Facebook Twitter
..తరవాతే నేను

 

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ ఉగాది క‌థ‌ల పోటీలో ద్వితీయ బ‌హుమ‌తి రూ. 3,116 గెలుపొందిన క‌థ‌

.. త‌ర‌వాతే నేను

 
“నివి, ప్రాజెక్ట్ ఈ వీకే సబ్మిట్ చేయాలి. శనివారందాకా అస్సలు కుదరదు. ముందే చెబుతున్నాను మళ్లీ అలగొద్దు. పొద్దున కావాలంటే బ్రేక్ఫాస్టుకి వస్తాను ఓ అరగంట. అదీ 8 లోపలయితేనే. డిసైడ్ చేసుకొని మెసేజ్ పెట్టు, కాల్ చేయలేను. ఇంతకీ స్లాట్ మార్చడా?” ఫోన్లో అన్నాడు ఆర్య.
“మార్చలేదు. వద్దు ఆర్యా, ఆలోచించేదేమీ లేదు, నువ్వు ప్రాజెక్ట్ చూసుకో, ఆల్ ద బెస్ట్”  ఫోన్ పెట్టెయబోయింది నివేదిత.
“సరే, నీ ఇష్టం. మరి అమ్మకి ఫోన్...”  
“చేస్తాలే ఎప్పుడో, ఇన్ని టెన్షన్స్లో ఇంకో టెన్షన్ పెట్టకు”
“అయిదు నిమిషాలు టైములేదా?”
“డిసైడ్ చేసుకొని చెప్పమన్నావు కదా ఇందాక, తర్వాత ఫోన్  చేస్తాను, ఓ ఐదు నిమిషాలు నాతో మాట్లాడుతావా, నీ దగ్గర టైముందా?”
“ఓగాడ్! ఎక్కడికి తీసుకువెళ్లి ఎక్కడ లింకు పెడుతున్నావ్ చూడు”
“అవును, నేను పెడితే లింకులు. నువ్వు చెబితే రీజనింగులు, లాజిక్కులు” 
“నివి డియర్, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేనిప్పుడు మూడు ఆఫ్ చేసుకోదలుచుకోలేదు”
    “గుడ్, నేను నీకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను. నువ్వు నన్ను ‘మూడు ఆఫ్ చేస్తున్నాను’ అంటున్నావు. బాగానే డెసిఫర్ చేస్తున్నావు. నీ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందిలే”
“నీ ఎగ్జిబిషన్ ఫ్రస్టేషన్ నామీద చూపిస్తున్నావా?”
“మరి నీ రీజనింగ్ ఎలా ఉంది. అరగంటలో కలవడమూ, బ్రేక్ఫాస్ట్ చేయడమూ కుదురుతుందా?”
“ఎనఫ్, అమ్మకి కాల్ గుర్తుచేద్దామని చేశాను. చేస్తే చెయ్, లేకపోతే లేదు”
 “అమ్మ, అమ్మ, అమ్మ” మనసులోనే కేకలు పెట్టింది నివేదిత, “నీకొక్కడికే ఉందా అమ్మ, నాకు లేదా” అందామని, ఆపుకొని, “నాకు మూడాఫ్ అయ్యింది” అని పెట్టేసింది. 

***
“పార్టీ అని  పిలిచి నువ్వే డల్లుగా కూర్చుంటే ఎలా?”
“కొత్త కదా, అలాగే ఉంటాడులే. అయినా, అంతా నీ చేతిలోనే ఉంది”
“పెళ్లయ్యాక కూడా ‘అమ్మ అమ్మ’ అంటే చాలా కష్టం”
“కొంతమంది అమ్మలు కొడుకులను వదలరు”
“ఎంత మంచిదైనా, ‘అమ్మ’ అత్తగా మారిన తరువాత మారిపోతుంది”
“మొదట్లోనే తుంచేస్తే మంచిది”
నివేదిత తన పెళ్లి సందర్భంగా ఫ్రెండ్స్ కి కజిన్స్ కి ఇస్తున్న పార్టీలో, ఇలా చాలాసేపు చర్చించుకున్నారందరూ.  బెంగళూరువాసి పెయింటర్ నివేదిత, వైజాగ్ నుంచొచ్చి ఐబీఎంలో జాబ్ చేసే ఆర్య మధ్య ప్రేమ, పెళ్లిదాకా వచ్చింది. రెండు వారాల్లో పెళ్లనగా, ఇద్దరికీ బిజీ షెడ్యూల్ అయిపోయింది.  పెయింటింగ్ ఎగ్జిబిషన్ గ్యాలరీలో నివేదితకి హాల్లో వాష్రూముకెళ్లే కార్నర్ స్లాట్ ఆలాట్ అవ్వడంతో, ‘ఆర్ట్ ఎక్సిబిషన్, వెంటనే పెళ్లి’ అనే ఉత్సాహమంతా నీరుకారిపోయింది. ముందు స్లాట్  ఇవ్వమని బతిమాలితే 'నాలుగు పైటింగ్సుకే ఇస్తాను, ఓకేనా?' అన్నాడు నిర్వాహకుడు. ఆర్య ఏమైనా ఊరడిస్తాడేమో అనుకుంటే, ‘అమ్మకు కాల్ చేయడమే ముఖ్య’మన్నట్టుగా మాట్లాడితే, ఆ సాయంత్రం, మూడ్ లేకుండానే పార్టీ కానిచ్చింది.

***

కొన్నిరోజుల ముందు, ఫోటో షూట్లు,  ఫ్రీవెడ్డింగ్ ప్లాన్ల రొటీన్ కాకుండా, ‘పెళ్లి వెరైటీగా ఎలా?’ అనుకున్నప్పుడు, ‘అమ్మ ఐడియాలు బాగుంటాయి, అడుగుదా’మని ఆర్య అనడంతో, ఇద్దరు కలిసి ఆర్య అమ్మ, మంజులకి ఫోన్ చేశారు. కాబోయే అత్తగారిని ఇంప్రెస్ చేయడానికి “మీరే చెప్పండి, ఎలా?” అన్నది నివేదిత.  “మీ పెళ్లి ఎలా చేసుకుంటే అపురూపంగా ఉంటుందో మీరే ఆలోచించుకోలేదా” అని “డెస్టినేషన్ వెడ్డింగే కానీ, రిసార్టులో కాకుండా ఇక్కడ అరకులోయలో, అడవుల్లో, ఆదివాసీల మధ్యలో” అన్నది మంజుల.  మంజుల ఫారెస్ట్ డిపార్ట్మెంటులతో కలిసి నేచర్ క్యాంపులు చేస్తూంటుంది. “అందరికీ గెస్టవుసులో బస, ఏర్పాట్లు చూసుకుంటాను” అన్నది. అందరికీ నచ్చడంతో “పట్టుచీరల పరపరలు, బంగారునగల తళుకుబెళుకులు లేకుండా ప్రకృతి ఒడిలో సరదాగా చేసుకుందా”మని నిర్ణయించేసారు.  షాపింగ్ కూడా థీమ్ కి తగ్గట్టు అక్కడే చేస్తానంది. మొదట్లో నివేదతకీ ఐడియా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. కానీ ప్రతిదానికీ ఆర్య “అమ్మ, అమ్మ” అంటూడడంతో చిరాకు, రానురాను భయం మొదలైంది. అత్తగార్లు పెట్టే ఆరళ్ళు, ‘అమెరికాలో ఉన్నా, అండమాన్లో ఉన్నా” కొందరబ్బాయిలు బెడ్రూమ్ విషయాలు కూడా అమ్మలతో చర్చించుకుంటారని, వాళ్ళనడిగే అన్ని డెసిషన్లు తీసుకుంటారని, ప్రేమపెళ్లిళ్లయినా భార్యతో కన్నా, అమ్మతో రహస్యాలు మైంటైన్ చేస్తుంటారని, ఇంకా చాలా విన్నది.    
ఆర్య మంచివాడే, ‘అర్థం చేసుకుని ఆనందంగా లైఫ్ ఎంజాయ్ చేసే మనిషి’ అనిపిస్తాడు, కానీ ఈ ‘అమ్మ’ గోలేంటో అర్థంకావడం లేదు. ఎమన్నా అందామంటే, పెళ్లి గురించి అస్సలు పట్టించుకోని తన కుటుంబం గుర్తుకొచ్చి ఊరుకుంటుంది. నాన్న రాజకీయాల్లో బిజీ, అమ్మ శోభిత నృత్యకళాకారిని. ఎక్కువ తన నృత్యాలయంలోనే గడపటం, ప్రదర్శనలంటూ దేశవిదేశాలు తిరుగూతూండడంతో, నివేదిత ఒంటరిగానే ఆయా పెంపకంలో పెరిగింది. అమ్మ ‘అసలు పెళ్ళికి అరకు రాగలుగుతానో లేదో’ అన్నది. గ్యాలరీ విషయంలో నాన్న ‘ఓ  మాట’ చెపితే పనౌతుంది కానీ, ‘కళ ఎక్కడున్నా గుర్తింపబడాలి’ అని వాదించే తను, ఎలా అడుగుతుంది. ఇన్ని ఆలోచనలతో అన్యమనస్కంగా వుండి గుర్తున్నా ఫోన్ చేయలేదు నివేదిత. రెండోరోజు మంజులే ఫోన్ చేసింది. "ఏంటీ.. ఆంటీ.. మీరా.. నిజంగానా.. ఆర్యకి తెలియకుండానా.. ఎప్పుడు.. రెండ్రోజులా.. చెప్పొద్దా.. ఏర్పోర్టుకా.. సరే" అన్నీ ప్రశ్నలే నివేదితకి. మంజుల సిటీ దాటిఉన్న కనకపురకి క్యాంపుకని వచ్చింది. బట్టలు సర్దుకొని, ఆర్యకి చెప్పకుండా, ఏర్పోర్టుకి రమ్మన్నది నివేదితని. క్యాంపుకొచ్చినవాళ్ళని ఏర్పోర్టులో దింపేసిన వ్యానులో ఒక్కతే కూర్చొని నివేదిత సిటీ దాటడం, అడవిలోకి వెళ్లడం, ఆర్యకి చెప్పకుండా వాళ్ళమ్మని కలవడం అడ్వెంచర్లాగా అనిపించింది. "ఏంటీ, పెళ్లికూతురు ముఖం సరిగ్గా పెయింట్ చేయలేదు, డల్ షేడ్ వేసావు"  "ఆంటీ.." అంటూ బిక్కమొహం వేసి గ్యాలరీ విషయం, ఆర్య అస్సలు ఊరడించకపోవడం చెప్పింది. కలవగానే మంజుల గట్టిగా వాటేసుకోని, తాజా పళ్ళరసం, పేరు తెలియని స్వీటెదో పెట్టి ప్రేమగా మాట్లాడడంతో, అంత ఆత్మీయత అమ్మతో కూడా లేని నివేదితకి ఆశ్చర్యంగా, చనువుగా అనిపించి, అన్నీ చెప్పేసింది, ఆర్యతో గొడవలతో సహా.   
“ఏం చేయదలుచుకున్నావ్ మరి”   
“తెలియడం లేదాంటీ, ఆలోచిస్తున్నా”
“ఎన్ని రోజులాలోచిస్తావ్? సరే, ప్రదర్శన ముఖ్యమా, బెంగళూరులోనే జరగడం ముఖ్యమా?”
“అంటే?” 
“అంటే, అడ్వాన్సు తిరిగితీసేసుకో. పెళ్లి తరవాత విశాఖ సాగరతీరంలో చిన్న విందు అనుకున్నాం కదా, అందులోనే నీ ఒక్కదాని పెయింటింగ్స్ ఎక్సిబిట్ చేద్దాం. ఐడియా నీకు నచ్చితే”
“నచ్చడమా, నా ఒక్కదాని పైంటింగ్సా, అదీ సాగరతీరంలోనా, ఇది కలా, అయ్యో! అంటీ వ్యానెక్కినప్పటినుండే నా బ్రెయిన్ తిరుగుతుంది. ఇప్పుడు స్పీడందుకుంది” 
“అదేంలేదు,  స్ట్రెస్ రిలీజ్ అవుతుంది నీకంతే. పద, క్యాంపు ఫైర్ కి కర్రలేరడంలో బసప్పకి సహాయం చేద్దాం”
వణికించే చలిలో వెచ్చని మంట దగ్గర కూర్చొని, కళ్ళుమూసుకొని సన్నగా పాటపడుతున్న మంజులని, మళ్ళీ పేరు తెలియని సూపేదో తాగుతూ కన్నార్పకుండా చూసింది నివేదిత. కావలసినంత మాత్రమే సౌకర్యాలున్న అందమైన క్యాంపు. భోజనం తరవాత గుడారాల్లో పడక. రాత్రంతా కబుర్లు చెప్పుకున్నారు. చీకట్లోనే లేపాడు బసప్ప. ఫ్రెషయ్యి, అడవిలో నాలుగైదు కిలోమీటర్లు నడిచి కొండపైకి చేరుకున్నారు. కళ్ళు మూసుకొని కూర్చోమంది మంజుల. అక్కడలా ఎంతసేపు కూర్చుందో తెలియలేదు నివేదితకి. "నెమ్మదిగా కళ్ళు తెరువు" మంత్రంలా వినిపించాయి మంజుల మాటలు.  ఆకాశానికి ఎర్రని బొట్టు పెడుతున్నట్టు ఎదురుగా, దూరంగా, తనొక్కదానికోసమే ఉదయిస్తున్నట్టుగా సూర్యుడు, పెయింటింగ్ లాగా అనిపిస్తున్నాడు. తదేకంగా చూస్తుంటే నివేదిత కళ్ళనీళ్ళు జలజలా రాలాయి. దగ్గరకొచ్చి కాసేపు తలనిమిరి “పద” అన్నది మంజుల.  తిరుగుదారిలో చిన్న జలపాతం దగ్గర చాలాసేపు ఆడుకొన్నారు.  తినడానికి పళ్ళు ఇచ్చాడు బసప్ప.  రకరకాల పక్షులూ, చెట్లూ, పువ్వులూ, పిల్లకాలువలూ చూస్తూ క్యాంపుకొచ్చేసరికి వేడివేడి లంచ్ సిద్ధంగా  ఉంది. ఆవురావురుమంటూ తిని పడుకుంది. సాయంత్రమెప్పుడో లేచేసరికి "మరుగళు" (చెట్లు) వర్కుషాపుకు వచ్చిన ఒక గ్రూపుని సాగనంపి మంజుల ఉయ్యాలలో కూర్చుంది. నివేదిత ఇంకో ఉయ్యాలలో కూర్చుని పోటీలుపడి ఊగారిద్దరు. ఈ మనోహరమైన దృశ్యాలూ, అనుభూతులన్నీ అప్పటికప్పుడు చిత్రించాలని నివేదిత కళాహృదయం ఉవ్విళూరింది. రాత్రి క్యాంపుఫైర్ దగ్గర పాటలు పడుతూ డాన్సు చేసారు. నివేదిత మంజులని గట్టిగా హత్తుకొని ముద్దుపెట్టుకుంది. ఎమోషనలయిపోయి ఏడ్చేసింది.  "మీ గురించి చాలా తప్పుగా అనుకున్నా, ఎలాగైనా సరే, ఆర్య బ్రెయిన్లోనుండి మిమ్మల్ని తీసెయ్యమని అందరు సలహా ఇచ్చా"రని చెప్పేసింది.  "పిచ్చిపిల్ల" నవ్వి మొట్టికాయిచ్చింది మంజుల. “ఇద్దరి పేరెంట్స్ బ్రోకెన్ మ్యారేజ్, మీరు ఎలా ఉంటారు, అని డిస్కస్ చేసుకున్నారు కదా, ఆర్యాని మీ పేరెంట్స్ కి పరిచయం చేసినప్పుడు?”
“ఆర్య చెప్పాడా?” 
“శోభిత చెప్పింది”
“వ్వాట్? అమ్మా?”
“అమ్మనాన్న ఇక్కడికొచ్చారు మొన్నొకరోజు”
“నేనస్సలు నమ్మలేకపోతున్నా, అమ్మ పెళ్ళికే రాననిందాంటీ ” 
“వస్తుంది నివి”
“ఆంటీ, ఆమె స్వార్ధపరు...”  ఆవేశంగా అనబోయింది నివేదిత.
“నివి, అమ్మ అయినంత మాత్రాన ఆడదానికి పిల్లల్ని పెంచడం ఒక్కటే ప్రపంచం కాదు. తనకీ ఆశలూ, కోరికలూ ఉంటాయి. కళారంగంలో ఉండి ఒక కళాకారిని మనసర్థం చేసుకోవాలని ప్రయత్నించలేదు నువ్వు”
“మీకు తెలియదాంటి నా బాధ. నాకు అమ్మ ప్రేమ ఎప్పుడూ దొరకలేదు”   
“నివి, కొండపైన ఎందుకు ఏడ్చావు... తెలియదు కదా. నీలాగే మీ అమ్మ కూడా ఏడ్చింది. నేను నిన్ను ఓదార్చినట్టు నాన్న తనని చూసుకున్నారు. చిన్నపిల్లలై జలపాతంలో ఆడుకున్నారు. నాన్న నాలుగు రోజులు పనులు పక్కనపెట్టి పెళ్ళికి వస్తాన్నన్నారు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ నివి, జీవితాలని కలవలేనంత దూరం విసిరేస్తాయి” నివేదిత ఆవేశమర్థం అయ్యి అనునయంగా అన్నది మంజుల.
“అత్తగారిలో అమ్మను చూడమని అంటారు, నేను పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాకూ అమ్మకి అసలు స్నేహం లేదు, మీకు ఆర్యకు మధ్య స్నేహం నేను భరించలేక పోతున్నాను” అప్రయత్నంగా మంజుల ఒడిలో తలపెట్టి అన్నది నివేదిత.
“వద్దు, అత్తగారిలో అమ్మని చూడొద్దు. అత్తగారు-అమ్మ, ఇద్దరిలోనూ ఆడదాన్ని చూడు. వాళ్ల మనసర్థమవుతుంది. సరే కానీ, మీ అమ్మ ఇన్నాళ్ళ ప్రేమనంతా పెళ్లిలో నీకు గిఫ్ట్ ఇవ్వబోతుంది. తన ట్రూపుతో వచ్చి,  “గొరవ, ధింసా” కలిపి ట్రైబల్ డాన్సు ఫ్యూషన్ చేస్తాననింది”   
“ఇప్పుడే వెళ్లి అమ్మను చూడాలని ఉంది. ఇదంతా ఎలా చేసారాంటీ?” నివేదిత ఎక్సయిట్మెంట్ ఆపుకోలేకపోతుంది.
“ఇప్పుడొద్దు. నీ ప్రేమ అమ్మకెలా చూపిస్తావో ఆలోచించుకో. ఎన్ని చిత్రాలు వేస్తావో, సాగరతీరమంతా నీదే. నువ్వు చిత్రాలు ఎంత శ్రద్ధతో, ప్రేమతో వేస్తావు, అదే డెడికేషన్తో జీవితాన్ని చిత్రించుకో. అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి” 
ఇంత సున్నితంగా ఉన్న మంజుల, శాడిస్టూ ఇగోయిస్టూ అయిన భర్తతో ఎంత నరకమనుభవించి బయటపడిందో ఆర్య చెప్పడం గుర్తొచ్చి, ఏడుపొచ్చింది. అదే అడిగింది. "ఆ బంధాన్ని నిలుపుకోవాలని ఎంత ప్రయత్నించానో, వదులుకోవటానికి అంత కష్టపడ్డాను నివి" మంజుల నిర్మలంగా అన్నది.
“మీది పూర్తిగా ప్రేమనిండిన మనసు, మరి బాధనెలా..”  
నివేదిత వాక్యం పూర్తి కాకుండానే చెప్పింది మంజుల, "కాలం అన్నీ మరిపిస్తుంది అంటారు కదా. ప్రకృతి, నాకు అది కూడా తోడైంది. కాలం కన్నా తొందరగా ప్రకృతి గాయాల్ని మరిపించి కొత్త శక్తిని నింపింది"
ఆర్య అమ్మతో స్నేహంగా ఉండడంలో అర్థం కనిపించింది. ‘అమ్మంటే చేదు’ భావన ఉన్న నివేదితకి ఇలాంటి ‘అమ్మ’ కూడా ఉంటుందని తెలిసింది. మళ్ళీ గట్టిగా హత్తుకుంది.
ఎగ్జిబిషన్, అమ్మ ప్రేమ, పెళ్లి తలుచుకుని, ఆనందంతో వస్తున్న కన్నీళ్లను ఆపుకొని “ఆంటీ, మా ఫ్రెండ్స్ కి ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రాం చెయ్యండి” అన్నది నివేదిత.  
“అమ్మో, వద్దమ్మా. నేను చెప్తే వింటారా మీరు. మమ్మల్నే తప్పించాలని చూస్తారు. కావాలంటే క్యాంపుకు రమ్మను కొండపైకి తీసుకెళ్తా” ఇద్దరూ నవ్వుతూ డిన్నర్ చేయడానికి వెళ్లారు. 
“పెళ్లిలో కలుద్దా”మనుకుంటూ, తెల్లవారిద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. తన కొత్త అత్త-అమ్మలను తలుచుకుంటూ నివేదిత బెంగళూరుకి, ఆర్యనొకసారి కలిసి, మంజుల వైజాగ్ వెళ్లడానికి.

***
అరగంట మాత్రమే ఆర్యని లంచ్ కి కలిసి, నాలుగు మాటలు చెప్పి, ముద్దులుపెట్టి వెళ్ళిపోయింది మంజుల. "ఆర్యా, అమ్మతో ఇకమీద నీకు స్నేహం మాత్రమే. దేనికైనా ముందు నివేదిత, తరవాతే నేను.
తనని ప్రేమగా చూసుకో, ఆటోమాటిక్ గా తను నన్నూ ప్రేమిస్తుంది, అప్పుడే తనకు నేను నచ్చుతాను. తనలోనే అమ్మని చూసుకో. 'మా అమ్మ గ్రేటు, అమ్మకన్నీ తెలుసు, అమ్మని అడుగుదాం లాంటి' సుత్తి మాటలెప్పుడూ అనకు. 'నువ్వంటే నాకిష్టం, సారీ, ఓకే' లాంటి మాటలనడానికి ఎప్పుడూ వెనకాడకు."

 

- కవిత బేతి