Facebook Twitter
పగటి కలలు

పగటి కలలు

 

 

 

వాసు, వాసంతి అన్నా చెల్లెళ్ళు. వాళ్లిద్దరూ కలసి ఆడుకునేవాళ్లు, పాడుకునేవాళ్లు, చక్కగా బడికి పోయేవాళ్లు.

ఒకసారి వాళ్ల ఇంటికి బంధువుల అబ్బాయి చంద్ర వచ్చాడు. ఒట్టి చంద్ర కాదు వాడు- `కలల చంద్ర'. చంద్రకు కలలు కనడమంటే ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకుని, కలల్లో తేలిపోతుండేవాడు.

చాలా కాలానికి తమ ఇంటికొచ్చిన చంద్రను వెంటపెట్టుకొని, వాసు, వాసంతిలు వాళ్ల తోటకు వెళ్ళారు.

తోటలో మామిడి కొమ్మకు ఉయ్యాల కట్టి ఊగుదామనుకున్నారు ముగ్గరూ. చంద్రకు కూడా ఉయ్యాల ఊగటం అంటే చాలా చాలా ఇష్టం. తనే మొదట ఊగుతానన్నాడు వాడు.

`సరే' నువ్వే మొదట ఊగమని, వాడిని ఊపడం మొదలుపెట్టాడు వాసు.

ఉయ్యాలలో కూర్చోగానే చంద్రకు కలలు మొదలయ్యాయి:

 

 

ఊగే ఉయ్యాలలోంచి ఆకాశంలో దూసుకుపోతున్న ఓ రాకెట్ లోకి ఎగిరిపోయాడు చంద్ర. అక్కడినుండి ఏకంగా ఒక గ్రహం మీదికి దూకాడు. ఆ గ్రహం మన భూమిలాగా నిలకడగా లేదు! ఉయ్యాలలాగా ఊగిపోతున్నది. చివరికి అక్కడి చెట్లుకూడా అటూ ఇటూ సోలిపోతూనే ఉన్నాయి. ఇంకా అలా ఊగుతూనే, చంద్ర ఆ గ్రహంమీద నడవటం మొదలుపెట్టాడు. నడిచీ నడిచీ కాళ్ళు నొప్పులైతే పుట్టాయిగానీ, అక్కడ జనసంచారం అన్నది లేదు. అంతలో అతనికి ఒకచోట పే..ద్ద- మెరిసే వస్తువు ఒకటి కనిపించింది. 'ఏమిటా?' అనుకుని దాని దగ్గరికెళ్ళి చూశాడు- చూస్తే, ఆశ్చర్యం! అది ఒక భారీ వజ్రం. దాన్ని ఎత్తుకుపోదామని ప్రయత్నించాడు చంద్ర. అయితే ఆ వజ్రం సుమారు ఇరవై కిలోల బరువు ఉంటుందేమో, అసలు కదలలేదు. ఎలాగైనా సరే ఆ వజ్రాన్ని ఎత్తుకుపోవాల్సిందే అని, వాడు ముందుకు వంగి, రెండు చేతుల్తోటీ వజ్రాన్ని పట్టుకొని, అతి ప్రయత్నంమీద, బలంగా ఎత్తాడు!! - ఇంకేం చెప్పాలి? వజ్రంకోసం చేతులు వదిలిన చంద్ర, ఉయ్యాలలోంచి దబ్బున కిందపడ్డాడు .

 

 

పాపం, చంద్ర! కలలచంద్రకు పళ్ళు ఊడినంత పనైంది. దగ్గర్లోనే ఉన్న వాసు, వాసంతిలు పరుగు పరుగున వచ్చి చంద్రను పైకి లేపి, "ఏమైంది? ఎందుకు, కింద పడ్డావు?" అని అడిగారు. అప్పుడే కల నుండి తేరుకొన్న ఆ కలల రాకుమారుడు ముక్కుతూ, మూలుగుతూ తన సుందర స్వప్నాన్ని వివరించాడు.

ఆ తర్వాత వాసు, వాసంతిలు చాలాకాలం వరకూ కలల రాకుమారుణ్ని తలుచుకుని నవ్వుకున్నారు.

చంద్ర మాత్రం అప్పటినుంచి పగటి కలలు కనడం మానేశాడు.

Courtesy..
kottapalli.in