Facebook Twitter
పుల్లప్ప మాట

 

పుల్లప్ప మాట

 

 

అనగనగా ఒక ఊళ్లో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతని పేరు పుల్లప్ప. పుల్లప్ప పుట్టు గ్రుడ్డి. రోజూ బస్టాండులో ఆగే బస్సుల దగ్గరికి వెళ్ళి అడుక్కునేవాడు. అట్లా వచ్చిన డబ్బులతో ఏదో ఒకటి కొనుక్కుని తినేవాడు. 


ఒకరోజున బస్టాండులో బస్సు ఒకటి వచ్చి ఆగింది. అక్కడ అడుక్కోవటం మొదలుపెట్టాడు పుల్లప్ప. బస్సు దిగిన ప్రయాణీకులు కొందరు అతనికి తలా ఒక్క చిల్లర డబ్బు ఇచ్చారు. అంతలోనే గుప్పుమని సారాయి వాసన వచ్చింది. ఎవరో మందు తాగిన వ్యక్తి ఒకడు, బస్సులోంచి దిగాడు. పుల్లప్పకి కళ్ళు లేవు, కానీ ముక్కు పని చేస్తూనే ఉందిగా, ఆ సంగతి అర్థమయ్యింది.

 

సాధారణంగా త్రాగినవాళ్లెవ్వరూ మన లోకంలో ఉండరు. బిచ్చగాళ్లని కసరుకుంటారు. అందుకని పుల్లప్ప అతనికి దూరంగా జరిగాడు. ప్రక్కకి తప్పుకొని అతను వెళ్ళేందుకు బాగా దారి వదిలాడు. తిరిగి వెళ్ళిపోదామని వెనక్కి కూడా తిరిగాడు. అంతలోనే ఆ త్రాగినతను పుల్లప్పని పిలిచి ఒక రూపాయి దానం చేసాడు. పుల్లప్ప అందరికీ పెట్టినట్టే అతనికీ దండాలు పెట్టాడు. మరుసటి రోజున కూడా ఇలాగే జరిగింది. త్రాగుబోతువాడు పుల్లప్పని పిలిచి ఒక రూపాయి ఇచ్చాడు. పుల్లప్ప దండం పెట్టాడు. ఇట్లా పది రోజుల పాటు వరసగా జరుగుతూ పోయింది. 

 

పదకొండో రోజున త్రాగుబోతువాడు పుల్లప్పకి పదిరూపాయల నోటు ఇచ్చాడు. కానీ పుల్లప్ప దానికోసం‌ ఆశ పడలేదు. అతని నోటును అతనికి తిరిగి ఇస్తూ "అయ్యా! మీరు మరిచిపోయి నాకు పదిరూపాయలు ఇచ్చారు. ఇదిగో ఇది తీసుకోండి" అన్నాడు. "మరిచిపోయి కాదులే. చూసే ఇచ్చాను. నా దగ్గర ఇవాళ్ల చిల్లర లేదు" అన్నాడు అతను. "పర్లేదులెండయ్యా! చిల్లర ఉన్నప్పుడు ఇద్దురులే. లేకపోతే తమరు మాత్రం‌ ఏం చేస్తారు" అన్నాడు పుల్లప్ప, నిజాయితీతో. "అవును అయినా ఇది పది రూపాయలని నీకెట్లా తెలుసు?" అని అడిగాడు. "కొత్త నోట్లకు చివర గీతలుంటాయి స్వామీ, ఉబ్బెత్తుగా ఉంటాయి. 

 

జాగ్రత్తగా చూస్తే ఆ గీతల్ని బట్టి అది ఏం నోటో కనుక్కోవచ్చు" అన్నాడు పుల్లప్ప. ఆ త్రాగుబోతు వాడు ఆశ్చర్యపోయాడు. "బాగా తెలివైన వాడివేనే! ఇదిగో, ఇవాల్టికి ఈ పది ఉంచుకో, పర్లేదు" అన్నాడు. పుల్లప్ప తీసుకోలేదు. "అయ్యా! తమరు త్రాగిన మత్తులో ఉన్నారు కాబట్టి, నాకు ఇన్ని డబ్బులు ఇస్తున్నారు. నాకు అనిపిస్తుంది, 'ఈ డబ్బులు ఇస్తున్నది తమరు కాదు, తమరు త్రాగిన మందు' అని. ఒకసారి ఆ మందు ప్రభావం తగ్గాక, తమరే నన్ను తిట్టుకుంటారు, 'మోసం చేసాడు గుడ్డోడు' అని. అందుకని, వద్దు స్వామీ- ఎక్కువ డబ్బులు ఇవ్వకండి. 

 

ఏదో మీకు బుద్ధి పుడితే ఒక రూపాయో, రెండు రూపాయలో ఇవ్వండి చాలు" అన్నాడు. "లేదులే! నేను ఎంత త్రాగినా కంట్రోలులోనే ఉంటాను. అట్లా ఏమీ అవ్వదు" అన్నాడు అతను, కొంచెం తగ్గి. "అయినా వద్దులెండి అయ్యగారు-" అన్నాడు పుల్లప్ప. ఆపైన కొంచెం సంకోచిస్తూనే "తమబోటి పెద్దలకు నేనేం చెబుతాను గాని, అయినా వయసులో పెద్దోనిగా నేనో మాట చెప్పనా, అయ్యగారు?" అని అడిగాడు. "చెప్పు!" అన్నాడు ఆ మనిషి. "అయ్యా! రోజూ చూస్తున్నాను; తమరు రోజూ త్రాగుతున్నారు; ఇలా తాగే బదులు, ఆ డబ్బులతో మీ పిల్లలకు ఏదైనా కొని ఇవ్వచ్చు కదా?!" అని చెప్పాడు పుల్లప్ప. అతను ఏమీ‌ మాట్లాడలేదు. నిశ్శబ్దం అయిపోయాడు.

 

"అయ్యా క్షమించండి- ఏదో మనసులో మాటని పైకి అనేసానండయ్యా. మీ పరిస్థితి ఏమిటో నాకు తెలీదు. మీకు పిల్లలు ఉన్నారో‌, లేదో కూడా తెలీదు.. క్షమించండి. నేను చిన్న మనిషిని..." పుల్లప్ప ఇంకా ఏదో అంటుండగానే ఆ మనిషి అక్కడినుండి వెళ్ళిపోయాడు. తను చేసింది మంచి పనో, తప్పుడు పనో అర్థం కాలేదు పుల్లప్పకు. అయితే తను అనుకున్నట్లుగానే మరుసటి రోజునుండీ బస్సులో ఆ త్రాగుబోతు అతను రాలేదు; తనకు రోజూ వచ్చే రూపాయి కూడా పోయింది! కొన్ని రోజుల తర్వాత ఎవరో పుల్లప్ప చేతికి గుడ్డివాళ్ళు పట్టుకునే ప్లాస్టిక్ కట్టెను ఒకదాన్ని అందించారు- "తీసుకో! నీవల్ల నేను మారాను. ఇప్పుడు నా పిల్లలు కూడా సంతోషంగా‌ ఉన్నారు. చాలా ధన్యవాదాలు!"‌ అని. అతని గొంతును గుర్తుపట్టి దండం పెట్టాడు పుల్లప్ప. అతని పేరేంటో తెలీదుగానీ, ఆ త్రాగే ఆయన దగ్గరినుండి ఇప్పుడు సారాయి వాసన రావట్లేదు.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో