Facebook Twitter
అల్లం రొట్టె అబ్బాయి..!

అల్లం రొట్టె అబ్బాయి..!

 


అనగా అనగా ఇంగ్లండులో ఒక అవ్వ, తాత, వాళ్లకో చిన్ని మనవడు ఉండేవాళ్ళు. ఒకరోజు ఉదయాన్నే అవ్వ 'మనవడి కోసం ఏం చేద్దాం?' అని ఆలోచించి, వాడికి నచ్చేట్లు గోధుమపిండిని సన్నగా ఒత్తి, మనిషిలాగే ఉన్న ఓ రొట్టె బొమ్మని చేసింది. వాడికి మైదాతో కళ్ళు, ముక్కు, రింగు రింగుల జుట్టు పెట్టి, చక్కగా ముడతలు ముడతలు ఉన్న బట్టలు కూడా వేసింది. మనలాగా వాళ్ళకు పెనాలు ఉండవు కదా, అన్నీ నిప్పుల కుంపట్లే. కాలాల్సిన రొట్టెల్ని నిప్పుల కుంపట్లలో వేసి మూత పెట్టేస్తారు. కొద్ది సేపటి తర్వాత మూత తీసి చూస్తే అవి తయారైపోయి ఉంటాయి. అట్లా అవ్వ ఈ రొట్టెని కూడా కుంపట్లో వేసి మూత పెట్టింది.

 

అయితే అంతలోనే ఆవిడకి తోటలో పని గుర్తుకొచ్చింది- మనవడితో "ఒరే! ఇవాళ్ల తోటలో చాలా పని ఉంది. తాత, నేను ఇద్దరం కలిసి చేసినా కూడా టైము చాలుతుందో, లేదో మరి. నువ్వు ఈ రొట్టె మాడిపోకుండా అట్లా ఓ కన్ను వేసి ఉంచావంటే, నేను పోయి నిశ్చింతగా తోట పని చేసుకుంటాను" అన్నది. మనవడు మంచోడు. "నువ్వు పోయిరావ్వా, నేను చూసుకుంటాగా! రొట్టెని కాల్చటం అదేమంత పెద్ద పని?!" అన్నాడు. 

 

దాంతో అవ్వ, తాత ఇద్దరూ పారా తట్టా పట్టుకు పోయి, తోటలో ఆలుగడ్డలు త్రవ్వటం మొదలు పెట్టారు. పిల్లాడు కుంపటి ప్రక్కనే కళ్ళు మూసుకు కూర్చొని, తను మామూలుగా ఎప్పుడూ కనే పగటి కలల్నే మళ్ళీ కనసాగాడు. అంతలో అకస్మాత్తుగా టప్పుమని ఏదో శబ్దం అయింది. మనవడు పిల్లాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసాడు. నిప్పుల కుంపటి తలుపు బార్లా తెరిచి ఉన్నది. అందులో ఉండాల్సిన రొట్టె లేదు! క్రింద, నేలమీద బోర్లా పడి ఉన్నది! మనవడు దాన్ని అందుకోబోయాడు. అయితే అంతలోనే అది- కాదు- వాడు..! ఆ అల్లం రొట్టె అబ్బాయి! వాడు లేచి పరుగు పెట్టాడు! తెరిచి ఉన్న తలుపువైపుకు పరుగెత్తాడు నేరుగా!

 

పిల్లాడు చటుక్కున ముందుకు దూకాడు- తలుపు వేసేద్దామని. కానీ అల్లం రొట్టె అబ్బాయి వాడికంటే ముందే అక్కడికి చేరుకున్నాడు. తలుపు రెక్క పడేలోగానే దాని క్రిందినుండి జారి, అవతలికి పోయాడు. ఇంటి మెట్లు గబగబా దిగేసి, పిల్లాడు కళ్ళుమూసి తెరిచే సరికి రోడ్డు వైపుకు పరుగెత్తుతూ కనబడ్డాడు! "అవ్వో! తాతో! వీడు పారిపోతున్నాడు! ఈ అల్లం రొట్టె అబ్బాయి పారిపోతున్నాడు, పట్టుకోండి!‌పట్టుకోండి!" అని అరుస్తూ వాడివెంట పరుగు పెట్టాడు మనవడు. ఇంటి ముందు తోటలో పని చేసుకుంటున్న అవ్వ తాత "ఏమైంది?!" అని చూసే సరికే అల్లం రొట్టె పిల్లాడు రోడ్డు ఎక్కేసాడు. వెంటనే వాళ్ళు కూడా తమ చేతుల్లో ఉన్న పారలూ, పలుగులూ ప్రక్కన పడేసి మనవడి వెంట, ఆ అల్లం రొట్టె అబ్బాయి వెంట పడ్డారు.

 

అయినా పెద్దవాళ్ళు కదా, కొంచెం పరుగెత్తే సరికి వాళ్ళు కాస్తా అలిసిపోయి, ఆయాసపడటం మొదలు పెట్టారు. అక్కడ దారిలో ఉన్న ఓ కల్వర్టు మీద కూర్చుండిపోయారు. అల్లం రొట్టె అబ్బాయిని అందుకోలేని మనవడు కూడా నిరాశగా వెనక్కి వచ్చి వాళ్లకి అత్యవసర సేవలు చేసాడు. అట్లా వాళ్లనుండి తప్పించుకున్న అల్లం రొట్టె అబ్బాయి కులాసాగా ఈల వేసుకుంటూ రోడ్డమ్మట నడుస్తూ పోతుంటే అక్కడ బావి త్రవ్వుతూ కనబడ్డారు ఓ‌ ఇద్దరు మనుషులు. వాళ్లకి అల్లం రొట్టె అబ్బాయిని చూస్తే ముచ్చట వేసింది. "ఎటుపోతున్నావు బాబూ, నువ్వు అల్లం రొట్టె అబ్బాయీ?! అడిగారు వాళ్ళు.

"అవ్వనూ, తాతనూ, వాళ్లిద్దరి మనవడినీ ఒక్క దెబ్బకు ఓడించాను ఇదిగో, బావిని త్రవ్వే బావన్నలూ, మీ ఇద్దర్నీ కూడా ఇప్పుడే ఓడించేస్తాను నేను! జూ…..మ్ " అని వాళ్లని దాటుకొని పరుగు పెట్టాడు అల్లం రొట్టె అబ్బాయి. "ఓహో! అవునా?! అంత గొప్పవాడివా? మేమూ చూస్తాం!" అని వాళ్ళిద్దరూ తమ చేతుల్లోని పికాసులూ పారలూ ప్రక్కన పడేసి వాడి వెంట పడ్డారు. అయితే అల్లం రొట్టె అబ్బాయి శరీరం తేలిక. వాడి కాళ్ళలో సత్తువ కూడా చాలా ఎక్కువ. దాంతో కొద్ది సేపట్లోనే వాళ్ళ చేతికి అందనంత దూరం వెళ్ళిపోయాడు వాడు. బావిని త్రవ్వేవాళ్లిద్దరూ కూడా అలిసిపోయి మధ్యదారిలో కూలబడ్డారు.

 

అల్లం రొట్టె అబ్బాయి అట్లా పోయి పోయి ఓ అడవిలోకి దూరాడు. వెంటనే వాడికో ఎలుగుబంటి ఎదురైంది. అది చేతులు చాపి వాడిని అందుకోబోతూ "ఏయ్! అల్లం రొట్టె అబ్బాయి! ఎటు పోతున్నావు నువ్వు?" అన్నది. వాడు దానికి అందకుండా తప్పించుకొని "అవ్వనూ, తాతనూ, వాళ్లిద్దరి మనవడినీ, బావిని త్రవ్వే బావన్నల్నీ ఒక్క దెబ్బకు ఓడించాను! నాకు నువ్వో‌ లెక్కా, నిన్ను కూడా ఇప్పుడే ఓడించేస్తాను నేను! జూమ్..... " అంటూ పరుగు పెట్టాడు. "అవునా? అంత గొప్పవాడివా? నీ పని చెప్తాను ఆగు!" అంటూ వాడి వెంట పడింది ఎలుగుబంటి.

 

"ఓసోస్! చాలా చూసాను. రా! నన్ను పట్టుకో!" అంటూ పరుగెత్తిన అల్లం రొట్టె అబ్బాయిని అందుకోలేక, త్వరలోనే చతికిలబడింది ఎలుగుబంటి "అయ్యో! అనవసరంగా వీడి వెంట పడ్డానే, ఈ మాత్రం పరుగెత్తితే ఇంకే జంతువైనా దొరికిపోయేది గదా, నాకు!" అనుకుంటూ. దాన్ని కూడా ఓడించే సరికి అల్లం రొట్టె అబ్బాయికి చాలా సంతోషం వేసింది. వాడు కులాసాగా పాటలు పాడుకుంటూ, అటూ ఇటూ చూసుకుంటూ పోసాగాడు.

 

ఈసారి వాడికి ఓ తోడేలు ఎదురైంది. అది వాడిని అందుకునేందుకు చెయ్యి చాపుతూ "ఓయ్! ఓయ్! ఎటుపోతున్నావోయ్! అందాల అల్లపు రొట్టె అబ్బాయీ?" అంది. "అవ్వనూ, తాతనూ, వాళ్లిద్దరి మనవడినీ, బావిని త్రవ్వే బావన్నల్నీ, దుబ్బ ఎలుగునీ ఒక్క దెబ్బకు ఓడించాను! నాకు నువ్వో‌ లెక్కా, నిన్ను కూడా ఇప్పుడే ఓడించేస్తాను నేను చూడు! జూ...మ్‌.." అంటూ దానికి దొరక్కుండా తప్పించుకుపోయాడు అల్లపు రొట్టె అబ్బాయి.

"ఓహో! అంత తురుంగాడివేమి?! నేను నిన్ను పట్టుకుంటా చూడు!" అని వగరుస్తూ వెంటపడింది తోడేలు. కానీ ఎంత పరుగెత్తినా అల్లం రొట్టె అబ్బాయి మటుకు దాని చేతికి చిక్కలేదు. చివరికి అదికూడా విరమించుకొని, తన దారిన తాను పోయింది. దాంతో అల్లం రొట్టె అబ్బాయికి చాలా గర్వం అనిపించింది. "ప్రపంచంలో ఎవ్వరూ.. నన్నింక పట్టుకోలేరూ.." అని గట్టిగా పాటలు పాడుకుంటూ పోయాడు వాడు. అంతలో వాడికో నక్క కనిపించింది. ఓ ముళ్ళ కంచెకి ఇవతలగా ముడుచుకొని పడుకొని ఉన్నది అది. జ్వరం వచ్చినట్లుంది; ముసలి గొంతు వణుకుతుండగా "ఎటు పోతున్నావబ్బీ! అల్లం రొట్టె అబ్బాయీ?" అన్నదది. 

 

"అవ్వనూ, తాతనూ, వాళ్లిద్దరి మనవడినీ, బావిని త్రవ్వే బావన్నల్నీ, దుబ్బ ఎలుగునీ, కోరపళ్ల తోడేలుగాడినీ కూడా ఒక్క దెబ్బకు ఓడించాను! నాకు నువ్వో‌ లెక్కా, నిన్ను కూడా ఇప్పుడే ఓడించేస్తాను నేను చూడు! జుయ్..." అంటూ పారిపోబోయాడు వాడు కానీ "అంత గడగడా మాట్లాడితే అర్థం ఎట్లా అవుతుంది, అల్లం రొట్టె అబ్బాయీ? నాకేం వినబడలేదు- నువ్వేమన్నావు?" అన్నది నక్క, కదలకుండానే. దాంతో అల్లం రొట్టె అబ్బాయి జోరు కొంచెం తగ్గింది.

"అవ్వనూ, తాతనూ, వాళ్లిద్దరి మనవడినీ, బావిని త్రవ్వే బావన్నల్నీ, దుబ్బ ఎలుగునీ, కోరపళ్ల తోడేలుగాడినీ కూడా ఒక్క దెబ్బకు ఓడించాను! నాకు నువ్వో‌ లెక్కా, నిన్ను కూడా ఇప్పుడే ఓడించేస్తాను నేను చూడు!" గొంతు పెంచి, ఇంకొంచెం గట్టిగా అరిచి, నక్క కదులుతుందేమో అని జాగ్రత్తగా నిక్కి చూసాడు వాడు. "ఆఁ..? ఏమంటున్నావు?  అవ్వనా?" అన్నది నక్క, ఒక కన్ను తెరిచి, ఇంకా కదలకుండానే.

 

"ఏదోలే, పో.. నీ దారిన నువ్వు పో... నువ్వు గొణుక్కునేదేమీ ఎలాగూ నాకు వినబడదులే గానీ, నీ దారిన నువ్వు పో.. గొంతులేని వెర్రి రొట్టెముక్కా!" అని గొణిగిందది. అల్లం ముక్క అబ్బాయికి కోపం వచ్చింది. గొంతు పెంచి, నక్క చెవి దగ్గర నోరు పెట్టి, చాలా గట్టిగా "అవ్వనూ, తాతనూ, వాళ్లిద్దరి మనవడినీ, బావిని త్రవ్వే బావన్నల్నీ, దుబ్బ ఎలుగునీ, కోరపళ్ల తోడేలుగాడినీ కూడా ఒక్క దెబ్బకు ఓడించాను! నాకు నువ్వో‌ లెక్కా, నిన్ను కూడా ఇప్పుడే ఓడించేస్తాను నేను చూడు!" అని అరవబోయాడు.

కానీ వాడి మాటలు పూర్తవ్వనిస్తేగా? నక్క చటుక్కున తల తిప్పి, లటుక్కున వాడిని కరిచి పట్టుకొని, ఆపైన మెల్లగా కరకరామనుకుంటూ తినేసింది!! "అయ్యో! ఎంత ఘోరం జరిగింది?! అల్లం రొట్టె అబ్బాయికి, పాపం!" అని బాధ పడుతున్నారా? అదేమీ లేదు. "అల్లం రొట్టె ఎంత బాగుంటుందంటే, దాన్ని తినకుండా ఉండటం అసలు ఎవ్వరి తరమూ కాదు. చూసినవాళ్ల నోర్లన్నీ‌ ఊరతాయి. నక్కకు మాత్రం నోరూరదా? నాకు దొరికితే నేనూ తినేస్తాను మరి!" ...

నిజం చెప్పండి: మీరూ అంతే! కదూ?!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో