TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తాత బాధ
నా పేరు రాము నేను మీ అంత వయసులో ఉన్నప్పుడు, చదువుకన్నా నాకు దేవుని మీద భక్తే ఎక్కువ ఉండేది. అందుకని, నేను ప్రతిరోజూ బడికి వెళ్ళేటప్పుడు దేవాలయం దగ్గర ఆగి, దేవునికి మ్రొక్కుకొని గానీ ముందుకు వెళ్లేవాడిని కాదు. ఒకసారి ఏమైందంటే, బడి వదిలిన తర్వాత నేను మా ఊరికి వెళ్తున్నాను గదా, అప్పుడు ఉన్నట్టుండి పెద్ద గాలి వీచింది. 'ఏమిటా?' అని నేను ఆగి చూశాను.
తర్వాత నేను రోజూ కొలిచే దేవుడే నాముందు ప్రత్యక్షం అయ్యాడు! నేను చాలా ఆశ్చర్యపోయాను. దేవుడు అప్పుడు నాముందు నిలబడి, ఉరుముతున్నట్లు అన్నాడు. "నువ్వు రోజూ నన్ను కొలుస్తున్నావు గదా, అందుకని నాకు నీమీద కరుణ కలిగింది. నీకు ఒక వరం ఇస్తున్నాను- కోరుకో, ఏం కావాలో" అని. చిన్న పిల్లవాడిని కదా, అందుకని తక్షణమే నాకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. నేను అడిగాను. "స్వామీ! 'మీ లోకంలో ఒక సెకన్ అంటే మాలాంటి మనుష్యులందరికీ పదివేల సంవత్సరాలు' అని మా అయ్యవారు చెప్పారు, నిజమేనా?" అని.
"అవును, నిజమే" అన్నాడు దేవుడు. "మరి, మీ లోకంలో ఒక రూపాయి అంటే మాలోకంలో 100 కోట్ల రూపాయలట, నిజమేనా స్వామీ?" అడిగాను నేను. "అవునవును, నిజమే" ఒప్పుకున్నాడు దేవుడు. "మరయితే నాకు మీ రూపాయి ఒకటి ఇవ్వండి స్వామీ" అన్నాను నేను, నా తెలివికి నేనే మురిసిపోతూ. అప్పుడు దేవుడు "ఒక్క సెకన్ ఆగు- ఇస్తాను " అని వెళ్లిపోయాడు! ఇప్పుడు నాకు 90 సంవత్సరాలు- దేవుడి సెకను ఇంకా పూర్తికాలేదో, ఏమో- ఆయనా రాలేదు, ఆయన రూపాయీ రాలేదు నాకు!
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో