Facebook Twitter
కృతఘ్నత

కృతఘ్నత

 



ఒకసారి, మంచిమనిషి ఒకడు ఒక అడవిదారిన పోతున్నాడు. మధ్యలో దాహంవేసి వెతుక్కుంటే అతనికో పాడుపడ్డ బావి కనిపించింది. అతను లోపలికి తొంగిచూడగా దానిలో నుండి "రక్షించు! కాపాడు" అని అరుపులు వినవస్తున్నాయి. ఒక సింహం, ఒక పాము, ఇంకా ఇద్దరు మనుషులు అందులో పడి, బయటికి రాలేక అరుస్తున్నారు, ఆర్తిగా. సింహం అన్నది - "నాకు సాయం చెయ్యి. నన్ను బావిలోంచి బయటికి తీయి. నీ మేలు మరువను" అని. "అమ్మో! `సింహం' అనుకుంటేనే నాకు వణుకు పుడుతున్నది. నిన్ను బయటికి తీస్తే నువ్వు ఊరుకుంటావా? నన్ను తప్పక తినేస్తావు. అందులోనూ బావిలోపడి నీకు కడుపు నకనకలాడుతూండాలి" అని. "లేదు లేదు. నేను నిన్నేమీ చేయనని మాట ఇస్తున్నాను. నమ్మకం ఉంచు. దయచేసి నాకు సాయం చెయ్యి" అని ప్రాధేయపడింది సింహం. దగ్గర్లో పెరుగుతున్న తీగల్ని మోకుల మాదిరి అల్లి, మంచి మనిషి సింహాన్ని బావిలో నుంచి బయటికి లాగాడు. సింహం అతన్ని తినలేదు. 

"మా గుహ దగ్గరికి రా, ఎప్పుడైనా. నీకు ఏమైనా ఇద్దామని ఉన్నది నాకు. అయితే నేను వెళ్లే ముందు నీకొక సలహామాత్రం ఇచ్చిపోతాను. ఈ ఇద్దరు మనుషులకూ మాత్రం సాయం చేయకు. వీళ్లు మంచి వాళ్లుకాదు" అని చెప్పి, అది సంతోషంగా వెళ్లిపోయింది.  అప్పుడు పాము అతన్ని వేడుకున్నది; తననూ బయటికి తీసి పుణ్యం కట్టుకొమ్మన్నది. మంచి మనిషి "అమ్మో, నాకు పాములంటే భయం" అన్న మీదట, అది కూడా అతనిని ఏమీ చేయనని ప్రమాణాలు చేసింది. మనిషి పామునుకూడా బయటికి లాగాడు. "ఏ సహాయం అవసరమైనా నన్ను తలుచుకో" అని పడగ ఊపుకుంటూ సంతోషంగా వెళ్లిపోయింది పాము. వెళ్లేముందు - బావిలో పడి ఉన్నకంసాలినీ, మంగలినీ మాత్రం బయటికి లాగవద్దని హెచ్చరించి మరీ వెళ్లింది.

 

కానీ, కంసాలి, మంగలీ తమనుకూడా బయటికి లాగమని ప్రాధేయపడితే, మంచి మనిషి కాదనలేకపోయాడు. "వాళ్లూ నాలాగా మనుషులే కదా" అనుకున్నాడు. మోకుల్ని ఇంకా బలంగా అల్లి బావిలోకి వదిలితే, వాళ్లిద్దరూ వాటిని పట్టుకొని పైకి వచ్చారు. వాళ్లూ అతనికి ధన్యవాదాలుతెలియజేసుకొని, తమ నగరానికి వచ్చినప్పుడు తమను తప్పకుండా కలవమని ఆహ్వానించారు. అతను చేసిన సాయానికి ప్రతిగా తామూ ఏదైనా సాయం చేస్తామని మాట ఇచ్చారు.

తన యాత్రలు ముగించుకొని తిరిగివస్తూ ఆ మంచిమనిషి అడవిలో సింహాన్ని కలిశాడు. సింహం అతన్ని చూడగానే ఎంతో సంతోషపడ్డది. అతనికి అడవంతా తిప్పి చూపించి, అతను వెళ్తూండగా ఒక వజ్రపుటుంగరాన్ని బహుమానంగా ఇచ్చింది. మంచిమనిషి నగరంలోకి వెళ్లి మంగలి గురించీ, కంసాలి గురించీ వాకబుచేస్తే, మంగలి ఇప్పుడు నగరానికి కొత్వాలు అయ్యాడనీ, కంసాలి రాజుగారికి దగ్గరవాడనీ తెలియవచ్చింది. వాళ్లూ మంచిమనిషిని చక్కగా సమాదరించారు. అయితే మంచిమనిషి వారికి సింహం ఇచ్చిన వజ్రపుటుంగరం చూపించగానే వాళ్లు అతన్ని రాజుగారి సైనికులకు పట్టించారు. 

రాజుగారికి ఒక కుమార్తె ఉండేది. కొద్ది రోజులక్రితమే ఆమె అడవిలోనికి వెళ్లి ఇక తిరిగి రాలేదు. ఆమె జాడ తెలియజేసిన వారికి, లేదా ఆమె ఆభరణాలు వేటినైనా తెచ్చి ఆమెగురించిన సమాచారం కనుగొనటంలో సాయం చేసినవారికి గొప్ప బహుమానాన్ని స్తానని రాజుగారు ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు మంగలి కొత్వాలు అయినప్పటికీ మంచిమనిషిని దయతో చూడక, చెరసాలలో పెట్టి హింసలపాలు చేశాడు. ఆ ఉంగరం తనకు సింహం బహుమానంగా ఇచ్చిందనీ, తనేపాపం ఎరుగననీ ఎన్ని విధాలుగా చెప్పినా అతను అర్థం కానట్లే వ్యవహరించాడు. ఇక అతనినెవరు నమ్ముతారు? అతనే తన కుమార్తెను చంపి ఉంగరాన్ని అపహరించాడని రాజుగారు నమ్మారు. శిరచ్ఛేద శిక్ష విధించారు. 

ఇంకా రెండు రోజుల్లో శిక్ష జరుపుతారనగా, మంచిమనిషికి ఇక నిద్ర పట్టలేదు. ఏదో ఒకటి చేసి ప్రాణాలు కాపాడుకోవాలి - ఏం చేయాలి' అని ఆలోచిస్తూండగా, అతనికి పాము గుర్తుకు వచ్చింది. అతను తలుచుకోగానే పాము, ఎలా వచ్చిందో ఏమో, అతనిముందు ప్రత్యక్షమైఏం చేయాలి, చెప్పు' అన్నది. మంచిమనిషి దానికి జరిగినదంతా చెప్పాడు. "ఆ దుర్మార్గుల్ని బయటికి లాగొద్దని నీకు ఆనాడే చెప్పాను. చూడు, ఇప్పుడేం జరిగిందో! అయినా నువ్వు కష్టకాలంలో నాకు సాయం చేశావు గనక నిన్నూ ఈ కష్టాల్లోంచి గట్టెక్కిస్తాను. నేను వెళ్లి రాణిగారిని కరుస్తాను. నువ్వు విషాన్ని విరిచేస్తానని రాజుగారికి కబురు పంపు. మిగతాదంతా నేను చూసుకుంటాను" అన్నది పాము.

 

ఆ రాత్రే రాణిని పాము కరిచి ఆమె బాధగా తన్నుకులాడటం మొదలైంది. రాజుగారు వైద్యులకోసం కబురంపారు. ఆలోగా సమయం అయిపోయింది. మంచివాడికి శిక్ష అమలు జరపబోతూ `చివరి కోరిక ఏమిటని' అడిగితే, అతను రాణిని కాపాడతానన్నాడు. వెంటనే రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు అతన్ని. రాజుగారి అనుమతితో అతను రాణిగారి మందిరంలోకి రాగానే, పాము ప్రత్యక్షమై, రాణి గారి గాయం వద్ద నోరుపెట్టి విషాన్నంతా వెనక్కు లాక్కున్నది! రాణిగారి బాధ మటుమాయం! రాజుగారు సంతోషించారు. కానీ తన కుమార్తెను చంపినవాడి పట్ల ఆయన కోపం పోలేదు. 

అయితే ఆయన మంచివాడి సేవ వల్ల కొంచెం మెత్తబడ్డాడు. మంచిమనిషి తన కథను మళ్లీమళ్లీ రాజుగారితో చెప్పుకున్నాడు. బావిలోంచి తను సింహాన్నీ, పామునీ, కంసాలినీ, మంగలినీ ఎలా బయటికి లాగాడో చెప్పాడు. కావాలంటే కంసాలినీ, మంగలినీ సాక్షులుగా పిలిపించి అడగమన్నాడు. అయితే కంసాలీ, మంగలి తాము అస్సలు ఈ మనిషినే చూడలేదని బొంకారు! ఇక సింహం వచ్చి స్వయంగా చెబితే తప్ప, వేరే మార్గం లేదనిపించింది మంచి మనిషికి. కానీ సింహం ఎలాగ, వచ్చేది? అయితే అతను అలా అనుకునే సమయానికే నగరమంతటా సింహగర్జనలు వినిపించాయి. సింహం తన స్నేహితులనందరినీ వెంటబెట్టుకొని మనిషిని కాపాడటం కోసం వచ్చేసింది - రాజుతో సహా నగరవాసులందరూ భయకంపితులైపోయేటట్లు! ఈ మనిషి నిజమే చెబుతున్నాడని రాజుకు విశ్వాసం కలిగిన తరువాత, సింహాలు ఠీవిగా నడుచుకొని అడవిలోకి వెళ్లిపోయాయి. రాజుగారు మంగలికీ, కంసాలికీ శిరచ్ఛేద శిక్ష విధించారు! మంచి మనిషిని సన్మానించి సాగనంపారు!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో