Facebook Twitter
వరం

వరం

 


పావని కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని సవతి తల్లి చేతిలో యమ యాతనలు అనుభవించింది. సవతి తల్లి ఆ పిల్లను ఓ త్రాగుబోతుకు కట్టబెట్టింది. అంతా చేసి తనకు పుట్టిన సంతానమన్నా గొప్పగా ఉన్నారా, అంటే అదీ లేదు రోగాల పుట్టలై ఇద్దరూ అకాల మృత్యువు పాలయ్యారు. అటుపైన అత్తా-మామల ఆరళ్ళు భర్త ప్రమాదంలో కాళ్ళు పోగొట్టుకోవటం. జీవచ్ఛవంలా బ్రతుకు ఈడ్వవలసి రావటం పాపం, అన్నీ కష్టాలే ఆమెకు!

చివరికి ఆమెకు జీవితం అంటేనే విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఓ మర్రి చెట్టు క్రిందికి చేరుకోగానే చెట్టు పైనుండి బ్రహ్మరాక్షసుడొకడు ఆమె ముందుకి దూకాడు. "పావనీ, ఆత్మహత్య మహా పాపం! దాని వల్ల ఇప్పటి కష్టాలు తీరటంకాదు; బాధలు రెట్టింపు అవుతాయి. నాలాగా ఏ చెట్టుమీదో, పుట్టమీదో తిరుగుతూ అనేక తరాలపాటు కృంగి కృశిస్తూ తిరగాల్సి వస్తుంది" అని రకరకాలుగా బుజ్జగించి చెప్పాడు. "ఇన్ని తెలిసినవాడివి, ఇలా అయ్యావేం?" అని అడిగింది పావని, కొంచెం తేరుకొని.

"ఏం చెప్పను? ఒకప్పుడు నేను గొప్ప శివభక్తుడిని కానీ ఒట్టి కోపిష్టి వాడిని. ఆ కోపంలో ఎంతో మందిని నాశనం చేశాను. చివరికి అందరూ నాకు ఎదురు తిరిగారు; నా ఆస్తులన్నిటినీ లాక్కున్నారు. నా భార్యాపిల్లలు నన్ను విడచి పెట్టేశారు. తినేందుకు ఏమీలేక, రోగాల పాలై, చివరికి వాటినుండి తప్పించుకుందామని, ఆత్మహత్య చేసుకు-న్నాను. ఇలా తయారయ్యాను" చెప్పాడు వాడు. వాడి కథ వినేసరికి పావనికి వాడి మీద జాలి వేసింది. "నీ కథ వింటే ఇక ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోరు. నేనూ తిరిగి ఇంటికి వెళ్ళి పోతానులే, ఇప్పటికి అయ్యింది చాలు" అన్నది విచారంగా.

మరుక్షణం ఆ బ్రహ్మరాక్షసుడికి దివ్య శరీరం వచ్చేసింది. "నిన్ను ఆత్మహత్య చేసుకోకుండా ఆపాను చూడు, అ పుణ్యం వల్ల నా కష్టాలు తీరిపోయాయి. రాక్షస రూపం నుండి నాకు విముక్తి లభించింది" అని చెప్పి పావనికి ఓ మంత్రం ఉపదేశించాడు ఆ దివ్యపురుషుడు. "దీన్ని జపించు, అంతా మేలు జరుగుతుంది" అని చెబుతూ. పావని శ్రద్ధగా ఆ మంత్రం జపించే సరికి, పార్వతీ పరమేశ్వరులు ఆమె ముందు ప్రత్యక్షం అయ్యారు: "ఏం వరం కావాలో కోరుకో" అంటూ.

పావనికి తను ఇంతకాలమూ పడ్డ కష్టాలు కన్నీళ్ళు, బాధలు అన్నీ గుర్తుకొచ్చాయి. "దేవాధిదేవా! ఈ లోకంలో ఎవరికీ కష్టాలు-బాధలు లేకుండా చెయ్యి స్వామీ!" అంటూ కన్నీళ్ళు కార్చింది. శివుడు నిర్ఘాంత పోయాడు. "అసాధ్యం! అలవికాని కోరికలు కోరకు, పావనీ! నీకు ఒక్కదానికీ ఏం కావాలో చెప్పు" అన్నాడు. "కేవలం నా ఒక్కదానికోసం ఏమీ కోరుకోలేను స్వామీ! ప్రపంచంలో ఎవ్వరికీ ఏలాంటి బాధలూ లేకుండా వరం ఇవ్వండి - నా కోరిక అదే" అన్నది పావని.

"ఇది సృష్టికి వ్యతిరేకం నేను ఇవ్వలేను" అన్నాడు శివుడు. "వేరే ఏదైనా కోరుకో, పావనీ" అన్నది పార్వతీదేవి. "తల్లీ నా కోరిక అదొక్కటే, నేనేం చెయ్యను?" అంది పావని. "పాపం, ఆడపిల్ల, అడుగుతోంది, ఆమె కోరుకున్న వరమే ఏదో ఇచ్చేస్తే పోలేదా, అట్లా కఠినంగా మాట్లాడతారెందుకు?" భర్తతో నెమ్మదిగా చెప్పింది పార్వతమ్మ. "లేదు పార్వతీ! మనుషులు గతంలో చేసిన పనులవల్లనే వాళ్లకు కష్టాలుగాని, సుఖాలుగాని కలుగుతుంటాయి. ఆ కర్మ చక్రంలో నా వంటివాళ్ళు జోక్యం చేసుకోకూడదు; చేనుకోను" అన్నాడు శివుడు. "నీ కోరికను మార్చుకోమ్మా!" పావనికి చెప్పింది పార్వతమ్మ.

"లేదమ్మా! నా కోరికలో మార్పులేదు. ఈ లోకంలో కష్టాలతోటీ, బాధలతోటీ ఎవ్వరూ నశించకూడదు" అన్నది పావని. పార్వతి నవ్వుతూ చూసింది భర్తకేసి. శివుడు కలవర పడ్డాడు. అంతలోనే ఓ మంచి ఆలోచన తట్టిందాయనకు "సరే, అలాగే కానియ్యి, పావనీ! నీ కోరిక ప్రకారమే మానవుడికి మతిమరపు ప్రసాదిస్తున్నాను. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఒక్క సారి మంచి నిద్రపోయి లేస్తే చాలు తన బాధలన్నిటినీ మనిషి" అంటూ సతీ సమేతంగా మాయమైపోయాడు. అంతే! అప్పటినుండి మానవుడు ఎన్ని బాధలున్నా మరచిపోయి హాయిగా నవ్వుతూ జీవిస్తున్నాడు. మరపు మానవుడికి నేస్తంగా వచ్చి చేరుకున్నది మరి!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో