TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
బంగారు నాణాల కథ!
అనగనగా ఒక ఊళ్లో ఒక ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు మొద్దు కానీ అతని మనసు మంచిది. చిన్నోడు బాగా చదువుకునేవాడు కానీ అతనిలో చాలా స్వార్థం ఉండేది. రోజులు, సంవత్సరాలు గడిచాయి. చిన్నోడు పరీక్షలు పాసై పట్నంలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. పట్నంలో ఉంటూ, అప్పుడప్పుడూ పల్లెకు వచ్చి తల్లిని, అన్నను చూసి పోయేవాడు. పెద్దోడు ఊళ్ళోనే ఉండేవాడు. వ్యవసాయం చూసుకుంటూ, ఎవరూ లేని పిల్లలకు వాళ్ళు చదువుకునేంత వరకు చదువు చెప్పించేవాడు. ముసలమ్మని కనిపెట్టుకొని ఉండేవాడు- అందుకని ఊళ్ళో వాళ్లంతా అతని గురించి మంచిగా అనుకునేవాళ్ళు. అయినా చిన్నోడికి పెద్దోడు అంటే లక్ష్యం లేదు. పెద్దోడిని చూసి అసూయ పడేవాడు. పెద్దోడు మంచి కోరి ఏం చెప్పినా గానీ ఇతను చికాకు పడేవాడు.
ఒకసారి ముసలమ్మకు ఆరోగ్యం బాగా లేకుండా అయ్యింది. "తను చనిపో-బోతున్నది" అని అర్థం అయిందామెకు. దాంతో ఆమె తన ఇద్దరు కొడుకులనూ చేరబిలిచి, తాంబూలపు తిత్తిలోంచి పది బంగారు నాణాలు బయటకు తీసింది. చెరైదు నాణాలూ కొడుకులకు ఇస్తూ "నాయనలారా! ఇవి మామూలు నాణాలు కావు. వీటిని మట్టిలో పూడ్చితే, ఒక్కో నాణెం నుండి ఒక్కో మొక్క వస్తుంది. ఆ మొక్కల్ని జాగ్రత్తగా పెంచండి- కొన్ని రోజులకల్లా ఒక్కొక్క మొక్కకూ ఒక్కొక్క గుమ్మడికాయ కాస్తుంది. ఆ గుమ్మడికాయల నిండా బంగారు నాణాలు ఉంటాయి.." అని తను మాట్లాడం ఆపి, మళ్ళీ చెప్పింది. "చూడండి బాబులూ! వీటిని మీ స్వార్థం కోసం వాడుకోవద్దండి. ఇతరులకోసం ఉపయోగిస్తే తప్ప, ఇవి మీ దగ్గర నిలవవు!" అని చెప్పి కన్ను మూసింది. కొన్ని రోజులు గడిచాయి. పెద్దోడు ఆ ఐదు నాణాలనూ నాటాడు. ఐదు గుమ్మడికాయలు వచ్చాయి. నాలుగు గుమ్మడి కాయల్ని ఆనాథాశ్రమాలకు, పేదవాళ్ళకు ఇచ్చేసాడు.
ఐదో గుమ్మడికాయ నాణాలని తనతోనే పెట్టుకున్నాడు. పేద పిల్లల్ని చదివించేందుకు, ఊరికి పనికొచ్చే పనులు చేసేందుకు వాటిని వాడాడు. అవి అయిపోవస్తున్నాయనగా వాటిల్లోంచి మరో ఐదు నాణాలు నాటాడు. అవి మొలకెత్తినై; మళ్ళీ నాణాలనిచ్చినై. చిన్నోడు నాటిన ఐదు నాణాలు కూడా ఐదు గుమ్మడి కాయల్ని ఇచ్చాయి. ఐతే స్వార్థపరుడైన చిన్నోడు వాటిలోని బంగారు నాణాలని ఎవ్వరికీ ఇవ్వలేదు. వాటినన్నిటినీ నాలుగెకరాల చేనులో తిరిగి నాటాడు. అయితే ఆశ్చర్యం, ఎన్ని రోజులైనా ఏమీ కాలేదు! త్రవ్వి చూస్తే అక్కడ తను నాటిన నాణాలు కూడా లేవు!
చిన్నబోయిన చిన్నోడికి అమ్మ చెప్పిన మాటలు అప్పుడు గుర్తుకుచ్చాయి. 'ఇతరులకోసం ఉపయోగించటం' అంటే ఏంటో కొద్దిగా అర్థం అయ్యింది అతనికి. దాంతో చింతించటం మాని, తనకు చేతైనంతలో ఇతరులకు సాయం చేయటం మొదలుపెట్టాడు. అన్న మంచితనాన్ని గుర్తించి, అతనితో సఖ్యంగా ఉండటం మొదలెట్టాడు. కాల క్రమంలో అన్నాదమ్ములిద్దరూ సమాజానికి పనికొచ్చే పనులు చాలా చేసారు!
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో