TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అనగనగా రామాపురమనే గ్రామం. ఆ గ్రామంలో సాంబయ్యనే రైతు ఉన్నాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఐతే కొన్ని సంవత్సరాల నుండి కరవు కారణంగా పంటలు పండలేదు.
సాంబయ్య రకరకాల పనులు చేసినా కలిసిరాలేదు. కుటుంబ పోషణ భారమైపోయింది. కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తన పొలంలో ఉన్న నూతిలో దూకి, ఆత్మహత్య చేసుకోబోతుండగా..
'ఆగు మిత్రమా' అన్న మాటలు వినిపించాయి. చుట్టూ చూడగా చెట్టు మీద ఒక రామచిలుక కనిపించింది. రామచిలుక మాట్లాడం చూసి అశ్చర్యపోయాడు. 'నేనూ, నా కుటుంబం నీ పొలంలో పండిన జామపళ్ళు తిని ఇంతకాలం బతికాం. మేము నీకు ఋణపడి ఉంటాం. ఆ ఋణం తీర్చుకునేందుకు నీకు సహాయం చేస్తాను. ఆత్మహత్య మహా పాపం. బతకటానికే ప్రయత్నం చేయాలి. నేను నీతో వస్తాను. నన్ను ఓ పంజరంలో ఉంచి, చిలుక జోస్యం అంటూ డబ్బులు సంపాదించు. కుటుంబాన్ని పోషించు' అన్నది చిలుక. సాంబయ్యకు చిలుక చెప్పింది నచ్చి, చిలుక చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు.
సాంబయ్య ఊర్లన్నీ తిరుగుతూ మధ్యాహ్నం వరకూ చిలుక జోస్యం చెబుతుండేవాడు. మధ్యాహ్నం ఒక చెట్టు కింద సేద తీరేవాడు. ఈ ఖాళీ సమయంలో చిలుక ఇండ్లపై ఎగిరి.. ఆ ఇండ్ల వివరాలు తెలుసుకుని, సాంబయ్యకు చేరవేసేది. ఆ వివరాలనే చిలుక జోస్యం పేరిట జనాలకి చెప్పేవాడు. తక్కువ కాలంలోనే సాంబయ్య మంచిపేరు సంపాదించాడు. అది సాంబయ్య శత్రువులకు నచ్చలేదు. చిలుక జోస్యమంటూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నాడని రాజుకు ఫిర్యాదు చేశారు.
రాజు సాంబయ్యను పిలిపించాడు. 'నేను ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా రాజ్యంలో పేదవారు తగ్గకపోవడానికి కారణం ఏమిటో? వారం రోజుల్లో జోస్యం చెప్పాలి. సరిగ్గా చెపితే మంచి కొలువు ఇస్తాను.. లేదంటే శిక్షిస్తాను' అన్నాడు రాజు. 'అలాగే ప్రభు' అంటూ సెలవు తీసుకుని, ఇంటికి వెళ్ళాడు సాంబయ్య. చిలుక సాయంతో ఆ రాజ్యంలో పేదరికం తగ్గకపోవటానికి అవినీతి అధికారులు, వేగులు ఒకటైపోవడమని ఆ జాబితా రాజుకు అందించాడు.
రాజు సాంబయ్య చెప్పిన అవినీతి అధికారులు, వేగులను కొలువు నుంచి తప్పించి, కొత్తవారిని నియమించగా రాజ్యంలో పేదరికం తగ్గింది. రాజు సాంబయ్యను మెచ్చుకుని, తన ఆస్థానంలో మంచి కొలువు ఇచ్చాడు. ఆ విధంగా చిలుక చేసిన సాయంతో సాంబయ్య కష్టాల నుంచి బయటపడ్డాడు.