TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
గుడ్లగూబల సమస్య
అనగనగా ఒక అడవిలో గొప్ప గుడ్లగూబ ఒకటి ఉండేది. దాని కళ్ళు పెద్దగా, భయంకరంగా, వికారంగా ఉండేవి. దాన్ని చూసి మిగతా పక్షులన్నీ ఎగతాళి చేసేవి. దాంతో గుడ్లగూబకి చాలా బాధ వేసింది. ఎలాగైనా తన కళ్ళను మార్చుకోవా-లనుకున్నది. కానీ ఎంత ప్రయత్నించినా దాని కళ్ళు మటుకు చిన్నవి కాలేదు. భరించలేక, చివరకి అది ఘోర తపస్సు చేసింది. దాని తపస్సుకు మెచ్చి దేవుడు కూడా త్వరగానే ప్రత్యక్షమైనాడు. "ఏమి కావాలో కోరుకో, గూబా!" అన్నాడు. "దేవుడా, అందరికీ చక్కగా అంత చిన్న చిన్న కళ్ళు ఇచ్చావు.
మాకు మటుకు ఇంత పెద్ద కళ్ళు! పది మందిలో ఎంత నగుబాటుగా ఉందో తెలుసా? మాకు ఈ పెద్ద కళ్ళు వద్దు! అందరి మాదిరి, చిన్న చిన్న కళ్ళు చేసెయ్యి!" అని వేడుకున్నది గుడ్లగూబ. "సరేలే, నీ ఇష్టప్రకారమే కానివ్వు" అంటూ దేవుడు వెంటనే గుడ్లగూబల కళ్ళను చిన్నవిగా, అందంగా మార్చేశాడు. అందమైన చిట్టి చిట్టి కళ్ళు పెట్టుకున్న గుడ్లగూబలు చాలా సంతోషపడ్డాయి. తోటి పక్షులన్నిటికీ తమ కళ్ళను చూపించుకొని చాలా మురిసిపోయాయి. తమ అందానికి చాలా గర్వ పడ్డాయి. కొన్నయితే మిగతా పక్షులను కూడా ఎగతాళి చేసాయి! అయితే రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా, కొన్ని సంవత్సరాలు గడిచాక, ఫ్యాషన్ మారింది.
గుడ్లగూబలకు అసంతృప్తి మొదలైంది మళ్ళీ. "మాకిప్పుడు ప్రత్యేకతే లేకుండా అయ్యింది. అన్ని పక్షులలాగే ఉన్నాయి, మా కళ్ళు కూడాను!" అనుకోసాగాయి. "పెద్ద పెద్ద కళ్ళు చాలా బాగుంటాయి. పాపం, ఈ గుడ్లగూబల కళ్ళు ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి!" అని కొన్ని పక్షులు వాటి మీద జాలి చూపించసాగాయి కూడా. కళ్లని పెద్దవి చేసుకునేందుకు గూబలు ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఒక గుడ్లగూబ మళ్ళీ తీవ్రమైన తపస్సు చేసింది. మళ్ళీ ప్రత్యక్షమైనాడు దేవుడు. "ఏంటి వత్సా, నీ కోరిక?" అంటూ. "మాకళ్ళు ఎప్పటి లాగే పెద్దవిగా, గుండ్రంగా మార్చెయ్యి స్వామీ!" అన్నది గుడ్లగూబ.
"మరి అప్పుడు చిన్నగా, అందంగా కావాలన్నారు కదా?" అన్నాడు దేవుడు నవ్వుతూ. గుడ్లగూబ ఏమీ అనలేకపోయింది. అయినా దేవుడు దాని కోరికను అర్థం చేసుకొని "సరేలే! ప్రస్తుతానికి మీ కళ్ళని తిరిగి పెద్దవి చేసేస్తున్నాను. ఇకమీద ప్రకృతి సహజంగా వచ్చినవాటిని వేటినీ చిన్న చూపు చూడకండి!" అని, నవ్వుతూ మాయమైపోయాడు. ఆ తర్వాత గుడ్లగూబలు తమ పెద్ద కళ్ళతో, ఇప్పటికీ సంతోషంగా, వినయంగా ఉన్నాయి. ఎవరైనా "చిన్న చిన్న కళ్ళు- ఎంత బాగుంటాయో! మీ కళ్ళూ ఉన్నాయి చూడండి- బండలు బండలుగా!" అంటే అవి ఇప్పుడు నవ్వుతున్నాయి తప్ప, మరేమీ అనుకోవట్లేదు.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో