Facebook Twitter
ప్రేమ నేర్పిన పాఠం

ప్రేమ నేర్పిన పాఠం

(తెలుగువన్ ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

 

 

‘ఎంటమ్మా...ఆవిడ పెట్టె బేడాతో ఇంటికొచ్చేసింది.ఎన్ని రోజులుంటుందేమిటి’
చిరాగ్గా అడిగింది శివాని తల్లిని.
‘అబ్బా..సరిగ్గా నేను అదే అడుగుదామనుకున్నాను’అన్నాడు అభిలాష్.
‘ఏంటా మాటలు..పెద్దా చిన్నా లేకుండా..ఆవిడ ఎక్కడకూ వెళ్ళదు. ఇక్కడే ఉంటుంది. తాతయ్య చనిపోయాడని నేనే తీసుకొచ్చాను మీకేం కష్టం’ తీవ్రంగా అంది ఉమ.
‘ఆ..ఇక్కడే ఉంటుందా...ఇంతకుముందు ఆ గదిలో మా ఫ్రెండ్స్ అంతా కల్సీ కబుర్లు చెప్పుకొవడానికి హాయిగా ఉండేది. ఇప్పుడు ఆవిడ మంచం తో ఇరుకయ్యింది. పైగా ఎప్పటికీ ఆ దగ్గోకటి. అదొచ్చినప్పుడల్లా శబ్దం చేస్తూ ఉమ్ముతూ ఉంటుంది.చికాకనిపిస్తోంది.’ శివాని అంది. ‘అవునమ్మా’వంత  పాడాడు అభిలాష్.  
‘మన నాన్నమ్మ  మన దగ్గరుండక ఇంకెక్కడుంటుంది. అలా అనకూడదు తప్పు. రేపు ముసలిదాన్నయ్యాక నన్ను అలాగే అంటారా..’


‘వూర్కో అమ్మా....అన్నీ పొంతన లేని  మాటలు మాట్లాడతావు. నాకు కాలేజ్ కి టైమవుతోంది’ అంటూ విసుగ్గా వెళ్లిపోయింది శివాని. కోపంగా వెళ్ళాడు అభిలాష్.
నాన్నమ్మ ఎప్పటికీ తమతోటే ఉంటుందన్న సత్యం జీర్ణించుకోలేక తమ అసహనాన్ని కోపంగా మాట్లాడుతూనో, ఏదైనా ఎత్తేస్తూనో నిరసన వ్యక్తపరుస్తుంటే ఎక్కడ అత్తయ్య బాధపడుతుందోనని మధన పడుతోంది ఉమ.
ఎంత పల్లెటూరినుండి వచ్చినా ఆ మాత్రం గ్రహించలేని అమాయకురాలు కాదు తాయారమ్మ. అందుకే ‘నన్ను మావూరు పంపించేయ్యండే...వూరు పొమ్మంటోంది,  కాడు  రమ్మంటోంది. కాటికి కాళ్ళు చాపుకున్న నా శేష జీవితం కూడా అక్కడే  మట్టిలో కలిసిపోనీ..’ అంది.


అలా అత్తయ్యకు తెలిసిపోయినందుకు, తన పెంపకం లో పెరిగిన పిల్లలలా తయారయినందుకు తెగ సిగ్గుపడి అవమానం లా ఫీలయ్యింది ఉమ. 
‘నువ్వలా అనకు అత్తయ్యా...మామయ్య లేని ఇంట్లో ఉండలేవు. మేమంతా లేమా’ అని సర్ధి చెబుతోంది.
ఆరోజు హటాత్తుగా ఉమ తల్లిగారి  దగ్గరి బంధువేవరో చనిపోవడం తో తప్పనిసరై తెలవారకముందే ప్రయానమై వెళ్ళిపోయారు ఉమా,భార్గవ్ లు. అంతకు ముందు రోజు రాత్రి కాలేజ్ లో ఏవో సాంసృతి క కార్యక్రమాలంటూ  అలసిపోయి వచ్చి , ఆలస్యంగా పడుకున్న శివానికి రాత్రికి రాత్రే జ్వరం అందుకుంది.


పొద్దున్న 8 గంటలకే వెళ్లాల్సిన అభిలాష్ నాన్నమ్మ పెట్టిన ఇడ్లీ,చట్నీ,సాంబార్ లొట్టలువేసుకుంటూ తిని వెళ్ళాడు. శివాని ఇంకా లేవలేదని లేపబోతూ, చలికి వణుకుతూ,మూలుగుతున్న శివాని ని చూసి నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి వాష్బేసిన్ దగ్గరకు నడిపించి బ్రష్ చేయించింది తాయారమ్మ .   వేడివేడి పాలు తాగించింది బూస్ట్ వేసి. ఇంట్లోని పారసిట మాల్ టాబ్లెట్ వేసి ఒక ఇడ్లీ తినిపించి పడుకోబెట్టింది.  కానీ పది నిమిషాలైనా కాకముందే  భల్లున వాంతి చేసుకుంది శివాని.  అప్పుడే ఇంటికొచ్చిన అభిలాష్,’ఛీ...అంతా వాసనొ స్తుంది ఏమయ్యింది’ అన్నాడు మొహం చిట్లిస్తూ. 


విషయం చెబుతూ, డాక్టర్ దగ్గరకు అతన్ని పంపించి, అంతా శుబ్రము  చేసి,బెడ్ షీట్  చద్దరు తీసింది. ఆమె డ్రెస్ కూడా తీసి వొళ్ళంతా వేడి నీళ్లలో డెట్టాల్ వేసి తుడిచి ఉతికిన బట్టలు తొడిగింది. నుదుటిపై చన్నీళ్ళ పట్టి వేసి, బట్టలు అన్నీ శుబ్రమ్ చేసేసరికి ఫామిలీ  డాక్టర్ ని తీసుకుని అభిలాష్ వచ్చాడు. డాక్టర్ కొన్నిటాబ్లెట్స్ రాసిచ్చి వెళ్లిపోయాడు. అభిలాష్ టాబ్లెట్స్ తెచ్చిచ్చి క్లాస్కెళ్లిపోయాడు. 


తాయారమ్మా’మా బంగారం కదూ..’ అంటూ బతిమిలాడి ,టాబ్లెట్ వేశాక  అందులోని మత్తు కో ఏమో గానీ కొంచెం సేపు ని ద్ర పోయింది.  కాసేపటికి  లేపి   ఇడ్లీ కారప్పొడితో కలిపి తినిపించి,  దిష్టి తీసింది. 


‘నాన్నమ్మా ..నాకు రేపు కాలేజ్ లో ‘కాలేజ్ డే’ ఉంది. నాపాట ఉంది. రేపేలాగయినా వెళ్ళాలి’ తొలిసారిగా నాన్నమ్మా అంటూ కళ్ల నీళ్ళు పెట్టుకున్న శివాని కన్నీళ్లు తుడిచి ‘తప్పక వెళతావు’ అంటూ పడుకోబెట్టింది. మధ్యాన్నం లేచేసరికి జ్వరమంతా  తగ్గిపోయింది. కంఠం మంచిగా ఉండడానికి మిరియాలు కలిపిన పాలు ఇచ్చింది.  వేడి వేడిగా అన్నం వండి ఎల్లిపాయ కారం తో  నాలుగుముద్దలు  తినిపించింది.  మరోగంటలో పాట ప్రాక్టీస్ కి సిద్దమయిపోయింది శివాని . అయిదారు సార్లు పాడి నీరసంగా  అనిపించడంతో బోర్ గా అనిపించి ఫేస్ బుక్ తెరిచింది. 
ఆరోజు వృద్ధుల దినోత్సవం కావడం తో ఫ్రెండ్స్ పోస్ట్ చేసిన కొటేషన్లు చదవసాగింది. 


‘ వృద్ధాప్యం ఎప్పటికీ శాపమే కాదు. మంచిగా మలుచుకుంటే వరమూ అవుతుంది. అది అనివార్యమని తెలిసినప్పుడు దాన్ని ఆనందంగా ఆహ్వానించాలి. ఒకర్కి భారం కాకుండా కొన్ని సదుపాయాలూ ముందే చేసుకోవాలి. పెద్దవాళ్ళు అనుభవసారంతో తల పండినవారు , చిటికెలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల నేర్పరులు.’

‘నీ శరీరం లేచి నిలబడడానికి సహకరించని రోజు, 
నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు
నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు
నీ పనులకు ఇకోకరిపై ఆధారపడిన రోజు
నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు
నీ నిస్సహాయ స్థితికి నికే జాలి కలిగే రోజు 
నీ జీవితం లో ఎం సాధించావో ఎం పోగొట్టుకున్నావో 
స్పష్టంగా తెలిసి పోతుంది
కానీ అప్పటికే అంతా చేజారిపోతాయి...
తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు.....’

‘ కన్నా.... నా  దగ్గర ముసలి వాసన వ వస్తుందని నా  దగ్గరకు రాకుండా  నన్ను ముట్టుకోకుండా ఉండకురా..
నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నిన్ను ఎత్తుకుని ముద్దాడా నురా...
నేను బట్టలలోనే మల మూత్రాలు చేసుకుంటున్నానని అసహ్యించు కోకురా....
నీ చిన్నప్పుడు ఈ చేతులతోనే అవన్నీ శుబ్రం  చేసానురా....
పదే పదే అడుగుతున్నానని విసుక్కోకురా... 
నీ చిన్నతనం లో ఎన్ని సార్లు ఒకే విషయాన్ని అడిగినా ప్రేమగా చెప్పానని గుర్తు చేసుకోరా....
అన్ని తినలేక పోతున్నానని  కోప్పడ కురా......
నీకు పళ్ళు రానప్పుడు మెత్తగా ఉగ్గు చేసి నిన్ను బుజ్జగించి తినిపించేదాన్నిరా  
నడవలేక పోతున్నానని ఈసడించ కురా 
తప్పట డుగులతో  నువ్వు పడిపోకుండా నా చేయందించి నడిపించానురా.......’
కళ్ళ నిండా  నీళ్ళు నిండగా  ఇక చదవ లేక క్లోజ్ చేసింది శివాని . 


నిజంగా చదువుకునే తామే ఎన్ని సూటి పోటి మాటలన్నారు నాన్నమ్మని. తాతయ్య చనిపోయిన భాద లో ఉన్న నాన్నమ్మను ఎంత కష్ట  పెట్టారు. తామేప్పుడైనా నాన్న వాళ్ళతో వెళితే తమ కోసం వేరుశనక్కాయలు, లేత కంకులు, పెసరు కాయలు, దుంప లతో ఎన్ని రకాలు చేసి ప్రేమగా పెట్టేది. తామే ఒకటి రెండు రోజులకు మించి ఉండక పోయేవాళ్ళు. ఉన్నన్ని రోజులు తామెక్కడ బాధ పడతారో నని తమకు ఎ కష్టం కలక్కుండా కూడా చూసేది. బురద గా ఉన్నదని, దోమలున్నాయని, బాత్రూమ్లు దూరంగా ఉన్నాయని తామే తొందరగా  వచ్చేవాళ్ళు. అలాంటి నానమ్మ ను ఎన్ని మాటలన్నారు.  ఇవ్వాల  తాను  వాంతి చేసుకుంటే తనకే  అసహ్యం గా అనిపించింది. పాపం... విసుక్కోకుండా ప్రేమగా అంతా ఎలా శుబ్రం చేసింది.  పశ్చాత్తాపంతో కళ్ళ నిండా నీళ్ళు నిండాయి.  


సాయంత్రం అయింది.  మనవడు వచ్చేసరికి వేడివేడి సర్వపిండి (తపాలచెక్క) పెట్టి అందించింది ఇద్దరికీ...
‘అబ్బా ఎంత బావుంది నాన్నమ్మా.. మా అమ్మ ఎప్పటికీ ఆ మ్యాగీలు,  బజ్జీలు పెడుతుంది. ‘ అంటూ ఇష్టంగా  తిన్నాడు . శివానికి ఇష్టంగానే అనిపించింది. నాన్నమ్మ ఆప్యాయత ఎంతో నచ్చింది. ఇంతకు ముందు  అమ్మ ఎక్కడికైనా ఇలా వెళ్ళినపుడు ఒంటరిగా చాలా ఇబ్బంది పడేవారు. నాన్నమ్మ వచ్చిందగ్గర్నుండి చేగోడీలు, సున్నుండలు, జంతికలు, కారబ్బిళ్ళలు, పల్లీల ఉండలు చేయడంతో రాగానే ఇష్టంగా  తింటున్నారు.

