చేసిన మేలు

అనగనగా ఒక అడవిలో ఒక కాకి, ఒక కోయిల ఉండేవి. అడవిలోని ఒక వృక్షం మీద వాటి నివాసం ఉండేది. ఒకరోజున వాటికి చాలా ఆకలైంది. ఆహారం కోసం అడవి అంతా గాలించాయి. ఎంత వెతికినా తినేందుకు ఏమీ దొరకలేదు. తిరిగి తిరిగి పాపం, అవి బాగా అలసిపోయాయి కూడా. దాహంతో వాటి నోరు పిడచబారింది. "ఇక లాభం లేదు- ఈ పూటకు నీటితోటే కడుపు నింపుకుందాం!' అని అనుకునే సరికి అవి అడవిని దాటి జనావాసాలను చేరుకొనేసాయి! అది మండు వేసవి.

ఊరిలో కూడా ఏ మూలనా నీటి జాడ లేదు. మనుషులుండే గుడిసెలలోకి పోయి వెతికేంత చొరవ వీటికి లేదు! ఆ సరికి అవి రెండూ చాలా అలసి పోయాయి. అంతలో కొంత దూరాన మంచి చేను ఒకటి కనబడింది. రెండూ ఆ చేనును చేరుకునేసరికి కోయిల మరింత నీరసించింది. ఇక దానికి అడుగు తీసి అడుగు వేసేంత బలం కూడా లేదు. ఉండిన చోటనే కూలబడిపోయింది.

కాకి ఒంటరిగా చేనులోకి పోయింది. చేనులో దూది విరగకాసి ఉండింది. కానీ నీరు ఏ మూలనా పారటం లేదు- బిందు విధానం వలన! అయితే బోరుబావి కాడ నీరు కొంచెం కొంచెంగా కారుతూ ఉండింది! కాకి ఆ తావును చేరి, తాను గబగబా కాసంత నీరు తాగేసి కడుపు నింపుకుంది. 'మరి కోయిలకు నీరు తీసుకొని పోయేది ఎలాగ?' అని ఆలోచించింది. అంతలో దాని చూపు దూది మీద పడింది. గబగబా పోయి, కొంత దూదిని సేకరించి, దానిని నీటిలో తడిపింది. తడి దూదితో ఎగిరి కోయిలను చేరింది. కోయిల మన సోయిలో లేదు.

కాకి తడి దూదిని దాని ముఖం మీద వేసి పిండింది. ఇలా రెండు మూడు తడవలు అటూ ఇటూ తిరిగి, తడి దూదిని తీసుకొని పోయి వేసే సరికి, ఆ తేమకు కోయిల కొంచెం కదిలింది. కోయిల కనులు తెరిచేసరికి కాకికి చాలా సంతోషం వేసింది. అది ఇంకో మూడు వరుసలు తిరిగి మరింత తడి దూదిని తీసుకుపోయింది.

అమృతం లాంటి ఆ నీటి బిందువుల వలన కోయిల తేరుకొనింది. సంతోషంతో వాటికి సగం బలం సమకూరింది. ఇక అవి నిదానంతా చేనులోని బోరుబావిని చేరుకొని, కడుపులు నింపుకుని, కొంత సేపు సేద తీరాయి. చేనులో కాకికి తొండ లాంటిది ఒకటి దొరికింది కూడా. తనకు దొరికిన తిండిని అది కోయిలతో కూడా పంచుకొనింది.
.jpg)
సాయంకాలం అవుతుండగా కాకి, కోయిల రెండూ తిరిగి కాసిని నీరు తాగి, వెనుకకు మరలాయి. 'కలసి ఉండటం వలననే కదా, ఇవి తిరిగి రాగలిగింది?' అని అడవిలోని పక్షులు సంబరపడినాయి. 'కాకులు ఎలాగైనా చాలా తెలివైనవి' అని అభినందించాయి. 'ఇకమీద చాలా దూరాలు ఎగరకండి' అని తమ కూనలకు బోధించాయి.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో



