TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
వెనక కోసల దేశంలో ముగ్గురు మిత్రులు ఉండేవారు. వారిలో ఇద్దరు నందుడు, సునందుడు అనేవారు ధనికులు. మూడో వాడు ఆనందుడు గర్భదరిద్రుడు. అతను తాళ్ళు పేనుకొని జీవించేవాడు. అతణ్ణి ఏ విధంగానైనా ధనికుణ్ణి చెయ్యాలని నందుడూ, సునందుడూ ఆలోచన చేశారు.
" పెట్టుబడికి కొంత ధనం ఉన్నట్టయితే ఎవరైనా ధనికుడు కావచ్చు. కనుక
ఆనందుడికి కొంత మూల ధనం ఇద్దాం” అన్నాడు నందుడు.
"ఎంతమంది ధనికులు దరిద్రులై పోవటం లేదు ? కలిసివచ్చినట్టయితే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనికుడైపోవచ్చు” అన్నాడు సునందుడు.
తన మాట నిజమని రుజువు చేయటాని కని నందుడు మర్నాడు ఆనందుడికి రెండు వందల మాడలిచ్చాడు. వాటితో ఏదైనా వ్యాపారం చేసుకొని ధనం సంపాదించమని చెప్పాడు. ఆనందుడు సంతోషించి, ఆ రెండువందల మాడలలో పది ఖర్చుకు గాను తీసి, మిగిలినవి తన తలపాగాలోనే భద్రంగా మూటకట్టి, ఇంటికి కావలిసిన వెచ్చాలు కొనటానికి బజారుకు బయలుదేరాడు. దురదృష్టవ శాత్తూ దారిలో ఒక పక్షి ఎటు నుంచో వచ్చి, ఆనందుడి తలపాగాలో మూట చూసి అందులో ఏదో ఉన్నదనుకొని మూటనూ తన్నుకుపోయింది. నూట తొంభై మాడలూ రెక్కలు వచ్చి ఎగిరి పోయినందుకు ఆనందుడు చాలా విచారించాడు.
తరువాత కొద్ది రోజులకు నంద సునంద లు ఆనందుడి ఇంటికి వచ్చి, తమ స్నేహి తుడి పరిస్థితిలో మార్పు లేనందుకు కారణం అడిగారు.
" నా అదృష్టం బాగులేదు. డబ్బంతా తలపాగాలో చుట్టుకొన్నాను. కాని ఏదో
పక్షి వచ్చి తలపాగా తన్నుకుపోయింది” అన్నాడు ఆనందుడు విచారంగా.
ఈ వృత్తాంతం నందుడు నమ్మాడుగాని సునందుడు నమ్మలేదు. ఆనందుడు ఆ డబ్బును దుర్వినియోగపరిచి ఉంటాడని అనుకున్నాడు. నందుడు మాత్రం ఆనందుడికి మరొకసారి రెండువందల మాడలిచ్చి, "ఈసారి అయినా డబ్బు భద్రంగా ఉంచుకొని, దాని సహాయంతో ధనం సంపాదించు,” అని సలహా ఇచ్చాడు.
ఈసారి ఆనందుడు తనకు కావలసిన మాడలు తీసుకోని, మిగిలినవి తవుడు తట్ట అడుగున భద్రంగా దాచి, ఇంటికి కావలసిన సంచారాలు పట్టుకువద్దామని బజారుకు వెళ్ళాడు. అతను తిరిగి వచ్చే సరికి తవుడుతట్ట కనబడలేదు. భార్యనడిగాడు.
"ఉప్పు అమ్మకానికి వచ్చింది. దగ్గిర డబ్బులు లేవు. అందుకని తపుడు తట్ట అమ్మి రెండు శేర్లు ఉప్పు తీసుకున్నాను" అన్నది ఆనందుడి భార్య.
ఆనందుడికి పట్టరాని దుఃఖం కలిగింది. తనకు డబ్బు దక్కించుకొనే యోగం లేదని అతను తేల్చుకొన్నాడు.
మరి కొద్ది రోజులకు నందనునందులు మళ్ళీ వచ్చి జరిగిన సంగతి విన్నారు. ఆనందుడు ఎప్పటికన్న దరిద్రుడుగా
కనిపించాడు. అతడు బట్టల చిరుగులు కూడా కుట్టుకొలేదు. కారణమేమంటే ఇంట్లో సూది కూడా లేదని చెప్పాడు.
అప్పుడే బజారులో సూదుల పొట్లం కొన్న సునందుడు ఆనందుడికి ఒక సూది ఇచ్చి " ఇది పెట్టి నీ భార్య చేత చిరుగులు కుట్టించుకో!” అన్నాడు. తరువాత నంద సునందులు వెళ్ళిపోయారు.
ఆ రోజు రాత్రే పక్క ఇంటి బెస్తవాడి భార్య అనందుడి భార్య వద్దకు వచ్చి, " అక్కా, మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా? రేపు ఉదయమే మావాళ్ళు వలలు పట్టుకొని చేపలు పట్టబోతున్నారు. వల బాగుచేసుకోవాలి. వలలో మొదట పడిన చేపలు మీకిస్తాంలే!” అన్నది.
ఆనందుడి భార్య ఆమెకు ఇంట్లో ఉన్న సూది అరువు ఇచ్చింది.
మర్నాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన బెస్తవాడు తన కూతురి చేతికిచ్చి ఆనందుడి ఇంటికి పెద్ద చేపను పంపాడు. కూర వండుదామని ఆనందుడి భార్య ఆ చేపను కోసేసరికి అందులో పెద్ద గాజు ముద్దలాటిది దొరికింది. ఆ గాజు ముద్దతో ఆనందుడి పిల్లలు వీథిలో ఆడుతూండగా చూసిన నగల వర్తకుడు అనందుడి దగ్గిరికి వచ్చి, "ఆ గాజు ముక్క నాకు అమ్ముతావా, ఆనందయ్యా? నూరు మాడలిస్తాను !'' అని అడిగాడు.
అది చాలా విలువైన గాజు పెంకు అయి ఉండాలని అనుమానం కగిలి ఆనందుడు దానిని అమ్మడానికి నిరాకరించాడు. ఆ రోజే దానిని నగరానికి పట్టుకుపోయి రత్నాల వర్తకులకు చూపించాడు.
నిజానికి అదొక అమూల్యమైన వజ్రం.
దానిని పెద్ద వర్తకుడు ఇరవై వేల మాడ లిచ్చి కొనుక్కొన్నాడు. ఆ ధనంతో
ఆనందుడు ఇళ్ళూ, దొడ్లూ కొన్నాడు. తాళ్ళు పేనటానికి కర్రలతో యంత్రాలు చేయించాడు, తాళ్ళ పరిశ్రమ ఏర్పాటు చేశాడు, ధనికుడైనాడు.
అనందుడు అకస్మాత్తుగా ధనికుడైన వార్త తెలియగానే అతని మిత్రులు నంద సునందులు అతనిని చూడవచ్చారు.
"నేనిచ్చిన డబ్బు పెట్టుబడి చేసే ధనికుడ వయావు. అవునా?” అన్నాడు నందుడు.
ఆనందుడు జరిగినదంతా పూసగుచ్చిన ట్టు మిత్రులకు చెప్పాడు.
"కలిసివచ్చేసరికి నేనిచ్చిన సూది తోనే ఆనందుడు ధనం సంపాదించాడు, చూశావా?” అన్నాడు సునందుడు.
ఈసారి నందుడికి నమ్మకం కలగలేదు. ఆనందుడు తన ధనంతోనే ధనికుడై, ఆ సంగతి కప్పిపుచ్చటానికి అబద్ధమాడు తున్నాడనుకొన్నాడు.
మిత్రులు ముగ్గురూ కలిసి ఆనందుడు కొత్తగా కట్టించిన ఇల్లూ, వెనక ఉన్న దొడ్డి చూడటానికి బయలుదేరారు. వారు దొడ్లోకి వెళ్లేసరికి ఆనందుడి పిల్లలు ఒక చెట్టు ఎక్కి దాని మీద ఉన్న పక్షిగూడును కింద పడేశారు. అందులో ఆనందుడి తలపాగా కనిపించింది. దాని చెంగున మూటకట్టి ఉన్న నూటతొంభై మాడలూ దొరికాయి.
వారక్కడి నుండి బయలుదేరి గొడ్లసావిడి కి వచ్చారు. అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తవుడుతట్ట కొని తెచ్చాడు. వాడు దానిలో నుంచి తవుడు తీసి కుడితిలో పోస్తూండగా బంగారు మాడలు కొన్ని వాడి చేతిలోకి వచ్చాయి. తట్ట బోర్లించి చూసేసరికి ఆనందుడు రెండవసారి పొగొట్టుకొన్న నూటతొంభై మాడలూ కూడా దొరికాయి!
ఇది చూడగానే నందుడికి ఆనందుడి మాటల్లో నమ్మకం కుదిరింది. సునందుడు చెప్పినట్టు కలిసివస్తే ఐశ్వర్యం రావటానికి కుట్టుసూది అయినా చాలునని నందుడు గ్రహించాడు.