Facebook Twitter
అరిసెల కథ

అరిసెల కథ

 

రామాపురం అనే ఊళ్ళో పుల్లమ్మ, పుల్లయ్య అనే పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. ఆ రోజు పండుగ రోజు. ఊళ్ళో వాళ్ళంతా మంచి మంచి వంటకాలు చేసుకొని తింటున్నారు. తాము కూడా ఏదో ఒకటి చేసుకొని తినాలనిపించింది పుల్లయ్యకు. అయితే ఇంట్లో ఏం సామానులు ఉన్నాయో, ఏవి లేవో తెలీదు. ఇంకా తెమ్మంటే తెచ్చేందుకు తన దగ్గర డబ్బు కూడా లేదు! అందుకని అనుమానంగానే "ఇదిగో అమ్మీ, నేను యాయవారానికి వెళ్తున్నాను. పండగ కదా, నేను తిరిగి వచ్చేలోగా తినేందుకు ఏ అరిసెలో చేసి పెట్టు" అని చెప్పి, పుల్లమ్మ నోరు తెరిచేలోగా బయటికి వెళ్ళి పోయాడు. "అరిసెలు తినాలనిపిస్తున్నట్లుంది, పాపం" అని పుల్లమ్మ డబ్బాల్లో వెతికింది. ఓ పది పన్నెండు అరిసెలకు సరిపడ సామాన్లు మాత్రం ఉన్నాయి ఇంట్లో. 

 

 

"ఊరికే ఇంతింత ఖర్చు పెట్టుకోకూడదు. ఒక్క నాలుగు అరిసెలు మాత్రం చేస్తాను- చెరి రెండూ వస్తాయి, చాలు!" అని కొంచెం బియ్యప్పిండి మాత్రం తీసుకొని, దానిలోకి కొంచెం బెల్లం పాకం వేసి కలిపింది పుల్లమ్మ. ముందుగా ఒక అరిసె చేయగానే, ఆ ఘుమఘుమలకి ఆమె నోరు ఊరింది. "ఎట్లా ఉందో, ఏమో- చూడకపోతే మిగతా అరిసెలు పాడౌతాయి" అంటూ ఆ అరిసెను తినేసింది ఆమె. చూస్తే అందులో బెల్లం ఎక్కువైంది! "అయ్యో! తీపి ఎక్కువైతే బాగుండదు!" అంటూ ఇంకొంత బియ్యప్పిండి తెచ్చి కలిపి, మరొక అరిసె చేసింది. ఆ అరిసె తిని చూస్తే తెలిసింది. తీపి తక్కువ ఉంది! అందుకని ఇంకొంత పాకం పట్టి, దానికి కలిపి, ఇంకో అరిసె చేసి, రుచి చూసింది. ఈసారి చేసిన అరిసె చాలా తియ్యగా అయింది. మళ్ళీ పిండి పోసింది. ఈసారి మళ్ళీ పాకం తక్కువ అయ్యిందని పాకం; తీపి ఎక్కువైందని పిండి- ప్రతిసారీ ఒక అరిసె చేస్తూ, దాన్ని రుచి చూస్తూంటే పిండి మొత్తం దగ్గరపడింది. అంతా బాగుంది అనుకునే సరికి, చివరికి కొంచెమే పిండి మిగిలింది! ఆ పిండితోటి రెండే అరిసెలు తయారయ్యాయి! కొద్దిసేపటికి పుల్లయ్య వచ్చాడు. "వాసన ఘుమ ఘుమలాడుతున్నది. ఏం చేసావే?" అని అడిగాడు సంతోషంగా, నవ్వుకుంటూ. 

 

 

"అరిసెలు చేశానండీ! మీరు అరిసెలేగా, చెయ్యమన్నది?! అవంటే నాకు కూడా ఇష్టమాయె!" అన్నది పుల్లమ్మ. "తొందరగా తీసుకురావే, నోరు ఊరుతున్నది. కడుపులో ఆకలి దంచేస్తున్నది!" అన్నాడు పుల్లయ్య, కంచం ముందు కూర్చుంటూ. "సరేనండీ!" అని తను చేసిన ఆ రెండు అరిసల్నీ పట్టుకొచ్చేందుకు లోపలికి వెళ్ళిన పుల్లమ్మ, అక్కడి అరిసెల్ని చూస్తూ ఆగలేకపోయింది: "సగం నా వాటా, కదా?!" అంటూ తన వాటా క్రింద వచ్చే ఒక అరిసెనూ దారిలోనే తినేసింది- మిగిలిన ఒక్క అరిసెను మాత్రం కంచంలో పెట్టి భర్త ముందు పెట్టింది. పుల్లయ్య ఆ అరిసెను చూసి విస్తుపోయాడు- "ఒక్కటేనా?! అదేనా, వొచ్చింది?!" అన్నాడు ఏడుపు మొహం పెట్టి. "లేదండీ! మొత్తం 12 అరిసెలు వచ్చాయి; కానీ మిగితా పదీ రుచి చూడటానికే సరిపోయాయి!" అన్నది పుల్లమ్మ అమాయకంగా. "అన్నేసి అరిసెలు ఎలా తిన్నావే?!" అన్నాడు పుల్లయ్య "అది.. ఎలా తిన్నానంటే...ఇలా!" అని ఆ ఒక్క అరిసెను కూడా తీసుకొని తినేసింది పుల్లమ్మ!

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో