Facebook Twitter
పావురం చెప్పిన పాఠం

పావురం చెప్పిన పాఠం

 


అనగనగా ఒక ఊరి శివాలయంలో చాలా పావురాళ్ళుండేవి. అవన్నీ అక్కడ చాలా సంతోషంగా‌ బ్రతికేవి. అయితే ఒకసారి ఆ గుడికి కుంభాభిషేకం చేసే సమయం దగ్గరయింది. అభిషేకం కోసం ఆలయాన్ని శుభ్రం చేయటం మొదలు పెట్టారు. చాలామంది పనివాళ్ళు వచ్చారు. బూజు దులిపే కట్టెలు, చీపుర్లు పట్టుకొని ఎక్కడెక్కడి బూజూ దులపసాగారు. పక్షుల గూళ్ళను తొలగించటం మొదలు పెట్టారు.


పావురాళ్ళకు చాలా కష్టమైంది. వాటి గూళ్ళన్నీ పోయాయి. ఇక అక్కడ ఉండటం ఇష్టం కాలేదు వాటికి. శివాలయం ఎదురుగానే ఉన్నదొక చర్చి. పావురాళ్ళన్నీ ఇప్పుడు ఆ చర్చిలోకి వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నాయి. చర్చిలోని ప్రశాంత వాతావరణం వాటికి చాలా నచ్చింది. అక్కడ వాటిని బెదిరించేవాళ్ళు, గూళ్లను చెరిపే వాళ్ళు ఎవరూ లేరు. అట్లా‌ అవన్నీ కొంతకాలంపాటు చర్చిలో ప్రశాంతంగా జీవించాయి. అయితే అంతలోనే క్రిస్మస్ పండగ వచ్చింది. చర్చికి సున్నం కొట్టే పనులు మొదలయ్యాయి. పావురాళ్లకు మళ్ళీ కష్టకాలం వచ్చింది.


ఇప్పుడు ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు వాటికి. అటూ ఇటూ చూసాయి. దగ్గర్లోనే ఉన్న మసీదు కనబడింది. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్న ఆ మసీదు వాటికి అనువుగా తోచింది. ఇక ఇప్పుడు అవన్నీ వెళ్ళి మసీదును ఆశ్రయించాయి. అట్లా మరికొంత కాలం గడిచింది. అంతలోనే రంజాన్ మాసం వచ్చింది. పావురాళ్ళకు మళ్ళీ‌ఇబ్బందులు మొదలయ్యాయి. మళ్ళీ సందిగ్ధంలో పడ్డాయి. చివరకు మళ్ళీ శివాలయంలోకి వచ్చి చేరుకున్నాయి..మునుపటి లాగే జీవించసాగాయి.

 


అంతలోనే ఏదో కలవరం మొదలైంది. మనుష్యులు ఒకరినొకరు తుపాకులతో కాల్చుకుంటున్నారు- కత్తులతో నరుక్కుంటున్నారు! పావురాళ్ళు గూళ్ళలో నుండి బయటకు వచ్చి చూశాయి. పిల్ల పావురం ఒకటి భయంతో తన తల్లి రెక్కల సందులోకి చేరింది. తల్లి పావురం ఒకటి తన పిల్లలకోసం వెతుక్కొని, వాటినన్నిటినీ ఒక మూలకు తరిమి, తను అడ్డంగా కూర్చున్నది.


"ఈ మనుషులకేమైంది, ఇట్లా ఒకళ్ళనొకళ్ళు కాల్చుకుంటూ నరుక్కుంటున్నారు?" అడిగిందొక చిన్న పావురం. "ఈ గుడిలో వాళ్ళు, ఆ చర్చిలో వాళ్ళు, మసీదులోవాళ్ళు 'మేం గొప్ప' అంటే 'మేం గొప్ప' అని కొట్టుకుంటున్నారు. నిజంగా ఎవరు గొప్పో మరి?!" అన్నది వాళ్ళమ్మ. "మరి మనం గుడిలోనూ ఉన్నాం, చర్చిలోనూ ఉన్నాం, మసీదులోనూ ఉన్నాంగా? వాళ్ళందరికంటే- మరి, మనమే గొప్ప అన్నమాట!" అన్నది చిన్నపావురం, ఆలోచిస్తున్నట్లు. "ఔను తల్లీ! మనం అస్సలు కొట్టుకోంగా, అందుకని మనమే గొప్పవాళ్ళం" అన్నది తల్లి పావురం, దాన్ని కూడా తన రెక్కల సందులోకి నెడుతూ.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో