Facebook Twitter
సింహం-అడవి

సింహం-అడవి

 

ఊరికి దగ్గరగా దట్టమైన అడవి ఒకటి ఉండేది. గుబురైన చెట్లతో, గల గలా పారే నీళ్ళతో, అనేక జంతువులతో ఆ అడవి కళకళలాడేది. దీనికి కారణం, ఆ అడవిలో ఉండే సింహం. చెట్లను కొట్టేసేందుకూ, జంతువుల్ని వేటాడేందుకూ వచ్చే వాళ్ళని అది అస్సలు సహించేది కాదు. 

 

మనుషులందరికీ అదంటే భయం. అది ఉన్న అడవిలోకి వాళ్ళెవ్వరూ‌ అడుగు పెట్టే వాళ్ళు కాదు. ఒకసారి ఎందుకనో సింహం ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది.దాంతో అది గుహకే పరిమితమైపోయింది.

 

ఇదివరకటి లాగా అడవి అంతటా తిరగట్లేదు. ఆ సంగతి తెలుసుకున్న ఊళ్ళో మనుషులు మళ్ళీ అడవిలో తిరగసాగారు. చెట్లు కొట్టేయటం, కుందేళ్ళనూ జింకలనూ వేటాడటం మొదలు పెట్టారు. రోజు రోజుకూ అడవి పలచబారింది.

 

'దీనికంతటికీ కారణం సింహరాజు ఆరోగ్యం బాగా లేకపోవటమే' అని గుర్తించిన జంతువులన్నీ సింహం గుహకు వెళ్ళి చూసాయి. సింహం జ్వరంతో మూలుగుతూ పడుకొని ఉన్నది. డాక్టరు దగ్గరికి వెళ్లనే లేదు!

 

దాంతో జంతువులన్నీ కలిసి ఏనుగు డాక్టరుకు ధైర్యం చెప్పి, దాన్ని తీసుకెళ్ళి సింహనికి వైద్యం చేయించినై. సింహానికి ఆరోగ్యం బాగైంది. అడవి అంతటా దాని గర్జనలు వినిపించినై మళ్ళీ. దాంతో మనుషులంతా అడవికి రావటం మానేసారు. త్వరలోనే అడవి అంతా చెట్లు-జంతువులతో కళకళ లాడింది.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో