TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
రహస్యం
మాధవపురాన్ని పాలించే మాధవుడికి రహస్యాలు ఛేదించటం అంటే ఇష్టం. సాహస కార్యాలు ఆయన్ని అనేక దేశాలు తిప్పాయి. ఒకసారి ఆయన అలా దేశాటన చేస్తూ పొరుగు రాజ్యపు సీమలో ప్రవేశించాడు. అక్కడ దట్టమైన ఓ అడవిలో దారి తప్పి, సన్యాసులు ఉండే మఠానికి ఒక దానికి చేరుకున్నాడు. వాళ్ళు ఆయనకు అతిథి మర్యాదలు చేసి, భోజనం పెట్టి, పడుకునేందుకు ఒక గది చూపించారు.
అర్థరాత్రి అవుతున్నదనగా మఠంలో ఎక్కడినుండో వింత వింత శబ్దాలు వెలువడ సాగాయి. రాజుకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. 'ఏమిటా శబ్దాలు?!' అనుకున్నాడు. అయితే అతను లేచి పరిశోధించాలని అనుకునేసరికి శబ్దాలన్నీ అకస్మాత్తుగా సద్దుమణిగాయి!
మరునాడు తెల్లవారాక, 'రాత్రి వెలువడిన ఆ శబ్దాలు ఏమిటి?' అని అతడు ఆ సన్యాసులను అడిగాడు.
"మేము నీకు చెప్పలేము- ఎందుకంటే నువ్వు సన్యాసివి కాదు కదా?!" అన్నారు వాళ్ళు.
రాజుకు తల తిరిగినట్లయింది. శబ్దాల రహస్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలం అతన్ని నిలువనివ్వలేదు. అయితే కొద్ది సేపటికల్లా సన్యాసులు అతనికి వీడ్కోలు చెప్పేసారు. రాజుకేమో, అక్కడే ఉండి ఆరోజు రాత్రి శబ్దాల రహస్యాన్ని ఛేదించాలని ఉంది. అయినా ఇంక ఏమీ చేయలేక, అలా అసంతృప్తితోనే తిరిగి వెళ్లిపోయాడు.
మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత, వింతగా అక్కడికే చేరుకున్నాడు- సంధ్యా సమయంలో! మళ్లీ అప్పటి సన్యాసులే అతన్ని సాదరంగా ఆహ్వానించి వసతి కల్పించారు. మళ్లీ అదే గది దొరికింది అతనికి. "అప్పటి లాగా ఆ శబ్దాలు వినిపిస్తాయా, ఇవాళ్ల?" అన్న ఆలోచనతో రాజుకు అసలు నిద్ర పట్టలేదు.
అర్థరాత్రి అవుతున్నదనగా మళ్లీ మొదలయ్యాయి శబ్దాలు. చటుక్కున లేచిన మాధవుడు ఆ మఠంలో అంతటా కలయ తిరిగాడు. తను ఎటు వెళ్ళినా, శబ్దాలు మరొక దిక్కునుండి వస్తున్నట్లు అనిపించసాగాయి! కొద్ది సేపటికి అంతటా నిశ్శబ్దం అలుముకున్నది.
మర్నాడు రాజు ఆ సన్యాసులను ఇలా అడిగాడు "ఆ శబ్దం ఏమిటో దయచేసి చెప్పండి" అని
"నువ్వు సన్యాసివి కావు, మేము చెప్పము" అన్నారు అందరూ ఒకేసారి.
"సరే. నేను సన్యాసిని అవుతాను- ఏం చేయాలో చెప్పండి!" అడిగాడు రాజు.
"నీ గుర్రాన్ని, నీ దగ్గర ఉన్న వస్తువుల్ని, దుస్తుల్ని అన్నిటినీ దానం చేసేయ్. ఆనక ఈ దుస్తుల్ని ధరించి రా!" అన్నాడు పెద్ద సన్యాసి.
'సరే'నని, ఆయన చెప్పినట్లే చేశాడు రాజు- "ఇప్పుడు చెప్పండి, ఏమిటి, ఆ శబ్దం?!" అడిగాడు కుతూహలం ఆపుకోలేక.
"ఆ దారి గుండా వెళ్లు. నీకొక ద్వారం కనిపిస్తుంది. దాన్ని తెరువు. నీకే అర్థమవుతుంది" అన్నారు వాళ్ళు.
అతను అలాగే వెళ్లాడు. ఒక ద్వారం కనిపించింది- దానిని తెరిచాడు; ఆ తర్వాత మరొక ద్వారం- వెండిది- కనబడింది. దానినీ తెరిచాడు- అమితమైన కాంతి ఒక్కసారిగా వచ్చి నేరుగా అతని కళ్లల్లోకి పడింది. పారిపోవాలనిపించింది అతనికి. కానీ భయంతో కాళ్లు కదల్లేదు. అరుద్దామంటే నోరు పెగల్లేదు.
అతను చూసిందేమిటి?!
ఆ వింత శబ్దానికి కారణం ఏమిటి?!
పాఠకులారా, క్షమించాలి- మీకు ఆ రహస్యం చెప్పలేను.. ఎందుకంటే మీరు సన్యాసులు కారు కదా!
Courtesy..
kottapalli.in