అభిలాష్ కి కాలేజ్ లో వక్తృత్వ పోటీ ఉండటంతో  ప్రి పే ర్ అవుతున్నాడు. లంచం తీసుకోకుండా  మానసికంగా  ఎలా పరివర్తన తీసుకురావాలనే అంశం గురించి. ఎదో కొంత విషయం ప్రిపేర్ చేసుకున్నాడు. కానీ అది అంత ఆసక్తి కరంగా లేదు. పైగా  భయం లేకుండా, చూడకుండా  చెప్పాలంటే ఒక వాక్యం చెబితే ఒకటి మర్చిపోతున్నాడు. అతని అవస్థ అంతా చూస్తున్న తాయారమ్మ,’కన్నా.. ముందు మనం చెప్పే విషయం ఎదుటి వారిని ఆకర్షించి వారి మనసు దోచుకునేలా ఉండాలి. మన కిచ్చిన అంశం  పరిధి లో ఉండాలి. మనకిచ్చిన సమయం లోనే పూర్తీ చేయగలిగి ఉండాలి.  మన ముందువాళ్లని చూసి మనం భయపడకూడదురా.. ప్రతీ టీచర్ కూడా ఒకప్పుడు విధ్యార్దే. నీలో ఎలాంటి రక్తం ఉందొ వాళ్లలోనూ అదే రక్తం ఉంది. అలాంటప్పుడు ఎదుటి వారిని చూసి భయపడకూడదు.  అలాగే నీ ముందున్న వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే. అలనాడు మన స్వాతంత్ర్య సమర యోధులు కూడా అలా భయపడి ఉంటే మనకీ స్వాతంత్ర్యం వచ్చేదా... ఇంకా భయమైతే నన్ను, చెల్లెల్ని చూస్తూ స్పీచ్ ఇవ్వు. లేదా అద్దం ముందు  నిన్ను నీవు చూసుకుంటూ ఇవ్వు. ఒక్కసారి ఫెలవుతావు. పది సార్లు ఫెలవవు కదా…. అందుకే తినగ తినగ వేము తియ్యనుండు అన్నారు’ అంటూ ధైర్యం చెప్పింది. 


కానీ అభిలాష్ , పల్లెటూరు నుండి వచ్చిన పాత  కాలం నానమ్మ తనకు హితబోధ చేయడం జీర్ణించుకోలేక పోయాడు. ఆమె చెప్పిన వన్నీ నిజమని తెలుస్తున్నా వొప్పుకోవడానికి అహంకారం అడ్డొచ్చింది. 


‘ఆ..... ఉచిత సలహాలు ఎన్నయినా ఇవ్వొచ్చు.  ప్రాక్టికల్ గా  చేస్తే తెలుస్తుంది అదేంత  కష్టమో....’ వ్యంగ్యం గా అన్నాడు.
‘ వావ్....నాన్నమ్మ... నీ కివన్నీ ఎలా తెలుసు...అసలు నువ్వేం చదువుకున్నావ్..అన్నయ్యా.... ఎందుకు అలా అంటావ్.... నాన్నమ్మ చెప్పింది అన్నీ కరేక్ట్ నే కదా.... పైగా నాన్నమ్మ ఇవన్నీ  చెప్పిందంటే ఆసక్తిగా ఎలా చెప్పాలో కూడా చెబుతుంది.  తెలుగు లోనే కదా చెప్పేది.... నాన్నమ్మా చెప్పవా....’ బ్రతిమిలాడింది.


‘ఆ.. ఎదో వానాకాలం చదువు... నేనేం చదివాను.... ఎదో తాతయ్య దగ్గరే నేర్చుకున్నా....  ఇప్పుడవన్నీ ఎందుకు గానీ వాణ్ని ప్రాక్టీస్ చేసుకోనివ్వు..... మనం బయట కేలదాం...రా....’ అంది 


కొంచెం చిన్నబుచ్చుకుంటూ తాయారమ్మ.
‘ సారీ.... నాన్నమ్మ.... ఎదో  అన్నాలే గానీ ....నిజంగా నీకు తెలిస్తే చెప్పవా.... మా మంచి నాన్నమ్మ కదూ...’ నవ్వుతూ చుబుకం పట్టుకుని అభిలాష్ సరెండ రయి పోయాడు, చెల్లి మాట కరేక్టే నిపించడంతో .
‘అది కాదు నాన్న... లంచాలు తీసుకోకుండా వారి మనస్సుల్లో పరివర్తన తేవాలంటే , మీకు అలేగ్జాందర్ చనిపోతూ కోరిన కోర్కెల గురించి తెలుసు కదా ... అది  ఇక్కడ ప్రస్తావిస్తే... ఆసక్తికరంగా ఉంటుంది. బట్టీ పట్టినట్లు కాకుండా సందర్భోచితంగా సులువుగా చెప్పగలవు...’


‘పూర్తిగా గుర్తులేదు  కానీ నువ్వు చెప్పు నాన్నమ్మా...’
‘అలేగ్జాండర్ చాలా రాజ్యాలను జయించి ఇంటికి తిరిగి వెళుతుంటే మార్గంలో తీవ్ర అనారోగ్యానికి గురయి మరణించ బోతున్నానని తెలుసుకుని , తాను చనిపోయాక 1. తన శవ పేటికను వైద్యులు మాత్రమె మోయాలని, 2. స్మశానానికి వెళ్ళేదారిలో తానూ సంపాదించిన విలువైన రత్నాలు, మణి మానిక్యాలు చల్లమని ౩. తన శవపేటిక నుండి తన రెండు అరచేతులు బయటకు కనిపించేలా ఉంచమని  చెపుతాడు. ఎందుకలా అని అడిగిన వారితో, 1. వైద్యుడు వైద్యం చేయగలడుగానీ మరణాన్ని ఆపలేడు  అని 2. సంపద కూడా కూడబెట్టడానికే నా  జీవితమంతా వృధా అయ్యింది, దాని కోసం  విలువైన సంతోషాన్ని పోగొట్టుకోకూడదు అని ౩. నేను ప్రపంచానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చాను, వెళ్ళేప్పుడు అలాగే వెళుతున్నాను ఎంత సంపాయించినా ఏమీ తీసుకు పోను, కేవలం పాప పుణ్యాలు తప్ప అని చెప్పడానికి , అని అంటాడు... ఈ విషయం రెండు నిమిషాల్లో చెప్పవచ్చు. బాగుంటుంది...’ అంది.


పిల్లలీద్దరు  మంత్రముగ్ధులై విన్నారు. ‘వావ్.....’ ఇద్దరి నోటినుండీ ఒకే సారి వచ్చింది.
‘నాన్నమ్మా.... నీకివన్నీ ఎలా తెలుసు....’ ఆశ్చర్యంగా అడిగింది శివాని. 
‘ తాతయ్య స్వాతంత్ర్య సమర యోధుడు కదా....రాత్రి వయోజన విద్య కేంద్రం లో మా వూరి జనాలందరికీ  చదువు చెప్పేవాడు . నేనూ వెళ్ళేదాన్ని. ఇలాంటి వెన్నో చెప్పేవాడు.  తీరిక వేళల్లో పుస్తకాలు చదవమంటూ ఎన్నో పుస్తకాలు ఇచ్చేవాడు....’ 


పై రూపం చూసి ఎవర్నీ తక్కువ అంచనా వెయ్యకూడదు అని తెలిసింది ఇద్దరికీ....చెరో వైపు హత్తుకున్నారు.  
తెల్లవారి శివాని, అభిలాష్ చెరోక ట్రోఫీ తో వచ్చి నాన్నమ్మకి చేతుల్లో పెట్టి చెరో చెంప పై ముద్దిచ్చారు. అప్పుడే వచ్చిన తండ్రి భార్గవ్ ఆశ్చర్యంతో చేతిలోని సెల్ కెమెరా క్లిక్ మనిపించాడు. తల్లి తలో ఏం మహిమ జరిగి ఉంటుందా అని ఆనందంతో అవాక్కైంది.                                                                                                                                            

-నామని సుజనాదేవి