Facebook Twitter
ఎవరు దాత..

ఎవరు దాత?

 

రామచంద్రాపురంలో రామయ్య, సోమయ్య అనే ధనిక రైతులు ఇద్దరు వుండే వాళ్ళు. ఇద్దరూ మంచి వాళ్ళు; తమకు చేతనైనంత వరకూ ఇతరులకు సాయం చేసేవాళ్ళు. అందరూ వాళ్ల దాతృత్వం గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు.

ప్రతి సంవత్సరమూ పంట కోతలకు ముందు, గ్రామదేవతలకు ప్రీతిగా అక్కడ ఒక జాతర జరుగుతుంది. ప్రతిసారి లాగానే ఈసారి కూడ రామయ్య, సోమయ్య ఇద్దరూ జాతరకోసం భూరి విరాళం ఇచ్చారు. ఆ సమయంలో గ్రామ దేవతలకు వీళ్లిద్దరిలో నిజంగా ఎవరు గొప్పవాళ్ళో కనుక్కోవాలని ఒక కోరిక కలిగింది. ఆ సమయానికి కోతలు అయ్యి రామయ్య, సోమయ్య పంటలు చేనులో ఉన్నాయి. వీళ్లని పరీక్షిద్దామనుకున్న గ్రామదేవతలు ఆ పంట మొత్తాన్నీ మాయం చేసేసారు.

చేతికి అంది వచ్చిన పంటని 'దొంగలు ఎత్తుకెళ్ళారు' అనుకున్నారు ఇద్దరూ. 'ఇలా జరిగిందేమి?’ అని నిండా విచారంలో మునిగి ఉన్నాడు సోమయ్య. అతను ఇంకా ఆ బాధలో ఉండగానే పొరుగూరు నుండి రైతులు కొందరు వచ్చారు. "అయ్యా! ప్రతి ఏడాదీ తమరు ఇచ్చే ధాన్యం పుణ్యాన మా ఊళ్ళో ముసలివారికి అన్నదానం జరుగుతున్నది. ఈసారి తమరి పంట చేతికి అందలేదని తెలిసింది. ఈ కార్యక్రమం మరి ఎలా జరపాలో తెలీకుండా ఉంది" అని బాధ వ్యక్తం చేసారు. సోమయ్య తన అశక్తతని చెబుతూ "ఈసారికి కుదరదు. అన్నీ అనుకూలిస్తే, వచ్చే ఏడాది ఏమైనా సాయం చేస్తాను" అని చెప్పేసాడు వాళ్లకు.

వాళ్ళు నిరాశగా బయటికి వచ్చి, సాయాన్ని అపేక్షిస్తూ రామయ్య ఇంటికి పోయారు. రామయ్యకు కూడా పంట చేతికి అందలేదన్న బాధ ఉండింది కానీ, ముందు అనుకున్న ప్రకారం అతను ఇంట్లో పూజా కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాడు; దానికి ఊళ్ళో వాళ్లను అందరినీ భోజనానికి పిలిచి ఉన్నాడు.

 

ఆ సమయంలో‌ వీళ్ళు వచ్చి సాయం అడిగితే "అన్ని ఖర్చుల్లో ఇదీ ఒక ఖర్చు.. కానివ్వండి. ఎలాగో ఒకలాగా మీకు అయిదారు నెలలకు సరిపడా ధాన్యం ఇస్తాను; రబీ పంటలోంచి మిగతాది చూద్దాం. ముందైతే మీరంతా భోజనం చేసి వెళ్ళండి!" అన్నాడతను. ఇంట్లో వాళ్ళు ఆ సరికే సైగలు చేస్తున్నారు- "ఇంకా వంట పూర్తవలేదు" అని. "దానిదేముంది, ఏముంటే అది పెట్టండి" అంటూ దేవుడికోసం ప్రత్యేకంగా చేసిన వంటకాలను తెప్పించి వాళ్లకు పెట్టి, తృప్తిగా సాగనంపాడు రామయ్య. ఆ తర్వాత గ్రామదేవతలే మారువేషంలో వచ్చి "రామయ్యా! దేవుడికి చేసిన వంటలు తెచ్చి ఎవరికో పెట్టేసావే, దేవుడంటే అంత తిరస్కారం అయితే ఎలాగ?" అన్నారు.

"అయ్యో, తిరస్కారం ఏమీ లేదు. వాళ్ళని చూస్తే పాపం ఆకలిమీద ఉన్నారని తెలుస్తూనే ఉంది. దేవుడిని ఆకలితో పంపితే ఎలాగ అని, ఆయనకోసం చేసినవి ఆయనకే ఇచ్చాను" అన్నాడు రామయ్య. లేమిలో కూడా దానశీలతను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న రామయ్యని మెచ్చుకున్న గ్రామదేవతలు నవ్వి, "నువ్వు ఎలాంటివాడివో తెలుసు-కుందామని, ఇట్లా ఓ పరీక్ష పెట్టాము. నీ ధాన్యమూ, సోమయ్య ధాన్యమూ ఎక్కడికీ పోలేదు. మీ గాదెల్లోకే చేరి భద్రంగా ఉంది. సోమయ్యకు కూడా చెప్పు- మీరు ఇద్దరూ మీరు చేసే మంచిపనుల్ని కొనసాగించండి. మంచి పనులు చేసేటప్పుడు కూడా "నేను" అన్న అహంకారపు భావన రాకుండా చూసుకోండి. మీకు మేలవుతుంది" అంటూ మాయం అయిపోయారు.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో