TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
సహాయం
అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది చాలా అల్లరి కోతి. అది ఒక రోజు మామిడి చెట్టు ఎక్కింది. అప్పుడే వస్తున్న కుందేలు కోతిని చూసి, "నాకు ఒక మామిడి పండు ఇవ్వు" అంది."నేను ఇవ్వను" అంది కోతి. అప్పుడు కుందేలు ఆకలితోటే వెళ్ళిపోయింది.అంతలో ఒక తోడేలు అటుగా వచ్చింది. కోతి దాన్ని చూసి బెదిరి, నేలమీద పరుగెత్తటం మొదలు పెట్టింది. తోడేలు దాని వెంటపడి తరిమి, చివరికి దాన్ని చేజిక్కించుకున్నది.
అటువైపుగానే కాస్త దూరాన తలవంచుకొని పోతున్నాయి కుందేలు, దాని మిత్రుడు జింకా. అవి చూసాయి, తోడేలు కోతిని ఎత్తుకుపోవడం. రెండూ'కోతిని కాపాడాలి. ఎలాగ?'అని ఒక ఉపాయం ఆలోచించాయి. గబగబా వెళ్ళి, తోడేలు వస్తున్న దారిలో ఓ చెట్టుకు మాంసం ముక్కను వ్రేలాడదీసాయి. ఆ మాంసం ముక్కని అందుకోవాలంటే తోడేలు బాగా పైకి ఎగరాలి. కోతిని లాక్కొస్తున్న తోడేలుకు చెట్టునుండి వ్రేలాడుతున్న మాంసం ముక్క కనపడగానే నోరూరింది.
"కానీ ఈ కోతి ఒకటి ఉన్నదే, ఎలాగ?" అని ఆలోచించింది. కోతిని ఒక ప్రక్కగా చెట్టుమొదల్లో బంధించి వచ్చింది. మాంసం ముక్కను అందుకొనటం కోసం ఎగరబోయింది.
అయితే ఆ చెట్టు క్రింద ఉన్నది పెద్ద గుంత! కుందేలు, జింక ఆ గుంత కనబడకుండా దానిమీద ఆకులు, చెత్తా కప్పి ఉంచాయి! మాంసం ముక్కకోసం ఎగిరిన తోడేలు నేరుగా ఆ గుంతలోకే పడిపోయింది!
కుందేలు, జింక వెళ్ళి కోతిని విడిపించాయి. కోతి కుందేలుకు క్షమాపణ చెప్పుకున్నది. "ఇంతకుముందు నువ్వు అడిగితే నేను పండు ఇవ్వనన్నాను. నన్ను క్షమించు" అన్నది. "ఏం పర్లేదులే! మనకు ఆకలి ఎక్కువైనప్పుడు అందరమూ అలాగే చేస్తాము" అన్నది కుందేలు తేలికగా. అటుపైన మూడూ కలిసి సంతోషంగా జీవించాయి.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో