TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
సూపర్ మ్యాన్
నేనొక సూపర్ మ్యాన్‌ని. ఎగరగలుగుతాను. ఎటు కోరితే అటు వెళ్ల గల్గుతాను. దూరదూరాల్లో ఏం జరుగుతున్నదీ కూడా నాకు కనిపిస్తుంది. నన్నెవరు తలచుకున్నా నాకు వినిపిస్తుంది.. ఒకరోజున నేను అట్లా ఊరికే కూర్చొని ఉంటే, ఎవరో సహాయం కోసం పిలుస్తున్నట్లు నాకు అనిపించింది. తక్షణం నేను అటువైపుకి ఎగిరాను.
చూస్తే అక్కడ ఇల్లు ఒకటి, కాలి పోతున్నది! ఆ ఇంటిలో ఒక పిల్లవాడు ఇరుక్కుపోయి ఉన్నాడు. బయటికి రాలేక ఏడుస్తున్నాడు. నేను ఇంక అటూ ఇటూ చూడలేదు: రివ్వున వాడి దగ్గరికి దూసుకు పోయాను. వాడిని ఎత్తుకొని, కిటికీలోంచి అంతే వేగంగా బయటికి ఎగిరిపోయాను. నేను వాడిని బయటికి తీసుకెళ్ళిన మరుక్షణం ఇల్లు మొత్తం కూలిపోయింది! నిజానికి నా వెనక ఏం జరిగిందో నాకు తెలీనే లేదు.
నేను ఆ పిల్లవాడిని క్రిందికి దింపి, వాడి తల్లిదండ్రులకు అప్పగించటంలో బిజీగా ఉన్నాను. అక్కడ చేరినవాళ్లంతా నన్ను చాలా మెచ్చుకున్నారు. అభినందించారు. "సూపర్ హీరో!" అని పొగిడారు. ఇక ఆనాటినుండి నేను అందరికీ సహాయం చేస్తూనే ఉన్నాను. ఒకసారి పది అంతస్తుల భవనం ఒకటి కూలిపోవస్తున్నది. సరిగ్గా ఆ సమయానికి నేను అక్కడే ఉన్నాను.
నేను నా చేతులతో ఆ భవనాన్ని నిలబెట్టబోయాను. కానీ దాన్ని అలా నిలపటం అసాధ్యం. దాని పునాది సరిగా లేదు- ఒక వైపునుండి అది మెల్లగా కూరుకుపోతున్నది. నేను నా శక్తినంతా వెచ్చించి, భుజాల్ని దానికి తాటించి నిలబడ్డాను. అట్లా అది కొంత సేపు నిలబడింది; కానీ అంతలోనే మెల్లగా క్రుంగిపోసాగింది! ఆ సమయంలో నాకు చాలా నిరాశగా అనిపించింది: 'ఈ పని నా వల్ల కాదు; నేను ఏమీ చేయలేను' అని. అయితే అది ఒక్క క్షణం మాత్రమే..
మళ్ళీ నేను ధైర్యం తెచ్చుకున్నాను. క్రుంగిపోతున్న భాగాన్ని నా చేతులతో పట్టుకొని ఎత్తటం మొదలు పెట్టాను. అక్కడ చేరినవాళ్లంతా నన్ను ప్రోత్సహిస్తూ "సూపర్ హీరో! నువ్వు చెయ్యగలవు! నువ్వు వీళ్లందరినీ కాపాడగలవు" అని అరుస్తున్నారు. అట్లా నేను దాదాపు ఒక అరగంట పాటు ఆ భవంతిని నిలిపి ఉంచగలిగాను. అయితే ఆలోగా అందులో ఉన్న మనుషులందరూ బయటికి వచ్చేసారు. ఆ పైన నేను మెల్లగా భవంతిని వదిలి ఇవతలికి రాబోతున్నాను..
అంతలో గుంపులోంచి వినబడింది... నాకు బాగా పరిచయం ఉన్న గొంతే అది: "ఇట్లా అయితే ఎలాగ? అందరూ ఏమంటారు? ఎంత సేపురా, ఇలాగ? నా వల్ల కాదు" అంటున్నారు ఎవరో. "ఎవరది? ఏమంటున్నారు? ఇంత బరువు ఎట్లా మొయ్యాలి?" అంటున్నాను నేను. "ఏం కల వచ్చిందిరా? మళ్ళీ ఆ సూపర్ మ్యాన్ కలేనా? ఎప్పుడూ ఆ పిచ్చి పిచ్చి సినిమాలు చూడద్దురా అంటే వినవు!" అంటోంది అమ్మ. "ఓహో ఇదంతా కలేనా?!" అనుకున్నాను నేను. "ఎంత కలైనా ఇంతమందికి సాయం చేయటం మాత్రం బలే ఉంది!" అని నవ్వుకుంటూ లేచి బాత్రూముకు పరుగెత్తాను.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో