Facebook Twitter
పట్నం ఎలుక

పట్నం ఎలుక

 

 

అనగా అనగా ఒక పట్నం ఎలుక ఉండేది. ఒక నాడు అది పల్లెలో ఉన్న తన నేస్తం దగ్గరికి వెళ్ళింది. పల్లె ఎలుక పట్నం ఎలుకకి మర్యాదలు చేసి భోజనం పెట్టింది. పట్నం ఎలుకకి ఆ తిండి నచ్చలేదు. "మిత్రమా! ఈ పల్లెలో ఏం సుఖం ఉంది? ఇదేమి తిండి? పట్నంలోనైతే పిండి వంటలు తినవచ్చు; దర్జాగా బతకవచ్చు. ఒకసారి రుచి చూస్తే నీకే తెలుస్తుంది- నాతో రారాదూ?" అంది. సరేనని పల్లెటూరి ఎలుక బయలు దేరి పట్నం వెళ్ళింది.

ఆ రోజు ఆ ఇంట్లో విందు. పిండి వంటలన్నీ అందంగా పేర్చి ఉన్నారు. వాటిని చూడగానే పల్లె ఎలుక పొంగి పోయింది. "మిత్రమా! ఎంత అదృష్టం చేసుకున్నావోగాని, ఇంత చక్కని ఆహారం తింటూ గడిపావు నువ్వు" అని పొగిడింది పట్నం ఎలుకను.

పట్నం ఎలుక దర్జాగా దాన్ని ఆ వంటకాల దగ్గరికి తీసుకెళ్ళింది. అంతలోనే ఎవరో లోనికి వస్తున్న అలికిడి అయ్యింది: "మిత్రమా‌! కలుగులోకి దూరు! ఎవరో వస్తున్నారు!" అంటూ లోనికి పరుగు తీసిందది. పల్లె ఎలుక దాని వెనకనే కలుగులోకి పరుగెత్తింది. అవి అక్కడి నుండి చూస్తూండగానే ఇద్దరు మనుషులు లోనికి వచ్చి, మెల్లగా భోజనం చేసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే మళ్లీ వంటకాల దగ్గరికి చేరాయి ఎలుకలు. ఇంకా దేన్నీ రుచి చూడనే లేదు- మళ్ళీ అలికిడైంది! ఈసారి ఇంకా ఎక్కువ మంది మనుషులు లోనికి వచ్చారు.

వాళ్లంతా తిని వెళ్ళేంత వరకూ ఎలుకలు కలుగులోంచి బయటికి రాలేకపోయాయి. ఆ సరికి వాటికి ఆకలి దహించుకు- పోతున్నది. గది ఖాళీ అయ్యిందో లేదో  రెండూ బయటికి పరుగెత్తాయి- మిగిలిన వంటకాలు తినేందుకు. అయితే అంతలోనే కుక్కల అరుపులు వినిపించాయి. రెండు ఎలుకలూ కలుగులోకి దూరాల్సి వచ్చింది మళ్ళీ. ఆ తర్వాత అవి బయటికి వచ్చేసరికి, ఇంటివాళ్ల పిల్లి వాటి వెంటపడి, కిలోమీటరు వరకూ తరిమింది!

పల్లె ఎలుకకి ఆకలి దహించుకు-పోతోంది. చివరికి 'ఎలా అయితేనేం' అని, అక్కడే- రోడ్డు ప్రక్కన ఉన్న చెత్తకుప్పలో భయం భయంగా భోజనం కానిచ్చాయి, రెండు ఎలుకలూ!  అప్పుడు ఇంటి దారి పడుతూ అన్నది పల్లె ఎలుక- "మిత్రమా! భయపడుతూ పాయసం తినేకంటే ప్రశాంతంగా కూర్చొని మాడిన మెతుకులు తినటమే హాయినిస్తుంది నాకు. మీకూ మీ పట్టణ జీవితానికీ ఒక నమస్కారం. నా వరకూ నా పల్లె చాలు"అని.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో