Facebook Twitter
రోడ్డుమీదపాప

రోడ్డుమీదపాప

 

ఐరోపా ఖండంలో ఇటలీ దేశం ఉంది. అక్కడ అలెస్సాండ్రో, రెవిల్డె అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ల పాప పేరు మరియా. పన్నెండో తరగతి ఐపోగానే 'నేను డాక్టరునవుదామనుకుంటున్నాను, డాక్టరు చదువులు చదువుతాను' అన్నది మరియా. ఈ కథ ఎప్పటిదనుకుంటున్నారు?- 1880ల నాటిది! అంటే నూట ముఫ్పై సంవత్సరాలనాటి మాట! ఆ రోజుల్లో ఇటలీ దేశం మొత్తం వెతికినా ఒక్క అమ్మాయి కూడా‌ డాక్టరు చదువు చదవలేదు. మరి ఆ పాప అమ్మా నాన్నలు మాత్రం అందుకు ఎట్లా ఒప్పుకుంటారు? కానీ మరియా పట్టుదల మనిషి. ప్రాధేయపడి, పోరాడి చివరికి వాళ్ళ అమ్మానాన్నలను ఒప్పించింది. అటుపైన వాళ్లందరూ కలిసి కాలేజీ వాళ్లనీ‌ ఒప్పించాల్సి వచ్చింది!‌ ఎందుకంటే అప్పటివరకూ వాళ్ల కాలేజీలో వైద్యం చదివేవాళ్లందరూ‌ అబ్బాయిలే మరి! 'అంతమంది అబ్బాయిల మధ్య, ఈ ఒక్క అమ్మాయినీ ఎలా సంబాళిస్తాం, వీలు కాద'న్నారు వాళ్ళు. ఈపాప పట్టుదల చూసి చివరికి వాళ్ళూ 'సరే చూద్దాం' అన్నారు.

వైద్య విద్యలో భాగంగా విద్యార్థులు అందరూ మానవ శరీరాన్ని పరీక్షించాలి. దానికోసం కాలేజీల వాళ్ళు శవాలను తెచ్చి పెడతారు. వైద్య విద్యార్థులందరూ ఆ శవాలను జాగ్రత్తగా సరైన పద్ధతిలో కోసి, శరీరంలో ఏ భాగం ఎక్కడ ఉండేదీ, ఎట్లా ఉండేదీ చూసి నేర్చుకుంటారు. ఆపరేషన్లు చేసేందుకు కావలసిన అనుభవమూ అట్లాగే కద, వచ్చేది!? అయితే అబ్బాయిలందరూ శవపరీక్షలు చేసే చోట ఈ ఒక్క అమ్మాయినీ ఉండనిచ్చేది లేదన్నారు కాలేజీవాళ్ళు. అట్లా అని శవ పరీక్షలు చెయ్యకుండా డాక్టరు ఎలా అవుతారు, ఎవరైనా? 'అందరూ వెళ్ళిపోయాక, సాయంత్రం పూట ఆమె ఒక్కతే వచ్చి శవపరీక్ష చేసుకునేట్లయితే పర్వాలేదు' అన్నారు పెద్ద డాక్టరు గారు. మరియా చాలా ధైర్యం ఉన్న పాప. 'సరేలెండి అట్లాగే కానివ్వండి' అన్నది. ఆరోజు సాయంత్రం కాగానే చక్కగా ఒక లాంతరు చేతపట్టుకొని, కాలేజీకి చేరుకున్నది. 
(మీకు అనుమానం వచ్చిందా, 'లాంతరు ఎందుకు?'అని? ఎందుకంటే అప్పటికి ఇంకా కరెంటు దీపాలు కనుక్కోలేదు మనుషులు! రాత్రి అవ్వగానే ఎవరికి వాళ్ళు దీపాలు, లాంతర్లు వెలిగించుకోవాల్సిందే! అందుకని!)

సరే, ఈ పాప కాలేజీకి చేరుకునేసరికి చీకటి పడుతున్నది. కాలేజీలో ఎవ్వరూ లేరు. ప్రయోగశాలలో చుట్టూ సీసాలు..సీసాల్లో ఫార్మాలిన్ ద్రవంలో- ఒక్కోదానిలో ఒక్కో శరీర భాగం తేలుతూ ఉన్నది- ఒక సీసాలో మెదడు, ఒక సీసాలో కాలు, ఒక దానిలో చెయ్యి, ఒకదానిలో గుండె- ఇలాగ. అంతటా నిశ్శబ్దం అలుముకుని ఉన్నది. మధ్యలో బల్లమీద మానవ కళేబరం పెట్టి ఉంది, కదలకుండా పడి ఉన్నది ఒక శవం! ఆ వాతావరణాన్ని పాపం, ఊహించలేదు మరియా. క్షణంలో ఆ పాపకు విపరీతమైన భయం వేసింది. గుండెల్లోంచి తన్నుకొచ్చింది వణుకు. కళ్ళు తిరిగినట్టు, మూర్ఛ వచ్చినట్టు అనిపించింది. వెంటనే బయటికి పరుగెత్తుకుంటూ వచ్చింది. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పరుగు తీసింది. ఆయాసంతో ఇక పరుగెత్తలేనంత వరకూ పరుగు. అటుపైన మెల్లగా, నీరసంగా నడక.

అప్పుడు గమనించింది మరియా- రోడ్డు ప్రక్కన ఒక పాప కూర్చొని ఆడుకుంటున్నది. పాప చుట్టూ అంతా మురికి, రోత, ఈగలు. అటూ ఇటూ వేగంగా పరుగులు పెడుతున్న వాహనాలు, గుర్రపు బళ్ళ శబ్దాలు. అంగళ్ల వాళ్ళు, బండ్లవాళ్ళు అరుస్తున్నారు, రొద- చీకటి. కానీ ఆ అమ్మాయి ఆడుకుంటున్నది- సంతోషంగా ఉంది. ఆ పాప చేతిలో ఉన్నది ఒక రంగు కాగితం! దాన్ని చూసుకొని మురిసిపోతున్నది ఆ పాప. చుట్టు ప్రక్కల ఏం జరుగుతున్నా, ఎంత జుగుప్సాకర వాతావరణం ఉన్నా పట్టించుకోవటం లేదు- పూర్తిగా తన ఆటలో నిమగ్నమైపోయి ఉన్నది. మరియా అక్కడే నిల్చున్నది కొంత సేపు. ఆడుకుంటున్న చిన్న పాప లోని సంతోషం, ఆ చీకటి తెరల్లోంచి కూడా దూసుకు వచ్చి మరియా కళ్ళు తెరిపించింది. తన కర్తవ్యం ఏంటో గుర్తుచేసింది. 

 

పారిపోతున్న మరియా ఒక నిశ్చయానికి వచ్చింది. వెనక్కి తిరిగి ధైర్యంగా కాలేజీ చేరుకున్నది. ప్రయోగశాలలోకి వెళ్ళి శవాన్ని కోసి పరీక్షించింది. లాంతరు వెలుగులో వివరంగా నోట్సు తయారు చేసుకున్నది. రాత్రి బాగా చీకటి పడ్డాక ఇల్లు చేరుకున్నది. ఆ తరువాత ఇక ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె నిశ్చయం ముందు నిలువలేక భయమే పారిపోయినట్లయింది. మరియా మాంటిసోరీ ఆ విధంగా ఇటలీ దేశపు మొట్ట మొదటి మహిళా డాక్టరైంది. తనకు కర్తవ్యాన్ని బోధించిన చిన్న పాపను ఆమె మర్చిపోలేదు. ఎంతోమంది మహిళలకు, పిల్లలకు మానవత్వంతో కూడిన వైద్యసేవలు అందించింది మరియా. ఒకవైపున డాక్టరుగా సేవలు అందిస్తూనే, మరోవైపున గొప్ప విద్యావేత్తగా ఎదిగి చిర స్మరణీయురాలైంది మరియా మాంటిసోరీ.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో