TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ముసలాయన - ఆవు
అనగనగా ఒక ముసలాయన ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. ముసలాయన చాలా పేదవాడు. ఒక సంవత్సరం వానలు సరిగ్గా పడలేదు. ముసలాయనకి రోజులు గడవటం కష్టమైంది. చేసేది లేక, ఆ ఆవును అమ్మేందుకు సంతకి బయలు దేరాడు. సంతకి వెళ్ళే దారిలో ఒక కాలువ ఉన్నది. దానిని దాటడానికి ఇష్టపడలేదు ఆవు. దానిని ఎంత బ్రతిమిలాడినా ప్రయోజనం లేక పోయింది. ఆవు జానెడంత కూడా కదల్లేదు. విసుగు వచ్చేసింది ముసలాయనకి. అటూ ఇటూ చూస్తే అతనికి దూరంగా నిలబడి ఇటే చూస్తున్న కుక్క ఒకటి కనిపించింది. ఆయన ఆవును అక్కడే వదిలేసి కుక్క దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, "కుక్కా! కుక్కా! నువ్వొచ్చి నా ఆవును కరువు, ఆది కాలువ దాటిపోతుంది!" అన్నాడు.
కుక్క ఒప్పుకోలేదు. "పాపం! ఆ ఆవుని కరవటం ఎందుకు, అనవసరంగా?" అనుకున్నది. అంతలో కాలవ ఒడ్డున ఒక కర్ర కనిపించింది ముసలాయనకు. "ఈ కుక్క ఎంతకీ మాట వినటం లేదు. దీని పని చెప్పాలి" అనుకొని అతను కర్ర దగ్గరికి వెళ్ళాడు. "కర్రా! కర్రా! రా! కుక్కను బాదు! నువ్వు బాదితే, అప్పుడు కుక్క వచ్చి ఆవును కరుస్తుంది; ఆవు కాలువ దాటుతుంది" అన్నాడు. కర్ర ఎందుకు కదులుతుంది? అది అస్సలు కదలలేదు. ముసలాయనకి ఇప్పుడు కర్ర మీద కూడా కోపం వచ్చింది. అటూ ఇటూ చూసే సరికి, అక్కడికి దగ్గర్లోనే చీమల పుట్ట ఒకటి కనిపించింది. చీమలన్నీ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాయి- ఏవేవో మోసుకొస్తున్నాయి.
ముసలాయన చీమల దగ్గరికి వెళ్ళి- "చీమల్లారా! చీమల్లారా! మీరు పోయి కర్రను కొరకండి; అప్పుడు అది పోయి కుక్కను కొడుతుంది; కుక్క పోయి ఆవును కరుస్తుంది; ఆవు కాలువ దాటుతుంది!" అని చీమల్ని అడిగాడు. కాని చీమలు కూడ ఒప్పుకోలేదు. 'చేస్తున్న పనిని ఆపి ఊరికే కర్రను ఎందుకు కొరకాలి, మేం కొరకం!' అనుకున్నాయి. ముసలాయనకు చీమల మీద కోపం వచ్చింది. అంతలో అక్కడ గింజల్ని ఏరుకుంటున్న కోడి ఒకటి కనబడింది ఆయనకు. 'వీటి పని చెబుతాను ఆగు!' అని, కోడి దగ్గరికి వెళ్ళాడు.
"కోడీ, కోడీ, చీమలను తినెయ్యి. అప్పుడు అవి పోయి కర్రను కొరుకుతాయి; కర్ర పోయి కుక్కను కొడుతుంది; కుక్క పోయి ఆవును కరుస్తుంది; అప్పుడు ఆవు కాలవ దాటుతుంది" అని బ్రతిమిలాడాడు. కానీ కోడి "కొక్కొక్కొక్కొ" అంటూ దూరం పారిపోయింది. ఇంక ఇప్పుడేం చేయాలి? ఇంకేమీ చెయ్యలేక, ముసలాయన "వీటిని బ్రతిమిలాడడం ఎందుకు? నేనే ఈ కర్రతో కొట్టి కాలువ దాటిస్తాను చూడు' అని కట్టెతో ఆవును గదమాయించాడు. వెంటనే ఆవు కాలువ దాటింది. సొంతగా పని చేసుకోటాన్ని మించింది వేరే ఏదీ లేదు!
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో