Facebook Twitter
జాషువా హాస్యం!

జాషువా హాస్యం!

మహాకవి గుర్రం జాషువా గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. దిగువ కులంలో పుట్టడం వల్ల నానారకాల అవమానాలను అనుభవిస్తూనే, అరుదైన సాహిత్యాన్ని అందించిన వీరుడు జాషువా. హరిజనుడు కావడం చేత అగ్రవర్ణాలవారు ఆయనను దూరంగానే ఉంచేవారు. సాహిత్య సమావేశాలలో సైతం ఆయనకు విడిగానే భోజనం వడ్డించేవారట. అబ్బూరి వరదరాజేవ్వరరావుగారు రాసిన ‘కవనకుతూహలం’ అనే పుస్తకంలో తాను ఇలాంటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్లు రచయిత చెబుతారు. మరోవైపు హైందవ సంప్రదాయంగా భావించే పద్యరచనని చేపట్టడంతోనూ, వారి దేవతల గురించి రాయడంతోనూ... క్రైస్తవులు కూడా ఆయనను వెలివేసేవారు.

ఈ ఉపోద్ఘాతమంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే- తన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా, జాషువాలోని హాస్యచతురతలో ఎలాంటి మార్పూ రాలేదు. అయనలోని చమత్కృతికి చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. వాటిలో కొన్ని...

- జాషువా గురించి తరచూ వినిపించే ఓ హాస్య సంఘటన దీపాల పిచ్చయ్యశాస్త్రికి సంబంధించినది. దీపాల పిచ్చయ్యశాస్త్రి, గుర్రం జాషువాకు సహాధ్యాయి. ఆయన సాహచర్యంలోనే జాషువాగారు పద్యాల మీద పట్టు సాధించారట. అదే సమయంలో కొప్పరపు కవులు, తిరుపతి వెంకట కవులు జంటకవులుగా మంచి ప్రచారంలో ఉన్నారు. మరోవైపు విశ్వనాధవారు కూడా కొడాలి ఆంజనేయులు అనే కవితో కలిసి కవిత్వం చెబుతున్నారు. ఇదంతా చూసిన జాషువా, పిచ్చయ్యశాస్త్రులకు తాము కూడా జంట కవిత్వం ఎందుకు చెప్పకూడదు అన్న ఆలోచన వచ్చింది. కానీ జంట కవిత్వం కోసం ఇద్దరి పేర్లనీ ఎలా కలిపేది? పిచ్చి జాషువా, జాషువా పిచ్చి, దీపాల జాషువా, జాషువా దీపాలు, జాషువా శాస్త్రి, గుర్రం పిచ్చి, దీపాల గుర్రం... ఇలా ఎలా చూసినా కూడా ఇద్దరి పేర్లూ కలవడమే లేదు. దాంతో జంట కవిత్వపు ఆలోచనను విరమించుకున్నారు ఆ కవిద్వయం.

- జాషువాకి సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా ఉంది కానీ, లక్ష్మీదేవి (సంపద) మాత్రం ఆయనకు దూరంగానే ఉండేది. జాషువా గురించి తెలిసిన ఒక పెద్దాయన గుంటూరు నుంచి ఓ 25 రూపాయలని మనీఆర్డరు చేశారట. దానిని జాషువా స్వీకరిస్తారో లేదో అన్న సంశయంతో సరదాగా- ‘రాత్రి నాకు దేవుడు కలలో కనిపించి 25 రూపాయలు నీకు పంపమన్నాడోయ్।‘ అని మనీఆర్డరు వెనుక రాశాడట. దానికి జాషువా ‘మీ దేవుడు 25 పక్కన సున్నా పెట్టమని చెప్పలేదా!’ అని అంతే సరదాగా జాబు రాశాడట!

- జాషువా గురించి చెప్పుకొనేటప్పుడు ఆయనకీ విశ్వనాథకీ మధ్య జరిగినట్లుగా ఓ కథ ప్రచారంలో కనిపిస్తుంది. ఓ సమావేశంలో తనతోపాటుగా జాషువాని పిలిచినందుకు విశ్వనాథ ఆక్షేపిస్తూ ‘గుర్రాన్నీ గాడిదనీ ఒకే గాటున కట్టేశారు’ అన్నారట. ఆ వెంటనే జాషువా ‘నా పేరులో గుర్రం ఉంది, మరి గాడిద ఎవరో నాకు తెలియదు!’ అని చురక అంటించారని చెబుతారు. ఈ సంఘటన చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ, దీని వెనుక ఎలాంటి ఆధారమూ లేదు. ఎందుకంటే అటు విశ్వనాథా, ఇటు జాషువా ఒకరంటే ఒకరు చాలా గౌరవభావంతో ఉండేవారట.

- ఒకసారి జాషువాగారికి జ్వరం వచ్చింది. అది ఎంతకీ తగ్గడం లేదయ్యే! ఎవరో వచ్చి ‘తగ్గిందా!’ అని అడిగితే... ‘ఆహా! తగ్గకేం. సీసాలో మందు సగం తగ్గింది,’ అని జవాబిచ్చారట జాషువా.

ఇంతకీ జాషువాకి ఇంత హాస్య ప్రవృత్తి ఎలా అబ్బి ఉంటుందీ అంటే, ఆయన పద్యంలోనే జవాబు కనిపిస్తుంది.

నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్
దివ్వెలు , కొన్ని నవ్వులెటు తేలవు , కొన్ని విష ప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమ రసమున్ వెలిగ్రక్కు విశుద్ధ మైన లే
నవ్వులు సర్వదు:ఖదమనంబులు వ్యాధులకున్ మహౌషదుల్।

అంటారు జాషువా ఒకానొక సందర్భంలో- ‘నవ్వు మనిషికి మాత్రమే ప్రత్యేకమైన వరం. ప్రశాంతమైన, స్వచ్ఛమైన అంతరంగానికి చిహ్నం! నవ్వులలో చాలారకాలు ఉండవచ్చు. కానీ అభిమానంతో కూడిన నవ్వులు సమస్త దుఃఖాలనూ నశింపచేస్తాయి. ఎటువంటి వ్యాధికైనా మందులా పనిచేస్తాయి,’ అన్నది పై పద్యంలోని భావం. అంతటి భావం మనసున కలిగి ఉన్నవాడు కాబట్టే... ఎటువంటి బడబాగ్నిలోనైనా చిరునవ్వుతో నిలువగలిగాడు జాషువా!

- నిర్జర.