎంత బాగుండు కదా అని బాధపడ్డవారు కూడా ఉన్నారు.
ఇక్కడ నా స్వార్ధం కూడా ఉంది .. నా చిట్టితల్లి సంతోషం.. నానమ్మ పోస్ట్ ఖాళీ అయిపోయింది.. ఇలా కొత్త అతిథితో భర్తీ చేసుకుంటున్నా.. ఈమె మాకు శాశ్వత అతిథి కావాలనుకుంటున్నాం. భగవంతుడి దయవల్ల మేమిద్దరం మంచి పొజిషన్ లో ఉన్నాం.. మాకున్నది ఒక్క కూతురు. ఒక మనిషిని మా మనిషిగా చూసుకోవడానికి మేము అంత ఆలోచించక్కర్లేదనిపించింది.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. మనస్ఫూర్తిగా సత్యవతిని నాకు తల్లిగా స్వీకరిస్తున్నా.. ఆమె నా బాధ్యత. ఆమె నాకెప్పుడూ బరువు కానేకాదు. నాకు భగవంతుడు మళ్ళీ తల్లినిచ్చాడు.. ఆయనకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను." అన్నాడు ఉద్వేగంగా ధీరజ్.
"హేట్సాఫ్ ధీరజ్.. నువ్వు చేసిన ధైర్యం మేమంతా చేస్తే.. ఓల్డేజ్ హోంల అవసరం ఉండేది కానే కాదు.. వృద్దులు మన సంపద.. వాళ్ళ అనుభవాలు, ఆశీస్సులు మనబిడ్డల జీవితాలను సుసంపన్నం చేస్తాయి, పక్కదారి పడకుండా కాపాడుతాయి".. అంటూ అక్కడనుంచి మిగిలిన వాళ్ళతో పాటు సంతృప్తి చెందిన మనసుతో ఓల్డేజ్ హోమ్ వైపు కదిలాడు కిరీటి..
* * *
"అత్తయ్యా.. దాన్ని మీరు మరీ గారం చేసేస్తున్నారు.. ఇలా అయితే ఎలా చెప్పండి.. మొండితనం పెరిగిపోదు".. అంటూ వంటిట్లో నుంచి సుగుణ కేకలు "అబ్బా సుగుణా.. అది చిన్నపిల్ల... ఉదయం నుంచి చదువులు, గిదువులని ఉరుకులు, పరుగులే కదా ! అచ్చటైనా ముచ్చటైనా పుట్టింటి దగ్గరే కదా.. కాసింత టైమ్ దొరికింది పడుకోనీ పాపం.. ఇదిగో ఈ టీ తాగు." అంటూ కొడలికి టీ కప్పు అందించింది రావుడమ్మ. "అమ్మా.. ఇక్కడొక మగవెధవనున్నాను.. నాకు కూడా టీ ఇవ్వాలన్న ఇంగితం లేకపోయే నీకు, నీ కొడలికి.." అన్నాడు ధీరజ్. "అబ్బా.. నీ దెప్పుడ్లు పాడుగాను.. వేడి వేడి పకోడీలతో.. అదిగో చిక్కటి కాఫి కలిపి ప్లాస్కు లో పోసి ఉంచింది నా కోడలు.. వెళ్ళి తిను.. అనవసరంగా కేకలు వేసి నా మనవరాలు నిద్ర పాడు చెయ్యకండి.. అంటూ ఇదిగో సుగుణా నా మనవరాలు లేచాక వేడిగా పకోడీలు వెయ్యి లేకపోతే చల్లారిపోతాయి." అంటూ గదిలోకి వెళ్లిపోయింది రాముడమ్మ.
- బంటుపల్లి శ్రీదేవి