TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తెలుగువన్-అక్షరయాన్ సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కథలో పోటీలో తృతీయ బహుమతి రూ. 1,116 పొందిన కథ "దృక్పథం"
"అమ్మా! తొందరగా! టిఫిన్...
పరీక్షకు బయల్దేరాలి" హడావుడి చేస్తున్న కాశ్యప్ ని చూస్తూ
"ఆగరా! బాబూ! హాల్ టికెట్ అవి సర్దుకున్నావా? వంటింట్లోంచి తల్లి
"ఆ! ఆ! అన్నీ రెడీ!
మేమంతా డైనింగ్ టేబుల్ దగ్గర రెడీ!"
రాగయుక్తంగా పాడుతున్న ప్రసాద్ మాటలు వింటూ "వస్తున్నా! వస్తున్నా!"
వేడివేడి ఇడ్లీలు తెచ్చింది. ముందే సిద్ధంగా ఉన్న కారంపొడి, కొబ్బరి చెట్నీలు ప్లేట్లలో వేసుకుంటున్నారు తండ్రి కొడుకులు.
"ఉండండి. నెయ్యి మరిగించి తెస్తాను". మళ్లీ వంటింట్లోకి పరిగెత్తింది సుధ
టిఫిన్ పూర్తికాగానే దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టి వస్తూ అమ్మానాన్నలకు నమస్కరించాడు. కొడుకుని దగ్గరకు తీసుకుంటూ "జాగ్రత్త నాన్నా! అన్నాడు ప్రసాద్.
"పోనీ నాన్నగారిని దింపమంటావేమిటి? అడిగింది సుధ
"ఫరవాలేదు అమ్మా! వెళ్ళొస్తా! బైక్ స్టార్ట్ చేశాడు. వెంటనే అప్రయత్నంగా నోటినుండి
" శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే...
అదేం అలవాటు అయిందో ఎప్పుడు అయిందో తెలీదు.
నెక్స్ట్ జంక్షన్ వస్తోంది అంటే ముందుగానే చాలా అలర్ట్ అవుతూ ఉంటాడు. కాసేపు సిగ్నల్ లైట్లు వెలుగుతాయి. చాలాసార్లు ఆరెంజ్ రంగు ఉండిపోతుంది.
పోలీస్ కూడా అప్పుడప్పుడు నాలుగువైపులా చేతులూపుతూ, చెమటలు కారిపోతూ, ట్రాఫిక్ నియంత్రిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎవరూ ఉండరు. మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకుంటూ వెళ్తున్నాడు.
ఇంతలో వెనుక నుండి స్పీడ్ గా తనను దాటుకుంటూ ఒక బైక్ ముందుకు పోవడం
వేరే వైపు నుంచి ముగ్గురితో కూడిన పెద్ద బండి అతడిని ఢీ కొట్టడం క్షణాలలో జరిగిపోయాయి.
అయ్యో! అనుకుంటూ అంతా మూగారు ఆక్సిడెంట్! ఆక్సిడెంట్! అంటూ అందరూ మూగారు.
ఆ పెద్ద బండి అబ్బాయిలు ఈ హడావుడిలో బండి అక్కడే వదిలేసి జారుకున్నారు. ముందు వెళుతున్న వాడి స్పీడూ పక్క నుండి వచ్చి ఢీ కొట్టిన వాడి స్పీడూ ఎంత ఉండవచ్చు? అని అంచనా వేస్తున్నారు కొందరు.
108 కి ఫోన్ చేయండి అంటున్నారు కొందరు. కానీ చేసేవారు కనపడలేదు.
పడిన వ్యక్తి లేవలేదు. ఎర్రటి రక్తం చిక్కగా రోడ్డుమీద పారుతోంది. చూడగానే అందరూ "అయిపోయాడు" అంటూ ఒక్కొక్కరుగా వాళ్ళ వాళ్ళ వాహనాలు ఎక్కి వెళ్ళిపోతున్నారు. కాశ్యప్ కి కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే స్కూటర్ పక్కకి తీసి, తాళం వేసాడు.
"అతనిలో ప్రాణం ఉంటే రక్షించే ప్రయత్నం చేయాలి. అతనికి సహాయం చేద్దాము." అంటూ ఇద్దరు ముగ్గురిని అడిగాడు. ఒకతను ధైర్యంగా ముందుకు వెళ్లి తల పక్కకి పడి ఉన్న అతడిని వెల్లకిలా తీసి ఆ మొహం చూసి అమ్మో! అంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆటో వాళ్ళని బతిమాలాడాడు. వాళ్లలో వాళ్లు అనుకుని
"ఆటోలో ఎక్కించుకుంటాం. హాస్పిటల్లో చేర్చడానికి నువ్వు వస్తావా?" అని అడుగుతున్న వారికి సరే! అని బుర్ర ఊపాడు.
ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్ లో ఎమర్జెన్సీ లో చేర్చి ఆటో వాడికి 200 ఇచ్చాడు. డాక్టర్లు ఎమర్జెన్సీ సర్వీసు ప్రారంభించారు.
