Facebook Twitter
వేషం మార్చిన యువరాజు

వేషం మార్చిన యువరాజు

 


ప్రవీణుడు ఒక రాజ కుమారుడు. వయసు ఆరేళ్ళే. అయినా అల్లారు ముద్దుగా పెరగటం వల్లనో ఏమో, అతనిలో గర్వం పాలు ఎక్కువే ఉండేది. తమ వద్ద పనిచేసే వాళ్లందరితోటీ దురుసుగా ప్రవర్తించేవాడు. ఆ సంగతి గుర్తించినా, పని ఒత్తిడిలో ఉండే రాజుగారు దాన్ని గురించి ఏమీ చేయలేదు. కానీ తగిన వయసు రాగానే అతన్ని విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపించారు.


గురుకులంలో అన్ని కులాలకు, వృత్తులకు చెందిన పిల్లలు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అందరూ రకరకాల విద్యలను, శాస్త్రాలను, కళలను అభ్యసించేవాళ్ళు. గురువులు ఎవ్వరూ ప్రవీణుడికి రాజకుమారుడని ప్రత్యేక గుర్తింపు ఇవ్వలేదు. వాళ్ళకు పిల్లలందరూ సమానమే! పిల్లలు కూడా అతన్ని తమలో ఒకడుగానే చూసారు తప్ప, రాజకుమారుడని వేరుగా చూడలేదు. అప్పటివరకూ అహంకారంతో మెలగిన ప్రవీణుడికి అక్కడి సమానత్వపు వాతావరణం ఏమంత నచ్చలేదు. "రాజకుమారుడికి ఇదేమి శిక్ష?" అనుకోసాగాడతను.
 

చూస్తూండగానే సంవత్సరం గడచిపోయింది. సెలవలు ఇచ్చే సమయం దగ్గర పడింది. సెలవల ముందు గురుకులంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. దానికోసం పిల్లలంతా నెల రోజుల పాటు సాధన చేస్తారు. వాళ్ళు వేయబోయే నాటకంలో ప్రవీణుడికి పనిమనిషి పాత్ర ఇచ్చారు గురువుగారు: "నాటకం రక్తి కట్టాలంటే, నటించేవాడు పాత్రలో లీనం అయిపోవాలి" అని గుర్తుచేస్తూ.


ప్రవీణుడికి ఆ నాటకం నచ్చింది. అందులో తను పనివాడు. చాలా కష్టపడి పని చేస్తాడు. యజమానిని, యజమాని ఇంటివాళ్లని మనస్ఫూర్తిగా గౌరవిస్తుంటాడు. అయినా వాళ్ళెవ్వరూ తన కష్టాన్ని గుర్తించరు. ప్రతి క్షణమూ తనని చులకనగా చూస్తారు. చివరికి అందరూ అతని మంచితనాన్ని గుర్తించటంతో నాటకం ముగుస్తుంది.


నాటకం వేయటంలో లీనమైన ప్రవీణుడికి సాధన చేస్తున్న కొద్దీ ఆ పాత్ర స్వభావం అర్థం కాసాగింది. యజమాని పరుషంగా మాట్లాడిన ప్రతిసారీ పనివాడి మనసు ఎలా గాయపడుతున్నదో అతనికి అర్థమైంది. ఎంత పని చేస్తున్నా తృప్తి చెందకుండా "ఇంకా పని చెయ్యి" అంటూ పీడించే యజమాని 'తప్పు చేస్తున్నాడు' అని అనిపించసాగింది. నాటకం అయిపోయేసరికి అతనికి తను ఎలా జీవించాలో తెలిసిపోయింది! 


సెలవులకని ఇంటికి వెళ్ళిన ప్రవీణుడిలో గొప్ప మార్పు కనబడింది అందరికీ. ఇప్పుడతను అందరితోటీ మర్యాదగా మెసలుకుంటున్నాడు. పని చేసేవారిని చిన్నబుచ్చటం లేదు సరికదా, "నేను ఇదివరకు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి" అంటున్నాడు! అందరూ యువరాజులో వచ్చిన మార్పుకు ఆనందించారు.

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో