Facebook Twitter
శిశిరంలోవిరిసిన కుసుమం

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ ఉగాది క‌థ‌ల పోటీలో ప్ర‌థ‌మ బ‌హుమ‌తి రూ. 10,116 పొందిన క‌థ‌

శిశిరంలోవిరిసిన కుసుమం


ఇంట్లో అంతా బయటికి వెళ్లడంతో బాల్కనీలో కూర్చుని కరువుదీరా ఏడ్చి, కొంగుతో కళ్లనీళ్లు తుడుచుకుని లోపలికి వచ్చింది కుసుమ. పొద్దున్నే మనవడు ఆనంద్ కోసం పెళ్లివారొచ్చారు. పలకరింపులయ్యాక లోపల్నించి కుసుమని పిలిచి ‘మా అమ్మగారు’ అంటూ పరిచయం చేసింది రమ. ఇరువైపుల తల్లిదండ్రులూ ముందు హాల్లో కూర్చుని కొంతసేపు మాట్లాడుకున్నారు. ఇక వెళ్తామని వాళ్లంటే ‘తాంబూలం తీసుకుందురు గాని రండి’ అని పిలిచి ఇల్లు చూపించింది రమ. డైనింగ్ హాల్లో కూర్చుని అష్టోత్తరమేదో చదువుకుంటున్న కుసుమని చూసి “మీ అమ్మగారు మీ దగ్గరే ఉంటారా?” అనడిగింది అమ్మాయి తల్లి. “మా అన్నయ్యది కూడా ఈ ఊరే అండీ. ఇద్దరి దగ్గరా ఉంటుంది. ఇంక మాకు మిగిలిన పెద్ద దిక్కు ఆవిడే” అంది రమ. కుసుమ విననట్టుగా నటించినా ఆ మాటలు ఆవిడ మనసులో గుచ్చుకున్నాయి. భర్త ఆరోగ్యంగా ఉన్నన్నాళ్లూ తమ ఇంట్లో తాము స్వతంత్రంగా గడిపిన జీవితం తలచుకుంటే ఆవిడకి దుఃఖం ముంచుకొచ్చింది.

**

పిల్లల చదువు సంధ్యలూ, పెళ్ళి పేరంటాలూ, పురుళ్లూ సక్రమంగా పూర్తిచేసి, మనవల పెంపకంలో ఆసరా అందించి, ఏ అనారోగ్యమూ లేకుండా విశ్రాంత జీవనం గడుపుతుండగా రంగారావుగారికి హఠాత్తుగా గుండెపోటు రావడం, హైదరాబాద్ లో స్థిరపడి ఉన్న కొడుకు రామచంద్రా, కూతురు రమా ఉన్నపళాన వచ్చి, ఆ మారుమూల పల్లెటూర్లో ఉండడానికిక  వీల్లేదని  హైదరాబాద్ తీసుకురావడం గుర్తొచ్చాయి. ఆసుపత్రిలో సరైన వైద్యం అంది, తండ్రి కాస్త కోలుకున్నాక, డిశ్ఛార్జి చేయించి, ముంబైలో తనకేదో కాన్ఫరెన్స్ ఉండడంతో తల్లినీ తండ్రినీ చెల్లెలింట్లో దింపాడు రామచంద్ర. కోడలు శిరీష కూడా ఆవేళ అతనితో పాటు వచ్చి కాసేపుండి వెళ్లింది. పూర్వం అడపా దడపా వచ్చివెళ్తూ ఉన్నా ఈసారి పూర్తిగా తరలి వచ్చేసిన భావన వల్ల రంగారావుగారికి కొన్నాళ్లు పట్టింది సర్దుకుందుకు. కుసుమ మాత్రం కూతురికి వంటింట్లో కాస్తో కూస్తో సాయపడుతూ, కూతురి సాయంతో భర్తకి కావలసినవి అమరుస్తూ, మధ్యమధ్య కాసేపు విశ్రాంతి తీసుకుంటూ, కాలక్షేపం చేసుకుంటూ వచ్చింది. కూతురూ, అల్లుడూ, మనవడు ఆనంద్ ల సమక్షంలో ఇద్దరూ మానసికంగా కోలుకున్నారు. పెళ్లి అయి భర్తతో అమెరికాలో స్థిరపడిన రమ కూతురు పుష్యమి అపుడపుడు వీడియో కాల్స్ లో పలకరిస్తూ ఉండేది. వయసు మీదపడిన పెద్దల సంరక్షణ తమకి కష్టమవుతుందని అనుకున్నారో ఏమో రామచంద్రా, శిరీషా అపుడపుడు వచ్చిపోతున్నారు గాని, ఇదివరకట్లా రంగారావుగార్నీ, కుసుమనీ తమ ఇంటికి రమ్మని పిలవడం లేదు. పండగా పబ్బం వస్తే భార్యా భర్తలిద్దరూ వచ్చేవారు. ఉద్యోగపూళ్లనించీ పిల్లలొస్తే వాళ్లని కూడా తీసుకొచ్చేవారు. కాసేపు కూర్చుని, తెచ్చిన పళ్లు తల్లిదండ్రుల చేతిలో పెట్టి, కాళ్లకి నమస్కారం చేసి ‘వెళ్లొస్తాం అమ్మా’అని రామచంద్రా, ‘ఆరోగ్యం జాగ్రత్త అత్తయ్యా’ అని శిరీషా చెప్పి వెళ్ళిపోయేవారు. ఇదంతా గమనించి కుసుమ మనసులో గుంజాటన పడింది గాని పైకి ఏమీ అనలేకపోయింది. ‘వీడు రమ్మని పిలవడం లేదేమిటి కుసుమా?’ అని రంగారావుగారు భార్యని అడగడం, గుండెపోటు తర్వాత బలహీనంగా ఉన్న ఆయనతో పూర్వంలా అన్నీ చెప్పలేక ఆవిడ సతమతమైపోవడం రమ గమనిస్తూనే ఉంది.

ఇక ఉండబట్టలేక ఒక రోజు “ఏమిటే రమా వీడిలా అయిపోయాడు? శిరీష కూడా వచ్చి వెళ్తున్న ప్రతిసారీ ‘ఆరోగ్యం జాగ్రత్త అత్తయ్యా’ అంటుందేమిటి? అంటే ఏం చెయ్యాలిటా? ఇద్దరికిద్దరూ మనింటికి వెడదాం రమ్మని అనడమే మానేశారు?” అంటూ తడికళ్లతో ప్రశ్నించిన తల్లిని చూస్తూ “పోనీలే అమ్మా. వాళ్లకేం ఇబ్బందులున్నాయో… నేనొకర్తెనే మీకు బిడ్డనైతే ఏం చేస్తామో ఇపుడూ అలాగే చేద్దాం. అనవసరంగా బాధపడకు” అని సర్దిచెప్పింది రమ. కూతురింట్లో ఎంత సౌకర్యంగా ఉన్నా, పెళ్లయిన దగ్గర్నుంచీ అత్తగారింటికే అంకితమైపోయి పెద్దకోడలిగా తన బాధ్యతలన్నీ శ్రద్ధతో నెరవేర్చిన కుసుమకి, కొడుకు తనని పట్టించుకోకపోవడం, రమ్మని తీసుకెళ్లకపోగా కనీసం నాలుగైదు రోజులకి ఒకసారైనా ఫోన్ చేసి మాట్లాడకపోవడం చాలా మనస్తాపానికి గురిచేశాయి.  అలా ఆర్నెల్లు గడిచాయి. 

ఒకరోజు మధ్యాహ్నభోజనం తర్వాత రంగారావుగారికి ఫిట్ లాగా వచ్చి, మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్ళవలసి వచ్చింది. చెల్లెలి ఫోనందుకుని ఆఫీసునించి తిన్నగా ఆసుపత్రికి వచ్చాడు రామచంద్ర. రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాలన్నారు. ఆసుపత్రివాళ్లిచ్చిన గది సదుపాయంగా ఉంది. కాఫీ టిఫిన్లూ, భోజనమూ ఇంటినించి తెచ్చే పనిలేకుండా వాళ్లే ఇస్తారు. కుసుమ తానెలాగూ భర్తతో ఉండాలి కనుక రమని ఇంటికి వెళ్లిపొమ్మంది. ఆసుపత్రి మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న రంగారావుగారు, ఎదురుగా కుర్చీలో కూర్చున్న కొడుకు కళ్లలోకి చూస్తూ “నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు నాన్నా” అన్నారు వేడుకుంటున్నట్టు.  సాధారణంగా రామచంద్ర తండ్రి కళ్లలోకి సూటిగా చూడడు. తల్లిదండ్రుల దగ్గరున్నపుడు అతని చూపులు దేన్నో తప్పించుకుంటున్నట్టుంటాయి. బలహీనంగా, తలభాగం పైకెత్తిపెట్టిన ఆ ఆసుపత్రి మంచం మీద పడుకుని, తన కళ్లలోకి చూస్తూ తండ్రి అలా అడిగేసరికి రామచంద్రకి మాట రాలేదు. ఒక క్షణం తర్వాత తేరుకుని, “సరే నాన్నగారూ, నాలుగైదు రోజుల్లో తీసుకెళ్తాను” అన్నాడు. మరో పదినిముషాలు కూర్చుని అతను ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ వెళ్లాక, అలసిపోయి నిద్రలోకి జారుకున్న భర్తనే చూస్తూ, పక్కన తనకోసం ఉన్న సన్నని బెడ్ మీద కూర్చుంది కుసుమ.

చుట్టపక్కాలందరికీ ఆశ్రయమిచ్చే వటవృక్షంలాగా ధీర గంభీరంగా, తల్లిదండ్రులని చివరిదాకా గౌరవాదరాలతో చూసుకున్న పుత్రుడిగా, జీవితపు ఒడిదుడుకుల్లో తనకు మార్గదర్శిగా, పిల్లాపాపలని గుండెమీద పెట్టుకు పెంచిన ప్రేమమూర్తిగా ఇన్నాళ్లూ కనపడిన భర్త, అలా నిస్సహాయంగా ఆసుపత్రి మంచంమీద పడుకుని ఉంటే చూసి విలవిలలాడిపోయింది ఆమె మనసు. నాలుగైదు రోజుల్లో తన ఇంటికి తీసుకెళ్తానన్న కొడుకు మాట గుర్తొచ్చి ‘రమ ఇంట్లోలాగా మనిషి సాయం ఉండదు అక్కడ. చెట్టంత మనిషికి స్నానపానాలూ ఇతర అవసరాలూ తనొకర్తీ చూసుకోవాలంటే ఎలాగో’ అని బెంగ పడింది.

పొద్దున్నే రామచంద్ర వచ్చి డాక్టర్ తో మాట్లాడి, ఆఫీసుకి వెళ్లబోతుంటే “ఈ వయసులో ఇక నాన్నగారికి అన్నిపనులూ చేయాలంటే కష్టమే నాన్నా. రమ ఇంట్లో అయితే అది కాస్త సాయానికి వస్తుంది. మీ ఇంట్లో అలా కుదరదు కదా. ఎవరైనా కాస్త సాయానికి ఉండేలాగా దొరికితే ఒక మనిషిని చూడాలి” అంది.
“సరే అమ్మా. సరైన మనిషిని వెతకాలంటే కొంచెం టైమ్ పడుతుంది కదా. రేపు డిశ్చార్జ్ అవగానే రమ ఇంట్లో దింపుతాను. మనిషి దొరికాక మనింటికి తీసుకువెళ్తాను” అన్నాడు.‘బావగారితో చెప్పావా’ అని అడగబోయి మానేసింది కుసుమ. హాస్పిటల్ ఇంటికి దగ్గర్లోనే ఉన్నా ఒక్కసారైనా కోడలు రాలేదని మనసు గుర్తు చేస్తుంటే, దాన్ని ఊరుకోబెట్టింది.

ఆపేక్షగా, భరోసాగా దగ్గర కూర్చుని, చేతిస్పర్శతో కొద్దిపాటి సాంత్వననైనా అందించని కొడుకుని చూస్తూ, అంటీ ముట్టనట్టున్న అతని ధోరణి గమనిస్తూ, ‘అలాగే’ అని తలూపింది. చిన్నపుడు తన కొంగు పట్టుకు వదలకుండా తిరిగి, ఎదుగుతున్న క్రమంలో తనతో ఆప్యాయంగా ఉంటూ, మనసుకి దగ్గరగా మసలిన ఎన్నో సందర్భాలు గుర్తొచ్చి, ‘అలాంటివాడు ఎలా మారిపోయాడో’ అనుకుంది. రామచంద్ర వెళ్లిపోయాడు.  రాబోయే కాలం కాలనాగులా కనిపిస్తుంటే ఆసుపత్రి గదిలో నిస్సహాయంగా నిలబడిపోయింది కుసుమ.

**

మరో నెల గడిచింది. రామచంద్ర ‘మనిషి దొరికిం’దని చెప్తూ ఫోన్ చేశాడు. చెప్పినట్టే ఆ వేళ చీకటి పడ్డాక రమ ఇంటికి వచ్చి, తల్లినీ తండ్రినీ తీసుకెళ్ళాడు. కొడుకు ఇంట్లోనే అంతిమ శ్వాస విడవాలని నిర్ణయించుకున్నారో ఏమో ఆ ఇంటికి వెళ్లాక మళ్లీ రంగారావుగారు గుమ్మం బయటికి రాలేదు. మంచం మీంచి దిగలేదు. పసిపిల్లలకి పెట్టే సెరిలాక్ పరిమాణంలో మెత్తని గుజ్జులాంటి పెరుగన్నం మాత్రమే తీసుకుంటూ తొమ్మిదిరోజులు గడిపి, పదోరోజు ఆఖరిశ్వాస విడిచారు. కుసుమ మనసులో పొంగిన దుఖ సముద్రానికీ, ఆమె కార్చిన దోసెడు కన్నీటికీ సంబంధం లేదు. రాయైన మనసుతో నిర్వేదంగా తర్వాతి కార్యక్రమాలన్నిటినీ కానిచ్చి, ‘అమ్మా, దా వెడదాం’ అన్న కూతురితో వాళ్లింటికి వెళ్లడానికి సిద్ధపడింది. ‘అన్నా, అమ్మ వెంట ఒక మనిషి తోడుండాలి ఇపుడు… నాతో తీసుకువెడతాను’ అని చెల్లెలు చెప్తే సరేనన్నాడు రామచంద్ర. మొదటి సంవత్సరం చాలా భారంగా గడిచింది. పల్లెటూళ్లో ఉన్న ఇంటి బాగోగులు చూసుకోవడం కష్టమనీ, జవసత్వాలుడిగిన కుసుమ ఒంటరిగా అక్కడ ఉండే అవకాశం లేదనీ చర్చించుకుని, ఊళ్లో ఇల్లు అమ్మేశారు. ఆ డబ్బు ఆవిడ పేర ఫిక్సెడ్ డిపాజిట్ లో వేశారు. డబ్బున్నా తనదైన ఇల్లులేదన్న చింతా, పరాయిగా కనిపిస్తున్న కొడుకింట్లో తనకి చోటు లేదన్న విచారం ఆవిడని చుట్టుముట్టేశాయి. 

**

ఆనంద్ కి పెళ్లిచూపులంటూ వెళ్ళేటపుడు ‘నువ్వూ రామ్మా’ అనేది రమ. “నేను రానమ్మా. నన్ను అడగద్దు” అని తప్పించుకునేది కుసుమ. వాళ్లటు వెళ్లగానే ఆలోచనల్లో మునిగిపోయేది. భర్తతోపాటుగా సంతోషంగా, పట్టుబట్టలూ అలంకారాలతో అన్ని శుభకార్యాల్లోనూ ముందు నిలబడిన తాను, ఇపుడిలా వెనకగా ఆగిపోవలసిన పరిస్థితికి ఆవిడ కళ్లు తడి అయేవి. 

ఆ వచ్చే పిల్ల అత్తమామలతో కలిసి బతకడానికే ఇబ్బంది పడచ్చు. వాళ్ళే కాక తను కూడా అక్కడే గుదిబండలా వాళ్ల నెత్తిన ఉండాల్సి వచ్చిందని మథన పడేది. మళ్లీ మనసు సర్దుకుని వెళ్లినవాళ్లు వెనక్కి వచ్చేసరికి వేడి వేడి కాఫీ కమ్మగా కలిపిచ్చి, ‘అమ్మాయి ఎలా ఉందర్రా?’ అంటూ చిరునవ్వుతో పలకరించేది. ఒకరోజు అలా పెళ్లిచూపులై ఇంటికొచ్చాక పిల్ల గురించీ, ఆ కుటుంబం గురించీ మాట్లాడుకుంటుంటే కూర్చుని వింది కుసుమ. మధ్యతరగతి కుటుంబవివరాలన్నీ బానే ఉన్నాయి. అమ్మాయి పనిచేసే ఆఫీసు కూడా ఆనంద్ ఆఫీసుకి దగ్గర్లోనే. అబ్బాయి రంగు పచ్చని పసిమి అయితే అమ్మాయి రంగు చామనచాయ. పెద్ద పొడుగూ కాదు. ఆరడుగుల ఆనంద్ పక్కన పిట్టలా ఉంటుంది. రూపంలో కూడా అబ్బాయిదే పైచెయ్యి. ‘ఏమంత వయసు మించిపోయిందీ, ఇంకొన్ని సంబంధాలు చూద్దా’మన్న మాట వినబడి, ఈ సంబంధం కూడా కుదిరేలా లేదనుకుంది కుసుమ.

అయితే మర్నాడు ఆ అమ్మాయి మెసేజ్ చేసిందనీ, అవేళ మళ్లీ కలిసి మాట్లాడతాననీ ఆనంద్ చెప్పడం, ఆరోజే కాక తర్వాత రెండు మూడుసార్లు అఫీసు దగ్గర్లో ఉన్న కాఫీ షాపులో ఇద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. నచ్చని పక్షంలో అలా పదే పదే మాట్లాడడం మంచిది కాదని తండ్రి అనడంతో ఆలోచనలో పడ్డాడు ఆనంద్. రమ మాత్రం “పనిపాటలు తెలిసిన పిల్ల, మనలాంటి కుటుంబంలోనే పెరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా… నిన్ను ఇష్టపడింది. ఒప్పేసుకో నాన్నా” అంది. 
ఆ రాత్రి ఆనంద్ గదిలోకి వెళ్లిన కుసుమకి “కూర్చో అమ్మమ్మా!” అంటూ మంచం చూపించాడు ఆనంద్. మనవడి కళ్ళలో ఏదో సందిగ్ధతా, ఎన్నో సందేహాలూ కనబడ్డాయి ఆవిడకి. కుసుమ మంచం మీద కూర్చోగానే, లాప్టాప్ మూసేసి వచ్చి, ఆవిడ దగ్గరగా కింద కూర్చుని ఒడిలో తలపెట్టుకున్నాడు ఆనంద్. పొత్తిళ్లలో పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచీ ఆలనా పాలనా చూసిన కుసుమకి ఆనాటి పసిబాలుడిలాగే కనిపించాడు ఆనంద్. కొడుకు పెళ్లిచూపులకి వెళ్లిన నాటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. కొడుకు కోసం అమ్మాయిని చూసి రావడం, తానూ భర్తా చర్చించుకోవడం గుర్తొచ్చాయి.

నూనె లేక బిరుసెక్కిన వత్తైన జుట్టు సవరిస్తూ “ఏం ఆలోచిస్తున్నావురా కన్నా?” అంది ఆపేక్షగా. 
“ఏమో అమ్మమ్మా? సరైన అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియడం లేదు. ఇలా చూసి ‘నచ్చలేదు’ అనడమూ నచ్చడం లేదు. ఈ అమ్మాయిలో కొన్ని బావున్నాయి. కొన్ని బాలేవు” అన్నాడు.
“ఏం బావున్నాయో చెప్పు ముందు”
“తెలివైనది. జోవియల్ గా సరదాగా మాట్లాడుతుంది. కానీ…లుక్స్…” 
“చూడ్డానికి బాలేదా? ఫొటో తీసుకురావాల్సింది. నేనూ చూసే దాన్ని” 
“అసలు బాలేకుండా లేదు. అలా అని పూర్తిగా నచ్చడం లేదు….. ఫొటో ఎందుకూ,  రేపు నిన్ను తీసుకెళ్ళి చూపిస్తా. వస్తావా?” అన్నాడు. కుసుమ మనసు ఊగిసలాడింది.
 “ఎక్కడ… ఎలా చూపిస్తావు?” 
 “నీకు మంచి కాఫీ ఇష్టం కదా! బ్రహ్మాండమైన కాఫీ దొరికే చోటొకటుంది మా ఆఫీస్ పక్కనే. అక్కడికి రమ్మంటే తనూ వస్తుంది. రేపు సాయంత్రం త్వరగా వచ్చి తీసుకెళ్తా వస్తావా?” 
“చూద్దాంలే” అని చెప్పి వెళ్లి పడుకుంది కుసుమ. 
మర్నాటి తిథి వారాలూ, నక్షత్రమూ లెక్కేసుకుంది. మనవడితో కార్లో కాఫీ షాపుకి వెళ్లడం తలుచుకుని ఉత్సాహపడింది. ఆ పిల్ల తనని చూసి ‘ఊళ్లోనే కొడుకున్నా, ఈవిడ వీళ్లతో ఉంటుందెందుకూ’ అనుకుంటుందేమో అని దిగులుపడింది. వీడి పెళ్లై, ఆ పిల్ల కాపురానికి వస్తే, ఎప్పుడూ ఇక్కడే ఉండే తనని చూసి ఏమనుకుంటుందో అనుకుంది. 

‘ఆ పిల్ల సరే.. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వస్తూ పోతూ ఉంటారుకదా. చిన్నతనంగా ఉండదూ’ అని చిన్నబుచ్చుకుంది. ‘అమెరికా నించి మనవరాలూ, భర్తా వస్తే తనెక్కడ ఉంటుందీ’ అని ఆలోచించింది. ‘ఇలా మూడు బెడ్రూమ్ ల ఫ్లాట్స్ పక్కనే వన్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా కట్టకూడదూ? ఒకటి కొనుక్కుంటే కూతురింట్లో ఉన్నట్టుండకుండా కాస్త హాయిగా ఉండేది. అలా ఎందుకు కట్టరో’ అనుకుని విచారించింది. పరిపరి విధాల పరుగెత్తుతున్న ఆలోచనల మధ్య నిద్రలోకి జారుకుంది.

**

మర్నాడు ఆఫీసుకి పరుగెడుతూ “అమ్మమ్మా, శిశిర మెసేజ్ చేసింది వస్తానని. సాయంత్రం త్వరగా వచ్చి నిన్ను తీసుకెళ్తా. రెడీగా ఉండు” అన్నాడు ఆనంద్. “అమ్మా! నువ్వు చేసుకోమంటే చేసేసుకుంటాడులా ఉంది. చూసుకో మరి!” అంది రమ నవ్వుతూ. అక్కడే ఉన్న అల్లుడిని చూస్తూ “ఇంకా నయం. వాడు నన్ను తీసుకెళ్లి చూపిస్తాననడమూ బావుంది. నేను తగుదునమ్మా అని తయారవడమూ బావుంది” అంది మొహమాటంగా.“భలేవారే. దగ్గరుండి పురుడు పోసి, బారసాల చేశారు. పిల్లలతో మాకు ఎప్పుడవసరమైనా వెంటనే వచ్చి అండగా నిలబడ్డారు. మీకు దగ్గర్లో ఇంజనీరింగ్ సీటొస్తే నాలుగేళ్లు దగ్గరుంచుకుని వండి పెట్టి చదివించారు. చూసి రండి. మీకన్నా వాడి క్షేమం ఎవరు కోరుకుంటారు?” అన్నాడు సతీష్ నవ్వుతూ. కుసుమ మనసు పొంగిపోయింది. “అందరూ చేసేదే నేనూ చేశానయ్యా” అంది. ‘కారాపగానే గభాలున దిగేసెయ్యకు. నేను అటొచ్చి దింపుతా’ అని మనవడు చెప్పడంతో షాపు ముందు కారాగినా సీట్లో కూర్చుని ఉంది కుసుమ. ఆనంద్ కారు దిగే లోగానే “అమ్మమ్మగారూ!” అంటూ వచ్చి, తలుపు తెరిచింది శిశిర. మెల్లిగా ఆవిడ దిగుతుంటే చెయ్యి పట్టుకుంది. ‘తనకన్నా గుప్పెడు ఎత్తుందేమో …నలుపే. కళ్లు పెద్దవే గాని రూపు రేఖలు సామాన్యం. రాజకుమారుడిలాంటి తన మనవడి పక్కన ఈ పిల్ల తేలిపోతుందేమో’ అనుకుంది శిశిరని చూసి. అటూ ఇటూ ఇద్దరూ ఉండి, ఆవిడని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లారు. ఆనంద్ కి ఎదురుగా  కుసుమ కూర్చుంది. పక్క సీట్లో శిశిర కూర్చుంది. కాస్త స్థిమితపడి కాఫీ వచ్చేలోగా కుసుమ శిశిరని పరికించి చూసింది. శిశిర ఆవిడ చూపులకి సిగ్గు పడలేదు. ఇబ్బంది పడలేదు. అందంగా కనపడాలని ప్రయత్నించనూ లేదు. సొంత అమ్మమ్మని చూస్తున్నట్టు చూస్తూ ‘ఇదే ఫస్ట్ టైమా అమ్మమ్మ గారూ, మీరిలాంటి కాఫీ షాపుకి రావడం?’ నవ్వుతూ అడిగింది. 

తెల్లని తీరైన ఆ పలువరసని చూస్తూ “అవును తల్లీ. హొటళ్లకి వెళ్లాను గానీ కాఫీ షాపులెపుడూ చూడలేదు. నా మనవడికి నాకన్నీ చూపించాలని తాపత్రయం. లేకపోతే అబ్బాయీ, అతని తల్లిదండ్రులే కాకుండా ఈ ముసలమ్మ కూడా నిన్ను చూస్తానని రావడమేమిటీ?” అంది. 
శిశిర కళ్లలో ఒక్క క్షణం కలవరం కనపడింది. “అమ్మమ్మగారూ, అలా అన్నారేమిటి? ఆనంద్ అమ్మగారికే అమ్మగారు మీరు. నన్ను చూడడానికి వచ్చారు. నాకెంతో నచ్చింది ఇలా” అంది, ఆవిడ చేతిమీద చెయ్యి వేస్తూ. తెల్లని ముడతలు పడ్డ ఆవిడ చేతిమీద ఆ అమ్మాయి లేత వేళ్లు చాయ తక్కువగా కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. కుసుమ కళ్లెత్తి శిశిర మొహంలోకి చూసింది. ‘నిర్మలమైన కళ్ళు ఈ పిల్లవి’ అనుకుంది. ఆనంద్ ని చూస్తున్నపుడు ఆ పిల్ల కళ్లలో కనపడే ఇష్టాన్ని ఆవిడ పసిగట్టేసింది. ఇద్దరూ మాట్లాడుకుంటుంటే రాలిపడుతున్న నవ్వుల పువ్వులు పరిమళభరితంగా తోచాయి ఆవిడకి. బయట కారెక్కేదాకా చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి, ఎక్కాక చీర కుచ్చిళ్లు లోపలికి సర్ది, తలుపు వేసింది శిశిర. ఆ పిల్ల తన స్కూటీ ఎక్కి, చెయ్యూపి రయ్యని వెళ్లిపోగానే ఆనంద్ వైపు చూసింది కుసుమ. స్టీరింగ్ వీల్ మీద చేతులు పెట్టి అమ్మమ్మనే చూస్తున్నాడు ఆనంద్. 
“నాకు నచ్చిందిరా పిల్ల” అంది కుసుమ. 
“ఏం నచ్చింది చెప్పు” అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. 
“ఏమో… ఏదో ఉందిరా ఆ పిల్లలో. మనసుని ఆకట్టుకునేదేదో ఉంది. ఆ స్పర్శలో… ఏదో ఆత్మీయత ఉంది నాన్నా. నిన్ను బాగా చూసుకుంటుంది” అంది.
ఆనంద్ డ్రైవ్ చేస్తూనే క్షణకాలం కళ్లు తిప్పి ఆవిడ కళ్లలోకి చూస్తూ “నాకూ అదే అనిపించింది అమ్మమ్మా!” అని, “కృష్ణుడికి సత్యభామ అంటే ఎందుకిష్టమో తెలుసా అని తాతగారొకసారి అమ్మతో అంటుంటే విన్నాను…. ఆవిడ మాటకారిట. ఆవిడ సంభాషణా చాతుర్యం అంటే ఆయనకి చాలా ఇష్టంట” అన్నాడు.
“అబ్బో .. అంత గుర్తుందిరా? అలా తాతగారన్నారా? నాకు గుర్తే లేదురా” 
“నాకూ ఇపుడే గుర్తొచ్చింది అమ్మమ్మా. శిశిరతో మాట్లాడుతుంటే ” అన్నాడు ఆనంద్ కారు గేరు మారుస్తూ.

**

పెళ్ళి ముచ్చటగా జరిగింది. హనీమూన్ కి వెళ్లి తిరిగొచ్చారు కొత్త దంపతులు. శిశిర కాపురానికి వచ్చింది. మర్నాటి నుంచి ఆఫీసుకి వెళ్లాలి.తెల్లవారాక  తొమ్మిది దాటుతుంటే గది తలుపు తెరిచి బయటికి వచ్చింది శిశిర. స్నానం అయిపోయినట్టుంది. లేత నీలంరంగు నూలు చుడీదార్ కుర్తాలో బయటికి వస్తూనే బాల్కనీ దగ్గర కుర్చీలో కూర్చుని ఉన్న కుసుమని చూసింది. దగ్గరకొచ్చి ఆవిడ బుజం చుట్టూ చెయ్యేసి మొహాన్ని ఆవిడ చెంపకానించి “ గుడ్మార్నింగ్ అమ్మమ్మ గారూ” అంది. పెళ్లికి ముందే అడపా దడపా కలుస్తూ ఉండటంతో ఇద్దరికీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. కుసుమకి మనసులో ఆనందంగా అనిపించినా “ముందు మీ అత్తగారిని పలకరించాక రావాలి నాదగ్గరకి” అంది. “ఎందుకలా? పొద్దున్నే మీరిలా కనిపిస్తే నాకెంతో బావుంటుంది. రోజంతా హాపీగా గడుస్తుంది… మా మామ్మతో నాకలా అలవాటైపోయింది మరి… మీ చేతులెంత మెత్తగా ఉంటాయో! మీ బుగ్గలు కూడా!” అంది బుగ్గలు పుణుకుతూ. కుసుమకి నవ్వొచ్చింది. మెల్లిగా పెళ్లి బడలికలు తీరి రొటీన్లో పడ్డారు అంతా. రోజూ పొద్దున్నే తనని వెతుకుతూ వచ్చి శుభోదయం చెప్పే శిశిరని కోప్పడుతూ “నాలా బొట్టు లేని వాళ్లని  పొద్దున్నే చూడకూడదు” అంది కుసుమ. 

“నేనలాంటివి నమ్మను అమ్మమ్మ గారూ…ఆనంద్ చెప్పాడు, మీరు తాతగారికి ఎంత సేవ చేశారో. తను కూడా మీదగ్గర ఉండి చదువుకున్నాట్ట కదా. జీవితమంతా కుటుంబానికి సేవలు చేశారు, ఆఖరివరకూ తాతగారిని కనిపెట్టుకుని ఉన్నారు. మీకన్నా పుణ్యస్త్రీ ఎవరుంటారు? తన తర్వాత భర్త పడే కష్టాలు పట్టించుకోకుండా ముందే వెళ్లిపోతే ఆ స్త్రీ పుణ్యస్త్రీ ఎలా అవుతుంది?” అంది. 

“ముందు వెళ్లడం, తర్వాత వెళ్లడం మన చేతుల్లో ఉంటాయిటే పిచ్చిపిల్లా?” అంది కుసుమ.
“మరి మన చేతుల్లో లేనిదానికి మనని జవాబుదారీ చెయ్యకూడదు కదా అమ్మమ్మ గారూ?” అంది శిశిర.
కుసుమ తెల్లబోయింది. ఆ మాటలు రమక్కూడా వినబడ్డాయి. ‘కోడలుపిల్ల మంచి మనసున్నదే కాదు, మనసులో భావాల్ని బాగా ప్రకటించగలదు కూడా! ఈ పెద్దావిడ కూతురు చెప్తే వినేది కాదు.. ఇపుడు మనవరాలు చెప్తే, వింటుందేమో చూడాలి’ అనుకుంది.

కొత్త కాపురం, సాఫ్ట్వేర్ ఉద్యోగం కావడంతో రాత్రి ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా లేస్తుంది శిశిర. రమా, సతీశ్ పెందరాళే లేస్తారు. కుసుమకి మొదటినించీ నాలుగున్నరా అయిదింటికి లేచేయడం అలవాటు. పొద్దున్నే కాఫీ తాగుతూ సతీశ్ “ఏమిటో ఈ కాలం పిల్లలు! బారెడు పొద్దెక్కాక గానీ లేవరు” అని విసుక్కోవడం వినబడింది కుసుమకి. కోడలు ఆలస్యంగా లేవడం అతనికి నచ్చడం లేదని  తెలుస్తూనే ఉంది. అడపాదడపా అలాంటి విసుర్లు వినపడుతూంటే ఒకరోజు వంటింట్లో రమతో “ఈ కాలం ఆడపిల్లలకి సుఖం లేదే రమా! పరుగులతో ఆఫీసుకీ, అలసిపోయి ఇంటికీనూ. రోజంతా ఆ కంప్యూటర్ తెరలకి కళ్లప్పగించి పనిచేస్తుంది పిల్ల. దానికి తోడు కొత్త కాపురం! ఈ రోజులు మళ్లీ వస్తాయా వాళ్లకి? ఓ పిల్లో పిల్లాడో పుడితే హాయిగా పడుకోడానికి ఎలాగూ కుదరదు. ఇప్పుడది పెందరాళే లేచేయడం ఎందుకే? మనమిద్దరం ఉన్నాం కదా. అవసరమైతే కాస్త కూరలు తరిగిచ్చేందుకూ, బట్టలారేసి మడతలేసేందుకూ  వేరేమనిషిని పెట్టుకుందాం” అంది. రమ తల్లిని చూసి నవ్వుకుంటూ “అలాగేలే” అంది. 

**

సాధారణంగా ఆనంద్, శిశిర ఆఫీసుకి కలిసి వెళ్ళి కలిసే ఇంటికొస్తారు. 
ఆవేళ శిశిర ఒకర్తే వచ్చింది కాస్త త్వరగా. రమ, సతీశ్  ఇంట్లో లేరు. కుసుమ డ్రాయింగ్ రూం లో సోఫామీద పడుకుని ఉంది. ఎపుడేనా అల్లుడు ఇంట్లో లేకపోతే అలా సోఫా మీద వాలి టీవీ చూస్తుంది. బోల్ట్ చేసి లేదేమో, శిశిర తలుపు తెరిస్తే తెరుచుకుంది. 
“అపుడే వచ్చేశావేమ్మా” అంది కుసుమ, అనుకోకుండా మనవరాలు త్వరగా రావడంతో సంతోషంగా.
“ఇవాళ కొలీగ్ ఇంట్లో ఫంక్షనుందని వెళ్లి, అక్కడ్నుంచి వచ్చేశా అమ్మమ్మ గారూ. కాళ్లు కడుక్కుని బట్టలు మార్చుకుని వస్తా” అంటూ లోపలికి వెళ్ళింది. కుసుమ లేచి ఇద్దరికీ టీ పెట్టింది. 
శిశిర వచ్చేసరికి కప్పుల్లో టీ పోస్తోంది కుసుమ. వెనక నించి ఆవిడ బుజాలమీద వాలిపోతూ “మంచి టీ వాసన! మా బంగారు అమ్మమ్మ! అయినా మీరెందుకు పెట్టారూ? నేను పెడతా కదా?” అంది.
కుసుమ నవ్వుతూ “ఇప్పుడు మాత్రమేమైంది? నువ్వు తాగిపెట్టు” అంది.
“ఓకే.. మీరు చెప్పినట్టే తాగిపెడతాలెండి” అని వంటగట్టు మీదున్న చిన్నగిన్నె మూత తీసి చూస్తూ, “మధ్యాహ్నం కాఫీ తాగలేదా మీరు? ఈ డికాక్షనంతా అలాగే ఉంది?” అడిగింది. 
“ఏమిటో ఒకర్తెకీ తాగాలనిపించలేదు” అంది.
కుసుమ మొహంలోకి చూస్తూ “ఏమయింది అమ్మమ్మగారూ? ఒంట్లో బాలేదా?” అడిగింది. కుసుమ కళ్లు మామూలుగా లేవు.  
“రండి బాల్కనీలో హాయిగా టీ తాగుదాం” అంది మాటమారుస్తూ. ఇద్దరూ బాల్కనీలో కూర్చుని ఎదురుగా కనబడే పార్కులో పిల్లలాటలు చూస్తూ టీ తాగారు. 
“అమ్మమ్మగారూ, ఏమిటాలోచిస్తున్నారు?” అడిగింది మెత్తగా.
“ఏమీ లేదమ్మా…ఎంత చిన్నదైనా నాకంటూ వేరే ఒక ఇల్లూ వాకిలీ ఉంటే బావుండేదనిపిస్తుంది. ఇలా కూతురింట్లో ఉండాలని ఎవరికుంటుంది చెప్పు?” అంది కుసుమ. 
“ఎందుకలా అంటున్నారు? ఎవరన్నా ఏమన్నా అన్నారా?”
“ఎవరూ ఏమీ అనలేదే. నాకే అలా అనిపించింది. అనిపిస్తూ ఉంటుంది అపుడపుడు” 
“ఏం కాదు. ఎవరో ఏదో అన్నారు. చెప్పండి ఎందుకలా ఉన్నారు?”
“చెప్పేందుకేం లేదే తల్లీ. పక్కింట్లోకి కొత్తగా వచ్చారు కదా. ఆ పెద్దావిడ వచ్చింది మధ్యాహ్నం. ‘మీరు రమ అత్తగారా’ అంది. ‘కాదు అమ్మని’ అన్నాను. ‘ఇక్కడే ఉంటారా మీరు’ అనడిగింది. అలా ఇక్కడే ఉంటారా అనడిగినపుడల్లా నాకు మనసులో గుచ్చుకున్నట్టవుతుంది. ఎక్కడికి వెళ్తాను మరి? నాకు వేరే ఇల్లు లేదుకదా!” బయటికి మామూలుగా ఉన్నట్టున్నా, ఆవిడ మనసులో కారుతున్న కన్నీరు కనపడినట్టై శిశిర కళ్ళు చెమర్చాయి. 

“ఇలాంటి ప్రశ్నలు విన్నపుడు నాకేదైనా వృద్ధాశ్రమంలో చేరిపోతే బావుండుననిపిస్తుంది”
“ఏ వృద్ధాశ్రమంలో చేరాలని ఉంది మీకు?” యధాలాపంగా అడిగినట్టు ప్రశ్నించింది శిశిర.
అనుకోని ఆ ప్రశ్నకి తెల్లబోయి, “ఆనందకుటీరం” నోటికొచ్చిన పేరు చెప్పింది కుసుమ. 
“ఇవాళే ఒక బోర్డు మీద ఆనందకుటీరం అని రాసి, మన వీధి తలుపుకి పెట్టేస్తా” అంది శిశిర.
ఫక్కుమని నవ్వింది కుసుమ.

నవ్వుతుంటే గులాబీరంగులో మెరిసిపోతున్న ఆవిడ మొహాన్ని చూస్తూ “ఇక్కడే ఉంటారా మీరు అని ఎవరైనా అడిగితే ‘వీళ్లు నన్ను ఎక్కడికీ వెళ్లనివ్వరండీ. ఎక్కడికి వెళ్లినా మర్నాడే తీసుకొచ్చేస్తారు’ అని చెప్పాలి!” అంది ఆపేక్షగా. మళ్లీ వెంటనే కోపం తెచ్చుకుంటూ “అయినా వాళ్లకెందుకు అవన్నీ?” అంది. 
“పోన్లే.. ఆవిడేమంటే ఏం గాని, ఇపుడు పుష్యమీ, శ్రీధర్ వచ్చారనుకో... వాళ్లెక్కడ పడుకుంటారు? నాకంటూ వేరే ఇల్లుంటే ఇలా నాకోసం మీరంతా సర్దుకోనక్కర్లేదు కదా” అంది. 

“పుష్యమి అమెరికా నించి వచ్చి ఇక్కడ ఎన్నాళ్లుంటుంది అమ్మమ్మగారూ? మా పెళ్లికోసం మొన్న వచ్చి వెళ్లింది కదా! మళ్లీ అలా వచ్చినపుడు నేనూ తనూ హాయిగా హాల్లో పక్కలు పరుచుకుని టీవీ చూస్తూ పడుకుంటాం. అలా తనకిష్టం లేకపోతే హొటల్లో చక్కగా ఏసీ రూమ్ తీసుకుంటాం. రాత్రి భోజనాలయ్యాక వెళ్లి పొద్దున్నే వచ్చెయ్యచ్చు” 
“నాకోసం మీరంతా ఎందుకు సర్దుకోవడం?” 
శిశిర లేచి కుసుమ కుర్చీముందు కింద కూర్చుని, మౌనంగా ఆవిడ చేతులు నిమురుతూ ఉండిపోయింది. 

తర్వాత నెమ్మదిగా “అమ్మమ్మగారూ, ఒకడుగుతా చెప్పండి. అత్తయ్యగారూ వాళ్లకి ఇంత ఫ్లాట్ ఉంది కదా. అయినా మేం ఉద్యోగం మారి బెంగుళూరులోనో, అమెరికాలోనో ఉంటే వాళ్లు అక్కడ కూడా ఇంకో ఇల్లు కొనుక్కుంటారా? కొనుక్కోరు కదా. మాతోనే ఉంటారు. ఇంత ఇల్లున్నా పెద్దయ్యాక వాళ్లు పిల్లల ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అపుడు ఎవరొచ్చినా వేరే అరేంజ్ మెంట్ చేసుకుంటారు గాని, పెద్దవాళ్లుండడం వల్ల ఇబ్బంది అనుకోరు” శిశిర మాటలు వింటూ మౌనంగా పార్కువైపు దృక్కులు సారించి కూర్చున్న కుసుమ ‘లోకరీతి తెలియని వెర్రిదానా’ అన్నట్టు శిశిర వైపు చూసి, పేలవంగా నవ్వింది. “అంతదాకా ఎందుకు అమ్మమ్మగారూ! అత్తయ్యా మామయ్యా పుష్యమి దగ్గరకి వెళ్లారనుకోండి. వాళ్లది రెండు బెడ్రూముల ఫ్లాట్ కదా. మరి ఎవరన్నా గెస్ట్ వస్తే ఏంచేస్తారు? హాల్లో కింద పక్కలేర్పాటు చేస్తారు గానీ అమ్మా నాన్నా వచ్చారు కనక ఇబ్బందిగా ఉందనుకుంటారా? కన్నపిల్లలు పసివాళ్లుగా ఉన్నపుడు వాళ్లే ఇంటికి చక్రవర్తులన్నట్టు, వాళ్ల సౌకర్యమే ప్రధానమన్నట్టు చూస్తారు కదా అమ్మా నాన్నా? మరి ఆ అమ్మానాన్నా పెద్దవాళ్లైపోతే, వాళ్ల అవసరాలే ఫస్ట్ ప్రయారిటీ కావాలి పిల్లలక్కూడా!”
కుసుమ అరచేతులు రెండిటినీ పట్టుకుని తన చెంపలకి చేర్చుకుంటూ “అమ్మమ్మ గారూ! పిల్లలు చిన్నగా ఉన్నపుడు అమ్మా నాన్నల ఇంట్లో ఎంత హాయిగా ఉంటారు! అది తమ సొంతం అనుకుంటారు గాని మాకు వేరే ఇల్లులేదని అనుకుంటారా? అలాగే పిల్లలు పెద్దయ్యాక, తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంట్లో ఉండాలి స్వేచ్ఛగా, స్వతంత్రంగా. మాకు వేరే ఇల్లులేదని అనుకోకూడదు” అంది శిశిర.
కుసుమ విభ్రాంతిగా చూసింది నిండా ఇరవైమూడేళ్లు లేని మనవరాలివైపు. మూగబోయిన మనసుతో ఆ పిల్లని దగ్గరగా లాక్కుని “నీకెందుకే నామీద ఇంత ప్రేమా?” అంది గొంతు రుద్ధమవకుండా జాగ్రత్త పడుతూ.  “మీరు నాకు ‘ఆనందా’న్నిచ్చారు. అందుకే!” మిస్చివస్ గా నవ్వుతూ అంది శిశిర. “నీకు ఏదిచ్చినా రెట్టింపై తిరిగొస్తుందే అమ్మలూ. అందుకే మా ఆనందాన్ని నీకిచ్చాం, మళ్లీ రెట్టింపు చేసి మాకిస్తావని!” అంది కుసుమ మనసారా నవ్వుతూ. ఎప్పుడొచ్చిందో తలుపు దగ్గర నిలుచున్న రమ నవ్వుతూ “అప్పుడే కాదులే…ఓ రెండు మూడేళ్ల తర్వాత” అంది. 

“అన్ని రోజులెందుకూ? ఇప్పుడే ఇస్తా” అంది శిశిర. 
“పిచ్చిపిల్లకి అర్ధమైనట్టులేదు” అంటూ కుసుమ పకపకా నవ్వుతుంటే, రమ నవ్వాపుకుంటూ లోపలికి పోయింది.


ర‌చ‌న‌:  డా. వార‌ణాసి నాగ‌ల‌క్ష్మి