కంటి దగ్గర కుట్లు వేసి, ఫ్రాక్చర్ అయిన కాలుకి సిమెంట్ కట్టు వేసి ప్రమాదం లేదు అనేంతవరకు తను ట్రాన్స్ లో ఉన్నట్లు అలా వాళ్ళు అడిగిన మందులు అవి తెచ్చి అందిస్తున్నాడు.
"ప్రమాదం నుండి బయటపడ్డాడు". అని డాక్టర్లు చెప్పేసరికి బయటకు వచ్చి చూశాడు.
చీకటి పడుతోంది.
సాయంత్రం ఆరుగంటలు అవుతోంది. చీకటి పడుతోంది. బయటకు వచ్చి ఆటో ఎక్కాడు.
ఉదయం తాను ఎక్కడ తన స్కూటర్ ని ఆపాడో అక్కడకు చేరుకుని, బండి తీసుకుని నెమ్మదిగా ఇంటి ముఖం పట్టాడు.
అప్పుడు గుర్తొచ్చింది.
"అమ్మో! తను ఇవాళ పరీక్ష రాయాలి. రాయలేదు. అమ్మానాన్నా ఎంత కంగారు పడతున్నారో? ఇల్లు చేరేసరికి తల్లి తండ్రి వీధి గుమ్మం లోనే కంగారుగా నిలుచున్నారు.
"నాన్నా! కాశ్యప్ ఏమైందిరా? ఎక్కడికి వెళ్లావు? పరీక్ష బాగా రాసావా? ఇంత చీకటి పడే వరకు ఎక్కడున్నావు?" ప్రశ్నల పరంపర కురిపిస్తున్న తల్లిదండ్రులను చూస్తూ లోపలకు అడుగు వేశాడు మౌనంగా.
"బాబూ! కాశ్యప్ ఏమైందిరా?" అని ఆతృతగా అడుగుతున్న అమ్మ మొహం చూస్తూ ఒక తల్లి నుదుటి కుంకుమ నిలపడానికి భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడు అనుకుంటూ అమ్మా! అంటూ భుజంపై వాలి వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకుని చూస్తూ ఉంటే ఆమెకూ కన్నీరు ఆగలేదు.
"అమ్మా! అమ్మా! నేనివాళ పరీక్ష రాయలేదు."
వింటున్న ప్రసాద్ తుళ్లి పడి భగ్గుమన్న కోపంతో ప్రళయకాలరుద్రునిలా ఏదో అనబోతుంటే ఆపేసింది సుధ.
"ఏమండీ ప్లీజ్! ఏమైందో? కనుక్కోండి పిల్లవాడిని పూర్తిగా చెప్పనివ్వండి." అంది
"ఉండు నాన్నా! ఉదయం అనగా వెళ్లావు రెండు ఇడ్లీలు తిని. కాళ్ళు కడుక్కుని రా! అన్నం పెడతా! అప్పుడు చెపుదువు గాని." అంటుంటే
తల అడ్డంగా ఊపాడు.
"సరే! ఉండు" అంటూ వంటింట్లోకి వెళ్లి అన్నం కలిపి తెచ్చింది. ఒక్కో ముద్ద నోట్లో పెడుతూ శాంతపరిచింది.
"అమ్మా! మరి…. నేను ఉదయం వెళ్తుంటే... జరిగినదంతా చెప్పుకొచ్చాడు వింటున్న ప్రసాద్ ఒకే ప్రశ్న అడిగాడు సూటిగా
"అక్కడ అంత మంది ఉంటే నీకెందుకు అంత శ్రద్ధ!!" వెటకారం మిళితం చేసి అడుగుతుంటే తండ్రి వైపు చూస్తూ
నాన్న…. అస్పష్టంగా అంటూ మరి మాట్లాడలేకపోయాడు.
"చెప్పు మరీ… రెట్టిస్తున్న తండ్రి వేపూ, తల్లి వేపూ చూస్తూ
"నాకు మీరే గుర్తొచ్చారు నాన్నా! మీరే అలా పడి ఉంటే నేను వెళ్లిపోగలనా?"
అరనిమిషం నేను ముందుకు వెళ్ళి ఉంటే?????
ప్రాణమా?పరీక్షా? అని ఆలోచించడానికి పరీక్ష నా మనసులోకి రానే లేదు."
వింటున్న సుధా ప్రసాదు నివ్వెరపోయారు.
ఆ రాత్రి ముగ్గురు అన్యమనస్కంగా కలత నిద్ర లోనే కాలం గడిపారు. కాశ్యప్ ఉదయం లేస్తూనే తయారై "నాన్నా! మా ప్రిన్సిపాల్ కి లెటర్ రాశాను. సంతకం పెడతావా? అంటూ కాగితం తెచ్చి ముందు పెట్టాడు.
జరిగినదంతా యథాతథంగా రాసాడు. మిగిలిన పరీక్షలు రాయడానికి అనుమతించమని కోరుతూ ముగించాడు. తండ్రిగా సంతకం పెడుతున్న ప్రసాదుకి మనసులో బాధగా ఉన్నా కొడుకు చేసిన పనికి మనసులో ప్రశంసించకుండా ఉండలేకపోయాడు.
- శ్రీలక్ష్మి చివుకుల